మెయన్ ఫీచర్

చేనేత మనుగడ ప్రశ్నార్థకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాలు చిందించే కళాత్మక వస్త్రాలను సృష్టించడం యంత్రాల వల్ల సాధ్యం కాదు. అది చేనేత కళాకారునికి మాత్రమే తెలిసిన విద్య. తగిన వనరులు, ఉపకరణాలు సమకూరిస్తే చేనేత కార్మికుడు తన మగ్గం నుంచి మిల్లులకు దీటుగా వస్త్రాలను సృష్టించగలడు..’ అని ఎఫ్.బి.హవల్ వందేళ్ల క్రితం అన్న మాటలు నేటికీ నిజమే. భారతీయ సంప్రదాయానికి, లక్షలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధికి ఆధారమైనది చేనేత. పవర్ లూమ్‌ల నుంచి ఎన్ని దాడులు జరిగినా, చేనేతతో సంబంధం లేని అధికారుల కమిటీలు ఎన్ని అడ్డగోలు సిఫారసులు చేసినా చేనేత చావకుండా ఇంకా సజీవంగానే ఉంది. మిల్లులకు, పవర్ లూమ్‌లకు ఇస్తున్న రాయితీల్లో, ప్రోత్సాహకాల్లో పదో వంతైనా చేనేతకు ఇచ్చినట్లయితే ఎంతో ఉపయోగం కలుగుతుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేనేత వృత్తిపై 18 ఉపకులాల వారు ఆధారపడి ఉన్నారు. దూదేకులవారు, మేదర్లు, సీనారేకులవారు, కమ్మర్లు, మత్స్యకారులు, ఎరుకలు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు లాంటి వివిధ కులాల వారు చేనేత పరికరాలకు కావలసిన విడి భాగాలను తయారు చేసి చేనేత ఉత్పత్తిలో అంతర్భాగంగా ఉన్నారు. చేనేత ఒక కులానికే పరిమితమైనది గాక సమాజంలో వెనుకబడిన ఇతర కులాలకు సైతం జీవనభృతి కల్పిస్తోంది. చేనేత రంగాన్ని నమ్ముకుని ఇప్పటికీ లక్షలాది మంది అసంఘటిత కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. 1995 నాటికి దేశవ్యాప్తంగా 65 లక్షల మగ్గాలు వుండగా 2010 నాటికి ఆ సంఖ్య 43 లక్షలకు పడిపోయింది. ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో బతకలేని నేతన్నలు తమ సంతానాన్ని గానీ, తమ తోటివారిని గానీ మగ్గం పని చేయమని చెప్పలేకపోతున్నారు. చాలా దేశాల్లో సుమారు 200 సంవత్సరాల క్రితమే చేనేత పరిశ్రమ శుష్కించిపోయింది. గత వైభవ చిహ్నమైన మగ్గం ఎక్కడా కనిపించదు. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా నేడు కంప్యూటర్ సాయంతో ఎయిర్‌జెట్ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఆంధ్ర, తెలంగాణల్లో పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి, తొగట, జాండ్ర వంటి కులాల వారు ఇప్పటికీ చేనేతపై ఉపాధి పొందుతున్నారు. ఒక నేత కార్మికుడు వృత్తి చేస్తుంటే అతనితోపాటు మరో నలుగురు ఉపాధి పొందుతారు.
చేనేతతో తయారయ్యే పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్ చీరలకు చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, వెంకటగిరి, మాధవరం, గద్వాల, సిద్దిపేట, పోచంపల్లి, నారాయణపేట మొదలైన ప్రాంతాలు నేటికీ ప్రసిద్ధి. పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతం ఒక్కో చేనేత వస్త్రం వల్ల ప్రసిద్ధి పొందాయి. కానీ, చేనేత రంగ వర్తమాన పరిస్థితి చూస్తే చాలా బాధకరంగా ఉంది. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెంచేందుకు 2015 నుంచి ఏటా ‘జాతీయ చేనేత దినోత్సవం’ జరుపుతున్నారు. 1905లో కోల్‌కత టౌన్‌హాలులో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో మొత్తం వస్త్ర ఉత్పత్తిలో చేనేత రంగం వాటా 15 శాతంగా ఉంది. ఒకప్పుడు ఇది 25 శాతానికి పైగా వుండేది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత రంగంలో విశిష్ట కృషి చేసిన 20 మందికి జాతీయ అవార్డులు, 20 మందికి సర్ట్ఫికెట్లను కేంద్ర ప్రభుత్వం ఏటా చేనేత దినోత్సవం రోజున బహుకరిస్తోంది. ‘దేశం కోసం చేనేత, ఫ్యాషన్ కోసం చేనేత’ అనే నినాదాన్ని వినిపిస్తున్నారు.
