మెయన్ ఫీచర్

రైతు సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈనాటికీ రైతు కష్టపడుతూనే ఉన్నాడు. స్వల్ప ఋణాలు కూడా చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పదివేల రూపాయలు చెల్లించలేక నల్గొండలో కొనే్న ళ్ల క్రితం రైతు ఆత్మహత్యకు పాల్పడగా, రూ.9 వేల కోట్ల రుణం ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేశాడు. రైతు ఆర్థికంగా బలపడేందుకు, రైతుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం చాలా ఏర్పడింది. గత రెండేళ్లుగా వర్షాభావం కూడా రైతు ఆర్థిక పరిస్థితిని కుంగదీసింది. దేశమంతా భగభగలతో వేడెక్కిందంటే కారణం చెరువుల స్థానే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం, చెట్లను నరకడం, భూగర్భ జలాలను పీల్చేయడమే కారణం. తాగేందుకే నీరులేక లా తూర్ ప్రజలు హాహాకారాలు పెడుతుంటే రైలు ట్యాంకర్లలో నీటిని మోదీ ప్రభుత్వం లాతూర్‌కు పంపింది.
మహారాష్టల్రో పది జిల్లాల్లో కరువు ఈ నాటి సమస్య కాదు. రైతులు నీళ్లు లేక అవస్థలుపడుతుంటే ఐపిఎల్ నిర్వహణను ముంబై నుంచి మార్చమని బొంబాయ హైకోర్టు ఆదేశించేదాక కూడ మీడియాకు రైతుల కష్టంపై స్పందన లేదు. 70 లక్షల లీటర్ల నీటిని పిచ్చి ముదిరిపోయిన క్రికెట్ ఆటకు కావలసిన పిచ్‌లు, ఆటస్థలాలు చదును చేసేందుకు ఎందుకని మీడియా చర్చలు నిర్వహించి తన రైతు భక్తిని చాటడం మొదలైంది. జెఎన్‌యు, హెచ్‌సియు విద్యార్థులకు రైతు సమస్యలు పట్టవు. ఫేస్‌బుక్, వాట్సప్‌ల వంటివే రైతును పట్టించుకోవు. క్రికెట్‌లో వికెట్‌లు పడితే ఫీలయిపోయే యువజనం, పిట్టల్లా రాలిపోతున్న కర్షక జనం పట్ల ఏరకంగానూ స్పందించరు. పైగా, నగరాల్లో, రెస్టారెంట్లలో క్వింటాళ్ల కొద్దీ ఆహారం వృధా చేస్తారు మరి కొందరు. అన్నం పెడుతున్న రైతు కష్టాలకు మోదీ ప్రభుత్వం స్పందించాలి. ఇం తకు ముందు బడ్జెట్‌లలో కేటాయించిన మొత్తానికి భిన్నంగా 2016-17 బడ్జెట్‌లో రూ. 44,485 కోట్లను వ్యవసాయానికి కేటాయించింది. పంట ఋణాలు మొత్తం పెంచింది. పంటల బీమా కింద కనీసం 2019 వరకు 50% రైతులకు లాభం చేకూర్చాలన్నది మోదీ ప్రభుత్వ ధ్యే యంగా ఉంది. భూసారం కార్డుల పంపిణీ, సాగునీటి నిధి, ధరల స్థిరీకరణ నిధి, పంట కుం టల తవ్వకం, వంటి మరికొన్ని చర్యలను ప్రకటించింది. దీనితో పాటు 2018కల్లా అన్ని గ్రామాలకు విద్యుత్తు, 2019 కల్లా అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడం లక్ష్యం గా మోదీ ప్రభుత్వం పని చేస్తున్నది. గ్రామీణ ఆదాయాన్ని పెంచాలని, 2022 వరకు రెట్టింపు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు సమస్యల పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేసేందుకు గత 8 నెలల కాలంలో మోదీ ప్రభు త్వం రెండు మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటిది బహుళ జాతి కంపెనీ మోన్‌శాంటోకు రైతులు కట్టే రాయల్టీని 70% తగ్గించడం. 450 గ్రాముల బిటి కాటన్ విత్తన పొట్లాలపై రైతులు చెల్లించే మొత్తం గతంలో రూ.160లుగా ఉంది. దాన్ని ప్రస్తుతం రూ.49 లకు తగ్గించారు. తామిచ్చిన సాంకేతిక పరిజ్ఞానానికి మోన్‌శాంటో రైతుల వద్ద ఇంతకాలం అధికమొత్తంలో సుంకం వసూలు చేసేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట నిచ్చింది.
