మెయన్ ఫీచర్

తరగతి గది నిజంగా ఆహ్లాదకరమేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతనెల జూన్ 8న గుంటూరులో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం అనే అంశంపై జరిగిన సమావేశానికి సిబిఐలో జెడిగా, ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డిజిపిగా పనిచేస్తున్న వి.వి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా, ఈ వ్యాసకర్త ప్రధాన వక్తగా హాజరు కావడం జరిగింది. విద్యారంగంలో ఉండాల్సిన విలువల గూర్చి లక్ష్మీనారాయణ మాట్లాడగా, విద్యారంగంలో అత్యవసరంగా పట్టించుకోవాల్సిన మూడు అంశాల గూర్చి ప్రధాన వక్త మాట్లాడారు. మొదటిది పాఠశాలలో చేర్పించే వయస్సు, రెండోది భుజాలపై మోసే పుస్తకాల బరువు కాగా, మూడోది- విభిన్న వర్గాల పిల్లలందరు ఒకే తరగతి గదిలో వుండాల్సిన ఆవశ్యకత గురించి! ఉపాధ్యాయులతోపాటు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన విద్యా విధానంకు సూచించాల్సిన అంశాల్లో పైమూడు అంశాల ప్రాధాన్యతను చర్చించడం జరిగింది. ఇవి ఆమోదం పొందితే, విద్యరంగం ఎదుర్కొంటున్న సమస్యలు సమసిపోయి, ఆరోగ్యకరమైన తరగతి గది రూపుదిద్దుకుంటుందని సమావేశం గుర్తించింది.
నిజానికి ఇలాంటి సమావేశాలు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా జరగాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, అందునా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు ఈ అంశాలపై దృష్టి సారిస్తే, మిగతా సమస్యల్ని సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఈమధ్యన చాలామంది బతుకుతెరువుకై అమెరికాకు వలస పోతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. వీరికి కలిగిన పిల్లలకు 5 సం. వయస్సు వచ్చేదాకా అక్కడి పాఠశాలల్లో నమోదు వుండకపోవడంతో, ఆ పసి పిల్లల్ని ఇండియాకు పంపించి, తాతమ్మల దగ్గర వుంచి ప్లే స్కూల్లో చేర్పించి యుకెజి దాకా రుద్దించి (చదువు పేరున) తిరిగి అమెరికాకు పంపిస్తున్నారు. ఇలాంటివారు అమెరికాలో ఈ విధానం ఎందుకు లేదో ఆలోచించరు. ఇలా మన భారతీయులు వదులుకోవాల్సిన తప్పుడు విధానాల్ని వదులుకోకపోవడం, గుర్తించాల్సిన మంచి అంశాల్ని పట్టించుకోకపోవడం, ఎక్కడి అవకాశాల్ని అక్కడ వినియోగించుకోవడంలో బాగా ఆరితేరారు.
ఈ విషయంగా జరిగిన కొన్ని పరిశోధనల్ని ఈ సందర్భంగా గుర్తించాలి. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన కోహర్ట్ స్టడీ (కోహర్ట్ విద్యార్థి సామర్థ్యాల్ని ఎంపిక చేసిన వివిధ స్థాయిలో పోల్చి చూడడం)లో పిల్లలు తీసుకునే స్వీయ నిర్ణయాధికారాలు (సెల్ఫ్ కంట్రోల్) అనగా, వ్యక్తిగత పనుల నిర్వహణ, అవసరానికి అనుగుణంగా పిల్లలు తీసుకునే నిర్ణయాల గూర్చి వారి తల్లిదండ్రుల అభిప్రాయాల్ని సేకరించారు. ఇందులో 7 సం. వయస్సున్న పిల్లల తల్లిదండ్రులు 54,241మంది, 11 సం. వయస్సున్న పిల్లల తల్లిదండ్రులు 35,902 పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం, 5 సం. నిండిన తర్వాత బడిలో చేర్పించిన పిల్లల కన్నా 6 సం.లు నిండిన తర్వాత చేరిన పిల్లలే సరాసరి విద్యార్థులు సాధించాల్సిన 73 శాతంకన్నా అధిక ర్యాంకుల్ని సాధించినట్లు తేలింది. ఈ దృష్టితోనే ఫిన్‌లాండ్ దేశంలో పిల్లల్ని 7 సం. నిండిన తర్వాతనే పాఠశాలకు పంపించడం జరుగుతుంది. అందుకే వీరు ప్రతిసారి జరిగే పీసా పరీక్షల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఈ దృగ్విషయాలేవీ పాలకులకు పట్టకపోగా, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకైతే చెవికెక్కని వైనమే!