రుణమాఫీ, పింఛన్లు మాత్రమే కాక చేనేత మనుగడకు అ మలు చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. చేనేత రంగం ప్రగతి కోసం వేసే కమిటీల్లో సంబంధిత రంగానికి చెందిన నిపుణులు, ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించటం అత్యవసరం. నేత కార్మికుల సంక్షేమం కోసం ఏ కమిటీ వేసినా ఫలితం పవర్ లూంల సంక్షేమానికే దక్కుతోంది. గతంలో చేనేత కోసం వేసిన కమిటీలను పక్కను పెడితే, 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రొ. ఎస్.ఆర్.సత్యం కమిటీ చేనేతను భూస్థాపితం చేసే సిఫార్సులు చేసింది. నేతన్నలందరూ మగ్గం గుంటలు వదిలి పవర్‌లూంలకు మారితే ప్రపంచ స్థాయికి ఎదుగుతారని ఆ కమిటీ తన అభిప్రాయాన్ని కేంద్రానికి నివేదించింది. అయితే, నేత కార్మికులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగటంతో ఆ సిఫార్సులు బుట్టదాఖలు అయ్యాయి. పత్తి నుంచి నూలు వరకు, నూలు రంగులు అద్ది పడుగులు చేసి, మొలలు కట్టి, మగ్గాల మీద అందమైన చీర తయారయ్యే క్రమాన్ని, చేనేత స్వరూప స్వభావాలను శాస్ర్తియంగా తెలుసుకున్నవారే ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. ముడిసరుకు లభ్యత ఎలా ఉంది? మార్కెట్ ఏ విధంగా జరుగుతోంది? మజూరీలు సరిపోతున్నాయా? లేదా? వంటి అంశాలను అవగాహన చేసుకోకుండా అధికారులు చేటు తెస్తున్నారు. చేనేతపై పరిశోధనలు చేసే సంస్థలను, నాయకులను కమిటీల్లో వేయకుండా అధికారులతో నింపే కమిటీల వల్ల చేనేత రంగానికి, కార్మికుడికి న్యాయం జరగదు.
ఒకప్పుడు చీరాల, గుంతకల్లు, ఎమ్మిగనూరు, రాజమండ్రిల్లో సహకార రంగంలో నూలు మిల్లులు ఉండేవి. చీరాల, గుంతకల్లు నూలు మిల్లులకు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. వందలాది ఎకరాల భూములు ఈ మిల్లులకు ఉండేవి. నిపుణులకు బదులు ‘రాజకీయ నిరుద్యోగుల’కు యాజమాన్యం బాధ్యతలు అప్పజెప్పడంతో ఇవి ఖాయిలా పడ్డాయి. ఇతర పరిశ్రమల పునరుద్ధరణకు వందలాది కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వం నూలు మిల్లులపై నిర్లక్ష్యం చూపి ఆస్తుల విక్రయానికి పచ్చజెండా ఊపింది. అధునాతనమైన లక్ష స్పిండిల్స్‌తో ప్రభుత్వమే ఒక నూలు మిల్లు స్థాపించి దాని నిర్వహణ బాధ్యతలను ఆప్కో సంస్థకు అప్పజెబితే చిలపనూలు కొరత నేతన్నలకు తీరగలదు. సహకార రంగంలో నూలు మిల్లుల గత అనుభవాలను గుర్తు చేసి అధికారులు ప్రభుత్వ యత్నాలకు అడ్డం తగిలే ప్రమాదం కూడా ఉంది. ‘ఇంట్లో ఎలుకలు దూరాయని ఇంటిని తగలబెట్టుకోలేము’. అలాగే, అవకతవకలను సరిదిద్దే ప్రయత్నం చేయాలే తప్ప చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. నూలు మిల్లుల స్థాపన, చేనేతపై ఆధారపడిన గ్రామీణ యువతకు ఉన్నత విద్య, ఉపాధి శిక్షణ అందించేందుకు వెయ్యి కోట్ల మూలధనంతో ఆర్థిక సహాయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
నేడు చేనేత పరిశ్రమ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ముడిసరుకులు, నూలు, పట్టు ధరలు రోజుకో విధంగా పెరిగిపోతున్నాయి. చిలపనూలు మీద విధించిన 5 శాతం, తయారైన వస్త్రాలపై విధించిన 10 శాతం జిఎస్‌టి రద్దు కోసం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది. చేనేత రంగంపై విధించిన జి.ఎస్.టి. ఎత్తివేస్తేనే మనుగడ సాధ్యం అనే విషయంలో సందేహం లేదు. చాలా రంగాలకు సొంత విధానాలు ఉన్నట్లే చేనేతకు సంబంధించి కూడా ఒక సొంత విధానం ఉంది. అది చేనేత రిజర్వేషన్లు అమలు జరపాలని, మొదటగా చేనేతకు 22 రకాలు రిజర్వేషన్ చేసి తర్వాత 11 రకాలకు కుదించారు. ఈ చట్టం అమలు జరిగినా చేనేత రంగం కొంత కోలుకుంటుంది.
