మెయన్ ఫీచర్

దోపిడీకి నిలయాలు.. తరగతి గదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది సిబిఎస్‌ఇకి అనుబంధంగా నడుస్తున్న ఓ పాఠశాల. సంబంధిత యాజమాన్యం, బోధించే ఉపాధ్యాయ వర్గం, చదివే విద్యార్థుల్లో అత్యధిక శాతం తెలుగు మాతృభాషను కలిగినవారే! తమ తమ ఇళ్ళల్లో దాదాపు అందరూ తెలుగే మాట్లాడుతారు. అయినా ప్రాథమిక స్థాయిలో తెలుగు ఊసే లేకుండా ఆ పాఠశాల ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతోంది. ద్వితీయ భాషగా కొన్ని పాఠశాలలు సెకండరీ స్థాయిలో పెట్టినా, సంబంధిత పీరియడ్‌లో తప్ప ఏ సందర్భంగా తెలుగు మాట్లాడినా అక్కడ నేరమే! చివరికి స్ట్ఫా రూంలో ఉపాధ్యాయుల మధ్య సంభాషణ బ్రోకెన్ ఇంగ్లీష్ కాగా, మిగతా అంతా గుసగుసలు, సైగలే! తెలుగులో మాట్లాడితే యాజమాన్యం దృష్టిలో, సహచర ఉపాధ్యాయుల దృష్టిలో, చివరికి పిల్లల దృష్టిలో ఎక్కడ చులకన అవుతామనే భయం!
సందడిగా ఉండాల్సిన పాఠశాల వాతావరణం, నిర్మానుష్యంగా, శ్మశాన వైరాగ్యంలా కనపడుతుంది. ‘స్పీచ్ ఈజ్ సిల్వర్, బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్’ అన్న ఆంగ్లసామెత ఈ పాఠశాలకు ఎంచక్కా వర్తిస్తుంది. నోరు విప్పి భావాల్ని వ్యక్తీకరించుకునే ప్రదేశంలో నోటిపై వేళ్ళు పెట్టించి నిశ్శబ్దాన్ని పాటించడంలో వాటికవే సాటి. వీటినే క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా కీర్తిస్తున్నాం. మాట్లాడే అవకాశమే లేని ఆ ప్రదేశాన్ని- పిల్లల దశ, దిశను నిర్దేశించే ప్రపంచంలా భావిస్తున్నాం. అందుకే ఉదయం బడి గంట కొట్టినపుడు భారంగా అడుగులు వేస్తూ తరగతి గదుల్లోకి పోయే పిల్లలు, సాయంత్రం బెల్లు కొట్టగానే పోయిన స్వాతంత్య్రం తిరిగి లభించినట్లుగా కేరింతలు కొడుతూ తూనిగల్లా, విల్లును వదిలిన బాణంలా బయటపడతారు.
ఇక బోధించే పుస్తకాల్ని చూస్తే పిల్లలు ఒకటో తరగతి చదువుతున్నారా? లేక డిగ్రీ చదువుతున్నారో అర్థం కాదు. ఆంగ్లం ప్రథమ భాషగా, (ప్రపంచమంతా ప్రథమ భాషగా మాతృభాషనే చదువుతారు) హిందీ ద్వితీయ భాషగా వుంటాయి తప్ప తెలుగు భాషను దరిదాపుల్లోకి రానీయని వ్యవహారం. పెట్టాలనుకుంటే 4, 5 తరగతి నుంచి తృతీయ భాషగా పెడతారు. ఇక్కడ సంస్కృతం పోటీగా వుండనే వుంటుంది. కొన్ని పాఠశాలలైతే ఫ్రెంచ్ లాంటి విదేశీ భాషల్ని పెట్టి తెలుగుకు తృతీయ స్థానాన్ని కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇలా తెలుగును తృణీకరించేవారంతా, ఆయా సందర్భాలలో తెలుగు ఔన్నత్యాన్ని గూర్చి లెక్చర్లు ఇస్తూనే ఉంటారు. ఇలా భాషకు తోడు గణితం, సైన్సు, సాంఘికాలతోపాటుగా కంప్యూటర్ యాప్స్ అని, ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌ని, వెరసి ఎనిమిదికి పైగా అంశాలు ప్రాథమిక స్థాయిలో బోధించడం జరుగుతున్నది. ఈ పుస్తకాలకు తోడు ప్రతి సబ్జెక్టుకు నోటుబుక్, వర్కుబుక్‌లుంటాయి. డ్రాయింగ్ బుక్‌లు, మిగతా వాటిని కలుపుకుంటే దాదాపు 20 దాకా వుంటాయి. కంపాక్స్ బాక్స్‌లు, మిగిలిన వాటిని కలుపుకుంటే దాదాపు 20 దాకా వుంటాయి. కంపాక్స్ బాక్స్‌లు, కలర్ పెన్సిళ్ళు, ఇతర సామగ్రి, బ్యాగు బరువుతో వెరసి 10-12 కిలోలుగా వుంటాయి. ఇది ఇరు భుజాలకు వేలాడుతుంటే, రెండు చేతుల్లో వాటర్ బాటిల్, టిఫిన్ బ్యాగులుండడం తెలిసిందే!
