ఎడిట్ పేజీ

అసమర్థ విధానాలు.. అధ్వానంగా చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజుగారి కొడుకులు- ఏడు చేపల కథ’ ఇంకా నడుస్తూనే ఉంది. ఏడో చేప ఎండకపోవడానికి కారణం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఒక ఐఐటి ఎదురుగా జిరాక్స్ సెంటర్ నడిపిన కుర్రాడు వృత్తి నైపుణ్యంతో నాలుగు ముక్కలు నేర్చుకుని, చోరకళానైపుణ్యంతో సర్ట్ఫికెట్లు సృష్టించుకొని, సంభాషణా చాతుర్యంతో ఇంటర్వ్యూలో నెగ్గి, ఓ విశ్వవిద్యాలయంలో ఆచార్యత్వం పొందాడు. కొనే్నళ్ల తర్వాత సదరు ఐఐటి నిపుణుల ఆకస్మిక తనిఖీలో అనుకోకుండా ఆ ‘ఆచార్యుడు’ పట్టుబడిన ఘటన వార్తాపత్రికల్లో చదివి విస్తుపోయాం. నైపుణ్యాల పెంపుదలలో భాగంగా రూపొందించిన ‘దూరవిద్య’ చదువుల్లో మరింత ‘నైపుణ్యం’గా పరీక్షలు రాస్తూ ఎంతోమంది అత్యుత్తమ శ్రేణుల్లో ఉత్తీర్ణులౌతూ సమాజోద్ధరణ చేస్తూండడం గమనిస్తూ గర్విస్తున్నాం. సాంకేతిక విద్య, వృత్తివిద్య, ఉపాధ్యాయ విద్య, సంప్రదాయ విద్య.. ఇలా అన్ని రకాల విద్యా విధానాల్లో ఎక్కడ పట్టినా నైపుణ్యాలే. వైద్య విద్య అర్హత పరీక్షల్లో ‘నైపుణ్యాలు’ ప్రదర్శించి పెద్ద పెద్దోళ్ళు ఇటీవల మీడియా కంట పడడం బహుశా వారి దురదృష్టం కావచ్చు. పరిశోధన పత్రాలు తస్కరించి లేదా సంగ్రహించి పుస్తకాలు ప్రచురిస్తున్నవారు, ఏకంగా డాక్టరేటు డిగ్రీలు పొందుతున్నవారు అసంఖ్యాకం. అంతా వారి వారి నైపుణ్యాల మహిమ!
ఏకబిగిన ఒకట్రెండు రోజుల్లో ఎంటెక్ పరీక్షలన్నీ రాయగలిగే వసతిని, రెగ్యులర్ పిజి కోర్సుల్లో సైతం కళాశాల గడప తొక్కకుండా, కష్టపడి చదవకుండా కృతార్థత పొందగల మార్గాన్ని, తెల్లకాగితాన్ని నల్లగా చేసినంత మాత్రాన మార్కులు కుమ్మరించే దాతృత్వాన్ని వ్యవస్థ మనకు ప్రసాదించడం చింతించాల్సిన విషయం. ర్యాంకుల కోసమో, గొప్పల కోసమో తపించడం తప్పుకాదు కానీ, వాటికోసం తప్పటడుగులు వెయ్యడం, అంతా తెలిసి కూడా వాటిపై చర్యలు శూన్యమవడం విద్యారంగం నవీన పోకడలకు నిదర్శనం. జాతి నిర్మాణం మొత్తం చదువులపైనే ఆధారపడి ఉందని తెలిసి కూడా విద్యావ్యవస్థను గాలికొదిలెయ్యడం ఆలోచించాల్సిన విషయం. ఆదాయంపై దృష్టితో- భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే సమయంలో ఫైర్, శానిటరీ, చెత్తాచెదారం సర్ట్ఫికెట్లు అంటూ వంకలు పెట్టే అధికార వ్యవస్థ- బోధనా విధానాలను, ఉపాధ్యాయుల అర్హతలను, సంస్థల నైతికతను పరిగణనలోకి తీసుకోకపోవడం విద్యారంగ పతనానికి ప్రధాన కారణం. ఇప్పుడు 90 శాతం విద్యారంగం డొల్లగా ఉందనడం నమ్మలేని నిజం. నియామకాలు లేని వర్సిటీలు, సిబ్బంది కొరతతో కళాశాలలు, వౌలిక వసతులు లేని విద్యాలయాలు ప్రభుత్వ రంగపు లోపాలు కాగా, ప్రయివేటు రంగం గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. అదొక మాయా ప్రపంచం. భవనాలు, ప్రయోగశాలలు, నిబంధనలు, వనరులు, విధులు, నియామకాలు, పనితనం, ఫలితాలు, ర్యాంకులు అన్నీ కాగితాలపైనే. నిపుణులైన అధికారులే అక్రమార్కులకు తగిన నైపుణ్యాలు నేర్పుతారు. అంతా ‘ఆన్ పేపర్’ చూపితే చాలు. గమనించేవారిలో ఉదాసీనత, ప్రశ్నించలేని చైతన్య హీనత ప్రస్తుత విద్యారంగానికి అసలైన శాపాలు. పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే పరిస్థితుల మార్పు విషయం అటుంచితే- అధికారులకు కాసుల పంట పండటం వర్తమాన చరిత్రలోని ప్రత్యేక కోణం.
జపాన్ తుమ్మకాయలు తినడానికి మేకలు ఎగబాకినట్లు పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లోళ్ళకు ‘కాపీలు’ అందించడానికి కన్నవాళ్లు పాఠశాలల కిటికీలెగబాకడం పాతకాలం కథ. ఇది నైపుణ్యకాలం. పరీక్ష ప్రారంభం కాకముదే ‘వాట్సాప్’ సహకారంతో పెద్దల కష్టాలు తీరిపోవడం, జవాబులు వెంటనే వాట్సాప్‌లో ఇన్విజిలేటర్‌లకు చేరిపోవడం, పిల్లల చెవులలో దూరిపోవడం తాజా పరిణామం. అసలే రాష్ట్రాల ఎల్లలు దాటి, బోలెడంత ఫీజులు కట్టి లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతలు సాధించి డి.ఇడిలు, బి.ఇడిల్లో చేరి, కళాశాల వారికి ఎలాంటి శ్రమనివ్వకుండా కాలేజీ గడప తొక్కకుండా కాలం వెళ్ళబుచ్చి, పూర్తిగా ‘నైపుణ్యాల’ ఆధారంగా గట్టెక్కి కొలువులు సాధించిన పంతుళ్ళు పిల్లలకు మాత్రం నైపుణ్యాలను నేర్పకుంటారా? అలా నేర్పకపోవడం వృత్తిద్రోహం కదా!
ఒక పాఠశాల వారాంతపుపరీక్షలో 2వ తరగతిలో 8వ ఎక్కం రాసి 10కి 10 మార్కులు పొందిన పిల్లాణ్ణి చూసి, ‘బాబూ.. నీకు 8వ ఎక్కం రాదు కదా!’ అని అడిగాడు తండ్రి. ఆ టీచరే బోర్డుమీద ఎక్కం రాసి- ‘చూసి రాసుకోవాల’ని చెప్పి మార్కులు వేసినట్లు తెలుసుకొని ఆ తండ్రి విస్తుపోయాడు. పాఠశాలలో సంప్రదించగా తరగతిలోని పిల్లలందరికీ 1, 2, 3 ర్యాంకులే! ‘మీరేనండి మమ్మల్ని తప్పుబడుతున్నారు.. తక్కిన పిల్లల తల్లిదండ్రులు ర్యాంకులు రాకపోతే కేకలేస్తారు.. అయినా బోర్డుమీద రాసి ప్రోత్సహించడంలో తప్పేంటి?’ అంటూ టీచర్ వాదన. ఈ దిగజారుడు ప్రక్రియలను అసలు పరీక్షలనవచ్చా?