దీంతోపాటుగా, పాఠశాలకు పంపే సమయం గూర్చి కూడా సమావేశంలో ప్రస్తావనకు తేవడం జరిగింది. ఉదయం లేవడానికే ఇబ్బందిపడే తల్లిదండ్రులు పిల్లల్ని బలవంతంగా నిద్రలేపి, కాలకృత్యాలు కూడా తీసుకోలేని స్థితిలో పిల్లల్ని తయారుచేసి, రెడీమేడ్ తిండిని నోటిలో కుక్కి, పిల్లలు ఏడుస్తున్నా పంపించడం గతంలో లేకపోగా, ఏ దేశంలో ఈ దురవ్యవస్థ లేదనేది కూడా తల్లిదండ్రులు గుర్తించడంలేదు. ఈమధ్యన ఎన్‌సిఇఆర్‌టి జరిపిన సర్వేలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే విద్యార్థులు అత్యధిక సమయాన్ని పాఠశాలలో గడుపుతున్నట్లు తేలింది. దాదాపు 4-4.30 గంటలే ప్రాథమిక పాఠశాలలో గడపాల్సిన సమయానికి మించి ఈ రాష్ట్రాల్లో 6-7 గం. గడపడం గమనార్హం! దీనికితోడు అతిదూర ప్రాంత పాఠశాలలకు పిల్లల్ని పంపడంతో రాను, పోను గంట చొప్పున దాదాపు రెండు గంటలు కలుపుకుంటే 8-10 గం. విద్యార్థి విద్యను ఆర్జించే నెపంతో గడపాల్సి వస్తుంది. దీంతో పిల్లల తమ అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. తోడి పిల్లలతో వీధి ఆటల ద్వారా నేర్చుకునే విద్యను, నైపుణ్యతల్ని పిల్లలు నేర్చుకోలేకపోతున్న విషయం కూడా గుర్తించడంలేదు. పైగా ఇలా వీధుల్లో ఆడితే పిల్లలు చెడిపోతారనే భావన ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు భావించడం బాధాకరం! దీనికితోడు ఇంట్లో పిల్లలు చూడద్దు అంటూ, పెద్దలు చూసే ఇండియట్ బాక్స్ (ఇడియట్ బాక్స్-టివి) పిల్లల్ని అనారోచితుల్నిగా, అమానవీయంగా, నేరుస్తుల్నిగా తయారుచేస్తున్నది. దాదాపు 12 గంటలు నిద్రపోవాల్సిన పిల్లలు 6-7 గంటలకే పరిమితం కావడంతో పగలంతా అలసటకు, రాత్రంతా నిద్రలేమికి గురౌతున్నారు. ఇలా పోగుపడిన దురలవాట్లు, రుగ్మతలు పిల్లల్ని స్వయంగా ఆలోచించనీయకుండా చేస్తున్నాయి. మతిమరుపును పెంపొందిస్తున్నాయి. దరిద్రమైన తిండి అలవాట్లు ఒళ్ళును బలిపిస్తూ చక్కెర వ్యాధికి, కంటి దోషాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి అర్థరహిత విద్యా విధానం రేపటి బంగారు తరాన్ని మొగ్గలోనే ఎదగకుండా చేస్తుంటే, పట్టింపు లేకపోగా, ఇదే సరియైన విధానమనే భావన బాగా పెరిగింది.
రెండో అంశమైన పుస్తకాల మోత గూర్చి 1993లోనే యశ్‌పాల్ కమిటీ తగిన సూచనల్ని చేసినా ఏ పాలక ప్రభుత్వం ఈ విషయంగా పట్టించుకోకపోవడం శోచనీయం. పుస్తకాల భారంతోపాటు స్టాండర్డ్స్ పేరున అశాస్ర్తియ పాఠ్యాంశాలు, లావుపాటు పుస్తకాలు పిల్లల మెదడును మొద్దుబారిస్తాయేగాని, పదును పెట్టవు.
