మెయన్ ఫీచర్

జగనన్నకు తొందరెక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వు.. నవ్వించు.. మా నవ్వులు పండించు..! తనను ఎవరూ పొగడకపోతే తనను తానే పొగుడుకోవాలి! ‘సెల్ఫ్ సర్వీస్’ మాదిరి ‘సెల్ఫ్ డబ్బా’ లాంటి ‘సెల్ఫ్ ప్రమోషన్’ అన్నమాట! ఇదీ ఆధునిక జీవిత లౌకిక సత్యం. వైకాపా దళపతి జగన్ ఇప్పుడు దానినే పాటిస్తున్నారు. అఖిలాంధ్రకోటి జనాలకు తనకుతాను ‘అన్న’గా భావించుకుని, 30 ఏళ్లపాటు ‘నిరంతర సిఎం’గా ఊహించుకుని, అదే భ్రమల్లో తన పాదయాత్రకు ముందు- ‘జగనన్న వస్తున్నాడు.. కాబోయే సిఎం వస్తున్నాడ’ని ఊళ్లలో డప్పుకొట్టించాలని జగనే తన శ్రేణులకు పిలుపునివ్వడాన్ని ఆయన దళమే ఆక్షేపిస్తోంది. ‘ఆలూ లేదూ చూలూ లేదూ కొడుకు పేరు సోమలింగమన్న’ట్లు, రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ‘ముఖ్యమంత్రి కల’ కనడం, జగనన్న కల తమకూ వచ్చిందనుకుని తమను కూడా రోడ్డెక్కి ‘టముకు’ వేయమనడం అనుచరులకు చిరాగ్గా ఉన్నట్లుంది మరి! ఈ విషయంలో జగన్‌కు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పి.కె) దేవతావస్త్రాల కథను ఆచరణలో చూపిస్తున్నట్లున్నారు. విశ్వాసం ఉండటంలో తప్పులేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, అత్యుత్సాహమే కొంపముంచుతుంది. ఇది ఎవరికైనా వర్తించే సూత్రం. చంద్రబాబు ప్రభుత్వాన్ని భరించలేకనో, పాలనలోని అవినీతిని సహించలేకనో, ఎమ్మెల్యేల దోపిడీని భరించలేకనో, ఇక ఈ పాలన మాకొద్దని జనం తీర్మానించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే జయాపజయాలు ప్రజాధీనం కాబట్టి. అంతమాత్రాన జగనన్న తానే చెప్పుకున్నట్లు 30 ఏళ్లపాటు సిఎం అయిపోతారా? ఒక్క జగనే కాదు. ఈ విషయంలో బాబు కూడా నాటౌట్ బ్యాట్స్‌మెన్ కావాలని కోరుకుంటున్నారు.
ఎవరి కోరిక వారిది. వాటిని తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే అసలు అలాంటి అవకాశాలున్నాయా? ఇప్పటివరకూ కేవలం షూటింగు గ్యాప్‌లోనే పార్ట్‌టైమ్ పాలిటిక్సు చేస్తున్న ‘ట్విట్టర్ రాజా’, ‘జనసేనాధిపతి’ పవన్‌కల్యాణ్ ఫుల్‌టైమర్‌గా మారి జనంలోకి వస్తే ఆయన పార్టీతో పుట్టిమునిగేదెవరికి? ఊపిరి పీల్చుకునేదెవరు? రేపటి ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టాలనుకుంటున్న కాపులు, పవన్ వస్తే సొంత కులవేల్పునకు కాకుండా వైకాపాకు ‘ఎస్’ అంటారా? టిడిపి గనుక బిజెపి చేయి విడిచిపెడితే, ఆ చేయి పట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా నేత బొత్స సత్తిబాబు నిర్మొహమాటంగా చెప్పినందున- ఇప్పటివరకూ జగనన్నకు దన్నుగా నిలిచిన క్రైస్తవ, ముస్లిములంతా గత ఎన్నికల్లో మాదిరి గంపగుత్తగా ‘పంఖా’ చెంతకు చేరిపోతారా?
హిందూ పార్టీగా ఉన్న బిజెపితో జతకట్టినా వైసీపీని క్షమించేస్తారా? ఇలాంటి కనీస అంచనాలేవీ లేకుండా ఉత్తరాది అరువు మేధావి పి.కె- అమాయక ‘పులివెందుల పులిబిడ్డ’ను సీఎం చేస్తానంటూ చెప్పడం, ఆ మేరకు యువరాజాను భ్రమల్లో విహరింపచేయడం ధర్మమేనా? ఫీజు తీసుకుని సలహాలిచ్చే కన్సల్టెంటు కాబట్టి తన క్లయింట్ బాగోగులు చూసుకోవడాన్ని తప్పుపట్టలేం. కానీ వాస్తవాలను అంచనా వేయకుండా తప్పుదోవపట్టించడం.. నలుగురిని సీఎంలు చేసి, ఇద్దరికి పుట్టిముంచిన పి. కె.కు న్యాయం కాదన్నది జగన్ దళాల వా(వే)దన. ఎందుకంటే అరువు మేధావి పి.కె. అనుకున్నట్లు ఇది ఉత్తరా ది కాదు. ఉత్తరాది మాదిరిగా ఒక కులం ఒకే పార్టీకి జైకొట్టే వాతావరణం ఏపీలో ఉండదు.
