ఎడిట్ పేజీ

సాహితీ కంఠాభరణం.. సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటికీ నేటికీ యువతకు ఆహ్లాద పతాక, నవ్య కవితాపుతీక, సాహితీ రంగ అంతరంగాలను ఎదపొరలను ఆవిష్కరించినట్లు ఆవిష్కరించగలిగే విజ్ఞులు, రసజ్ఞులు, అసమాన గేయకవితా ధురీణుడు, వచన కవితా వికాస లహరి డాక్టర్. సి.నారాయణరెడ్డి. ‘సింగిరెడ్డి’ ఇంటిపేరే గానీ కవిత్వపుసింగడి సినారె. తెలుగు సాహిత్య మేరు నగం. పాఠం చెప్పినా పాట రాసినా విద్యారంగాన్ని, సినిమా రంగాన్నీ తనదైన ముద్రతో వైభవ ప్రాభవాలు కూర్చి ‘్భళారే సినారే’ అనిపించుకున్న అజాత శత్రువు. సాహిత్యమే మూలకందంగా భారతదేశపు అత్యున్నత రాజ్యసభ సభ్యునిగా కూడా రాణించి, ఆ నిధులతో సాహిత్యపు పెన్నిధులను సమకూర్చిన వాడాయన. నేటి తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షునిగా ఆమరణాంతం, సాహిత్య భాషా సేవా పరాయణునిగా రాణకెక్కిన ‘విశ్వంభర’ కవి.
‘ఆకాశవాణి’లో లలిత గీతాలతో, సంగీత రూపకాలతో కవితలతో, ప్రసంగాలతో తొలినాళ్ల నుండి కవిగా వినుతికెక్కిన ‘అయామ్ బార్న్ ఇన్ ఆల్ ఇండియా రేడియో యాజ్ ఎ పొయట్’ అని పార్లమెంటులో స్వయంగా ప్రకటించిన వారాయన. ఆయన చేత తమ పుస్తకం ఆవిష్కరింపచేసుకోవాలని తపించని యువకవి లేడంటే అతిశయోక్తి కాదు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఉపన్యాసకునిగా వందలాది మంది శిష్యులను తయారుచేసి తెలుగు విశ్వవిద్యాలయానికి తాను ఉపకులపతిగా సేవలందించడమే కాక ఎంతోమంది శిష్యులకు దిశానిర్దేశం చేశారు. ఆయన తరగతి గదిలో తెలుగు పాఠం చెబుతుంటే ఇతర శాఖల విద్యార్థులు కూడా వారి ఉపన్యాసం వినడానికి ఎగబడేవారు. హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక వికాసానికి మూలాధారనాడి సినారె సభలో ఉండాలని అభిలషించని సాహిత్య సంస్థ లేదు. అనునిత్యం ఒకటి, రెండు సభలకు విధిగా హాజరు కావలసిన గౌరవ ప్రపత్తుల విధాయకతను ఆయన పొందారు. తన జన్మదినం జూలై 29 అంటే చాలు ఒక కొత్త కవితా సంకలనం తనది వెలువరించడమే అసలైన పుట్టినరోజుగా ఏటికేడాదిగా ఎదిగిన సాహిత్యపు ‘జ్ఞానపీఠం’ ఆయన.
సాధారణంగా విశ్వవిద్యాలయాల సిద్ధాంత గ్రంథాల్లో పరిశోధనలు చేసిన వారికి డాక్టరేట్ పట్టా రావడంతోనే మరుగున పడతారు. గానీ సి.నారాయణరెడ్డిగారికి డాక్టరేట్ సంతరించి పెట్టిన ఆయన సిద్ధాంత గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము-ప్రయోగములు’ నేటికీ సాహిత్య విద్యార్థులకే కాదు, సాహిత్యాభిలాషులందరికీ కూడా పఠనీయమైన గ్రంథంగా నవనవోనే్మషంగా ఉంది.
జన సమ్మోహనం..
ఆయన మాట-పానుగంటి పరిభాషలో మనం మలుచుకుంటే ‘మాటయన్న మాటయా-మాణిక్యముల మూట వౌక్తికముల పేట-మకరంద ప్రవాహపు తేట. జిగికి జిగి, బిగికి బిగి ఎదురెక్కునకెదురెక్కు-ఎన్ని వగలు-ఎన్ని హొయలు-ఎన్ని వనె్నలు-ఎన్ని ఒద్దికలు’ అన్నట్లుగా ప్రాసలతో విలాసహాస వయ్యారాలతో భాషించే వ్యక్తి సినారె.
సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని నిలిపిన కవి కలాల్లో ప్రథమ శ్రేణిలో పేర్కొనదగిన సినీ కవిగా రాణించాడాయన. ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసాని!’ అని ఆయన పాటను సంభావించని శ్రోతంటూ లేడేమో! దానవీర శూర కర్ణ చిత్రంలో ‘చిత్రం భళారే విచిత్రం’ అంటూ ప్రతినాయకుడైన మహాభారత విలన్ దుర్యోధనుడికి ప్రేమగీతం రాసి మెప్పించిన ప్రజ్ఞ ఆయనదే మరి!
పెద్ద మర్రిచెట్టు నీడలో పిల్ల మొక్కలు బతకవు అన్న మాటను పరాస్తం చేస్తూ తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని పదవులధిష్ఠించినా, పద్మభూషణ్ వంటి అత్యున్నత ప్రభుత్వ గౌరవాలు బడసినా కొత్తగా కలం పట్టిన కుర్రకవిలో లేశమైన ప్రతిభనయినా గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించి ఆద్యతన భావిలో వారూ ఉత్తమ కవులు కావడానికి కొండంత అండగా ప్రోత్సహించిన సౌజన్యమూర్తి సినారె. ఎవరు ఏ పుస్తకం పంపించినా పోస్టుకార్డు మీదయినా సరే వెంటనే ప్రతిస్పందన రాసి పంపే గొప్ప లక్షణం ఆయన సొంతం.
