మెయన్ ఫీచర్

నెహ్రూ మార్గం.. కాంగ్రెస్‌కు శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణ పండిట్ల కు టుంబంలో పుట్టినా ఏ ఛాందసాలనూ తన దరికి చేరనీయలేదు. ‘పండిట్’ అంటే వేద పండితుడు కాదు, లోకం పోకడను, ప్రపంచ పరిణామాలను ఎరిగిన పండితుడు. తన దేశానికేం కావాలో, తన ప్రజల మనోభావాలేంటో నెహ్రూ అర్థం చేసుకున్నంతగా- ఒక్క అంబేద్కర్ తప్ప మరే నేతలూ అర్థం చేసుకోలేదు. దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసింది నెహ్రూ కుటుంబం. దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి మత కలహాలతో, విభజన విద్వేషాలతో కొట్టుమిట్టాడుతుండగా, అనేక సంస్థానాలుగా ఉన్న దేశాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చిన సమర్థ నాయకుడు నెహ్రూ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల పేరిట అల్లకల్లోలంగా ఉన్న భారత సమాజాన్ని ఐక్యం చేయడానికి నెహ్రూ తన విధానాలను ఎప్పుడూ మార్చుకోలేదు. సెక్యులర్ భావాలను వదులుకోలేదు. ఏ మతస్థుడితో ఆ మతస్థుడి టోపీ లేదా కండువా, శిలువ, రుమాలు ధరించి తన కుహనా లౌకికత్వాన్ని చాటుకోలేదు ఈ ‘పండిట్’. ఆయన మతపరమైన ప్రార్థనాలయాలకు పోయినట్టు కాని, సెక్యులరిజానికి భిన్నంగా ప్రవర్తించినట్టు కాని ఎక్కడా దాఖలాలు లేవు. ఇప్పటి నాయకులు సెక్యులరిజమంటే మతాతీత రాజ్యంగంగా గాక, అన్ని మతాలను ప్రోత్సహించే సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. నెహ్రూ బాటలోనే సెక్యులరిజాన్ని మిగతా నాయకులంతా పాటించి వుంటే దేశంలో ఇంతగా మత ఘర్షణలు, మారణహోమాలు జరిగి వుండేవి కావు.
అటు సోషలిస్టు రష్యా సోషలిస్టు పంథాను, ఇటు అమెరికా ప్రజాస్వామిక పంథాను, స్వదేశీ స్వభావాన్ని జీర్ణించుకొని ఈ దేశానికేం కావాలో నిర్ణయించుకున్నాడు నెహ్రూ. సెమీ సోషలిస్టు పంథాను ఎన్నుకున్నాడు. అది సాయుధ పోరాటం ద్వారా వచ్చే సోషలిస్టు వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం ద్వారా వచ్చే సోషలిస్టు వ్యవస్థ. తనదైన అలీన విధానాన్ని నెహ్రూ అనుసరించాడు. సోవియట్ రష్యా వైపుకొంత మొగ్గుచూపినా నెహ్రూ అలీన వ్యవస్థను అనుసరించాడు. అగ్రదేశాలైన అమెరికా, రష్యాలకు సమాన ప్రాధాన్యమిచ్చాడు. ప్రధానిగా దేశాన్ని పరిపాలించిన 17 ఏళ్ల సుదీర్ఘ కాలంలో స్వష్టమైన ముందుచూపుతో పరిపాలించిన అసలు సిసలు అభ్యుదయవాది నెహ్రూ. భారీ నీటిప్రాజెక్టులను ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం, సంస్థానాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడం, బడుగు వర్గాల పక్షం వహించడం వంటి అంశాలతో జాతిని ముందుకు నడిపాడు. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పేరిట ఇందిరకు నెహ్రూ రాసిన లేఖల్లో అతని విశ్వరూప సందర్శనం మనకు కనబడుతుంది.
ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో సంబంధాల విషయంలోనూ ఆచితూచి ఆయన వ్యవహరించాడు. విదేశాంగ విధానంలో నెహ్రూది ఓ ప్రత్యేకమైన శైలి. స్వతంత్ర పోరాటంలో, జైలుశిక్షను అనుభవించడంలో, జనాన్ని ప్రభావితం చేయడంలో నెహ్రూ పాత్ర అపూర్వం. గాంధీ నిర్ణయాలు హిందూమత విలువలకు, వర్ణాశ్రమ విలువలకు లోబడి వుంటే నెహ్రూ నిర్ణయాలు ప్రగతిశీలమైనవిగా ఉండేవి. నెహ్రూ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నందునే అంబేద్కర్‌కు రాజ్యాంగం రాసే మహత్తర అవకాశం లభించింది. అప్పటికి ప్రముఖ స్థానాల్లోఉన్న హిందుత్వవాద కాంగ్రెస్ నాయకులు- ఓ దళితుడితో రాజ్యాంగం రాయించడాన్ని వ్యితిరేకించినా నెహ్రూ మాత్రం అంబేద్కర్‌లోని ప్రతిభాపాటవాలను గుర్తించాడు. ఓ దళితుడికి భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఎంతో ప్రగతిశీల చర్య. స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగల వారిలో సర్దార్ వల్లభభాయి పటేల్, అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు. అంబేద్కర్ దేశ తొలి ప్రధాని అయ్యుంటే ఈ దేశ దళిత బహుజనుల పరిస్థితుల్లో ఇప్పటికంటే ఎంతో మెరుగ్గా ఉండేవన్నది వాస్తవం. సాంప్రదాయ వాదులంతా పటేల్ ప్రధాని కావాలని కోరుకున్నారు. హిందుత్వవాదిగా ముద్ర పడిన పటేల్ ప్రధాని పదవిని చేపట్టి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవి. గాంధీ హిందుత్వవాది అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో పటేల్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేయలేదు. అయితే, నెహ్రూ సిద్ధాంతాలు హిందూమత పరిధికి లోబడి ఉండేవి కావు. అవి అభివృద్ధికరమైనవి, లౌకికమైనవి, మతానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చేవి. నెహ్రూ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశాన్ని పురోగమనబాటలో నడిపాడు. శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. నెహ్రూ వేసిన పునాది, ఇందిరా గాంధీ డైనమిక్ నాయకత్వం, రాజీవ్ గాంధీ ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి వంటివన్నీ దేశాన్ని అణ్వాయుధ రంగంలో, ఉపగ్రహాల ప్రయోగంలోనూ, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడే స్థితికి తెచ్చాయి.
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కల్గించాల్సిన అవసరం ఇపుడు ఏర్పడింది. సిద్ధాంత బలంతో, బడుగువర్గాల నేతల నాయకత్వంలో నిజమైన బహుజన పార్టీ రానంతవరకూ- ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీయే పెద్దదిక్కు. గత మూడేళ్ల బిజెపి పాలనలో కొన్నివర్గాలు అభద్రతా భావంతో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావాలంటే ముఖ్యంగా రెండు విషయాలపై ధ్యాస పెట్టాల్సింది. అందులో ముఖ్యమైనది- నెహ్రూ విధానాలను పాటించడం, రెండవది పార్టీని బహుజనీకరించడం, సామాజికీకరణం చెందించడం.
