మెయన్ ఫీచర్

విదేశాంగ విధానంలో తప్పటడుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతవరకు మన దేశానికి సంబంధించి మరే ప్రధాన మంత్రి జరపనన్ని విదేశీ పర్యటనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుతున్నారు. దౌత్యపరంగా భారత్ ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పలు చిన్న చిన్న దేశాల్లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. పలు సంపన్న దేశాల అధినేతలతో వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించడానికి అనేక దేశాల నుండి లభించిన మద్దతు మోదీ దౌత్యనీతికి విజయంగా మనం భావించాం. ఏ దేశం వెళ్లినా స్థానిక భారతీయులు, భారీస్థాయిలో సంబరాలు జరుపుతూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన జరిపే విదేశీ పర్యటనలకు విశేష ప్రచారం లభిస్తున్నది. అయితే, విదేశీ పర్యటనల్లో ప్రచార ఆర్భాటాల కన్నా వ్యూహాత్మక ఎత్తుగడలు కీలకం కాగలవు. ఈ విషయంలో ఆయన కొంతమేరకు తప్పటడుగులు వేస్తున్నట్టు భావించాల్సి వస్తున్నది.
తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టిన సమయంలో పొరుగు దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా మోదీ అద్భుతమైన దౌత్యనీతిని ప్రదర్శించారు. అయితే, పలు అంతర్జాతీయ విషయాల్లో ఆయన తగు క్రియాశీలత ప్రదర్శించలేకపోతున్నట్టు స్పష్టమవుతున్నది. ముఖ్యంగా గతంలో మన్‌మోహన్ సింగ్ హయాం నుండి అమెరికాకు సన్నిహితంగా వ్యవహరించిన నేపథ్యంలో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. రష్యాతో మనం ఏర్పరుచుకున్న బంధం ఆరు దశాబ్దాల పాటు మన దేశానికి ఒక రకమైన భరోసా కలిగించేట్టు చేసింది. నేడు అమెరికా, రష్యా రెండు కూడా భారత్‌ను విశ్వసింపలేని పరిస్థితులు నెలకొనడం దురదృష్టకర పరిణామం.
గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం తాజాగా మోదీ ప్రారంభించారని అనిపిస్తున్నది. దాదాపు ప్రతి సంవత్సరం భారత్-రష్యా అధినేతల భేటీ జరుగుతునే ఉంది. ఇప్పటికి 18సార్లు అటువంటి సమావేశాలు జరిగాయి. గత అక్టోబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటించాడు. తిరిగి అకస్మాత్తుగా మోదీ గత నెలలో రష్యాలో పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చింది? చరిత్రపరంగా మనం రష్యాకు దగ్గర కావడంతో అమెరికా మన పట్ల 45 ఏళ్లపాటు ప్రతికూల ధోరణులనే అవలంబిస్తోంది. మనం ఎంతగా స్నేహహస్తం చాస్తున్నప్పటికీ ‘అగ్రరాజ్యం’ సంకుచిత సాకులతో ముఖం తిప్పేసుకుంటున్నది. పాకిస్తాన్‌తో సైనిక ఒప్పందం చేసుకోవడంతోపాటు ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితుల్లో వున్న చైనాను ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సహకారం అందిస్తున్నది. ఈ రెండు చర్యలు భారత ప్రయోజనాలపై విషం కుమ్మరించినట్లే అని చెప్పాలి. కొందరు మన దేశంలో భావిస్తున్నట్టు చైనా నుండి మనకు రక్షణ వ్యవహారాలలో కాకుండా ఆర్థిక వ్యవహారాలలో పెను ప్రమాదం ఏర్పడనుంది. ఈ పరిస్థితులను వాస్తవిక దృష్టితో గ్రహించిన అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు చైనాతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఈ విధానాలను కొనసాగించిన మన్‌మోహన్ సింగ్ అణు సరఫరా బృందంలో చేరడంతోపాటు చైనా నుండి కీలక సహకారం పొందగలిగారు.
