మెయన్ ఫీచర్

రెడ్ కారిడార్.. గ్రీన్ కారిడార్ అవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటిసారిగా మావోయిస్టుల కంచుకోట లాంటి వారి ప్రాబల్య అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేసి, వారి స్థావరాలను ధ్వంసం చేసామని చత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారి, మావోయిస్టు వ్యతిరేకదాడుల ఇన్‌చార్జి డి.ఎం.అవస్తి ఇటీవల ప్రకటించారు. గత మూడునాలుగు దశాబ్దాల కాలంలో మావోయిస్టులను ఎదుర్కొన్నాం, కాని ఈసారి వారి స్థావరాల్లోకి వెళ్లి ‘దాడి’ చేసామని, ఈ సందర్భంగా మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లిందని, మావోయిస్టు ముఖ్య నాయకుల కదలికలపై నిఘా పెంచామని, గాజర్ల రవి లాంటి కీలక మావోయిస్టుల సమాచారం, కదలికలు గూర్చిన వివరాలు తెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అగ్రనాయకత్వంపై ఓ కనే్నసామని ఆయన చెప్పారు. తాము జరిపిన దాడులకు వైమానిక దళం సహకారం అందించిందని బీజాపూర్ ప్రాంతం నుంచి మావోయిస్టు విముక్తి ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు వైమానిక దళం సైతం మావోలపై ఎదురుదాడులు జరిపిందని, 150 మంది గెరిల్లా బటాలియన్‌పై తాము జరిపిన దాడిలో చాలామంది మావోయిస్టు గెరిల్లాలు చనిపోయినట్టు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
ఈ భీకర దాడులు ఇంకా కొనసాగుతాయని, మావోయిస్టులను తుడిచివేయడమే పనిగా ముందుకు సాగుతున్నామని, ఈ నేపథ్యంలో మావోయిస్టులు దక్షిణాదికి అంటే పశ్చిమ కనుమలవైపు పరుగులు తీస్తున్నారన్న సమాచారం తమకు అందుతోందని, దండకారణ్యంలో మాదిరి బలమైన స్థావరాలను కేరళ, కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లోని ట్రైజంక్షన్‌లో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ట్రై జంక్షన్‌లో గత నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలకనాయకులు కుప్పు దేవరాజ్, అజిత్ మరణించారు. వారి మృతికి ప్రతీకారంగా పెద్దఎత్తున విధ్వంస కార్యక్రమాల్ని చేపట్టేందుకు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి దళాలను పంపినట్టు తెలుస్తోంది. వైనాడ్, కోజికోడ్, మల్లపురం, నీలాంబుర్, పాలక్కోడ్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయని హోంశాఖ ధృవపరిచింది. ఇప్పటికే మావోయిస్టు సీనియర్ నాయకులు ఈ ప్రాంతాలకు చేరుకున్నారని కూడా పోలీసులు తమ అంతర్గత నివేదికల్లో పేర్కొన్నారు.
దండకారణ్యంలోకి కొత్తగా వెయ్యేసి మందిగల పది కోబ్రా బటాలియన్లను దింపారు. ఇప్పటికే లక్షమందికిపైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు మావోల వేటలో నిమగ్నమై వున్నారు. తాజాగా పది ఎం-ఐ-17 హెలికాప్టర్లను ఛతీస్‌గఢ్‌లో మోహరించారు. భద్రతాదళాలను ఆపద సమయంలో ఆదుకోవడమేగాక, ఎదురుదాడుల్లో పాల్గొనేందుకు వీటిని ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది.
గత ఏప్రిల్ 24న సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపుదాడి అనంతరం ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక పోలీసులు సిఆర్‌పిఎఫ్ జవాన్లతో కలిసి చేసిన సంయుక్త దాడుల్లో చాలామంది మావోయిస్టు గెరిల్లాలు, వారి నాయకులు మరణించారని, మావోయిస్టుల స్థావరాల్లోకి జవాన్లు చొచ్చుకపోయి దాడులు జరిపారని భట్నాగర్ అనే పోలీసు అధికారి తెలిపారు. 121 స్పెషల్ ఆపరేషన్స్ జరిపి 89 మంది మావోయిస్టులను పట్టుకున్నామని, 291 కిలోల పేలుడు పదార్థాలను, ఐదువేలకుపైగా డిటొనేటర్లు, తూటాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
కరిగూడెం, మినప, కసాల్‌పార, మిల్లంపల్లి, టోకెన్‌పల్లి లాంటి మావోయిస్టు స్థావరాలను ధ్వంసం చేసామని, రెడ్‌కారిడార్‌గా భావిస్తున్న మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లోకి భద్రతా బలగాలు తొలిసారిగా చొచ్చుకపోతున్నాయని ఈ వేట ఇంకా కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికా ప్రతినిధికి చెప్పారు. సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల స్థావరాలను చాలావరకు ధ్వంసం చేసామని, మావోయిస్టులకు భారీ నష్టం కలిగిందని కూడా ఆ పోలీసు అధికారి వెల్లడించారు.
2010 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన 72 కి.మీ కీలక రోడ్డు పనులు పునః ప్రారంభమైనాయని, ఈ రోడ్డు పనులకు కాపలాగా ఉన్నప్పుడే మావోయిస్టులు గత ఏప్రిల్ 24న బురకాపాల్ వద్ద మెరుపుదాడి చేసి 25 మంది జవాన్లను కాల్చిచంపారు. అబూజ్‌మడ్‌కు చేరుకునేందుకు ఉద్దేశించి ఈ రోడ్డు నిర్మాణాన్ని మావోయిస్టులు ముందునుంచే వ్యతిరేకిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే భద్రతా బలగాలు మావోయిస్టుల కీలక స్థావరాలను చేరుకునేందుకు సులువవుతుంది. తమ విముక్తి ప్రాంతం కల దెబ్బతింటుందని మావోయిస్టులు 2010 సంవత్సరం ఏప్రిల్ 6న 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను, గత మార్చిలో 12 మందిని, ఏప్రిల్‌లో 25 మందిని మావోయిస్టు గెరిల్లాలను హతమార్చారు.
