మెయిన్ ఫీచర్

దారు బ్రహ్మం.... జగన్నాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్నాథునికి గల అనేక నామాల్లో దారుబ్రహ్మం అనేది ప్రత్యేకమైనది. జగన్నాథుని మూర్తిని దారువు (కొయ్య)తో చెక్కించినది. దారు రూపంలో వున్న ఆయనలో సాధారణ మానవులు తెలుసుకోలేని బ్రహ్మపదార్ధమేదో ఉండి ఉంటుంది. లేకపోతే ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించగలిగే శక్తి ఆ దారమూర్తికే ఎక్కుడినుంచి వచ్చినట్టు?
పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్ర విశ్వజనీనమైన పండుగ. కేవలం భారతదేశంలోనే కాక విదేశాల్లో వుంటున్న భారతీయులందరు మహోత్సవంగా జరుపుకునేది జగన్నాథ రథయాత్ర.
జగన్నాథుని ఆవిర్భావంనుంచి ప్రతి ఏటా జరిగే రథయాత్ర వరకు ఆలయంలో జరిగే విధి విధానాలు, ఆయా సందర్భాల్లో పాటించే సంప్రదాయాలు ఏవి చూసినా ప్రత్యేకతలు ప్రదర్శితమవుతాయి.
ముందుగా-ఉపనిషత్తులు,, వేదాలు, పురాణాలు పేర్కొన్న పరమాత్మ స్వరూపం ఇదేనా అనిపిస్తుంది. పరమాత్మ నిర్గుణుడు. ఇక్కడ సాకారుడు. ఆకారం ఉంది కానీ అంగాలు లేవు. ఏ శిల్ప శాస్త్రం ఇటువంటి మూర్తిని గురించి చెప్పలేదు. అయితే శే్వతాశ్వత రోపనిషత్తులో పురుషోత్తముని వర్ణన చేసినట్టుగానే జగన్నాథుడు ఉన్నాడంటున్నారు పండితులు.
జగన్నాథుని విచిత్ర రూపం. దారుమూర్తిగా పెద్ద కళ్లు రెప్పలు లేకుండా చక్రాల్లా వుంటాయి. కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా ఉండడం, ఒక చెట్టు మానుకు నల్లటి రంగు పూసి, తెలుపు, ఎరుపు రంగులతో కళ్లు, నోరు, ముక్కు, చెవులు చిత్రించినట్టు ఉంటుంది. తనతో ఉన్న సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రూపాలు అలానే ఉంటాయి. అయితే వర్ణాలలో మార్పు ఉంది. బలభద్రుడు శే్వతవర్ణంతో సుభద్ర పసుపు ఛాయతో ఉన్న వదనాలుగా చిత్రించబడ్డాయి. ఆకర్షణీయంగా కనిపించే మూడు మూర్తులు ఆటవికుల రూపంలో ఉంటారు. ఆ మూర్తులకు అద్దిన రంగులకు ఆధ్యాత్మికత ఉండడం ప్రత్యేకత. అనంత తత్వానికి సంకేతంగా జగన్నాథుని నలుపు వర్ణం, శుద్ధ సత్య గుణమే బలభద్రుని శే్వతవర్ణం. ఐశ్వర్య శక్తికి సంకేతంగా సుభద్ర పసుపు ఛాయతో భాసిస్తుంది. అంతే కాక ఈ మువ్వురితో సహా సుదర్శనమూర్తి నాలుగు వేదాలకు ప్రతీకలు. జగన్నాథుడు (సామవేదం), బలభద్రుడు (రుగ్వేదం), సుభద్ర (యజుర్వేదం),. సుదర్శనుడు (అధర్వణవేదం) నారాయణ తత్వమే ఈ నాలుగు మూర్తుల్లో నెలకొన్న ప్రత్యేకత.
సత్య యుగంలో నీలాచలంపై వెలసిన నీలి మాధవుడు శబరుల ఇలవేల్పు. అతడే యుగాలు మారిన క్రమంలో పురుషోత్తమపురం (పూరి)లో జగన్నాథునిగా ఆవిర్భవించినట్టు పలు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంద్రద్యుమ్నుడు రత్న వేదికపై ప్రతిష్టించిన జగన్నాథ, బలభద్రులకు మోచేతులు మాత్రమే ఉంటాయి. సుభద్రకైతే స్ర్తిత్వ చిహ్నాలే కాక మోచేతులు లేవు. మోడు నడుం భాగం వరకే ఉండడం ఒక ప్రత్యేక లక్షణం. ఇక్కడ ప్రత్యేకంగా జగన్నాధుని కళ్లను గురించి ప్రస్తావించుకోవాలి. గుండ్రంగా, ఎర్రటి రేఖలతో ఉంటాయి. రోహితుడు, అనిమిషుడు అని విష్ణుమూర్తికి గల పేర్లు ఇవి సరిపోతాయి. ఆ కళ్లలో ఉన్న సమ్మోహన శక్తి భక్తులను కట్టిపడేస్తుంది. ఆ కళ్లను సూర్యచంద్రులతో పోల్చవచ్చు. దివారాత్రాలు కళ్లకు రెప్పలు లేకపోవడంతో అందర్నీ కనిపెడుతూ రక్షిస్తున్నాడా అనిపిస్తుంది. మువ్వురు మూర్తులలో ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సోదరి సుభద్రను అనవరతంగా రక్షిస్తున్నారా అన్నట్టు సోదరులిద్దరు ఇరుపక్కలా కొలువుతీరి ఉంటారు. సుభద్రను జగత్తుకు ప్రతీకగా భావిస్తే అన్నదమ్ములిద్దరూ జగద్రక్షకులుగా భావించడానికి ఒక ప్రత్యేక లక్షణంగా గుర్తించవచ్చు. దారుమూర్తి అయిన జగన్నాథుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రథయాత్ర. ఘోషయాత్రగా ప్రసిద్ధిపొందిన పూరీలో రథయాత్ర ప్రతి ఏటా ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుగుతుంది. ఆలయంనుంచి ఇంద్రద్యుమ్నుని భార్య పేర నిర్మించిన గుండిచా దేవి మందిరం వరకు సాగే ఈ యాత్రను గుండిచా యాత్ర అని కూడా అంటారు.
