మెయన్ ఫీచర్

‘స్వస్థ భారత్’కు సవాలక్ష సవాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వచ్ఛ భారత్’కు, ‘స్వస్థ భారత్’కు బోలెడంత అవినాభావ సంబంధం ఉంది. పనికిరాని చెత్తాచెదారం, ఇతర వ్యర్థ ప దార్థాలు, మురుగు కాల్వలు, నీటి కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలై మానవ సమాజానికి అనారోగ్య పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నందున ఏటా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభమైతే చాలు పల్లె ప్రాంతాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో విష వ్యాధులు పంజా విప్పుతున్నాయి. సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక, సకాలంలో చికిత్స అందక పేద కుటుంబాల వారు అవస్థలు పడడం సర్వసాధారణమైంది. అంటువ్యాధుల కారణంగా ఎక్కడైనా మరణాలు సంభవిస్తే మన పాలకులు, అధికారులు చేసే హడావుడి ఇంతా అంతా కాదు. ఈ హడావుడి కొద్దిరోజులకు సద్దుమణిగితే పరిస్థితులు మళ్లీ షరామామూలే! సకాలంలో రోగుల్ని పరీక్షించక నిర్లిప్తతతో, నిర్లక్ష్యంతో వ్యవహరించే ప్రభుత్వ వైద్య సిబ్బంది కారణంగా పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు రోగికి స్వస్థతను చేకూర్చకపోగా మరిన్ని వ్యాధులు సంక్రమించేలా ఉండడం బాధాకరం. వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దేందుకు పాలకులు ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు.
ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా ఉండడంతో ఏటా విషజ్వరాలతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్రామాల్లో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులు పట్టణాల్లో నివాసం ఉంటూ, ఎప్పుడో చుట్టపు చూపునకు వచ్చినట్లు తమకు తోచినపుడు విధులకు వస్తుంటారు. గ్రామాల్లో ఉండని వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మంత్రులు చేస్తున్న హెచ్చరికలు తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితులు మారనంతవరకూ గ్రామాల్లో ‘స్వస్థ భారత్’ను ఆశించలేం.
భారత్‌లో ఏటా పది లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వారిలో మూడింట రెండువంతుల మంది మృత్యువాత పడుతున్నారు. పలురకాల క్యాన్సర్ల బారిన పడిన రోగులకు అవసరమైన మందులు, ఆధునిక చికిత్సలు చేయించలేని పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక లేమితో దేవుడిమీద భారం వేస్తున్నాయి. కన్నీళ్లు కార్చుకుంటూ చావుబతుకుల మధ్య వున్న రోగిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఈసురోమంటున్న కుటుంబాలకు కొదవ లేదు. క్యాన్సర్ రోగులకు ఉత్తమ వైద్య సౌకర్యం కల్పించి, అత్యాధునిక పరిజ్ఞానంతో చౌకగా చికిత్సలు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పం నెరవేరే వెసులుబాటు ఏనాడు సిద్ధిస్తుందో వేచి చూడాల్సిందే! క్యాన్సర్ రోగులకు చికిత్సల కోసం ఉపయోగించే పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున సహజంగానే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా వైద్య పరికరాల తయారీ ఊపందుకుంటేనే రోగుల కుటుంబాలకు ఆర్థిక స్వస్థత కలుగుతుంది. అలాంటి వ్యవస్థ ఏర్పడేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య సదుపాయాల నిమిత్తం నిధులను భారీగా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఆధునిక జీవన విధానాల వల్ల ప్రజల్లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులు గతి తప్పుతున్నాయి. శారీరక శ్రమకు దూరం కావడంతో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి జబ్బులు పెచ్చరిల్లి మానవ ఆరోగ్య వ్యవస్థను నిలువునా కుప్పకూల్చుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో ఈ మాయదారి జబ్బులకే అధిక శాతం ఆదాయం ఖర్చవుతున్నందున సగటు జీవులను ఆర్థిక సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
భారతీయ గ్రామీణ వ్యవస్థలో ప్రజారోగ్యం ప్రమాదాల బారిన పడింది. పల్లెసీమల్లో ఇప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత అంతంత మాత్రమే. దీంతో గ్రామీణలు తరచూ జ్వరాలతో సతమతమవుతున్నారు. ఏది విషజ్వరమో? ఏది సాధారణ జ్వరమో? తెలుసుకోలేని పల్లె ప్రాంతాల వారు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం అందించే పరిస్థితి లేదు. నగరాలకు పోయి ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించే ఆర్థిక స్థోమత పేద ప్రజలకు లేదు. ఇంటిల్లిపాదీ రోగిని కాపాడుకోవాలన్న తపనతో కాయకష్టం చేసి సంపాదించిన డబ్బును ప్రైవేటు ఆసుపత్రుల పరం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వైద్యులు రక్తపరీక్ష, మూత్రపరీక్ష, హెల్త్ చెకప్ పేరిట భారీగా డబ్బు దండుకుంటున్నారు. మామూలు జ్వరాలకు వందలు, వేలు చెల్లించాలంటే అప్పు చేయడం, దీర్ఘరోగాలకైతే ఆస్తులు అమ్ముకోవడం తప్ప పల్లెవాసులకు మరో ప్రత్యామ్నాయ మార్గం కానరావడం లేదు. డబ్బు ఖర్చు చేయలేని వారు ఉచిత వైద్యసేవల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోని దీన దృశ్యాలు కనిపిస్తుంటాయి. చాలాచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, మందుల కొరత, ఆధునిక సౌకర్యాలు లేకపోవడంతో రోగులు సైతం అప్పు చేసైనా ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులపై పాలకుల్లో, అధికారుల్లో జవాబుదారీతనం లేకపోవడం పేదరోగుల పాలిట పెనుశాపమైంది. పేదవాళ్లు తాము అడిగినంత ఇచ్చుకోలేరని ప్రభుత్వ వైద్యసిబ్బంది ముఖం చాటేస్తుండగా, సర్కారీ దవాఖానాల్లో తమను ఎవరూ పట్టించుకోరన్న భావన పేదవర్గాల్లో బలపడింది.
