ఎడిట్ పేజీ

మనదంతా మిథ్య.. ఫిన్‌లాండ్‌దే విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడా లేనన్ని బాలల హక్కుల సంఘాలు మన దేశంలోనే వున్నా, బడి బయట బాలల హక్కుల ఉల్లంఘనలు తప్ప, బోధన పేరిట బడిలో జరుగుతున్న ఉల్లంఘనలు ఏ ఒక్క హక్కుల సంఘానికీ పట్టడం లేదు. పాఠశాలకు పోవల్సిన వయస్సెంతో, ఏ వయస్సుకు ఎంత చదవాలో, ఎన్ని పుస్తకాలు చదవాలో, ఎన్ని భాషల్ని నేర్చుకోవాలో, ఉన్నత చదువులనే ఊహాజనిత ఆలోచనలతో ఎనె్నన్ని పోటీ పరీక్షలు రాయాలో ఈ సంఘాల వారెవ్వరికీ పట్టదు. తెలిసినా అది ప్రభుత్వ వ్యవహారమని తప్పించుకునే వ్యవహారం వీరిది. ఇక ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి తల్లిదండ్రులది ఫీజుల గోలే తప్ప, పిల్లలు మోస్తున్న పుస్తకాల భారం ఏనాడు బాధించదు. పేరెంట్స్‌కు తెలిసిందల్లా బోలెడన్ని పుస్తకాలతో, అత్యధిక బోధన సమయంతో పాఠశాలలో గడపాలని, అవసరమైతే ఉదయం, సాయంత్రం అదనంగా కోచింగ్‌ల పేరున బాధించాలనేది మాత్రమే!
వలసవాదుల కాలంలో రామ్‌మోహన్‌రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీజీ లాంటివారు ఓ ప్రత్యామ్నాయ విద్యావిధానం గూర్చి ప్రస్తావన చేసినా, అది ఆచరణకే రాని వైనం. ఈ సందర్భంగానే ఠాగూర్ ‘చిలక చదువు’అనే ఓ అద్భుతమైన కథను రాశారు. జాతీయ నేతలను పొగడడం తప్ప ఏనాడు వారి విధానాల్ని పట్టించుకోకుండా, వలసవాద విధానానే్న నేటికీ పాలకులు కొనసాగిస్తున్నారు. ముదిలియార్ సెకండరీ విద్యా కమిషన్, కొఠారీ పాఠశాల విద్యాకమిషన్ బోధన గూర్చి, తరగతి గదిలో జరగాల్సిన వౌలిక మార్పుల గూర్చి కొంత ప్రస్తావన చేసినా ఏ ప్రభుత్వానికి ఈ విషయాలు పట్టలేదు. ప్రభుత్వ రంగంలో వుండాల్సిన విద్య పూర్తిగా ప్రైవేట్‌మయం అయింది. కానె్సప్టు బోధన విధానం కాంపిటీషన్ బోధనా విధానంగా మారిపోయింది. ఇలా కార్పొరేటీకరణ చెందిన విద్య ‘నూరు ర్యాంకులు- వేల కోట్ల రూపాయల ఆదాయం’తో విరాజిల్లుతున్నది. ఇంటర్ తర్వాత ఒకప్పుడు మెడిసన్ చుట్టూ, ఆ తర్వాత ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ రంగం చుట్టూ, ఎంబిఎ, ఎంసిఎల చుట్టూ తిరిగినా ఇప్పుడు ఐఐటిలు, ఐఎఎస్‌ల వైపు మళ్ళింది. వీటి కోసం ప్రాథమిక స్థాయిలోనే ‘్ఫండేషన్ కోర్సు’లంటూ కాలానుగుణంగా దోచుకోవడం కార్పొరేట్ శక్తుల నైజంగా మారింది. ఒక శాతం విద్యార్థులకు కూడా ఒనగూరని ఈ విధానం మిగతా 99 శాతం విద్యార్థుల్ని నూన్యతాభావానికి గురిచేస్తూ ఆత్మహత్యలకు పురికొల్పుతున్నది. ఈ అశాస్ర్తియ విధానాలను పాలకులు పోషిస్తుంటే, పౌర సమాజాలు, తల్లిదండ్రులు, వృత్తి సంఘాలు, బాలల హక్కుల సంఘాలు వౌనాన్ని పాటిస్తున్నాయి.
