మెయన్ ఫీచర్

ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెన్నవంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు నువ్వేనా?
కొవ్వెక్కిన నవ చైనా?
సామ్యవాదమను పేరిట
సామ్రాజ్య పిపాస దీర్చ
నెంచు కుటిల జాతీ!
ఇదా రాజనీతి..?’
మాతృభూమి శత్రు దేశపు దురాక్రమణకు గురి అయి ఉండిన స మయంలో.. 1962లో ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించిన జాతీయ హృదయ ఘోష ఇది.. భౌతికమైన సరిహద్దులు మాతృదేవి స్వరూపం, సాంస్కృతిక వికాసం మాతృభూమి స్వభావం! భౌతికమైన వైకల్యం సాంస్కృతిక వైక్లబ్యానికి దోహదం చేయడం చరిత్ర నిరూపించిన వాస్తవం! క్షతమైన దేహం నుండి రక్తం స్రవిస్తున్న సమయంలో బుద్ధి పనిచేయదు. సరిహద్దుల సమగ్రతకు భంగం వాటిల్లిన దేశంలో ‘వెన్నున’ నిప్పంటుకున్న జాతీయ సీమలలో సంస్కృతి వికసించలేదు! శరీరం భౌతికం, ధర్మం స్వభావం! ‘శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనమ్’.. అందువల్లనే చైనా దురాక్రమణ నాటికి- పసిమి వదలని మిసిమి సొగసుల వాడైన, ముప్పయి ఏళ్ల ‘త్రిదశుడైన’ ‘సినారె’ భరతజాతి స్వభావాన్ని ఇలా ఆవిష్కరించాడు. ఈ స్వభావం ‘వెన్న’.. సౌశీల్య నవనీతం, సాంస్కృతిక పీయూషం! ఈ ‘వెన్న’ను చైనా ఇప్పటికీ దోచుకుంటూనే ఉండడం యాబయి ఐదేళ్లనాటి ‘సినారె’ కవిత సమకాలానికి సమన్వయం అవుతున్న వాస్తవం! పాంచ భౌతిక శరీరాకృతిని ‘సినారె’ పరిత్యజించడం ప్రాకృతిక జీవన పరిణామక్రమం.. ప్రజల హృదయాలను పలికిస్తున్న ఆయన కృతి అజరామరం కా వడం సాహితీ ప్రపంచ స్థిత వాస్తవం.. ‘విశ్వంభర’ భూమి, విశ్వమంతటా నిండిన వాడు విశ్వంభరుడు! మాతృభూమిపై మొలకెత్తిన ‘సినారె’ సాహిత్య సుమ పరిమళం అనంత విశ్వాన్ని ఆవహించడం దశాబ్దుల భాషా చరిత్ర, ఈ భాష ‘ఆత్మలను పలికించింది’, పలికిస్తోంది.. ‘సినారె’ సృష్టించిన ‘విశ్వంభర’ అజరమైన సాంస్కృతిక శ్వాస.. ఆయన కవితా దుహిత అమరమైన ‘త్రిదశ’.. ‘త్రిదశ’కు- దివ్యత్వానికి- అంతం లేదు..
అక్షర రూపమైన భాష దేహం, దేశం.. అక్షయమైన భావం దేహస్థిత ఆత్మ, దేశస్థిత సంస్కృతి! ‘దేశం’ భౌతికం, ‘కాలం’ సాంస్కృతికం! దేశ కాల అనాదిని అనంతాన్ని సాహిత్య ఇతివృత్తంగా మలచుకున్న సనాతనుడు, శాశ్వతుడు- నారాయణరెడ్డి! ‘మూగ నేల’కు నీరందించని ‘వాగు’ పరుగు దేనికనీ? పరుల కొరకు పాటుపడని నరుని బతుకు దేనికనీ..?’ అని 1984 జనవరి ఇరవై ఆరవ తేదీన ‘సినారె’ ఆలపించాడు- వాగ్గేయకారుడు! ‘వాగు’ ప్రధానం కాలేదు, ‘నేల’ ప్రధానమైంది, శ్యామల కోమల వ్యవసాయ క్షేత్రం ప్రధానమైంది, మాతృభూమికి ‘పసిమి మించుల ‘చోల’మేదీ? పసిడి అంచుల చేలమేదీ..?’ అని ప్రశ్నించిన వాడు ఈ సాహిత్య ‘కర్పూర వసంత రాయలు’! తల్లికి, ‘మాతృ సాంస్కృతిక మూర్తికి మధురాక్షలతో నిర్మించిన సా హిత్య ‘చోల’ము- రవికెను, కవితా ‘చేల’ము-చీర-ను మాత్రమే కాదు, అసంఖ్యాక భావ భూషణాలను అలంకారాలను సమర్పించిన మాతృ మమకార విభూషితుడు నారాయణరెడ్డి! ‘కెరటాలెంతగ ఎగసిన కాని కడలిని విడి పోలేవు, వెనె్నల లెంతగ విరిసిన కాని చంద్రుని’కి దూరం కాదు! ‘విశ్వంభర’- నేలతల్లి-పై పుట్టిన వరాల బిడ్డడు త్రివిముక్రయుడై వ్యాపించినప్పటికీ ‘నేల’ను వదలిపోడు.. అసంఖ్యాక గీతాలలో ఈ నేల తల్లితో పుత్రునికున్న మమకార వాత్సల్యాలను ధ్వనింపచేసిన సాహితీ సుపుత్రుడు ‘సినారె’.. ‘్ధ్వని’ ప్రాధాన్యమైనది, అది ఉత్తమ కవిత్వం! ఆ కవిత్వం నారాయణరెడ్డి జీవితం. ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’ అన్నది భరత జాతీయ జీవన వేదం!