ఉపాధ్యాయుల నుంచి వినవస్తున్న సమాధానం మరింత వింతగా వుంది. ‘ఇప్పుడు పాఠశాలల్లో అంతా ఇదే సార్.. ఇతర దేశాల్లో చెత్తదని తేల్చి రద్దుచేసేసిన విధానం మనోళ్ళు ఇక్కడ రుద్దుతున్నారు. అంతా రికార్డు పని. పాఠం చెప్పే సమయమే లేదు. కాగితాల రిపోర్టుల కోసం పైనుండి ఒత్తిళ్ళు. పైగా ఇప్పటిదాకా తెలుగు మీడియం పాఠాలు చెప్పాం. ఇప్పుడు అదాట్ను ఇంగ్లీషు మీడియం పెట్టారు! మాక్కూడా అలవాటు లేదు. పాఠం చెప్పడంలో ఏం న్యాయం చేస్తాం! సమగ్ర మూల్యాంకనం అంటారు గానీ, ఇది అసమగ్రం సార్.. అంతా రికార్డు పని. 8, 9 తరగతుల మార్కులు 10లో కలుపుతారు. దాని ఆధారంగానే 10లో గ్రేడ్ పాయింట్లు, పైగా పేపర్లు రుద్దడంలో జంబ్లింగ్ అంటున్నారు. పిల్లలు ఫెయిలయితే మెమోలిస్తారు. ప్రయివేటోళ్ళనైతే ఉద్యోగం పీకేస్తారు. అంతా గందరగోళమండీ, అందుకే అందరం మూకుమ్మడిగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాం. పిల్లలు మాత్రం ఫెయిల్ కాకూడదు! చేతనైంది చేద్దమనుకున్నాం. అసలు 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, పిల్లలు ఉండాలండీ, గవర్నమెంట్ స్కూళ్ళలో 1:70, ఇక ప్రయివేటయితే 1:100 ఉంటారు. ‘విద్య-నైతికత’ ఈ రూల్సు చెప్పకండి బాబూ.. మా బాధలు మావి- మీ గోల మీది’- అందరు ఉపాధ్యాయుల నోట దాదాపు ఇదే మాట.
ఇప్పుడు పాఠశాలల్లో సంవత్సరాంతపు పరీక్షలు. ప్రభుత్వ రికార్డుల పరంగా పకడ్బందీ ఏర్పాట్లు. స్క్వాడ్లు, జిల్లా, రెవిన్యూ డివిజన్, మండల స్థాయిల విద్యాధికారుల అవిశ్రాంతత, ప్రధానోపాధ్యాయుల కష్టం, టీచర్ల శ్రమ, పాపం పిల్లలు పిచ్చోళ్ళు. బిట్లు వరకైనా పిల్లలకు సాయం చేద్దాం అంటూ కరుణ భావన. కాదని వారించడానికి వీల్లేదు. అన్ని చోట్లా మొత్తం ఇదే తంతు. పాఠశాల స్థాయి నుండి మనం ఏం నేర్పుతున్నాం? ఈ ప్రశ్న కంటే ముందు అసలు మనం ఏం నేర్చుకున్నాం? కచ్చితంగా ఆలోచించాల్సిన అంశాలివి. ఖర్మకాలి ఎక్కడైనా ఒకరు ప్రశ్నిస్తే, చాల్లేవయ్యా.. భలే చెబుతున్నావ్. దేశమంతా ఇంతే. అసలు చూసి రాసుకోనిస్తే ఏవౌతుంది? పరీక్ష పాసైనంత మాత్రన ఎవరైనా పిలిచి ఉద్యోగమిస్తున్నారా? మనమేదో వదలిస్తే ఆనక వాళ్ల తిప్పలు వాళ్ళవి అంటూ వేదాంతాలు. వ్యక్తిత్వ హీనులు విద్యారంగంలో పెత్తందార్లుగా ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. ఇలాంటి వారి వల్లే ప్రతిభా పాటవ పరీక్షలకు కూడా మకిలి పట్టింది. జవాబులు రుద్దకుండా ఓయంఆర్ షీట్ నెంబరు, ప్రశ్నపత్రం కోడ్ నెంబరు గుర్తు పెట్టుకొని కేవలం పరీక్షకు హాజరై, తగు మొత్తంలో పైకం చెల్లిస్తే ర్యాంకులు సైతం తారుమారు కావడం మనం చూస్తున్నాం. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు- మహోన్నత ర్యాంకులు. నోరు తెరిస్తే అక్షరం ముక్కలేని విజేతలు. మనం చిన్నబుచ్చుకోవాల్సిన విషయమిది.