ఇదంతా విషయ పరిజ్ఞానాన్ని (ఎన్‌రిచ్డ్) పెంచడానికేనని భావిస్తున్నవారు, అంతర్జాతీయంగా మన పిల్లలు, ఉన్నత స్థాయి విద్యావంతులుగా ఎందుకు రాణించడం లేదో ఆలోచించలేకపోతున్నాం. బోధన విధానాల్ని, ఉపాధ్యాయుల సామర్థ్యాల్ని- తరగతి గది వాతావరణాన్ని మార్చకుండా కేవలం లావుపాటి పుస్తకాలే విద్యార్థుల బుర్రల్ని ఎదిగే స్థాయని భ్రమిస్తున్నాం. ఈ విషయంగా 2005లో జాతీయ విద్యా ప్రణాళికా చట్టం ఇచ్చిన సూచనలు నాటి యుపిఎ ప్రభుత్వానికి, నేటి ఎన్‌డిఎ పాలకులకు పట్టలేదు. ఇలాంటి చట్రం ఒకటి ఉందని తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు! కాని ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు కూడా పట్టింపు లేకుంటే ఏమనాలి?
ఈమధ్య గాంధీ మెడికల్ కాలేజీకి పిల్లల వైద్య విభాగం డాక్టర్లు జరిపిన సర్వేలో పిల్లలు ఎంతగా భావోద్వేగానికి గురౌతున్నారో గుర్తించడం జరిగింది. 5-15 సం. మధ్యగల పిల్లలపై చేసిన సర్వేలో 6.64 శాతం పిల్లలు విద్యాపరమైన ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నట్లు, దీంతో ప్రతి 7గురిలో ఒకరు అధిక రక్తపోటుకు గురౌతున్నారని, హైదరాబాద్ నగరంలోనైతే 13.08 శాతం పిల్లలు హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా పిల్లల రక్తపోటును కొలిచే సాధనం నోమోగ్రామ్‌లు అంతటా అందుబాటులో వుంటే, పిల్లల గూర్చిన మరికొన్ని నిజాలు బయటపడుతాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి రుగ్మతలు కల్గిన పిల్లలే ఇంటర్ స్థాయిలో (యుక్తవయస్సు) ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం, ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే ఇవి అధికంగా జరుగుతున్నది కూడా తెలిసిందే! అయినా మన చర్మాలు మరింతగా మొద్దుబారుతున్నాయేగాని, స్పందన లేకుండా పోతున్నది.
పోతే, ఈ పుస్తకాల బరువునుగూర్చి తెలంగాణ ప్రభుత్వం ఈమధ్యన జీవో 22న విడుదల చేసి, వివిధ స్థాయిల్లో ఉండాల్సిన పుస్తకాల సంఖ్య గూర్చి, విధి విధానాల గూర్చి ఏకరువు పెట్టింది తెల్సిందే! ఇలాంటి జీవోలు గతంలో వచ్చినా, ఏవి ఆచరణకు నోచుకోనిది మన అనుభవంలో ఉన్నదే! ఇక ఈ జీవో ఎలా అమలవుతున్నదో, ప్రతి ఇంట్లో రోజు ఉదయానే్న పిల్లలు సంచుల్ని మోస్తున్న విషయం చూస్తునే వున్నాం. ఎందుకంటే, జీవోలు తెచ్చిన, ఇచ్చిన పెద్దమనుషులకే ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు, ప్రచురణసంస్థలు, బ్యాగుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు వున్నాయి కాబట్టి!