సీమలో జగన్‌కు జైకొట్టే రెడ్డి వర్గం నెల్లూరులో టిడిపి వైపు ఉంటుంది. గుంటూరు, అనంతపురంలో టిడిపికి దన్నుగా నిలిచే కమ్మ వర్గం ప్రకాశం-కృష్ణాలో నిలువునా చీలిపోయింది. ఉభయ గోదావరిలో కాపు-శెట్టిబలిజ-రాజులదే కీలకపాత్ర. శెట్టిబలిజలు ఇప్పుడు టిడిపి వైపు ఉంటే కాపులు రిజర్వేషన్లు, ముద్రగడ ప్రభావంతో వైసీపీ వైపు చూస్తున్నారు. మళ్లీ అక్కడే- గతంలో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినా అటువైపు కనె్నత్తి చూడని కరుడుగట్టిన మరో కాపు వర్గం, చినరాజప్ప, చిక్కాల వంటి స్వామిభక్తులున్నారు. పవన్ కల్యాణ్‌కు రేపు పెద్ద ఓటు బ్యాంకు కూడా ఈ రెండు జిల్లాలే. గోదావరి కాపులెప్పుడూ ఎటు తిరిగినా, సీమ బలిజలు మాత్రం టిడిపి వైపే ఉంటారు. ఇక ఉత్తరాంధ్రలో బీసీలదే హవా. తూర్పుకాపు, కాళింగ, కొప్పల వెలమ, గవర, మత్స్య, యాదవ వర్గాల్లో ఇప్పటికీ యాదవ, తూర్పుకాపులు టిడిపి వైపున్నారు. కాళింగ, కొప్పల వెలమల్లో మెజారిటీ శాతం వైసీపీకి జైకొడుతున్నారు. ఇక మాల నాయకులంతా గత ఎన్నికల తర్వాత టిడిపి వైపువచ్చినా, మెజారిటీ జనం మాత్రం జగన్‌కే జై కొడుతున్నారు. చంద్రబాబు ఇక్కడో ఓ విషయం గ్రహించాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ముస్లిం అభ్యర్ధిని మేయర్‌గా నిలబెట్టినా, ముస్లింలు అసలైన ముస్లిం పార్టీ అయిన మజ్లిస్‌కు ఓట్లేస్తారే తప్ప, తమ వర్గం అభ్యర్థి మేయరుగా ఉన్నాడని మరో పార్టీని అందలమెక్కించరు.
రేపుమాలల విషయంలో కూడా జరగబోయేది అదే! మాలల కంటే నాలుగున్నర లక్షల సంఖ్య తక్కువగా ఉన్న మాదిగలు చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం వల్ల ప్రస్తుతం వౌనంగా ఉన్నప్పటికీ, వారు మాలల దారి పట్టడం కష్టం. నిజానికి మాదిగలు తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకయితే, మాలలు నాడు కాం గ్రెసు-నేడు వైసీపీకి అనుకూలంగా ఉంటారన్నది చరిత్ర. ఇప్పుడు చంద్రబాబు కళ్లు తెరవకపోతే మంద కృష్ణమాదిగ పుణ్యాన మాదిగలు బిజెపి ఓటుబ్యాంకుగా మారినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఎన్టీఆర్ హయాంలో టిడిపిని సంప్రదాయకంగా వ్యతిరేకించిన బ్రాహ్మణులు, చంద్రబాబు తమ కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తో సానుకూలంగా మారుతున్నారు. క్రైస్తవులు, ముస్లిముల ను ఆకర్షించేందుకు టిడిపి ఎన్ని తాయిలాలు, తాంబూలాలు ఇచ్చినా ఎన్నికల నాటికి ఆ వర్గాలు జగన్ వైపే మళ్లడం ఖాయం. ఇంతోటి రాజకీయ, కుల సమీకరణలను జగన్ తన పార్టీలోని ఏ సీనియర్‌ను అడిగినా చెప్పేవారు. దానిని కాదని, కోట్లు పోసి కన్సల్టెంటును పెట్టుకోవడం, ఆయనను వేదిక మీదకు తీసుకువచ్చి ‘బాహుబలి’గా చూపించడం ఏమిటన్నది జగనన్న దళాల ప్రశ్న.