2002 నుంచి అధిక మొత్తంలో రైతులు వద్ద వసూలు చేస్తున్న మోన్‌శాంటో ఆశకూ ఓ హద్దుండాలి. ప్రభుత్వం చేసిన నిర్ణయం అంగీకారం కాకపోతే భారత్‌ను వదలి వెళ్లవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2016లో అంతర్జాతీయంగా పత్త్ధిరలు అతి తక్కువకు పడిపోయాయి. 450 గ్రాముల బిటి పత్తి విత్తనాల పొట్లం గరిష్ట ధరను రూ. 800గా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ ధర రూ.830 నుంచి రూ.1000 గా ఉండింది. వచ్చే సంవత్సరం భారత్ స్వయంగా బిటి కాటన్ విత్తనం అభివృద్ధి చేయనుంది. ఆరు దశాబ్దాలుగా భారత్‌లో వ్యాపారం చేస్తూ 2002 నుంచి జన్యు మార్పిడి విత్తనాల వ్యాపారంతో సంపద పెంచుకున్న మోన్‌శాంటో ఈ విషయంలో ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సుదీర్ఘ విచారణ జరిపింది. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నిర్ణయం ఈ ఖరీఫ్ నుండే అమలకు రానుంది. 80 లక్షల మంది వ్యవసాయ దారులకు లబ్ది చేకూరనుంది. కాంపిటిషన్ చట్టంలోని సెక్షను 13(4), 4 నిబంధనలను మహికో-మోన్‌శాంటో బయోటెక్ లిమిటెడ్ కంపెనీ యదేచ్ఛగా ఉల్లంఘించిందని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాదన. సుమారు 48 విత్తన కంపెనీలతో మోన్‌శాంటో వొప్పందం చేసుకుంది. ఇందులో చాలా విషయాలు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయన్న నూజివీడు సీడ్స్ వంటి కొన్ని కంపెనీల ఫిర్యాదు మేరకు 2015లో కేంద్రం స్పందించింది. నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా కూడా ఈ దర్యాప్తులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సహకరిస్తోంది.
మోదీ ప్రభుత్వం చేపట్టిన మరొక చర్య యూరియాపై వేపపూతనివ్వడం. దేశంలో యూరియా తయారయ్యే కర్మాగారాల్లో 75 శాతం యూరియాకు వేపపూత నిమ్మని కేంద్ర ఎరువులు రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ ఆదేశించారు. దీనివల్ల వ్యవసాయ దిగుబడి 15-20 శాతం పెరగడమే కాక అధిక యూరియా వినియోగం వల్ల్ల భూసారం తగ్గిపోయే ప్రమాదం నుంచి రైతులు రక్షించబడతారు. భూమిలో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్‌ల నిష్పత్తి (4: 2:1) చెదరకుండా వుంటుందనే ఈ ఎరువుల కార్యదర్శి జికె మహాపాత్ర అభిప్రాయం. వేపుపూత వల్ల అది క్రిమిసంహారకంగా కూడ పనిచేస్తుంది. కేవలం టన్నుకు 5% ధర ఎక్కువవుతుంది. టన్నుకు రూ. 200 ఖర్చవుతుంది. పైగా దీనివల్ల రసాయన కర్మాగారాలకు యూరియాను అక్రమంగా తరలిస్తున్నవారి అకృత్యాలకు తెరపడుతుంది. ఆవిధంగా అర్హులు కాని వారెందరో యూరియా కింద ఇచ్చే సబ్సిడి రూ.6700 కోల్పోతారు. సబ్సిడీ భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. ఈ మొత్తాన్ని పంటల బీమా కింద వెచ్చించేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.
గత ఆగస్టు 15 నాడు ఎర్రకోటనుంచి తాను చేసిన ప్రసంగంలో మోదీ రైతులకు మేలుచేసే చర్యలను ప్రభుత్వం చేపడుతుందన్న సంకేతం ఇచ్చారు. అందుకనుగుణంగానే యిది జరిగింది. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అధ్యయనం ప్రకారం ఢిల్లీలో పంపిణీ అవుతున్న పాలలో ఎన్నో కల్తీ పదార్ధాలను కలుపుతున్నారు. వాటిల్లో యూరియా కూడా ఒకటి. వ్యవసాయంతో కాకుండా యూరియాను రంగులు, ప్లాస్టిక్ పెయింట్స్, జంతువుల ఆహారం, క్రిమిసంహారకాల్లో వాడుతున్నారు. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్రవాదులు ఉపయోగించే బాంబుల్లో కూడా యూరియా వాడుతున్నట్టు తెలిసింది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్‌లకు యూరియా అక్రమంగా రవాణా అవుతోంది. మోదీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది. నిఘాను పెంచింది. పరిశీలన జరిపే అధునాతన రాడార్లను ఏర్పాటు చేసింది. నల్ల బజారుకు యూరియా తరలకుండా ఎరువుల మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తనిఖీలు చేస్తోంది.