పని సంస్కృతి లేని విద్య ‘పని చేయడమే నేరమ’నే ఆలోచనల్ని కలిగిస్తూ, సంప్రదాయ వృత్తుల్ని, కులవృత్తుల్ని అపహాస్యం చేసేలా ఎదిగిస్తున్నది. దోపిడి భావజాలాన్ని పెంపొందిస్తున్నది. ఉన్నత స్థాయి ఉద్యోగార్థుల్నిగా, బ్యూరోక్రాట్లుగా ఎదిగించి పాలకులకు బానిసలుగా తయారుచేస్తున్నది. ఇలాంటి సందర్భంలోనే పాఠశాలకు రెండు లక్ష్యాలుండాలని, అవి- విద్యార్థుల్ని ఈ ప్రపంచంలో జీవించడానికి సంసిద్ధం చేయడం ఒకటైతే, ఈ ప్రపంచాన్ని మరింత అర్థవంతంగా సుందరంగా పిల్లలే తీర్చిదిద్దుకునే విధానం రెండోది- అనే నినాదంతో, ‘పాటర్స్‌వీల్’ అనే సంస్థ రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని బిర్లా సైన్సు సెంటర్లో ‘క్రియేటివ్ పెడగాజీ, న్యూ ఎడ్యుకేషనల్ స్ట్రాటజీస్’ అనే అంశంపై ఓ అద్భుతమైన వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈనెల 6,7 తేదీల్లో జరిగిన ఈ వర్క్‌షాపులో దాదాపు 50మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనగా, కౌన్సిల్ ఫర్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ (సిసిఇ), ఫిన్‌లాండ్ హెడ్ ఆఫ్ స్ట్రాటజిస్టు హెరాంబ్ కులకర్ణితోపాటు నార్వేకు చెందిన ప్రపంచ స్థాయి తరగతి గది కథకుడిగా(బోధకుడిగా కాదు) పేరుగాంచిన డా.గోడి ఖెల్లర్ పాల్గొని ఆహ్లాదకర వాతావరణంలో, అలసట కలిగించకుండా ఫిన్‌లాండ్ విద్యావిధానం గూర్చి, ఆచరణాత్మక తరగతి నిర్వహణ గూర్చి చర్చా పద్ధతిలో, గ్రూపుల మధ్యన ఉల్లాసాన్ని కల్గించే ఆటల విధానంతో నిర్వహించడం ఓ విశేషం. పదుల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సర్వశిక్షా అభియాన్ గత దశాబ్దకాలంగా మొక్కుబడిగా నిర్వహిస్తున్న శిక్షణ, వర్క్‌షాపులకు భిన్నంగా ఈ వర్క్‌షాప్ జరగడం ఈ రచయితతో పాటు ఆహూతులను అబ్బురపరిచింది.
భ్రష్టుపట్టిపోయిన భారతీయ తరగతి గదిని కొంతైనా మార్పుచేయాలనే దృఢ సంకల్పంతో నిర్వాహకులు సంజయ్ వోమ్‌కరే చేసిన చిరు ప్రయత్నం దేశవ్యాప్యమైతే మన తరగతి గది స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు. పత్రికల్లో చదవడమే తప్ప ఫిన్‌లాండ్ విద్యావిధానం గూర్చి కళ్ళకు కట్టినట్టు, స్వయంగా చూసినట్లు అనుభూతిని కల్గించే నిర్వహకుల్ని అభినందించాల్సిందే! ఏడేండ్లు నిండితే గాని జరగని పిల్లల నమోదు, పాఠ్యపుస్తకాలనే మాట లేకుండా, పరీక్షలనే ‘దండన’ దరి రానీయకుండా, మాతృభాషలో తప్ప పరభాష వ్యామోహం లేకుండా, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వమే ఉచితవిద్య అందిస్తున్న విధానం ఫిన్‌లాండ్‌లో కనిపిస్తుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల స్వేచ్ఛాపూరిత వాతావరణంతో ఈ దేశంలో తరగతి గది నిర్వహణ గొప్ప విషయం. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులే సిలబస్‌ను రూపొందించుకోవడం, వారికైవారే ఎప్పటికప్పుడు స్వయం మూల్యాంకనం చేసుకోవడం, పరీక్ష అనే భావన రాకుండా అంతరంగ ఆలోచనలకి పదునుపెట్టే విశే్లషణాత్మక, గుణాత్మక, సంవాద మూల్యాంకన పద్ధతులు మన తరగతి గదికి ఏనాడు తట్టని అంశాలు. పిల్లల గూర్చి తెలుసుకోవాలంటే వారిపై నమ్మకం, విశ్వాసం కలిగి వుండాలని, పరీక్షలతో కొలవడం కాదని, ఈ విధానం విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, విలువల్ని పెంపొందించడమనే బోధనాధోరణి మంచిది కాదని ఫన్‌లాండ్ విద్యావ్యవస్థ మనకు చెబుతుంది. ప్రపంచాన్ని వీక్షించేలా జాలి, దయ, ప్రేమతో వికసింపజేసి విద్యార్థిని నిలబెట్టడమే విలువలతో కూడుకున్న విద్య అని, మన దృష్టితో కాకుండా, పిల్లల్ని వారి దృష్టిలోనే ఎదిగించాలని డా.గోపి తన తరగతి గది అనుభవాల్ని వ్యక్తీకరించారు. సృజనాత్మక విధానాలే తరగతి గది లక్ష్యంగా వుండాలని, పిల్లలు తరగతి ఫస్ట్ అని, గ్రేడ్‌వన్ అని, ర్యాంకర్ అని బిరుదుల్ని తగిలించవద్దని, ఇవన్నీ విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తాయని, ఫిన్‌లాండ్‌లో చదువుకుంటున్న తన కుమారుడి అనుభవాల్ని వివరిస్తూ హెరాంబ్ అనే వ్యక్తి తన ఆలోచనల్ని ఆవిష్కరించాడు.