ఇక మూడో అంశంగా తరగతి స్వరూపం గూర్చి, అందులో ఉండాల్సిన విభిన్నవర్గాల పిల్లల గూర్చి ప్రస్తావన తేవడం జరిగింది. పుణ్యభూమి అని నమ్మే మనం, పిల్లల్ని వారి ఆర్థిక స్థోమతను బట్టి, కులాన్ని బట్టి వర్గాల్ని బట్టి, మతాన్ని బట్టి చూసే మనస్తత్వం బాగా పెరిగింది. ఇక ప్రభుత్వాలైతే పిల్లల విద్యా స్థాయిని బట్టి నవోదయ లాంటి, గురుకుల లాంటి పాఠశాలల్ని తెరిచి మిగతా పిల్లల్ని నూన్యతాభావానికి గురిచేస్తున్నాయి. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలని ఎవరు గుర్తించడంలేదు. పైగా ఈ విధానాల్ని పొగడడం, దొడ్డిదారిన వాటిని వాడుకోవడం జరుగుతున్నది. నిజానికి తరగతి గది ఒకప్పుడున్నట్లు విభిన్నవర్గాల, ఆర్థిక స్థోమతల, కులాల పిల్లలందరు ఒకే దగ్గర, ఒకే తరగతి గదిలో చదువుకోవాలి. ఇలాంటి తరగతి గదే విద్యార్థుల మధ్యన మానవీయ కోణాల్ని, సౌభ్రాతృత్వాన్ని, విలువల్ని పెంపొందిస్తుంది. బాగా చదువుకునేవారు, చదువులో వెనుకబడినవారు (మార్కుల కొలతల్లో), సరాసరిగా మార్కులు సాధించుకునే వారుంటేనే తరగతి గదికి అందం వస్తుంది. పోటీతత్వం కూడా పెరుగుతుంది. దీనికితోడు ప్రతి తరగతి గదిలో విభిన్న అభిరుచులు, అనగా ఆటలు, పాటలు, సంగీతం, ఇతర కళలు గల పిల్లలుంటేనే నవసర భరితంగా వుంటుంది. ఏకరీతి (ఆర్థిక/సామాజిక/కుల/వర్గ) తరగతి గది ఉపాధ్యాయుల్ని మోనోటోనస్‌గా తయారుచేస్తుంది. పిల్లలు మరబొమ్మల్లా తయారైనారు. విద్యార్థి నుంచి విద్యార్థికి, ఉపాధ్యాయున్నుంచి విద్యార్థికేకాక విద్యార్థి నుంచి కూడా ఉపాధ్యాయుడు అనేక విషయాలు నేర్చుకునే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి తరగతి గదే మన పాలకులు మాట్లాడే వసుదైక కుటుంబాన్ని ఎదిగిస్తుంది. సమాజంలో హెచ్చుతగ్గులుంటాయని, ఆర్థిక అసమానతలున్నాయని, కష్టాలు, కడగండ్లు అనివార్యమని బుద్ధుడు గుర్తించినట్లు గుర్తించి జ్ఞానోదయం పొందినట్లు విద్యార్థులు పొందగలుగుతారు. పిల్లల మధ్యన పెరిగే ఇలాంటి స్నేహబంధమే కుల, మత రహిత సమాజాన్ని ఆవిష్కరిస్తుంది.
స్వాతంత్య్రం తర్వాత ఓ నాలుగు దశాబ్దాల పాటు ఇలాంటి వాతావరణమున్న తరగతి గదిని మనమంతా అనుభవించాం. అందుకే సామాజిక స్పృహ, మానవీయ కోణం, జవాబుదారీతనం, వృత్తి ధర్మం ఈ తరంలో పొడసూపింది. దీన్ని పాలకుల తోడ్పాడుతో పెట్టుబడి శక్తులు ధ్వంసం చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే స్థానంలో ఏకత్వంలోనే ప్రత్యేక తత్వమనే భావనను పెంపొందిస్తున్నాయి. ఏసి తరగతి గదులు, ఏసిమెస్‌లు, ఏసి ప్రత్యేక వసతి గృహాలు వీటి వికృత రూపాలే! అడ్డగోలుగా సంపాదనకు మరిగిన కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు ఇవే తగినవని, తమ స్థాయికి తగ్గవని భావించి ప్రోత్సహిస్తున్నాయి. చదువే విధానం ఏదైనా చేయాల్సింది సమాజ సేవననే భావన కొరవడింది. ఈ పసి చదువులు చదివినవారు రేపు యావత్ దేశాన్ని ఏసిగా మారుస్తామంటే (తెలంగాణకు సముద్రాన్ని తెస్తానన్న సినిమా డైలాగులా) మురిసే వ్యవస్థ! ఈ విధానం వ్యవస్థను ఎదిగించడం కాదు, నిండా ముంచుతుంది. ఇప్పుడు ఇది ప్రారంభంలోనే వున్నది. ఇప్పుడన్నా నిలువరిద్దాం!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162