అమలు చేయాల్సిన అంశాలు...
* వాస్తవిక బడ్జెటరీ కేటాయింపుల తగ్గుదల ధోరణిని తక్షణమే తిరగదోడాలి. జౌళిరంగ కేటాయింపులలో చేనేతకు 1990వ దశకం చివరిలో లభించిన విధంగా- 25 శాతం కంటే ఎక్కువ తన వాటాగా రావాల్సి ఉంది. (ప్రస్తుతం ఇస్తున్న 5 శాతం కాదు)
* పత్తి, పట్టుదారంలో విధాన పరమైన జోక్యం ద్వారా చేనేత కార్మికులకు తక్షణమే ధరల్లో రాయితీలు కల్పించాలి. నూలు ధరలలో ఆటుపోట్లను భరించేలా ప్రతి రాష్ట్రం నిర్దిష్టమైన అవసరాల కనుగుణంగా ఆరుమాసాలకు సరిపోయే (బఫర్‌స్టాక్) నూలును ఎన్.హెచ్.డి.సి. వద్ద నిల్వ ఉంచుకోవాలి.
* చిలపనూలు బాధ్యతలను కచ్చితంగా అమలు పరచాలి. ఇతరులతోపాటు చేనేత కార్మిక సంఘాల నుండి ప్రతినిధులతో నూలు సలహా బోర్డును ఏర్పాటుచేయాలి.
* తక్షణమే అమలులోకి వచ్చే విధంగా- చైనా నుండి పట్టుదారం దిగుమతులను క్రమబద్దీకరించాలి. ఈ చర్య- ‘్భరించగలిగే ధరల’పై పట్టుదారం లభ్యతను మెరుగుపరుస్తుంది.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేనేత కార్మికులకు పనిచేసే ప్రదేశంతో పాటు వసతి కల్పన (వర్క్ షెడ్, నివాసం కలిపి) పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ఇలా కల్పించే ప్రతి యూనిట్‌కు కనీసం రెండున్నర లక్షల రూపాయలు గ్రాంటుగా అందజేయాలి.
* రూ.10 వేల కోట్లతో చేనేత బ్యాంకు ఏర్పాటు చేయాలి. 1975లో ప్రభుత్వం నియమించిన అవధానం కమిటీ చేనేత బ్యాంకు ఏర్పాటుకు చేసిన సిఫార్సులు నేటికీ అమలు జరగలేదు.
ఎనె్నన్నో ప్రతికూలతలున్నప్పటికీ, ఈ పరిశ్రమ ఇంకా మనగలుగుతున్నదంటే దానికి ప్రజాదరణ మాత్రమే ఏకైక కారణం. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు, పురుషులు నేత వస్త్రాలంటే ఆసక్తి చూపుతున్నారు. చీరలు, పంచలు, కండువాలు, ఇతర నేత దుస్తులకు ఇంకా గిరాకీ ఉంది. స్పిన్నింగ్ మిల్లులు, చేనేత పరిశ్రమ ఒకదానికి మరొకటి దోహదపడుతూ మనగలుగుతాయి. చేనేత పరిశ్రమ ఇప్పటి వరకూ- మరమగ్గాలను, సరళీకరించిన విధాన వ్యవస్థను, మార్కెట్ అస్థిరతను, ప్రభుత్వ ఉదాసీనతను తట్టుకొని బతికి ఉందంటే దానికి తన తేరుకునే గుణమే కారణం. మార్కెటింగ్ సదుపాయాలు, ఆధునిక పరిజ్ఞానం, వినియోగదారుల డిమాండ్లను గుర్తించక పోవడం వంటి కారణాలతో చేనేత రంగం ఒడిదుడుకులకు లోనైంది. ఈ దుస్థితి నుంచి చేనేత కార్మిక కుటుంబాలను ఒడ్డున పడేయాలంటే ప్రభుత్వ మద్దతుతో దీనికి నూతన రూపం ఇవ్వటం అత్యవసరం.

-పోతుల సునీత, ఎమ్మెల్సీ