ఫిన్‌లాండ్‌లో కూడా దాదాపు అయిదు దశాబ్దాల క్రితం మనలాంటి విద్యావిధానమే ఉండేదని, 19వ శతాబ్దం చివరార్ధంలో యూనోసిగ్నేయస్ (1810-1888) అనే విద్యావేత్త ప్రజావిద్యకై చేసిన కృషిఫలితమే నేటి విద్యారంగ మార్పుని, యావత్ దేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా, ప్రతి తరగతి గది ఓ జాతి కేంద్రంగా భావిస్తూ విద్యారంగ రూపకల్పన చేసినందుకుగాను ‘యూనోను ఫిన్‌లాండ్ విద్యపిల్’గా గుర్తించిందని, ఈ ఆచరణాత్మక తరగతి విధానాలే ఫిన్‌లాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకునేలా చేసాయని తెలుపుతూ, 1970దాకా ఫిన్‌లాండ్ విద్యారంగానిది పూర్వ దశ అయితే, 1980, 1990, 2000 నాటి కాలం ఆధునిక దశగా అభివర్ణించడం జరిగింది. ఇలా ప్రతి దశాబ్దానికొకసారి మార్పుల్ని చేసుకుంటూ ముందుకెళుతున్న ఫిన్‌లాండ్ పీసా పరీక్షలో 2006నుంచి మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. గణితం, సైన్సులాంటి విషయాల్లో ప్రతి మూడేళ్లకొకసారి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ డెవలప్‌మెంట్(ఓఇసిడి) నిర్వహించే ఈ పరీక్షలో నాలుగు సంవత్సరాల క్రితం భారత్ పాల్గొనగా కిందినుంచి రెండోస్థానంలో నిలవడం, తలవంపుగా భావించి ఈ పోటీకి దూరంగా వుంటున్నది.
ఎక్కువ పని గంటలు, సుదీర్ఘ బోధన , భారీ సంఖ్యలో అశాస్ర్తియ పుస్తకాలు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యవైఖరి, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం భారతీయ విద్యావిధానం అయితే, అతి తక్కువ పనిగంటలు (సం.కి 600గం.), వారానికి అయిదు రోజుల చొప్పున ఉదయం 9నుంచి 2.30 గం.వరకు ఒంటిపూట బడి విధానంతో, రోజుకు 4 పీరియడ్ల చొప్పున మధ్యమధ్యన 15ని. తరగతి గది బయట ఆట పాటలతో, అత్యధిక సెలవులతో, విద్యార్థులచే అత్యధికంగా ఇతర పుస్తకాల్ని (సం.కి 17 చొ.న) చదివించే విద్యావిధానంతో ఫిన్‌లాండ్ కొనసాగుతున్నది. ఫిన్‌ష్ (జశశజఒ్ద) భాషలో ప్రతి 5కి.మీ. ఒక గ్రంథాలయాన్ని నిర్వహించడమే కాదు, రైళ్ళల్లో, బస్సుల్లో, వీధిమూలల్లో గ్రంథాలయాల్ని నడుపుతున్నదంటే పిల్లలకు విద్యనందించే విధానం అర్థవౌతున్నది.