కాంగ్రెస్‌ను నెహ్రూ స్థాపించకున్నా ఆ పార్టీని మహోన్నత స్థితికి తెచ్చింది ఆయనే. అవిచ్ఛిన్నంగా దేశాన్ని ముప్ఫై ఏళ్ళు పాలించడానికి, 2014 ఎన్నికల వరకూ ఐదున్నర దశాబ్దాలు పాలించడానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసింది నెహ్రూనే. బ్రిటన్ దొరల ‘విభజించు.. పాలించు’ స్థితి నుండి నవభారతాన్ని నిర్మించడానికి కృషిచేసింది నెహ్రూ. వివిధ సంస్కృతులు, మతాలు, భాషలు, కులాలు, జాతులున్న సువిశాల భారతంలో సెక్యులర్ భావాలను పెంపొందించింది ఆయనే. కానీ, కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు బదులు ఇప్పటికీ ‘గాంధీ జపం’ చేస్తోంది. నెహ్రూ మరణానంతరం ఈ ‘జపం’ మరీ ఎక్కువైంది. అంబేద్కర్‌కు అనేక విషయాల్లో గాంధీ అడ్డుపడ్డాడు. ఫ్యూడల్ గ్రామాలను గాంధీ కోరుకున్నాడు. నెహ్రూ పట్టణ సౌకర్యాలున్న పల్లెలను కోరుకున్నాడు. గాంధీ హరిజనవాదం కూడా హిందుత్వ భావజాలానికి, వర్ణ్ధర్మానికి లోబడిందే. నెహ్రూ కుటుంబం కుల వ్యవస్థనెప్పుడో అధిగమించింది. తన కుమార్తె ఇందిర ఫిరోజ్‌ను పెళ్ళిచేసుకోవడాన్ని నెహ్రూ ఆమోదించాడు. రాజీవ్ గాంధీ విదేశీ క్రైస్తవురాలైన సోనియాను పెళ్ళిచేసుకున్నాడు. సంజయ్ గాంధీ సిక్కు వనితను పెళ్ళిచేసుకున్నాడు. ప్రియాంక మార్వాడీని పెళ్ళాడింది. ఈ దేశాన్ని పీడిస్తున్న కులం అడ్డుగోడలను నెహ్రూ కుటుంబం అధిగమించింది.
నెహ్రూ తర్వాత గాంధీ నామజపంతో ఓట్లు పొందాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నెహ్రూ విధానాలను అమలు చేసి ఉంటే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. హిందుత్వ గాంధీని కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. అందుకే కాంగ్రెస్‌లో (ఇతర పార్టీలూ ఇంతే) పీడిత కులాల నాయకత్వం ఎదగలేదు. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, సామాజికాంశాలపై పార్టీలు ఎదగడానికి దోహదం చేశాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న క్రమంలో బిజెపి బలం పుంజుకుంది. సెమీ మనువాద పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటేయడమెందుకని అగ్రవర్ణాలు, హిందుత్వవాద బి.సిలు, కొంతమంది ఎస్సీలు కూడా బిజెపి వైపు మొగ్గు చూపారు. ఒకప్పుడు గాంధీని శత్రువుగా భావించినప్పటికీ ఇప్పుడు బిజెపి వైఖరిలో మార్పు వచ్చింది. బిజెపి బలం పెరుగుతున్న కాలంలో ‘గాంధీ జపం’ కాంగ్రెస్‌కు ఏమాత్రం ఉపయోగపడడం లేదు.
గాంధీ కంటే ఎన్నోరెట్లు బడుగుల పక్షపాతి అయిన నెహ్రూను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవాలి. పార్టీ మొత్తం ఆయన విధానాలను అనుసరించాలి. ఇదివరకున్న దళిత బహుజన పక్షపాతాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇందుకోసం సామాజికీకరణం, దళితీకరణం చెందాలి. కాంగ్రెస్ పార్టీని ‘నెహ్రూకరించడమే’ ఇందుకు ఏకైక మార్గం. ఇక రెండవ మార్గం- మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల పక్షం వహించడం. ఏ పార్టీలోనూ ఈ సామాజిక వర్గాల నుంచి అత్యున్నత స్థానంలో ఉన్నవారులేరు. సర్వ సంపదల సృష్టికర్తలైన బడుగువర్గాల వారే సామాజిక దురన్యాయానికి గురవుతూ నిరుపేదలుగా మగ్గుతున్నారు. ఈ కులాల్లోంచి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, దేశాధ్యక్షులు, నిర్ణయాధికారులు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ఆలోచించి, ఆయా సామాజిక వర్గాలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. పార్టీలోని అగ్రకులాల వారు ఇందుకు సహకరించాలి. ఈ రెండు సూచనలను అనుసరిస్తే గనుక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయం.

- డా. కాలువ మల్లయ్య