రథయాత్ర సందర్భంగా రత్నవేదికను వదిలి సోదర సోదరీలతో ప్రజల వద్దకు వస్తారు. ముగ్గురు మూడు రథాల్లో పయనిస్తారు. ఈ మూడు రథాలను కొత్తగా ప్రతి సంవత్సరం తయారు చేయడం ఒక ప్రత్యేకత. అక్షయ తృతీయ నాడు అంకురార్పణం చేసి రథయాత్ర నాటికి అన్ని హంగులతో నిర్మితమవుతాయి. నంది ఘోష లేక గరుడ ధ్వజ అను పదహారు చక్రాలతో, ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో ఉండే రథం జగన్నాథునిది. 14 చక్రాల ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో ఉండే తాళధ్వజం బలభద్రునిది. 12 చక్రాలతో నలుపు, ఎరుపు వస్త్రాలతో అలంకరించిన దేవదళనము అను రథము సుభద్రాదేవిది.
జ్యేష్టపూర్ణిమనాడు పరమాత్మ జగన్నాథునిగా అవతరించాడని పురాణ వచనం. అందువల్ల ఆనాడు స్వామికి స్నపనం నిర్వహించి ఏకాంతంలో ఉంచుతారు. శబర పూజారులకు (దయితపతులు) మాత్రం నిత్యం జరిగే పూజాదికాలకు ప్రవేశం ఉంటుంది. నిత్యం వచ్చే భక్తులందరికీ తెల్లని వస్త్రంపై మువ్వురు మూర్తులను చిత్రించి ఒక మందిరాన ఉంచిన పటమే దర్శకులకు ఉంచుతారు. రథయాత్రకు ముందు రోజున ప్రజలకు స్వామి దర్శనం లభిస్తుంది. దీనిని ‘ననవన దర్శనం’ అంటార. ఇవన్నీ ఆలయ సంప్రదాయాలలో ప్రత్యేకతలు.
సాధారణంగా ఆలయాల్లో జరిగే రథోత్సవాలకు ఉత్సవ మూర్తులనే వినియోగిస్తారు. కానీ పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రలలో మువ్వురు శ్రీ పీఠాన్ని వదిలి నేరుగా ప్రజల మధ్యకు రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. కుల మత భేదాలు, వర్గ తారతమ్యం, ఆర్య, అనార్య విచక్షణ లేక దేశ విదేశీయులంతా లక్షలాదిగా ప్రజలు పాల్గొనే ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం రథయాత్రలోని ప్రత్యేకత దీన్ని వీక్షించడానికి స్వర్గంనుండి దేవతలు దిగి వస్తారని, పురుషోత్తమ క్షేత్ర మహత్యం చెబుతున్నది. ఈరథయాత్ర లో ముందుగా బెహరాపెహరా అని బంగారు చీపురుతో రథాన్ని స్వయంగా పూరీ రాజునే శుభ్రపరుస్తారు. రథం గుండిచాఘర్‌కు చేరిన తర్వాత హోరా పంచమి పర్వాన్ని జరుపుతారు.ఈదినం మహాలక్ష్మీ ఆగ్రహం జగన్నాథుని రథచక్రం విరగొట్టటం అనే ఉత్సవం చేస్తారు. ఈ గుండిచాఘర్‌లో తొమ్మిది రోజులు జగన్నాథుడు దర్శనం ఇస్తాడు. ఆతర్వాత ఏకాదశినాడు జగన్నాథుడు బలభద్ర, సుభద్రలతో మళ్లీ ప్రయాణంచేసి ఆలయానికి విచ్చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఈయాత్రలో నవకళేబ రోత్సవం అత్యంత విశేషమైంది. పాతమూర్తులను ఖననం చేయడం, కొత్తమూర్తులల్లో ప్రతిష్ఠించడం ఇందులోని విశేషం. జగన్నాథస్వామీ నయనపద గామీ భవతుమే అంటూ జగన్నాథాష్టకం పఠిస్తూ జగన్నాథునికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి అన్నప్రసాదతయారీ కూడా చాలా ప్రత్యేకమైనది.
భారతీయ క్షేత్రసంస్కృతిలో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న విశిష్ఠ్భూమిక ఈ పూరీక్షేత్రం.

- ఎ. సీతారామారావు