అయితే, మోదీ ప్రధాని అయిన కొద్దిరోజులకే జపాన్‌లో పర్యటించిన చైనా నేతలను విమర్శించడం భారత్- చైనా సంబంధాల మధ్య పెద్ద అగాధం సృష్టించడానికి దారి తీసింది. అందుకే అప్పటికే సన్నిహితంగా ఉన్న పాకిస్తాన్‌తో గల తన సంబంధాలను చైనా మరింత పటిష్టపరుచుకోవడం, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును వేగవంతం చేయడం భారత దౌత్య వైఫల్యమే అని అంగీకరించక తప్పదు. అమెరికా పట్ల మోజుతో మనకు ‘నమ్మదగిన రక్షణ భాగస్వామి’ అయిన రష్యాతో సంబంధాలు తగ్గించుకోవడం మరో దురదృష్టకర పరిణామం. రష్యా మరే దేశానికి అమ్మని అతి సున్నితమైన రక్షణ సామగ్రిని భారత్‌కు సరఫరా చేస్తున్నది. పైగా అటువంటి సామగ్రిని మరే దేశం కూడా మనకు సరఫరా చేయడానికి సిద్ధంగా లేదు. రక్షణ సామగ్రి విషయంలో ఒక దేశంపై ఆధారపడడం మంచిది కాదని, ఇతర దేశాల నుండి ముఖ్యంగా అమెరికా నుండి రక్షణ భాగస్వామ్యం పెంచుకోవాలని గత దశాబ్ద కాలంగా భారత్ ప్రయత్నిస్తున్నది. అయినా 2012-16ల మధ్య మన రక్షణ సామగ్రి దిగుమతులలో 68 శాతం రష్యా నుండే వున్నాయి. అమెరికా నుండి 14 శాతం మించలేదు. పైగా సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం గల రక్షణ సామగ్రిని మనకు సరఫరా చేయడానికి అమెరికా ఇష్టపడడం లేదు.
గత సంవత్సరం జరిగిన ‘బ్రిక్స్’ సదస్సులో పాకిస్తాన్ పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించడానికి మొదటిసారిగా రష్యా విముఖత చూపింది. ప్రధాని మోదీ రష్యా పర్యటన సందర్భంగా జమ్ము- కశ్మీర్‌లో పాకిస్తాన్ పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదం గురించి అడిగితే పుతిన్ మాట దాటవేశాడు. మరో వంక చైనా-రష్యాల మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్నది. ఈ మధ్య బెజింగ్‌లో చైనా జరిపిన వెల్ట్ అండ్ రీడ్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ప్రముఖ దేశాలలో రష్యా ఒకటి కావడం గమనార్హం. ఈ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. భారత్ పట్ల చైనాకు గల దురుద్దేశాలు, పాకిస్తాన్‌కు గల నేరపూరిత ఉద్దేశాల నుండి ఆపదలో భారత్‌కు అండగా ఉండగల దేశంగా రష్యాను ఇంకెంత మాత్రం భావించలేని పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి.
అమెరికాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మోదీకి గుణపాఠం నేర్పడం కోసమా అన్నట్టు చరిత్రలో మొదటిసారిగా పాకిస్తాన్‌తో కలిసి రష్యా 2016లో సంయుక్త సైనసిక విన్యాసాలు జరిపింది. రష్యాతో ఏర్పడిన కొత్తరకం స్నేహంతో ఉప్పొంగిపోతున్న ఆ దేశం వద్దగల అత్యాధునిక ఆయుధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు నెలల క్రితం పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజ్ ఆసిఫ్ మాస్కో వెళ్లి యుద్ధవిమానాల కొనుగోలు కోసం సంప్రదింపులు జరిపారు. గత డిసెంబర్‌లో మాస్కోలో ఆఫ్ఘనిస్తాన్ గురించి రష్యా, చైనా, పాకిస్తాన్‌ను కలిసి సమాలోచనలు జరిపాయి. కాబుల్‌లో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వానికి భారత్ సంపూర్ణ మద్దతు అందిస్తున్నది. అయతే ఈ విషయంలో రష్యా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది. పాకిస్తాన్ అండదండలున్న తాలిబన్‌లతో సమాచార వ్యవస్థను ఏర్పర్చుకోవడానికి సిద్ధపడుతున్నది. ఈ పరిణామం భారత భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ప్రమాదకరమైనవి.