దేశం- స్పేస్- ఆద్యంత రహితం, మనకు జన్మనిచ్చిన ‘నేల’ దానికి విగ్రహ రూపం! ‘దేశ’ అనంత తత్త్వాన్ని మాత్రమే కాదు ‘కాల’ అఖండ స్వభావాన్ని సాహితీ పరిభాష ద్వారా నిరంతరం ధ్వనింపచేసిన ‘సనాతనుడు’ సినారె! చలనచిత్ర జగత్తును రమ్యరస సరితలతో- ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాల’తో ముంచెత్తిన సాహిత్య పర్జన్యుడు.. ఈ ‘సవ్వడి లేని’ స్రవంతులు ప్రేక్షకుల గుండెలను జలపాతాలుగా మార్చడం, జన మానస సీమలను ఉప్పొంగిన తరంగ ప్రకంప మయం చేయడం దశాబ్దుల చలనచిత్రం..! ఈ దశాబ్దులలో ‘సినారె’ యుగయుగాలను ధ్వనింపచేశాడు, ‘కాలప్రవాహ నిత్యత్వాన్ని’ ఆవిష్కరించాడు, ‘కదిలే ఊహలకు కన్నులు’ కల్పించి దర్శింపచేశాడు! ‘పగలే వెనె్నల’ కావడం ఆదర్శం.. పగటి తరువాత రాత్రి రాత్రి తరువాత పగలు, ఇది యుగాల చక్రం.. పగలే ‘వెనె్నల రాత్రి’ కావడం నిత్యమైన కాలంలో నిహితమైన అద్వైతం.. తొలి చిత్రంలోనే- ‘ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..’ అంటూ తుది మొదలు లేని యుగయుగాల కాలాన్ని ధ్వనింపచేశాడు ‘సినారె’, కారణజన్ముడు! ‘అవధి లేని యుగయుగాల అమృత వాహిని..’ ఆయన కవిత్వం! ‘యుగ యుగాలు నీ నీలికనుల సోయగము చూడనీవే’ అంటూ జగత్తును పలుకరించిన ‘పద’విన్యాసం సినారె సాహిత్యం! ఇలా యుగాలను ఆవహించిన, యుగాలను అతిక్రమించిన కాలాన్ని జీవన ప్రస్థావానికి అన్వయించడం భారతీయ వాస్తవం, సనాతన సాంస్కృతిక స్వభావం! ‘సినారె’ భారతీయుడు, అతనిలోని సాహిత్య స్వభావుడు సనాతనుడు!! అతని అక్షరాలు చలనచిత్ర ప్రవాహాన్ని ఉరకలెత్తించిన అలలు, ఉదాత్త్భావ మాధుర్యాన్ని అద్దిన సుధారస గుళికలు.. ఆయన సృష్టించిన ‘చిత్ర సాహితీ సుందరి’ ఆయన ఆవిష్కరించిన రీతిలోనే-
‘నీల నీల కుంతల, వి
లోల మృదుల చేలాంచల,
తరళ తరళ భావ గగన
సురభిల నవ చంచల,
మధుర మధుర హాసిని
మదన హృదయ వాసిని....
మద మరాళ గామిని
మంజుల మధు యామిని
ఝలం ఝలిత మణి నూపుర
లలిత లయ విలాసిని
రాగ తాళ భావ రంజని..
భువన మోహిని!
అవధి లేని యుగయుగాల
అమృతవాహిని..’
- ఇది ‘సినారె’ భాష, సాహిత్య శ్వాస! ఇది ‘సినారె’ తెలుగు, సాంస్కృతికమైన వెలుగు.. రెండు దశాబ్దులకు పైగా చలనచిత్ర సాహిత్యాన్ని సముజ్వల భాషాభూషణాలతో సుసంపన్నం చేరిన కోవిదుడు నారాయణరెడ్డి. జాతీయ సాంస్కృతిక పరంపరా పరిమళాలను ‘చిత్రసీమ’లో ప్రసరింపచేసిన వాడు.. ఈ భాష తెలుగా? సంస్కృతమా? సంస్కృతం వలె కనిపించే తెలుగా? తెలుగు వలె ధ్వనించే సంస్కృతమా? అన్న సందేహం ప్రేక్షకులకు కలగలేదు, ‘వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించి..’ పోయిన కవితాకాంత ప్రశ్నించలేదు. అర్ధమయిన వారికి అర్థమయింది! ‘అది ప్రసన్న కథాకలితార్థయుక్తి..’ ఇతరులు అక్షర రమ్యతను ఆదరించారు! ఇది నన్నయ బాట.. ఇదే నారాయణరెడ్డి మాట....