ఒకటో తరగతి పాఠ్యాంశాల్ని చూస్తే మనమంతా చదువులో ఎంతగా వెనకబడ్డామో అనిపిస్తుంది. ఇంగ్లీష్ పాఠ్యాంశాలుగా, నౌన్, ప్రొనౌన్‌తో పాటుగా ప్రిపోజిషన్, ఆర్టికల్స్ వుంటాయి. మల్టిపుల్ సెంటెన్స్‌లతో వాక్యాలుంటాయి. పాఠశాల విద్యలో మొత్తంగా 2500-3000 పదాలు, 250 స్ట్రక్చర్స్ (వకాబులరీ /స్ట్రక్చర్స్) చదివితే కావాల్సినంత ఆంగ్ల పరిజ్ఞానం వస్తుందని ఆంగ్ల బోధనా పద్ధతులు ఘోషిస్తుంటే, ఒకటో తరగతిలోనే దాదాపు 100 పదాల్ని, పదుల సంఖ్యలో స్ట్రక్చర్స్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎందుకో? ఈ పుస్తకాల్ని ప్రచురించే పబ్లిషర్స్‌కు, రాసే రచయితలకు తెలియదు. పైగా ఎన్‌సిఆర్‌టి గైడ్‌లైన్స్ ప్రకారం, ఎన్‌సిఎఫ్ ఫ్రేంవర్క్‌లో, సిసిఇ మోడల్‌లో పుస్తకాలు తయారుచేసినట్లు ‘ముందుమాట’లో రాసుకుంటారు. ఇక రచయితల పేర్లు పొడి పొడి అక్షరాలతో తప్ప, వారి ప్రావీణ్యతలేంటో కనపడవు. ఇలా ఇష్టం వచ్చిన విధంగా, ప్రైవేట్ పబ్లిషర్స్ తయారుచేసిన పుస్తకాల్ని కమీషన్లు మరిగిన పాఠశాల యాజమాన్యాలు పిల్లలపై రుద్ది లక్షలు సంపాదిస్తున్నాయి. పైగా ఏ ఒక్క పబ్లిషరో కాక, ఒక్కో పాఠ్యపుస్తకాన్ని ఒక్కో పబ్లిషర్స్ నుంచి కొనుగోలు చేసి, తల్లిందడ్రులకు వాటిని నేరుగా కొనకుండా చూడడంలో వీరు సిద్ధహస్తులే! గణితంలో చతుర్విద ప్రక్రియల నెపంతో మూడంకెల సంఖ్యలతో సంకలన, వ్యవకలన, గుణకార, భాగాహారాల్ని ఒకటో తరగతిలోనే ప్రవేశపెట్టి, పిల్లంతా ఐఐటిలకు సిద్ధమైపోతున్నట్లు భ్రమింపజేస్తే ‘బాగు బాగు’ అని తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. వీటితోపాటు పోలికలు, అంచనాలు, వ్యత్యాసాలు కల్గిన లెక్కలుంటాయి. ఇక సైన్సులో సజీవులు, నిర్జీవులంటూ భేదాలంటూ (బయాలజీ టీచర్లకే చాలా సందర్భాలలో తెలియని అంశాలు) పాఠాలుంటే, సాంఘిక శాస్త్రంలో మొత్తం గ్లోబునే పరిచయం చేసే పాఠాలుంటాయి. దిక్కులే తెలవని పిల్లలకు ధృవాల గూర్చి చెప్పి, తల్లిదండ్రుల్ని బురిడీ కొట్టిస్తారు. కర్కట, మకర రేఖలు ఏ డిగ్రీ అక్షాంశాల్లో వుంటాయో తెలియని ఉపాధ్యాయులే, పిల్లలపై ఈ భారాన్ని మోపుతారు.
