మెయన్ ఫీచర్

మీ దళితుడితో మా దళిత్ పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను మోదీ-అమిత్‌షాలు ఎంపిక చేయటం అద్భుత నిర్ణయం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్‌లు సైతం కోవింద్ ఎంపికను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అయితే కోవింద్ వివాదరహితుడని కొనియాడారు. రెండేళ్లుగా బీహార్ గవర్నర్‌గా ఉండిన ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం నితీశ్‌ది. కాంగ్రెస్ ప్రతినిధులంతా కూడా కోవింద్ ప్రతిభావంతుడంటూ మెచ్చుకున్నారు. కోవింద్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నిజాయితీకి ఆయన మారుపేరు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ అత్యున్నత పదవికి కోవింద్ అన్ని విధాలా అర్హుడు. విపక్షాలు సైతం ఈ విషయాన్ని అంగీకరించాయి.
ఈ విషయంలో వామపక్షాలకు అభ్యంతరాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు.. ఒక వ్యక్తి అన్ని విషయాల్లో గొప్పవాడైనప్పటికీ, ఆయన ఒక సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం వాటికి అభ్యంతరకరమైంది. మెజారిటీ రాజకీయ పార్టీలకు కోవింద్ అభ్యర్థిత్వం అంగీకారమైనప్పుడు విపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీల నుంచి ఏకాభిప్రాయం కోసం తెగ పాకులాడిపోయింది. ‘రామ్‌నాథ్ కోవింద్ పట్ల మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన విశిష్టమైన వ్యక్తి. నిష్పక్షపాతి. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందుత్వ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తి కావటం వల్లనే, సైద్ధాంతిక ప్రాతిపదికపైనే మేం ఆయన్ను వ్యతిరేకిస్తున్నాం’ అని వ్యాఖ్యానించటంలోనే వారి వాదనలోపస లేదనే విషయం స్పష్టమవుతోంది.
ఇక్కడ నీతిసూత్రమేమంటే, ఒక వ్యక్తి గొప్పవాడైనప్పటికీ, అతను ఒక ప్రత్యేక సిద్ధాంతానికి చెందిన వాడైతే అతణ్ణి వ్యతిరేకించాల్సిందే. ఎంత విడ్డూరం.. ఇదే నోటితో మనం ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి మాట్లాడుతాం. విభిన్న అభిప్రాయాలు, రాజకీయ సిద్ధాంతాలను అంగీకరించని ప్రజాస్వామ్యం వల్ల ఉపయోగం ఏమిటి? వాళ్ల వాదన ప్రకారం మన దేశంలో సెక్యులరిజం ఒక్కటే సిద్ధాంతంగా ఉండాలి. అది ఎంత భ్రష్టుపట్టిపోయినా, రష్యా, చైనాల వంటి దేశాల్లో సైతం బూజుపట్టిపోయినా కమ్యూనిస్టులు ఈ సిద్ధాంతానే్న పట్టుకువేలాడతారు. ఓ జాతీయవాద నాయకుడి అభిప్రాయం ప్రకారం ఇదొక ‘సైద్ధాంతిక అంటరానితనం’.
రామ్‌నాథ్ కోవింద్ ఎంపికతో విపక్షాలను అయోమయానికి గురిచేయటంలో మోదీ, అమిత్‌షాలు విజయం సాధించారు. ఇందుకు కారణాలను టీవీ స్టూడియోల్లోని రాజకీయ విశే్లషకులు ఇలా చెప్తున్నారు. 1. కోవింద్ దళితుడు. 2. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. ఆ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఎవరూ రాష్టప్రతి కాలేదు. 3. 2019 ఎన్నికల్లో ఆయన ఉపయోగపడతారు. 4. ఆయనపై ఎలాంటి వివాదాలు లేవు.
కెఆర్ నారాయణన్ లాగా ఒక దళితుడిని రాష్టప్రతిని చేయబోతున్నామని గొప్పలు చెప్పడం ఆ కులాన్ని తీవ్రంగా అవమానించటమే. ఇది మన సామాజిక- రాజకీయ వర్గం మైండ్‌సెట్‌ను ప్రతిఫలిస్తున్నది. ఆ కులం పట్ల వారికున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. ఒకవేళ డాక్టర్ స్వామినాథన్‌ను రాష్ట్రప్రతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసి ఉంటే ఒక బ్రాహ్మణుడిని ఎంపిక చేశామని మనం అనేవాళ్లమా? లేదు. ఎందుకంటే అక్కడ అది అర్హత అవుతుంది.
అదే దళితుడి విషయానికి వచ్చేసరికి మన రాజకీయ వర్గం ఈ పదవిని ఇవ్వటం ద్వారా ఆ కులానికి ఎంతో మేలు చేసినట్లు మాట్లాడతారు. ఇలాంటి మైండ్‌సెట్ అంతం కావాలి. మీరాకుమార్ గురించే చూడండి.. ఆమె విదేశీ సర్వీసులు నిర్వహించింది. లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. మాజీ ఉపప్రధాని కూతురు. ప్రతి 37 రోజులకోసారి యూరప్ వెళ్తుంటారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దళిత్ అన్న కార్డుపై రాష్టప్రతి పదవికి పోటీ పడుతున్నారు.