ఈ మెరుపుదాడులు ఇచ్చిన విజయోత్సాహంతో మావోయిస్టులు కొత్తగా రిక్రూట్‌మెంట్లను చేపట్టినట్టు తెలిసింది. తమకు ప్రాబల్యమున్న ప్రాంతాలలో ప్రస్తుతమున్న దాదాపు లక్షమందిలో 40 శాతంమంది మహిళలు వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదివాసీ మహిళలకే అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని బలమైన శక్తిగా రూపొందించే పనిలో మావోలున్నట్టు తెలుస్తోంది. బాణాలు సంధించడంలోనూ వారికి తర్ఫీదు ఇస్తున్నారు. బాణాలకు పేలుడు పదార్థాలను ఏర్పాటుచేసి ఉపయోగించే విధానంలో మెలకువలు నేర్పుతున్నారు. అలాగే కుట్టుపనులు, వంట పనులు, తుపాకులు శుభ్రం చేయడం, సెంట్రీలుగా విధులు నిర్వహించడం ఇలా అన్ని పనులు వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరి సంఖ్యను గణనీయంగా పెంచాలని మావోయిస్టు నాయకత్వం ఆలోచిస్తున్నట్టు వినకిడి. సుకుమా జిల్లాలో జరిగిన దాడి విజయవంతమయ్యాక అందులో మహిళలు పెద్దఎత్తున పాల్గొని తక్కువ నష్టంతో వెనుతిరగడంతో ఈ ప్రయోగాన్ని మరింత విస్తృత పరచాలని మావోలు భావిస్తున్నట్టు సమాచారం.
బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తమ పూర్వ వైభవం కోసం ప్రయత్నించాలని మావోలు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే నిఘా వ్యవస్థను పటిష్టపరచి మిలిటరీ సాంకేతికతకు పదును పెట్టాలని, దండకారణ్యంలోని విముక్తి ప్రాంతాల్లో వ్యవసాయాన్ని, చేపల పెంపకాన్ని అభివృద్ధి పరచాలని ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం.
మావోల ప్రణాళికలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికలను రచిస్తోంది. తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కొత్తగా పోలీసు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అలాగే ఏపిలోని గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక దళాన్ని 9 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని, అడవుల్లోని మావోయిస్టులను పసిగట్టేందుకు ఇజ్రాయిల్‌లో తయారైన నిఘా డ్రోన్లను ఉపయోగించాలని, మరో 40వేల మంది అర్ధ సైనిక బలగాలను మోహరించాలని, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను, అత్యాధునిక ఆయుధాలను బలగాలకు సమకూర్చాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇప్పటికే లక్షమంది జవాన్లు, 16వేలమంది కమాండోలు మావోల ఏరివేత కార్యక్రమాల్లో మునిగివున్నారు.
దండకారణ్యంలో మావోల ఏరివేతకు నిర్దిష్టమైన ముగింపు సమయమేదీ నిర్ణయించలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ చెప్పారు. సుకుమా సంఘటన తరువాత మావోలపై పెద్దఎత్తున దాడికి ప్రభుత్వం నిశ్చయించిందని కూడా ఆయన పేర్కొన్నారు. భద్రతా బలగాలకు స్వేచ్ఛ ఇచ్చామని, మావోల సమస్య సమసిపోయేలా చూడాల్సిందిగా వారికి చెప్పామని అన్నారు. అలాగే దండకారణ్యం నుంచి తప్పించుకుని పశ్చిమ కనుమల్లో మావోలు స్థావరాలు ఏర్పరచుకునే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని, అన్ని రాష్ట్రాలను ఈ విషయమై అప్రమత్తం చేసామని, గతంలో ఈ మేరకు మావోలు ప్రయత్నం చేసిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు అది పునరావృతం కాబోదని ఆయన చెప్పారు. మావోల అణచివేతకు ప్రస్తుతం సైన్యాన్ని దింపే ఆలోచన లేదని, అర్ధ సైనిక బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులు కలిసి ఈ సమస్యను ఎదుర్కోగలరని ఆయన అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అక్కడి ప్రజలకు అందేలా చూస్తామని, ఇందుకు అవసరమైన వౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుందని, మధ్య భారతం నుంచి మావోయిస్టుల సమస్య సమసిపోతుందని ఆయన ఎంతో విశ్వాసం వ్యక్తం చేసారు. ఏదిఏమైనా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు విముక్తి కలగగలదని ప్రభుత్వ బలగాలు భావిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పెద్దఎత్తున ఎదురు దాడికి సన్నద్ధం కావడం, వైమానిక దళ సహాయం, ఇజ్రాయిల్ యుద్ధ నైపుణ్యం ఆచరణలో పెట్టడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గరిష్టంగా ఉపయోగించడం, అన్నింటికన్నా రాజకీయ సంకల్పం బలంగా వుండటంతో మావోయిస్టుల ‘రెడ్ కారిడార్’ కాస్త గ్రీన్‌కారిడార్‌గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- వుప్పల నరసింహం సెల్: 9985781799