వ్యవస్థలన్నాక లోపాలుంటాయి. అన్నిటినీ అధికారులే చక్కదిద్దాలనడం, బాధ్యుల్ని చెయ్యడం ఎంతవరకు న్యాయం? విశ్వవిద్యాలయంలోని పెద్దలంటున్న మాటలివి. నిజమేనేమో! మరి తప్పిదాలను నియంత్రించాల్సిందెవరు? ప్రతి స్థాయిలోనూ అడ్డదారులను ఆశ్రయించి అనైతికతకు పాల్పడుతున్న విద్యాసంస్థలను గాడిలో పెట్టేదెవరు? సమూల ప్రక్షాళన చెయ్యాల్సిందెవరు? చేసేదెన్నడు? అన్నీ బేతాళ ప్రశ్నలే. సాధించిన విజయాలను, గొప్పలను చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్న మనం వైఫల్యాల ప్రసక్తి రాగానే వౌనం వహించడం అసమర్థతకు పరాకాష్ట. ఎవరైనా బలవంతంగా కదిలించినా కమిటీలు- కాలయాపనలు- కవర్లు- కవరేజీలు. లంచగొండుల జేబులు నిండడానికి తప్ప మరో ప్రయోజనం సాధించలేని ఆకస్మిక తనిఖీలు. అన్ని రంగాలతోపాటు విద్యారంగం కూడా రాజకీయ నేతల కబంధ హస్తాలకు చిక్కడం, వారి కనుసన్నల పరిధిలో కదలాడడం విషమస్థితికి ప్రధాన కారణం. ఇతర రంగాల అనైతికత పర్యవసానాల కంటే విద్యారంగ అనైతికత వల్ల కలిగే పరిణామాలు అత్యంత ప్రమాదకరం. దీని తొలిదశ ఫలితాలు కొంతమేర మనం చూస్తున్నాం. అలాగే వదిలేస్తే రేపటిని ఊహించలేం. అభివృద్ధి పేరిట సౌధాలు నిర్మించాలనుకోవడం తప్పుకాదు, పునాదులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం.
దిద్దుబాట్లు.. సర్దుబాట్లు
*వ్యవస్థను గాడిన పెట్టడం ‘చేతుల్లో పని’ అని కాకుండా చేతల్లో పనిగా ముందు పాలకులు గుర్తించాలి.
*పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు పరీక్షల సమయంలో అధికారులు చెప్పే ‘ఎలాగైనా సరే.. 100 శాతం రిజల్ట్స్ రావాలి’ అనే వౌఖిక ఉత్తర్వులకు స్వస్తి చెప్పాలి. మంచి ఫలితాల కోసం విద్యా సంవత్సరం తొలినాళ్ళ నుండి విద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు, బోధన, విద్యార్థుల అభ్యాసన నైపుణ్యాలపై నిక్కచ్చిగా దృష్టి సారించాలి.
*పాఠశాల స్థాయి నుండే ఐచ్ఛికాంశాలను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు సిలబస్ మోతలను తగ్గించి, నిర్ణీత రంగాల్లో విస్తృత అధ్యయనానికి పాదులు వేయాలి.