రాజకీయ పండితుల విశే్లషణ ప్రకారం కోవింద్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఇది ఒక అర్హత ఎలా అవుతుంది? తమ రాష్ట్రానికి చెందిన నాయకుడిని రాష్టప్రతి చేసినంత మాత్రాన యూపీ ఓటర్లు ఎన్డీఏ, బిజెపిలకు ఓట్లు వేస్తారని నమ్మకం ఏమిటి? రాష్టప్రతిగా తమ రాష్ట్రం వాడు ఉండి, రాజ్యాంగం అనుమతించనిదేదైనా రాష్ట్రానికి చేస్తే యూపీ ప్రజలు అంగీకరిస్తారా? సుపరిపాలన అందించకుండా, శాంతిభద్రతలను పరిరక్షించకపోయినా యూపీకి చెందిన వాడు కాబట్టి రాష్టప్రతి పట్టించుకోకుండా ఉంటారా?
2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ కోవింద్‌ను ఎంపిక చేశారని టెలివిజన్ పండితులు కారణం చెప్తున్నారు. ఇదో విచిత్రమైన వాదన. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 300కు పైగా సీట్లు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటుకు ఆ కూటమిని రాష్టప్రతి ఆహ్వానించక ఏం చేయగలరు? ఇందుకు విరుద్ధంగా ఎన్డీఏకు వంద సీట్లు మాత్రమే వచ్చాయనుకోండి.. అప్పుడు రాష్టప్రతి వారికి అనుకూలంగా ఏమైనా చేయగలరా? ఒకవేళ నెంబర్ల కోసం ఫిరాయింపులు జరిగితే రాష్టప్రతి వారికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చు. కానీ, మోదీ అంతగా ఆలోచించి ఉండకపోవచ్చు. 2019లో చీలిపోయిన విపక్షమే మోదీ తిరిగి అధికారంలోకి రావటానికి దోహదపడుతుంది.
ఇక నాలుగో కారణం వివాద రాహిత్యం. వివాదాలు అనేవి రాష్టప్రతి పదవికి ఎంపిక కావటాన్ని అడ్డంకి కాలేవు గతంలో ఇందిరాగాంధీ కోసం రాచబాట వేసిన జైల్‌సింగ్ విషయంలోను, ఆ తరువాత అంతా అవినీతి మరకలంటించుకున్న ప్రతిభాపాటిల్ విషయంలోనూ ఇదే జరిగింది. అబ్దుల్‌కలామ్ రెండోసారి రాష్టప్రతి కావటాన్ని వామపక్షాలు వ్యతిరేకించాయి. ఆయన ముస్లిం కాదని, శాకాహారి అని, భగవద్గీత చదువుతారని, వీణ వాయిస్తారన్న కారణాలతో ఆయన రెండోసారి రాష్టప్రతి కాకుండా అడ్డుకున్నాయి. నిజానికి ఆయనపై ఎలాంటి వివాదాలు లేవు. ‘ప్రజల రాష్టప్రతి’గా పేరు తెచ్చుకున్నారు. కానీ రైసీనా హిల్స్‌లో తమకు కావలసిన వారిని తీసుకొచ్చుకునేందుకు కలాంను నాడు వద్దన్నారు.
ఏమైనప్పటికీ కోవింద్‌ను ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థిగా ఎంచుకుంది. విపక్షాలను తమవైపు మొగ్గేలా ఈ ఎంపిక జరిగిందన్నది వాస్తవం. మోదీ తిరుగులేని అస్త్రంతో కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు, ఆర్జేడీలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి. విచిత్రమేమంటే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్టప్రతి పదవికి ఎల్ కె అద్వానీ, సుష్మాస్వరాజ్‌ల పేర్లను సూచించటం. సంఘ్ సిద్ధాంతాలలో బలమైన మూలాలు ఉండి, రథయాత్రను నిర్వహించిన అద్వానీ అభ్యర్థిత్వం ఇప్పుడు ఎలా అంగీకారమైంది? సుష్మాస్వరాజ్‌పై లలిత్ మోదీ వ్యవహారంలో ఆమె తప్పులేకపోయినా విపక్షాలు ఎలా విరుచుకుపడ్డాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె పేరు మమతకు ఒప్పుకోలు అయింది. ఎందుకంటే మోదీ ఎంపికను గుడ్డిగా వ్యతిరేకించాలి కాబట్టి.
భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో దళిత్, మహిళానాయకురాలు అయిన మీరాకుమార్‌ను రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీకి నిలబెట్టాలని ప్రతిపాదించారు. దీంతో రాష్టప్రతి ఎన్నికను దళిత్‌పై దళితుడి పోటీగా కాంగ్రెస్ దిగజార్చింది. కోవింద్‌కు ఎలక్టోరల్ కాలేజీలో 62శాతం మద్దతు ఉంది. రామ్‌నాథ్ విజయం ఖాయమైపోయింది. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ ప్రతిభావంతుడు, గొప్పవాడని కాంగ్రెస్సే అంగీకరించినప్పుడు మరో దళిత అభ్యర్థిని పైగా ఓడిపోతారని కచ్చితంగా తెలిసీ ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే మీ దళితుడి కంటే మా దళిత్ గొప్ప అని చెప్పుకోవటానికే.

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206