మెయన్ ఫీచర్

అన్నదాత మోములో దరహాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతమేరకు నష్టపోయిందో ఆ నష్టాన్ని గత మూడు సంవత్సరాల కాలంలో రూపుమాపి, పది రెట్ల వేగంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రభాగాన నిలిచేలా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజల పక్షపాతిగా నిలుస్తూ రాజకీయ అవినీతికి అంతం పలికేందుకు కంకణం కట్టుకునే ప్రభుత్వానికే ఎప్పుడూ జనం జేజేలు పలుకుతారు. ఈ దిశగా తెలంగాణ సర్కారు పయనిస్తున్నందున గతంలో కన్నా ఇప్పుడు పాలన పారదర్శకంగా జరుగుతోంది. ముఖ్యంగా పేద ప్రజలకు అందాల్సిన ప్రగతి ఫలాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా రాజకీయ జోక్యం లేకుండా లబ్ధిదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతున్నారు. దేశం మొత్తమీద తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు 8.2 శాతం నిధులు కేటాయించి అగ్రభాగాన నిలిచింది. అలాగే 20.8 శాతం భారీ నిధులు నీటిపారుదల రంగానికి కేటాయించి మొదటి స్థానంలో ఉన్నది. ఈ కేటాయింపుల పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 2016-17 నివేదికలో సంతృప్తిని వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటిని ఆచరణాత్మకంగా అమలు చేస్తోంది. కరవుకోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం తీసుకున్న పంట రుణాలను ప్రస్తుత ప్రభుత్వం తీర్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 2014లో 4250 కోట్లు, 2015లో 4086కోట్లు, 2016లో 4038కోట్లు, 2017లో 4000 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మొత్తం 16,374 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వుకు కారణమైంది. దీని ద్వారా 35.3 లక్షల మంది రైతులు కష్టాల కడలి లోంచి బయటపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. దేశంలో సుమారు 13.87 కోట్ల మంది రైతులున్నారని అంచనా. వీరిలో ప్రతిరోజు సుమారు 2,058 మంది రైతులు సేద్యానికి దూరవౌతున్నారని వ్యవసాయ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రైతుకు పెట్టుబడికి అనుగుణంగా సంపాదన గిట్టుబాటు రూపంలో రావడం లేదు. రైతు ఆదాయం రోజుకు 201 రూపాయలు ఉంటుండగా, నాలుగో తరగతి ఉద్యోగి వేతనం రోజుకు 600 రూపాయలు ఉంటోంది. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ రంగానికి క్రమంగా దూరవౌతున్నారు. దీంతో తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 55.53 లక్షలమంది రైతులున్నారు. వీరిలో చిన్నకారు రైతులు 47.68 లక్షల మంది కాగా, మధ్యతరగతి రైతులు 7.69 లక్షలమంది కాగా, ధనిక రైతులు 15,775 మంది రైతులున్నారు.
సన్నకారు, మధ్య తరగతి రైతులకు ప్రభుత్వం ఎరువుల కోసం సాయం చేయనుంది. తెలంగాణలో వ్యవసాయం కుదేలవుతున్న నేపథ్యంలో వర్షాభావం, పెట్టుబడుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎకరానికి 4 వేల చొప్పున ఎరువుల కోసం వానాకాలం, యాసంగి పంటలకు నేరుగా 8వేల రూపాయలు రైతు ఖాతాలోకి జమచేయనుంది. రాష్ట్రంలో సుమారు 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం 4,130 కోట్ల రూపాయలు రైతులకు ఎరువుల కోసం ఉచితంగా ఇవ్వనుంది. అంటే ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోంది. ఈ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగం కష్టాలు తీరనున్నాయి. అలాగే పరస్పరం నమ్మకంతో తెల్ల కాగితంపై రాసుకుని భూములు కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. రాష్ట్రంలో సుమారు 11.17 లక్షల మంది సాదాబైనామా లబ్ధిదారులు ఉన్నారు. వీరి దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులకు నేరుగా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద రైతులకు ఉచితంగానే భూమి పట్టాలు అందనున్నాయి.
షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి నిధి చట్టాన్ని రూపొందించి 2017-18 వార్షిక బడ్జెట్‌లో షెడ్యూల్డ్‌కులాలకు 14,375 కోట్ల రూపాయలు కేటాయించింది. సుమారు 95 వేల మంది విద్యార్థులకు మేలు జరిగేలా 1,151 కోట్ల రూపాయలతో 268 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల కింద విద్యా సౌకర్యాలు పొందుతున్న 18 లక్షలమంది విద్యార్థులకు పెరిగిన నిత్యావసర ధరలు, కూరగాయల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, స్కాలర్‌షిప్‌లు భారీ స్థాయిలో పెంచడం జరిగింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నది. ఈ ఏడాది భూమిలేని దళిత కుటుంబాలకు భూమి పంపిణీ కార్యక్రమం జోరందుకున్నదని చెప్పాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 3,336 మంది కుటుంబాలకు సుమారు 10,989 ఎకరాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత మూడు సంవత్సరాల కాలంలో 7,363 మంది లబ్ధిదారులకు 20,732 ఎకరాలు అందించింది. దేశంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని రిజర్వేషన్ల విధానాన్ని మార్కెట్ కమిటీలల్లో ప్రవేశపెట్టడం ద్వారా 25 మంది ఎస్సీ రైతులకు, 10 మంది ఎస్టీ రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అవకాశం కల్పించింది ప్రభుత్వం.
ఏళ్ల తరబడి విద్యాభివృద్ధికి నోచుకోని మారుమూల తండాల్లో వుంటున్న గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి కృషి చేస్తున్నది. దీనిలో భాగంగానే గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేస్తున్నది. రాష్ట్రంలో 1,43,724 మంది ఎస్టీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికోసం అనేక మార్గదర్శకాలు రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల జనాభా శాతం పెరిగింది. రాజ్యాంగం ప్రకారం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో వీరికి ఇటీవల 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. దీని ద్వారా విద్యా, ఉద్యోగ రంగాలల్లో గిరిజనులకు మరింతగా లబ్ధి చేకూరనుంది.
తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నది ప్రభుత్వం. రానున్న రోజుల్లో బీసీ ప్లాన్ అమలుకోసం త్వరలో చట్టం కూడా చేయనుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5076.36 కోట్ల రూపాయల బడ్జెట్‌ను వీరికి కేటాయించింది. అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి వేయికోట్లు కేటాయించింది ప్రభుత్వం. నారుూ బ్రాహ్మణ సహకార సంస్థకు 250 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించింది. దీని ద్వారా 28,500 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం అందించడానికి ‘మహాత్మ జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి’ కింద ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి 20 కోట్లు కేటాయించింది. 100 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. తెలంగాణలో వేలాది కుటుంబాలు ఇప్పటికీ చేనేత రంగంపై ఆధారపడి బతుకుతున్నాయి. రాష్ట్రంలో వివిధ రకాల చేనేత సొసైటీలు 1254 ఉన్నాయి. వీటి అభివృద్ధికోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్లు కేటాయించింది. పవర్‌లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకునే ప్రతి వస్త్రాన్ని చేనేత, పవర్‌లూమ్ కార్మికుల నుంచే తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చేనేత కార్మికులకు 70 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చింది. గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పాలి. రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది. ‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా చెరువు గట్ల మీద సుమారు 55 లక్షల ఈత, తాటిచెట్లను నాటించింది. 5 లక్షల రూపాయల మేరకు ఎక్స్‌గ్రేషియాను పెంచి గీత కార్మికుల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్గించింది. కులవృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటిమీద ఆధారపడి బతుకుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 4 లక్షల గొల్ల, కురుమ కులస్థులకు 75 శాతం సబ్సిడీతో 1.25 లక్షల విలువ కలిగే గొర్రెలను ముఖ్యమంత్రి ఇటీవలే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాంసం ఉత్పత్తులు పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఎన్నో ఏళ్ళుగా విద్యా రంగానికి దూరంగా ఉన్న ముస్లిం మైనారిటీల కోసం అనేక గురుకులాలను ప్రారంభించింది. ఈ గురుకులాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై సుమారు లక్షకుపైగా రూపాయలు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఆంగ్లభాషలో అందించనున్నారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇటీవల అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు జరిగితే ముస్లింలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అనతికాలంలోనే అభివృద్ధి నమూనాలలో మొదటి స్థానంలో నిలిచి విమర్శకుల అంచనాలను తారుమారు చేసింది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై దేశ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక్కడి నమూనా అభివృద్ధిని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కోర్టు మెట్లు ఎక్కుతూ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు వివిధ వర్గాల నుంచి హర్షామోదాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి.

-డాక్టర్ సిలువేరు హరినాథ్ కన్వీనర్, సోషల్ రీసెర్చ్ ఫోరమ్