*ఒకే భవనంలో నాలుగైదు విద్యాలయాల డాక్యుమెంట్ల మాయను అరికట్టి, విద్యకు ఉన్నతిని సమకూర్చడం కోసం పాఠశాల స్థాయి నుండి గుర్తింపు పొందిన ప్రతి విద్యాలయాన్ని అక్షాంశ, రేఖాంశాలతో సహా అంతర్జాల పటాలకు అనుసంధానం చేయాలి.
*అధ్యాపకుల మాయను నివారించాలంటే ప్రస్తుతం జిల్లాలు, యూనివర్సిటీల స్థాయిలో నమోదవుతున్న సిబ్బంది జాబితాలను దేశ వ్యాప్తంగా అంతర్జాలానికి అనుసంధానం చేసి వారి ఆధార్ నెంబరు, ధృవపత్రాల నెంబర్లు ఒక చోట నమోదైతే మరోచోట నమోదు చేయలేని విధంగా సాంకేతిక నియంత్రణ చేయాలి.
*మూల్యాంకన చేస్తున్న అధ్యాపకులపై స్థిరమైన నిఘాతోపాటు, తప్పులు చేస్తే నోటీసులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టాలి (ఇంటర్మీడియెట్ బోర్డులాగా), వర్సిటీలు నిర్వహించే డిగ్రీ, పీజీ పరీక్షల మూల్యాంకనంలోని లోపాలు, ఉదాసీనతలను సమూలంగా ప్రక్షాళన చేయాలి.
*విద్యాసంస్థల నిర్వహణదారుల నైతికతపై నిఘావేసి వ్యాపార ధోరణులకు అడ్డుకట్టవేయాలి. కాగితాల గారడీలు, పేపర్ రిపోర్టులు కాకుండా విద్యారంగ నైతికత పరిశీలనకై అర్హులైన విశ్రాంత ఆచార్యుల స్థాయి సభ్యులతో ఒక మండలిని ఏర్పాటు చేసి పర్యవేక్షక బాధ్యతలు అప్పగించాలి. విద్యా మంత్వ్రి శాఖను రాజకీయాలకతీతంగా విద్యారంగ నిపుణులకు అప్పగించడం క్షేమకరం.
*విద్యార్థులను ప్రలోభపెడుతూ పబ్బం గడుపుకుంటున్న విష సంస్కృతికి చెల్లుచీటీ రాయాలి. ప్రశ్నప్రశ్నాల నిల్వ, పంపిణీలను ఆయా ప్రాంత పోలీస్ స్టేషన్లతోగాని, మండల స్థాయి విద్యాధికారులతోగానీ జతచేసి తాజాగా వస్తున్న సెల్‌ఫోన్ సాంకేతిక అక్రమాలపై కొరడా ఝుళిపించాలి. విద్యా రంగంలో విలువలు దిగజారిపోతే మొత్తం సమాజం, వ్యవస్థలు అథోగతి పాలౌతాయని గుర్తెరగాలి.
* ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి నిబంధనలు, చర్యలతో పాటు సంస్కరణల అమలు తాలూకు నైష్టికతను వీక్షించగలగాలి. మొక్కుబడి తంతుకు ముగింపు పలకాలి. విద్యారంగంలో పరీక్షల గ్రేడ్ పాయింట్స్ విధానాన్ని మరింత మెరుగ్గా రూపొందించి ప్రవేశపెట్టడం, ప్రతిభకు, మార్కులకు ఉపాధ్యాయుల్ని బాధ్యుల్ని చేసేబదులు బోధన తీరుపై నిశితంగా దృష్టి సారించి తగిన సలహాలు, సూచనలు అందించడం అనే సరికొత్త మార్పుకు నాంది పలకాలి.

-డా. కప్పగంతుల మధుసూదన్ సెల్: 92464 68076