‘రాజుకంతట అనుగు
భార్య కన్పడలేదు,
భార్యయును సర్వ సే
నాని కన్పడలేదు,
సర్వం సహా ధరణి
నిర్వహణ దక్షుడని
కొనియాడు తనదైన
ప్రజయు కన్పడలేదు..’
ఇది ఆంధ్ర భాషా యోషను ‘సినారె’ అలంకరించిన విలక్షణమైన ‘ముక్తపదగ్రస్తం’.. అక్షర యుక్తమైన భావం అందకపోవచ్చు కానీ భావయుక్తమైనప్పటికీ అక్షరాలు అలరిస్తాయి, అనుభూతులను కలిగిస్తాయి! అందువల్లనే ‘సినారె’ భాష తెలుగువారిని ఇంతగా అలరించింది! భావయుక్తమైన అక్షరాలు లేవు, ‘సినారె’ సాహిత్యంలో లేవు, భావం బోధపడని వారిని సైతం ‘సినారె’ అక్షర రమ్యత అలరిస్తోంది, ఆయన తెలుగు సంస్కృతమైంది, ఆయన సంస్కృతం తెలుగు వెలుగులను ప్రసరించింది. ‘ఆత్మావైపుత్ర నామాసి’’- ‘‘ఆత్మ! పుత్రికవు అవుతున్నావు, పుత్రుడవు అవుతున్నావు’’-అన్నది సృష్టిగత పునరావృత్తి! తెలుగు సంస్కృత భాషకు పుత్రిక. ఈ సత్యం ‘సినారె’ తెలుగు ద్వారా పదేపదే స్పష్టమైంది! తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు మరో భారతీయ భాష కావచ్చు, ‘ఆత్మలను పలికించేదే అసలైన భాష..’ అన్నది ‘సినారె’ ఆవిష్కరించిన సత్యం. ఆత్మలను వెలిగిస్తున్న ఆయన భాష ఇందుకు సాక్ష్యం. ‘పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును...’ ‘సినారె’ సామాజిక దార్శనికుడు, ఈ దార్శనికత కూడ ఆయన కవిత్వంలో ‘వాచ్యం’ కాలేదు, ధ్వనించింది! ‘్ధ్వని’ సముత్కర్ష సాహిత్య స్వభావం.. అందుకే..
పలుకలేను కవిత్వ
భాషలో ఈ పూట
పాడుతా గొంతెత్తి
వేడి నెత్తుటి పాట....
ఎక్కడున్నాము నిరు
డెక్కడన్నాము?
రచ్చకెక్కిన పచ్చి
రాజకీయాలలో...
ఎక్కడున్నాము ఇపు
డెక్కడున్నాము?
రొదలేని విప్లవం
రూపొందు నేలలో...’’
- అని 1976లో ‘సినారె’ ఆలపించాడు! అవి అత్యవసర స్థితి- ఎమర్జెన్సీ- నెలకొన్న రోజులు. అందువల్ల ‘సినారె’ రొదలేని విప్లవాన్ని ధ్వనింపచేశాడు. తాత్కాలిక వాచ్యార్థం వేఱు కావచ్చు! ఆయన ధ్వనింపచేసిన ‘రొదలేని విప్లవం’ రూపొందింది, విజయవంతమైంది, 1977 మార్చి ఇరవయ్యవ తేదీన ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి పదవిని పరిత్యజించడం ఆ ‘రొదలేని విప్లవం’- సైలెంట్ రివల్యూషన్- పరాకాష్ఠ! కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1930వ దశకంలో ‘ఏకవీర’ చారిత్రక నవలను రచించాడు. 1969లో ఆ నవల చలనచిత్రమైంది, మాటలు వ్రాసినవాడు ‘సినారె’. ‘జ్ఞానపీఠ’మెక్కిన ఇద్దరు తెలుగు మహాకవుల మధ్య నెలకొన్న అపురూపమైన సామ్యమిది! విశ్వనాథ నిష్క్రమణ తరువాతి ఆంధ్ర సాహిత్యసీమలో మరో విశ్వనాథ- సినారె... ‘సినారె’ వ్రాసిన ఒక చిట్టి కవితలోని ఇతివృత్తం ఇదీ- ‘ఆరోజున’- ఆయనకు శరీరం నలతగా ఉంది, మనస్సు కలత గా ఉంది, రాత్రివరకూ ఈ బాధ ఆయనను వదలలేదు, ఎందుకు బాధ?- అని ఆయన మధనపడినాడట.. హఠాత్తుగా స్ఫురించింది, ఆరోజున ఆయన ‘కవిత’ వ్రాయలేదట! ‘త్వమేవ అహం’- -నీవే నేను- అని సరస్వతీమాత మహాకవి కాళాదాసునకు స్ఫురింపచేసిందట.. ‘సినారె’ అంటే కవిత్వం, కవిత్వమంటే ‘సినారె’.. ఇది ఆయన జీవన ప్రస్థానంలో ప్రస్ఫుటించిన ‘అద్వైతం’.. *

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com