ఇదే ఒకటో తరగతిలో ఇచ్చే ప్రాజెక్టుల్ని చూస్తే, మన పిల్లల్ని ఏ స్థాయి స్టాండర్డ్స్‌లో ఎదిగిస్తున్నారో తెలిసి చావదు. పిల్లల బూట్లతో వచ్చే అట్టపెట్టెలతో అక్వేరియాన్ని (దీనికి తెలుగు పదం లేదు), కంప్యూటర్‌ను, ఇండ్ల రకాల్ని, బస్సుని, పేకమేడల్ని లేదా ఇతర సంబంధిత వస్తువుల్ని ఇచ్చిన టైంలో తయారుచేయాలని పురమాయిస్తారు. అసలు ఒకటో తరగతి పిల్లలకు పై అంశాలు తెలుస్తాయా? అనేది ఆ పాఠశాలకు అనవసరం. ఎంత పెద్ద స్థాయిలో ప్రాజెక్టు ఇస్తే అంత స్టాండర్డ్ పాఠశాలగా పొగడబడుతుంది. తల్లిదండ్రులదీ అదే తీరు. తమ పిల్లల స్థాయికి తగ్గ ప్రాజెక్టా? కాదా? అని గాని, పిల్లలు ఎలా చెప్పారని గాని ఆలోచించకుండా, పిల్లల డైరీలో రాసిన ఇన్‌స్ట్రక్షన్‌కు అనుగుణంగా, మరబొమ్మల్లా వీటిని చేసి పెట్టడమో, చేతగాకపోతే నేర్పరులతో డబ్బులిచ్చి చేయించి పెట్టడం చేస్తారు. ఇలా తయారు చేయించిన వాటిని, తమ పాఠశాల పిల్లలే స్వయంగా చేసారని, ఎగ్జిబిషన్‌కు పెట్టి గొప్పని చాటుకోవడం పాఠశాలల వంతు. ఈ తాంత్రిక విద్యలన్నీ తెలిసినా, నోరు మెదపని తల్లిదండ్రులున్న వ్యవస్థ మనది. వీటినే లోకాస్ట్, నోకాస్ట్ ప్రాజెక్టులని గర్వంగా చెప్పుకుంటూ, సంవత్సరం పొడుగునా, పిల్లల్ని, పిల్లల పేరున తల్లిదండ్రుల్ని ఊపిరి పీల్చుకోకుండా రకరకాల ప్రాజెక్టుల్ని, ఇతర యాక్టివిటీస్‌ను ఇస్తూనే వుంటారు.