పేద ప్రజలందరికీ విద్య, వైద్యం అందించాలని మన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నా ఆ దిశగా ప్రభుత్వ వైద్యశాలలు పనిచేయడం లేదన్నది నిష్ఠుర నిజం. ప్రభుత్వ వైద్యుల ఉదాసీనతతో విసుగెత్తిన ప్రజలు ప్రైవేటు వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరు ఆర్థికంగా చితికిపోతున్న వైనం ప్రభుత్వాలకు తెలియనిది కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘లంచావతారాల’ చేతివాటం తెలియక కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని, అదే రక్షణ కవచమని పదే పదే చెప్పే పాలకులు వాస్తవ పరిస్థితులను మాత్రం పట్టించుకోరు. చాలా చోట్ల ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో పేదవర్గాల గర్భిణులు, బాలింతలకు అనునిత్యం అవస్థలు తప్పడం లేదు. ఒకే మంచాన్ని ఇద్దరేసి బాలింతలకు కేటాయించడం, నవజాత శిశువులు తారుమారు కావడం, సిబ్బంది ఉన్నా శిశువులు కుక్కలపాలు కావడం, ఎలుకలు కుట్టి శిశువులు మృత్యువాత పడడం.. ఈ అమానవీయ దృశ్యాలన్నీ మనకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కనిపిస్తుంటాయి. ఆర్థిక సంబంధాల ముందు ఇక్కడ మానవీయత తలదించుకోవాల్సిందే!
సిరిసంపదలు ఎంతగా ఉన్నా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు పెద్దలు. ఆరోగ్యాన్ని, విద్యను, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. గుండె శస్త్ర చికిత్సల్లో వినియోగించే స్టెంట్లపై రేట్లు పెంచి, లాభాలు దండుకోరాదన్న ఆశయంతో కేంద్రం కొంతవరకు వ్యయభారాన్ని నియంత్రిస్తున్నా, ఇతరత్రా వైద్యసేవలు ఖరీదైపోయి మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల వారు ఉన్నదంతా అమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన 184 జిల్లాల్లో మెరుగైన వైద్య సేవల పరికల్పనకు మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఉపక్రమించినా, క్షేత్రస్థాయిలో ఆ ‘సంకల్పం’ సక్రమ స్థాయిలో అమలు కావడానికి మరిన్ని పర్యవేక్షణాచర్యలు అవసరం. రకరకాల రోగాలకు పరిమిత ధరలతో మందులు పంపిణీ చేస్తే పేదవర్గాలకు ఎంతో ఊరటగా ఉంటుంది. అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతిపై విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా వాటిని తయారుచేసి ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేసే వెసులుబాటు కల్పించాలి. అనారోగ్యాలను కూకటివేళ్లతో పెకలించే అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ పరిపుష్టం కావాలి. స్వచ్ఛత, ఆరోగ్యం పడుగు-పేక లాంటివి. ఎక్కడైతే అపరిశుభ్రత, మురుగునీటి నిల్వలు, కాలుష్యం, కలుషిత జలాలు లేని వాతావరణం ఉంటుందో అక్కడ రోగాలు పలచబడి- అనారోగ్యానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అందుకే ‘స్వచ్ఛ గ్రామీణ భారతం’ ఆవిష్కారం కావాలని గాంధీజీ కలలు కన్నారు. నేడు మోదీ నేతృత్వంలో స్వచ్ఛ గ్రామీణతకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, కాలుష్యరహిత పరిసరాలు, గృహాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతకు పెద్దపీట వేయాలి. అలాంటి పరిస్థితి ఏర్పడితేనే- వాతావరణ కాలుష్యం, భూతాపం తగ్గి ప్రకృతి వైపరీత్యాలు తగ్గుతాయన్న శాస్తజ్ఞ్రుల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రజలు కూడా ఆసక్తి చూపి ఆ దిశగా కార్యాచరణకు పూనుకోవాలి. అప్పుడే స్వచ్ఛత, స్వస్థత సాకారం అవుతాయి.

-దాసరి కృష్ణారెడ్డి