పాఠశాల మొహం చూపకముందే, నేర్చుకోవాలనే సామర్థ్యాన్ని పెంపొందించడానికై ప్రతి 10 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయున్ని అప్పజెప్పడం, అభ్యసనను అలవాటుగా, ఆహ్లాదకరంగా మార్చడం ఫిన్లాండ్ చేపట్టిన సంస్కరణలో మొదటిది కాగా, తరగతి గదిలో 22మందికి మించకుండా చూడడం మరో విశేషం. అందుకే పిల్లలంతా తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులుగా భావించడం, ఇచ్చిపుచ్చుకొనే అలవాట్లను, సహకరించుకునే ఔదార్యాన్ని, కలిసిమెలిసి జీవించే సౌభ్రాతృత్వాన్ని, వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను బాధ్యతగా గుర్తిస్తూ, సామాజక బాధ్యతతో, కార్మిక, కర్షక, దేశాధినేత పిల్లలనే తేడా లేకుండా, కుగ్రామం నుంచి, దేశ రాజధాని దాకా ఒకే విధమైన బడిని, విధానాన్ని అవలంబిస్తున్న దేశం ఫిన్‌లాండ్. నాల్గో గ్రేడ్ దాకా (10 సం.నిండేదాకా) ఎలాంటి హోంవర్కు లేకుండా, నచ్చిన రంగుల డ్రెస్సుల్ని వేసుకునే స్వేచ్ఛతోసాగే అక్కడి తరగతి గదిని దత్తత తీసుకొని, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు వెళ్ళడం గమనార్హం! మనదగ్గర ఈ విధానాన్ని దశాబ్దకాలం క్రితం సర్వశిక్షా అభియాన్ ఆచరించే ప్రయత్నం చేస్తే, ఓవైపు ప్రభుత్వ విధానాలు, మరోవైపు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు దీన్ని కాగితాలకే పరిమితం చేసాయి. ఏ స్థాయిలోనూ పిల్లల తిండి విషయంగా బాధలేని తల్లిదండ్రులు, ప్రభుత్వం అందించే నాణ్యతతో కూడుకున్న ఉచిత భోజనంపై పూర్త్భిరోసా కలిగి వుంటారంటే మనకు వింతే!
ఇంతగా విశిష్టత కలిగిన ఫిన్‌లాండ్ విద్యారంగంలో పనిచేయడానికి ఎంపికైన ఉపాధ్యాయులు టెట్‌లు, డిఎస్సీలు పాసై బెత్తంతో, కనుచూపులతో పిల్లల్ని నియంత్రించే మర మనుషుల్లా కాకుండా నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిజాయితీతో, స్వేచ్ఛాపూరిత వాతావరణంతో, తమ స్వంత పిల్లల్ని కూడా అదే తరగతి గదిలో చదివిస్తూ వుంటారు. అనేక దఫాల వడపోత తర్వాత, ఉన్నత స్థాయి, పిహెచ్‌డి విద్యార్హతల్ని కలిగిన వారిని, నిరంతరం తరగతి గదిలో ప్రయోగాత్మక బోధన చేసేవారిని గుర్తించి ఎంపికచేస్తారు. వీరికిచ్చే జీతాలు కొన్ని స్థాయిల్లో, మన సరాసరి కన్నా 25రెట్లు అధికమంటే ఆశ్చర్యమే! అంటే, ఫిన్‌లాండ్ ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనాలుబట్టే, అక్కడి విద్యాస్థాయిని అంచనా వేయవచ్చు! విద్యారంగం బాగుండకపోతే ఆ జాతే బాగుపడదనే ఆలోచనతో, బాధపడేవారికి సాంత్వన చేకూర్చగలిగితే, సొమ్మసిల్లిన వారిని గూటికి చేర్చగలిగితే- నేను వైఫల్యం చెందనట్లే.. అన్న ఇమ్లి డికెన్‌సన్ పంక్తుల్ని అక్షరాలా నిజం చేస్తున్న దేశం ఫిన్‌లాండ్. దీర్ఘరాత్రులతో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో, సమతుల వాతావరణం లేని అతి చిన్న దేశం ప్రపంచానికే తరగతి గది పాఠాల్ని బోధించడం అక్కడి పాలకుల పాలనకు అద్దం పడుతున్నది. ఫిన్‌లాండ్ విద్యావ్యవస్థలోని విశిష్టతను భారతీయ ఉపాధ్యాయులు గుర్తిస్తే మన తరగతి గది కొంతైనా మారుతుంది. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162