1, 2 తరగతులకు హోం వర్కే ఇవ్వద్దని, పుస్తకాల్ని కూడా తరగతి గదుల్లోనే పెట్టుకునే అవకాశం కల్గించాలని, ప్రాథమిక స్థాయిలో ఎలాంటి ప్రాజెక్టులివ్వద్దని, సెకండరీ స్థాయిలో ఇచ్చే ప్రాజెక్టులు కూడా కాస్ట్ లెస్‌గా వుండాలని సిబిఎస్‌ఇ ఇచ్చిన సూచనలు ఏ పాఠశాల కూడా పాటించిన దాఖలాలు లేవు. ఇచ్చిన సూచనల్ని పాఠశాలలు పాటిస్తున్నాయా? అని చూసే పర్యవేక్షణ లేదు. అంతా ప్రభుత్వాధీనం! మాయల ఫకీర్ ప్రాణం సప్త సముద్రాల ఆవల చిలుకలో వుందంటే సప్త సముద్రాలు దాటిన బాలవర్ది రాజులా పాఠశాల విద్యలో ఎన్ని సముద్రాలు దాటాలో, తాంత్రిక విద్యలు నేర్చుకోవాలో తెలియవు. ఇలా సంచీ నిండా పుస్తకాలు, వర్కు బుక్కులు, నోటు బుక్కులు, బ్యాగు ఖరీదుతో వెరసి రూ. ఐదు వేలంటే మనం ముక్కున వేలు వేసుకుంటే నామోషీనే! పిల్లల చదువుకై ఈ మాత్రం ఖర్చుచేయకుంటే ఎలా? అనే ప్రశ్న! ఇక ప్రాజెక్టులకు, ఔట్‌డోర్ టూర్స్‌కు, స్కూలు డేకు, గేమ్స్ డేకు, ఇతర అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలకు ప్రతి విద్యార్థిపై పెట్టే ఖర్చు సంవత్సరానికి పదివేలు దాటుతుందంటే నమ్మశక్యం కాదు. కట్టే ఫీజులకు అదనంగా తల్లిదండ్రులు సిద్ధపడుతూనే, ఈ ‘విలువైన’ పాఠశాలల్ని ఎంచుకోవాలి. లేదంటే అడ్మిషన్ దరిదాపుల్లోకి రావద్దంటారు. ఇప్పుడున్న ధరల ప్రకారం మామూలు పాఠశాలల్లో ఏటా ఫీజులు లక్ష, లక్షన్నర కాగా, పేరు మోసిన పాఠశాలల్లో రెండు లక్షలుంటున్నాయి. ఈ లెక్కన పది సంవత్సరాలకు 15-20 లక్షల రూపాయల్ని సాధారణ విద్యకు తల్లిదండ్రులచే ఖర్చుచేయించే దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. భారత్ అందునా ఇరు తెలుగు రాష్ట్రాలు తప్ప!
ఇక ‘స్కూల్ డే’ల తీరే వేరు. చిన్న పిల్లలచే వాంప్ డ్యాన్సుల్ని, మంద డ్యాన్సుల్ని చేయిస్తే, అందులో మన పిల్లల్ని గుర్తించి సెల్ఫీలు తీసుకోవడం తల్లిదండ్రులకు ఓ మరపురాని ఘట్టమే! విలువల్ని పెంచే ప్రదర్శనగాని, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే కథనాలు ఒక్కటీ కానరావు. వాస్తవికతకు, జీవితానికి సంబంధం లేకుండా, ఇంటితో సంబంధం లేని సంస్కృతితో, అవాస్తవాలతో, అబద్ధాలతో, అశాస్ర్తియతతో, లౌకికవాదమనే పదానికి అర్థమే తెలియకుండా మొత్తం పాఠశాల వ్యవహారం సాగుతూ వుంటుంది.
ఇలా ఆర్థికమైన దోపిడీ కాకుండా, పిల్లల్ని శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా దోపిడీకి గురిచేస్తూ పిల్లల్ని పిల్లలుగా ఎదగనీయకుండా, స్వతంత్రంగా ఆలోచించనీయకుండా, బానిస వర్గాన్ని తయారుచేయడమే పనిగా ఈ కార్పొరేట్ విద్య కొనసాగుతుంటే, నిరసించాల్సిన తల్లిదండ్రులు, పౌర సమాజం మిన్నకుంటున్నదంటే మనం మనంగా లేమన్నట్లే. ఇదే విద్యావిధానం అని మోసపోతున్నట్లే! ఈ మోసాన్ని గుర్తించి, ఈ తప్పుడు విధానాన్ని నిలదీయకపోతే, మన పిల్లల్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నట్లే! బురదలోనే కమలం వికసిస్తుంది. నీటిలోనే చేప ఈదులాడాలి. పిల్లి ‘మ్యావ్’ అనాల్సిందే! దేని రీతి దానిది. ఈ దశల్ని మారుస్తే, మారాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో.. మన పిల్లల పెంపకం అలాంటిదే! ఈ సందర్భంగానన్నా చలం రాసిన ‘పిల్లల పెంపకం’ పుస్తకాన్ని చదివితే కొంతన్నా మేలు జరుగుతుందేమో!
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162