మరోవంక భారత్-రష్యాల మధ్య ఆర్థిక సహకారం నరేంద్ర మోదీ హవా ప్రారంభం నుంచి (2014) స్థిరంగా ఉంటున్నది. పురోగతి కనిపించడం లేదు. ఇప్పుడు మోదీ భారత-రష్యా వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం గుర్తించినట్టు ఉన్నాడు. అందుకనే హడావుడిగా రష్యా పర్యటనకు వెళ్లి, ఆదేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ మోదీ తరువాత రష్యా ప్రయాణం పెట్టుకున్నాడు. పాకిస్తాన్, చైనాల పట్ల మొగ్గు చూపితే భారత్ తట్టుకోలేదని రష్యాకు తెలుసు. కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి ఈ ఎత్తుగడను పుతిన్ విజయవంతంగా అనుసరింపగలిగారని భావించవచ్చు.
అమెరికాతో సంబంధాలను ఎంతగా బలోపేతం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ము ఖ్యంగా బారక్ ఒబామాతో వ్యక్తిగత స్నేహం మోదీ ఏర్పరుచుకోవడం డొనాల్డ్ ట్రంప్‌కు నచ్చలేదు. ఒబామా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు అన్నింటినీ తిరగదోడే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ భారత్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారనే గుడ్డి నమ్మకంతో భారత్ వ్యూహాత్మక తప్పటడుగు వేసింది. అద్యక్ష ఎన్నిక సమయంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను భారతదేశపు రాయబారి కలిసి శుభాకాంక్షలు తెలపడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తున్నది. కానీ, మొదటిసారిగా గత నవంబర్ ఎన్నికల్లో భారత రాయబారి అమెరికా అధ్యక్ష అభ్యర్థులను కలవలేదు. అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటన వెలువడేవరకు భారతదేశపు ప్రతినిధి ఎవరూ ఆయనను మర్యాద పూర్వకంగా కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా నిష్క్రమించడానికి ట్రంప్ చెప్పిన ప్రధాన కారణంతో భారత్‌కు వందల మిలియన్ల డాలర్ల సహాయం చేయవలసి రావడం ఒక కారణంగా పేర్కొనడం గమనార్హం. ఆసియా పసిఫిక్ గురించి, హిందూ మహాసముద్రాల గురించి ఒబామా సమయంలో భా రత్,అమెరికాలు ఏర్పరచుకున్న సంయుక్త వ్యూహాత్మక అవగాహనలకు ఇప్పుడు విలువ లేకుండా పోయినట్టయింది. రెండు దేశాల సంబంధాల్లో గతంలో ఎన్నడూ ఎరుగని ప్రతిష్టంభన నేడు ఏర్పడింది. అమెరికాలో పలువురు భారతీయులపై జాతి దురహంకార దాడులు జరిగినా, మన ఐటి కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ట్రంప్ విధానాలు రూపొందిస్తున్నా మోదీ నోరు మెదపలేకపోతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల ఫలితంగా అమెరికాతో స్నేహం ప్రయోజనం కలిగించకపోగా రష్యాతో సంబంధాలు బలపడడానికి, మనపై చైనా, పాకిస్తాన్ దుష్టయత్నాలు మరింత పటిష్టం కావడానికి దారి తీసాయి.
మరోవంక పాకిస్తాన్ సవాల్‌ను స్వీకరించడంలో మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతున్నది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రెండుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అద్భుతమైన దొత్యం ప్రదర్శించి పాకిస్తాన్‌తో మెరుగుపరుచుకున్న సంబంధాలు విదేశాంగ శాఖను ప్రక్కనపెట్టి ప్రధాన మంత్రికి సన్నిహితుడైన ఒక మాజీ నిఘా అధికారికి పెత్తనం అప్పచెప్పడంతో ఇటువంటి అనర్థాలు కలుగుతున్నాయి. కాశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితులు సైతం ఈ వైఫల్యాల పర్యవసానమే. ఇప్పటికైనా ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు బాధ్యత అప్పచెప్పి ఊరుకోవడం కాకుండా రాజనీతిజ్ఞత, రాజకీయ చొరవతో అసమానమైన దౌత్యనీతిని ప్రదర్శించడానికి సమాయత్తం కావాల్సిన సమయం ఇది.

-చలసాని నరేంద్ర