గౌరవ మర్యాదలు ఒకరిస్తే వచ్చేవి కాదు. జగన్ తనను అఖిలాంధ్రకోటి జనాలు నోరారా ‘అన్నా’ అని పిలవాలని ముచ్చట పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకూ అలాంటి గౌరవం ఒక్క ఎన్టీఆర్‌కే దక్కింది. అన్నార్తులను ఆదుకునేందుకు ‘అన్న’ గుండెల్లో నుంచి పుట్టిన అనేక పథకాలను ఆయనను ఇప్పటికీ అన్నగారిగానే నిలబెట్టాయి. పార్టీ పెట్టిన తర్వాత జగన్ మాదిరిగా ఆయన తనను ‘అన్నా’ అని పిలవమని ఎప్పుడూ చెప్పలేదు. ఆవిధంగా డప్పుకొట్టాలనీ కోరలేదు. ఆ తర్వాత ఆ స్థాయిలో ‘అన్న’గా కాకపోయినా, పేదల దేవుడిగా నిలిచిపోయిన మరో నేత వైస్ రాజశేఖరరెడ్డి. తన కోసం పనిచేసిన వారిని అడగకపోయినా ఆదుకోవడం, నమ్మినవారికి దన్నుగా ఉండటంలో వైఎస్ తర్వాతే ఎవరైనా అన్న కీర్తిని శాశ్వతం చేసుకున్నారు. వైఎస్ నడక, నడతలో మానవత్వం మూర్త్భీవించేది. ఆయన వల్ల లబ్ది పొందామని ఇప్పటికీ గుర్తుచేసుకునేవారు ఎక్కడో ఒక చోట తారసపడుతుంటారు. కష్టాల్లో ఉన్న పార్టీ నేతలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఆదుకున్న ఉదారవాది. వైఎస్ పుణ్యాన మీడియా ప్రముఖుల నుంచి ఆయనతో సన్నిహితంగా ఉండే సగటు నాయకుడి వరకూ స్థిరపడ్డారన్నది నిష్ఠుర నిజం. అందుకే వైఎస్ ఇప్పటికీ సజీవంగా వారి గుండెల్లో నిలిచిపోయారు. ఈ విషయంలో ఆయన తనయుడైనప్పటికీ జగన్ ధోరణి పూర్తి వ్యతిరేకం.
డబ్బు విషయంలో వైఎస్-బాబు తీరు ఒక్కటైతే, ఇద్దరు యువరాజుల తీరు ఒకేమాదిరిగా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రచారం. ఇక బాబుది ఫక్తు అవసరార్థ రాజకీయం. ఎవరి ఉపయోగం ఎంతో గ్రహించి వారిని అంతవరకే పరిమితం చేస్తారు. ఆయన వల్ల లబ్ది పొందామని, తమ జీవితాలు బాగుపడ్డాయని ఇప్పటివరకూ ఒక్కరూ చెప్పుకున్న దాఖలాలు లేవు. వైఎస్-బాబు సమకాలీకులే అయినప్పటికీ ఆ విషయంలో బాబు ఎందుకో ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. ఇదీ రాష్ట్రంలోని ప్రముఖుల వ్యక్తిగత వ్యవహార శైలి.
జగన్ ముచ్చట నెరవేరాలంటే ఆయనకు ఇంకా వయసు, అనుభవం కావాలి. కనీసం తండ్రి స్థాయికి ఎదగాలంటే దానికి చాలా త్యాగం, ఓపిక, సహనం అవసరం. జగన్ ఒక్కరే కాదు. లోకేష్‌ను కూడా సీఎంగా చూడాలని ఆ పార్టీలోని భజన భక్తబృందం ఆశిస్తోంది. ఆయనకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వైఎస్-బాబు ఇద్దరి రాజకీయ జీవితాలు వడ్డించిన విస్తరేమీ కాదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ప్రతిఘటనలు ఎదుర్కొని ఆ స్థాయికి ఎదిగారు. ఈ విషయంలో బాబుకు- ఎన్టీఆర్ పుణ్యాన వైఎస్ కంటే ముందుగానే రాజయోగం పట్టగా, వైఎస్ దాని కోసం కొనే్నళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. వారి తనయులిద్దరిదీ అందుకు భిన్నమైన జీవితం. గోల్డ్‌స్పూన్‌తో పెరిగిన ఇద్దరు యువరాజులకు కష్టాలు, కన్నీళ్లు, మానవీయకోణం, రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఇంకా తెలియవు. ఈ విషయంలో జగన్ ఇప్పుడు కొంచెం సీనియర్. జైలు అనుభవం, ప్రతిపక్షంలో కష్టాలు, వెన్నుపోటు దెబ్బలు తెలుసుకుంటున్నారు. లోకేష్‌కైతే ఆ బాధలు కూడా లేవు. సొంతంగా ఎదిగే నాయకులకు, త్యాగరాయ గానసభలో మాదిరిగా కిరాయి మనుషులతో జైకొట్టించుకుని ఎదిగే నేతలకు విలువ ఉండదు.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144