మెయన్ ఫీచర్

మనం మళ్లీ పొందలేని మహానేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి అంతర్జాతీయ స్థాయి ‘రోల్ మోడల్’ నాయకత్వం- లీలామాత్రంగానే మిగిలిపోతోంది. అలాంటి ఉద్ధండ నాయకులు, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, తమ తమ దేశాలకు వారు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ ప్రాంతాల గురించి ఆ మహానాయకులు పడ్డ ఆరాటం, పోరాటంలో నిబద్ధత- ఇప్పటి తరం నేతల్లో ఉన్నాయా? ఇలాంటి ఉన్నత లక్షణాలన్నీ ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించాయనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తూ రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటితరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్రకారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని- గత కాలపు మేటి నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తికనబరుస్తున్న దాఖలాలు అంతగా లేవు.
అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టికాని, సమావేశం కాని, సదస్సు కాని, సమ్మేళనం కాని ఎప్పుడు, ఎక్కడ, ఏ మూల జరిగినా ఆ నిర్వహణలో కనిపించిన హంగూ ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పుడు లోపించిందనాలి. ఉదాహరణకు బెల్‌గ్రేడ్‌లో 1961లో జవహర్‌లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్‌క్రుమా, టిటోల సారథ్యంలో పురుడుపోసుకున్న ‘అలీనోద్యమ సదస్సు’ను పేర్కొనవచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య ప్రచ్చన్నయుద్ధాన్ని నివారించడానికి తెరపైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులను నేటితరం వారు తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? 1955 నాటి జెనీవా సదస్సు గురించి, ఆ రోజుల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల గురించి, కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశాల గురించి, ‘బాండుంగ్’ సమావేశంగా పిలుచుకునే ఆఫ్రో ఏషియన్ సమావేశం కాని, 1954లో జరిగిన జెనీవా సమావేశం వంటి మరెన్నో అంతర్జాతీయ సమ్మేళనాల గురించి నేటి యువతలో ఎలాంటి ఆసక్తి లేదు.
అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి.. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ కెనె్నడీ, నికితా కృశే్చవ్, చార్లెస్ డిగాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డామీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌఎన్‌లై, మావోసేటుంగ్, సిరిమావో బండార నాయకే, విల్లీబ్రాండ్, సుకర్ణో, క్వామే ఎన్‌క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా వంటివారు.
జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రథమ ప్రధానమంత్రి. ఐరాస విధానాలకు ఆయన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా, శాంతిత్వవాదనకు ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా అలనాటి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యేమార్గాన్ని అనుసరించేట్లు చేసినవాడిగా చరిత్రలో ఆయనో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. పొరుగునున్న చైనాతో ‘పంచశీల’ పేరుతో శాంతి సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా పేరుతెచ్చుకుంది. భారతదేశానికి మూడో ప్రధానమంత్రిగా, ఆ తరువాత ఆరవ ప్రధానమంత్రిగా హత్యకు గురయ్యేదాకా ఇందిర సేవ చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపుతెచ్చుకున్న దేశంగా భారత్‌కు పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనికపరంగా దక్షిణ ఆసియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారతదేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాక్‌పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా ఆమె చేసిన కృషి అమోఘం. పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.
జాన్ కెనె్నడీ అమెరికా 35వ అధ్యక్షుడిగా- తాను హత్యకు గురయ్యేవరకు పనిచేసారు. ఆయన కాలంలోనే ‘బే ఆఫ్ పిగ్స్’ దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్‌గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌరహక్కుల ఉద్యమం సహా వియత్నాంపై యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటుచేసుకున్నాయి. అతి పిన్నవయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెనె్నడీ, అచిరకాలంలోనే ప్రపంచస్థాయి అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత అమెరికాకు ఎంతోమంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయనకొచ్చిన గుర్తింపు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! మరో అగ్రరాజ్యంగా అమెరికాకు పోటీగా ఉన్న సోవియట్ యూనియన్‌కు ప్రధానమంత్రిగా నికితా కృశే్చవ్ వుండేవారు. జర్మనీ ఐక్యత కోసం కృశే్చవ్ నిరంతరం కృషి చేశారు. ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫాన్స్‌కు ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు.
చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడిగాను, ఆ దేశానికి అధ్యక్షుడిగాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్ర ముఖ రాజనీతిజ్ఞుడిగా ఆరోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలాకాలం క్రితమే ఆ దేశానికి 1945లోనే ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణభూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్‌ను ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య సమతుల్యం పాటించుకుంటూ ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్‌ను అభివృద్ధి చేసేందుకు డి గాలె ఎన్నడూ రాజీపడలేదు. అలాగే ఇజ్రాయిల్‌కు చెందిన గోల్డామీర్, బెన్ గూరియన్‌లు విశేష ఖ్యాతి పొందారు. ఆ దేశ నాల్గవ ప్రధానమంత్రిగా ఉన్నపుడు గోల్డామీర్‌ను ఇజ్రాయిల్ రాజకీయాలలో ‘ఐరన్ లేడీ’గా అభివర్ణించేవారు. గోల్డామీర్ అనేకమంది ప్రపంచ నాయకులను కలిసి, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతిస్థాపనకు కృషిచేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పనిచేసిన డేవిడ్ బెన్‌గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతిపితగాను ప్రసిద్ధికెక్కాడు. అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమేకాక, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు నడిపారు.
యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో చనిపోయేంతవరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేసాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణోలతో కలిసి అలీనోద్యమనేతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రథమ సెక్రటరీ జనరల్‌గా ఆయన ఎంపికయ్యారు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే- ఆయన ఈజిప్ట్‌కు రెండవ అధ్యక్షుడిగా చనిపోయేంతవరకు వున్నారు. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ‘సూయజ్ కెనాల్ కంపెనీ’ని జాతీయం చేయడంతో ఈజిప్టులోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి ‘యునైటెడ్ అరబ్ రిపబ్లిక్’ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులెందరినో కదిలించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ప్రథమ ప్రధానమంత్రిగా చౌ ఎన్‌లై చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపథ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కోసం ఆయన పాకులాడాడు. అమెరికా, తైవాన్, రష్యా, భారత్, వియత్నాంలతో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో చౌ ఎన్‌లై సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన ‘మెంటార్’, నాయకుడు. మావో సేటుంగ్ 1949లో ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ వ్యవస్థాపకుడు. చైనా కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషిచేసిన ‘త్రిమూర్తుల’లో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి.
పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షునిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రథమ అధ్యక్షునిగా పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తికి తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయికే ఎన్నోసార్లు బాధ్యతలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-74 మధ్యకాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేసారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన కృషికి గుర్తింపుగా విల్లీ బ్రాండ్ట్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇండోనేషియా ప్రథమ అధ్యక్షునిగా పనిచేసిన సుకర్ణో ఆ పదవిలో 22 ఏళ్లపాటు కొనసాగారు. ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండోనేషియన్ కమ్యూనిస్టు పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత, గుర్తింపుతెచ్చేందుకు సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడిగా వుండేవారు. బ్రిటిషు వలస రాజ్యంగా వున్న ఘనాకు స్వాతంత్య్రం సంపాదించడంలో కీలకపాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రథమ అధ్యక్షునిగా, ప్రథమ ప్రధానమంత్రిగా పనిచేసారు. ‘ఆఫ్రికన్ యూనిటీ సంస్థ’ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు క్రుమా. వియత్నాం కమ్యూనిస్టు విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హోచిమిన్ ఆ దేశాధ్యక్షునిగా, ప్రధానమంత్రిగా పనిచేసారు. వియత్నాం స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన హోచిమిన్ కమ్యూనిస్టు పాలనలోని తన దేశంలో ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను స్థాపించారు. ఫ్రాన్స్‌ను ఓడించిన ఘనత ఆయనదే. ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలోవున్న వ్యక్తి- క్యూబాకు తిరుగులేని నాయకుడు ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్టు నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్టు విప్లవ పంథాపై ఆయనకు గట్టిపట్టుంది. నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘దక్షిణాఫ్రికా మహాత్మాగాంధీ’గా ఆయనను అంతా పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే గత కాలంలో ఇలాంటి మహానాయకులు మరి కొందరుండవచ్చు. ఏరీ అలాంటి నాయకులిప్పుడు? *

- వనం జ్వాలా నరసింహారావు సెల్: 80081 37012