తాజాగా మోదీ ప్రభుత్వం ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ స్వగ్రామం మధ్యప్రదేశ్‌లోని మహి గ్రామంలో ‘గ్రామ ఉదయ్ సే...్భరత్ ఉదయ్’ అభియాన్‌ను ప్రారంభించారు. ఈనెల 17 నుండి అన్ని గ్రామాల్లో గ్రామ కిసాన్ సభలను నిర్వహించి రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల అవగాహన కల్గిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి రైతుల సంక్షేమం కోసం మోదీ అంబేద్కర్ జయంతి రోజున జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ప్రధానమైన 885 మండీలను మూడు అంచెల్లో 2018 కల్లా అనుసంధానించే వినూత్న కార్యక్రమం ఇది. మొత్తం భూమిలో 48.15 శాతం వ్యవసాయిక భూమి అయిన భారత్‌లో 58 శాతం గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయ జీవనాధారమైన నేపథ్యంలో ఈ తరహా ఏకీకృత వ్యవసా య విపణి ద్వారా రైతు పంటకు మంచి ధర దొరికేలా చూడాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనే్న ఇ-మార్కెటింగ్ అంటారు. ఇందుకోసం కేంద్రం రూ.200 కోట్లు కేటాయించింది. అయితే ఇందుకు పల్లెల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచాలి.
మాజీ రాష్టప్రతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతి కుంటుంబంలోను కంప్యూటర్ ఉండాలి, దాన్నుపయోగించగలిగిన పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అనేవారు. ఉదాహరణకు వొక మత్స్యకారుడు కూడా తాను ఆరోజు చేపలవేటకు సముద్రం మీదకు వెళ్లొచ్చా లేదా అనే విషయం తెలిపే వాతావరణ స్థితిగతులు కం ప్యూటర్ ద్వారా తెలుసుకోగలిగితే విజ్ఞానం ప్రయోజనకారి అయినట్లే అనేవారు. గ్రామీణ ప్రజల్లో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరిగితే ఫోనుద్వారా తమ పంటలు, దాని దిగుబడి, ధరలు, బీమా యిత్యాది వివరాలు, వివిధ టోకు మార్కెట్ల వివరాలు, తెలుసుకోగలిగితే స్వీయ నిర్ణయంతో తగిన లబ్దిని పొందగలరు. దీనివల్ల కిలోల కొద్దీ తమ పంటను తరలించి మార్కెట్లలో పంటకు తగిన ధరను పొందే అవసరం ఉండదు. రైతు పంటను దేశంలోని ఏ వ్యాపారి అయినా ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం కలి గించే వెసులుబాటు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. వ్యవసాయం, వ్యవసాయ మార్కెట్ల అవసరాలు రాష్ట్రాల పరిధిలోనివే అయినా మా ర్కెట్ల అభివృద్ధికి కావలసిన వౌలిక సదుపాయలను సమకూర్చేందుకు కేంద్రం సిద్ధమైంది. కనుక సాంకేతిక అనుసంధానంతో బాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానం తప్పనిసరి అయితేనే ఈ పథకం సాఫల్యం సాకారమవుతుంది. రైతు ఆదాయం పెరిగేందుకు ఇది దోహద పడుతుంది.
వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలు వచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. తద్వారా గ్రామీణ యుతవకు ఉపాధి కూడా దొరికి ఆదాయం పెరిగే అవకాశముంది. వ్యవసాయం అనుబంధంగా పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం రూ. 850 కోట్లు కేటాయించారు. పశువుల ఆరోగ్యం, పశు సంపద వృద్ధి, అన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం వంటివి యిందులో ఉన్నాయి. కూరగాయలు, పండ్లు వృధా కాకుండా ఆహారశుద్ధి, మార్కెటింగ్‌లను అభివృద్ధి చేసేందుకు వందశాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రైతులకు ఉపాధి అవసరాలను పెంచేందుకు ప్రభుత్వం చొరవ చూపింది. పంటల బీమా పథకంలో పరిహారం విషయంలో పరిమితి లేకపోవడం, ప్రీమియం అతితక్కువగా వుండడం, 1/3వ వంతు పంట విస్తీర్ణానికి పరిహారం అందిస్తామనడం రైతుకు మంచి ప్రోత్సాహకాలైనాయి. 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత భవిష్యత్తు బాగుండేందుకు 9 ప్రధాన రంగాలను గుర్తించామన్నారు. అయితే అందులో వ్యవసాయం, రైతు సంక్షేమం అంశాలకు ఆయన పెద్దపీట వేశారు. ‘జై కిసాన్’ నినాదాన్ని సాక్షాత్కరింపజేసే ప్రయత్నమే యిది. రైతును రాజును చేయడమే ప్రస్తుతం మోదీ ముందున్న సవాలు. సవాళ్లను స్వీకరించడమే ఆయన నైజం. దేశ ఖజానాకు కాపలాదారుగా ఉంటానన్న మోదీ ఖజానా నుంచి అక్రమంగా దండుకుంటున్న అన్ని కేంద్రాల వద్ద పాలనా పరమైన నిఘా నేత్రం వుంచడమే, సంక్షేమ బాటలో నడిచేందుకు కావాల్సిన విశ్వాసాన్నిస్తోంది.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888