ఆయన జీవించిన కాలంలో జీవించడం ఆయన దగ్గర ఎంఏలో, ఎం.్ఫల్‌లో నేరుగా విద్యను శిష్యునిగా నేర్వగలగడం అదృష్టంగా గల నాబోంట్లు ఎందరెందరో! పదవ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ సుధామ పుట్టినరోజు కానుకగా సినారె గారి ‘ఋతుచక్రం’ గేయ కావ్యాన్ని తండ్రిగారి నుండి అందుకోవడం జరిగింది. ఆ తరువాతి కాలంలో ‘ఆకాశవాణి’ హైదరాబాద్ కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా సి.నారాయణరెడ్డిగారిని ఆహ్వానించి వారి గళంలో మొత్తం ‘ఋతుచక్రం’ కావ్యాన్ని రికార్డు చేయడం ఓ చిరంతన స్మృతి. యువభారతి సంస్థ ద్వారా కూడా వారితో అనుబంధం అధికం. ఇరివెంటి కృష్ణమూర్తి (సినారె సన్నిహిత మిత్రుడు), చక్రవర్తి వేణుగోపాల్, రంగపల్లి విశ్వనాథం గార్లతో బాటు నేనూ కూడి ‘యువభారతి’ నలుగురి సభ్యుల ‘వీచికలు’ కవితా సంకలనం నేను వేసిన ముఖ చిత్రంతోనే ఆయనచే ఆవిష్కృతమైనప్పుడు 1972లోనే ‘కవితలో బొమ్మ గీస్తాడు బొమ్మలో కవిత రాస్తాడు’ అని ప్రశంసింపబడడం, అలాగే యువమిత్ర లిఖిత పత్రికను అనేక సంవత్సరాలు నా సంపాదకత్వంలో నిర్వహించినప్పుడు 18-1-1974న ఆయన స్వహస్తాలతో నేటి ముద్రిత పత్రికలు ముఖం చూసుకోదగ్గ అద్దం ఈ లిఖిత పత్రిక. ఇందులో వున్నవన్ని శబ్ద చిత్రాలు, చిత్ర శబ్దాలు. ‘వోనా కాలం నా ప్రాణం తీసేసింది’-సజీవ రచన. శేముషి+కృషి=సుధామ’ అని ప్రశంసాక్షరాలు అందుకోవడం మరుపురానిది.
ఇప్పుడు వోనా కాలం ప్రవేశించిన తర్వాతనే ఆయన అశువులు బాయడం ‘వోనాకాలం నా ప్రాణం తీసేసింది’ అన్న అక్షరాలను అక్షర సత్యం మరోలా చేయడం నిజంగానే బాధాకరం. ఆయన ఆత్మీయతను, ఆదరణను పొందిన శిష్యగణంలో ఉండడం గొప్ప ఆనందదాయకం. నా తొలి కవితా సంకలనం ‘అగ్నిసుధ’కు 1990లో కలహంసి అవార్డును, అలాగే నా ‘సం.సా.రా.లు’ వ్యాస సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం 2004లో ఆయన సమక్షంలోనే స్వీకరించడం జరిగింది. వారు ముఖ్య అతిథిగా వచ్చిన పలు సాహిత్య సభలకు అధ్యక్షత వహించే భాగ్యం కలిగింది.
ఆలాగే ఒకేరోజు రెండు సభల్లో ఆయన పాల్గొనవలసి వున్నప్పుడు కూడా ‘సుధామ మాట్లాడాక వెడతాను’ అని ప్రేమగా, ఆత్మీయంగా ఆయన వ్యవహరించిన సందర్భాలు ఎలా మరిచిపోయేది? ఏటా విడుదల చేసిన ఆయన ‘కవితా సంకలనాన్ని’ ఆయన సంతకంతో పోస్టులో అందుకున్న అదృష్టం సాగుతూనే వచ్చింది. పుస్తక సమీక్షలు పలు పత్రికల్లో చేసిన నేను, సినారె మనుమరాలు వరేణ్య ఆంగ్ల కవితలకు తాతగారు సినారె తెలుగు చేసిన కవిత్వ పుస్తకాన్ని సమీక్షించిన తీరుకు సినారె గారి పెద్ద అమ్మాయి శ్రీమతి గంగ ఫోన్ చేసి అభినందించిన సందర్భమూ గుర్తుంది. సినారె తెలుగువారి జ్ఞానపీఠం. విశ్వనాథ తరువాత దానినందుకున్న ఏకవీరుడాయనే! రావూరి భరద్వాజ ఆ తరువాత. ఇప్పుడు ముగ్గురు జ్ఞానపీఠులూ అస్తమించారు. వారి ముగ్గురితో సన్నిహితంగా సన్నిహితంగా సంచరించగలిగిన మధుర స్మృతి మిగిలింది. ఎందరో కవులు కావడానికి స్ఫూర్తి దాయకం అయిన కవికుల ‘గురువు’ సినారె. తెలుగువైభవ ప్రాభవాలకు గొప్ప దారి దీపంగా నిలచిన మహనీయుడు సినారె. ఆయన కలం, గళం శాశ్వతంగా అస్తమించాయి. కానీ ఆయన కవిత్వ దీపం వెలుగుతూనే ఉంటుంది.

-సుధామ సెల్: 98492 97958