మెయన్ ఫీచర్

ఇది ప్రజాస్వామ్య మహోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మాతృభూమికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించడంలో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యాన్ని పారద్రోలడంలో శతాబ్దాల చరిత్ర ఉంది, అలుపెరుగని పోరాటం ఉంది. భారత జాతి 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుంచి 1947లో ‘స్వాతంత్య్ర భానోదయం’ వరకు ఒకే శక్తిగా సంఘటితమైంది. కానీ, అఖండ భారతం ఇండియా, పాకిస్తాన్‌లుగా విభజనకు గురైంది. స్వాతంత్య్రం సిద్ధించాక గత ఏడు దశాబ్దల కాల గమనంలో శాంతి, అహింస, మిత్రత్వం, సుహృద్భావం విలసిల్లడానికి బదులుగా మన సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో ప్రమాదం పొంచి ఉంది. భారత స్వాతంత్య్ర పోరాటాలకు సారధ్యం వహించిన జాతినేతలు, ఉరికంబాలపై, తుపాకీ కాల్పులకు అమరులైన అసంఖ్యాక యువ విప్లవకారులు ఎవరూ- దేశ విభజన సృష్టించనున్న దుష్పరిణామాలను ఊహించలేదు. దాదాపు మూడు దశాబ్దాలు జాతిపిత గాంధీజీ నాయకత్వం, భగత్‌సింగ్ వంటి విప్లవ యువకులు, మన్యం సీమలో అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ తపస్విలు, ‘అజాద్ హింద్ ఫౌజ్’ దళపతి నేతాజీ సుభాష్‌చంద్ర బోస్.. ఇలా ఎందరెందరో నేతలు.. వారి సిద్ధాంత కార్యాచరణ విభిన్నమైనా మాతృభూమికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించాలన్న తపనలో జాతి మొత్తం ఏకతాటిపై నిలిచింది..
పీడితుల కన్నీటిని తుడిచే పాలనా వ్యవస్థను, అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు సంచరించగలిగే నైతిక విలువల సమాజాన్ని జాతిపిత గాంధీజీ ఆశించారు. స్వాతంత్య్రానంతరం అనివార్యమైన దేశ విభజన కారణంగా మతోన్మాదం తలెత్తింది. హిందూ, ముస్లింల మత కలహాలు గాంధీజీని కలచివేసాయి. అందుకే 1947 ఆగస్టు 15న ప్రథమ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొనలేదు. అసలు ఆయన ఆరోజున దేశ రాజధాని దిల్లీలోనే లేరు. మత విద్వేషాలను రూపుమాపే ప్రయత్నంలో కలకత్తా వీధులలో ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రానంతరం గాంధీజీ జీవించి వున్న అయిదు నెలల పదిహేనురోజుల్లోనూ మత సమైక్యత కోసం పరితపించారు. నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ముస్లిం పక్షపాతిగా ఆయనపై ముద్ర పడింది. 1948 జనవరి 30న ఓ మతోన్మాది తుపాకీ గుళ్లకు ఆయన బలి అయ్యారు.
ప్రజాస్వామ్య సోషలిజం లక్ష్యం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మేధాసంపన్నత, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ వంటి జాతినేతల మార్గదర్శకత్వంలో స్వతంత్ర భారతదేశం ‘సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లక్’గా 1950 జనవరి 26న అవతరించింది. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో, పాలనలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ సేవలందించాక, ఆ తర్వాతి కాలంలో ఆయన కుటుంబ వారసత్వం కొనసాగింది. నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ, మనవడు రాజీవ్‌గాంధీ దేశ ప్రధానులుగా పనిచేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ కుటుంబ వారసత్వ ప్రభావం సుమారు నాలుగు దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను, కాం గ్రెస్ పార్టీని నడిపించింది.
1947-67 మధ్య రెండు దశాబ్దాల కాలంలో తలెత్తిన తిండి గింజల కొరత ఫలితంగా భారీ సాగునీటి పథకాలు, పంచవర్ష ప్రణాళికలు చేపట్టాక అధికోత్పత్తి, పారిశ్రామిక అభ్యున్నతికి బాటలు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన లౌకిక ప్రజాస్వామ్య సోషలిజం వ్యవస్థీకృతమైంది. 1885లో స్థాపించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్య్రానంతరం ‘్భరత జాతీయ అధికార స్వామ్య పార్టీ’గా స్థిరపడి ఇందిరాగాంధీ హయాంలో నియంతృత్వ పోకడలు విస్తరించడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1977లో సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యతతో ఆవిర్భవించిన జనతాపార్టీ- ఎమర్జెన్సీ చీకటిరోజుల తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా రాజ్యాధికారం చేపట్టినా అది మూన్నాళ్ల ముచ్చటగా చరిత్రలోకి నిష్క్రమించింది. డెబ్బై సంవత్సరాల కాలగమనంలో 40 కోట్ల నుంచి 127 కోట్లకు పెరిగిన దేశ జనాభాకు ఆహారం, నివాసం, ఉపాధి వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోషలిజం లక్ష్యంతో పురోగమిస్తునే- అవినీతి, అవిద్య, అజ్ఞానం లేని సమాజ నిర్మాణాన్ని అభిలషిస్తున్నాయి. మత ప్రాతిపదికన అనివార్యమైన అఖండ భారతావని విభజన దేశ ప్రజలను రెండు వర్గాలుగా విడదీసింది. ముస్లింల సర్వాధిపత్యంగా పాకిస్తాన్ ఎదిగింది. తొలి తరం జాతి నేతలు మాత్రం దేశాన్ని హిందూస్థాన్‌గా కాకుండా ఇండియన్ యూనియన్‌గా, భిన్నత్వంలో ఏకత్వం లక్ష్యంతో లౌకిక ప్రజాస్వామ్య దేశ ఆవిర్భావానికి పునాదులు వేసారు.
కొత్త రాజకీయ శక్తి
2022 నాటికి డెబ్బై అయిదవ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా, ప్రధాని మోదీ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో దేశంలోని అసంఖ్యాక పేద జనావళి జీవన సంక్షేమం, స్వమైక్యతా సురాగం, సుపరిపాలనకు మూడు ప్రధాన అంశాలుగా జాతి పురోగమించాలని నిర్దేశించారు. భారత జాతిని బ్రిటిష్ పాలనాధిపత్యం నుంచి విముక్తి చేసే స్వాతంత్రోద్యమ అంకుర పోరాట దశలో తొలితరం జాతి నేతలలో నాటి హిందూ మహాసభ అగ్రశ్రేణి మేధావుల, స్వరాష్టస్రాధన లక్ష్య చైతన్యం మిళితమై ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌లో లోకమాన్య బాలగంగాధర తిలక్, పండిత మదన మోహన మాలవ్యా, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, మున్షీ వంటి నేతలు హిందూ జాతి ఐక్యతను స్వాతంత్య్ర పోరాటానికి ఒక శక్తిగా జాగృతం చేయాలని కార్యాచరణ చేపట్టినవారే. హిందూ జాతీయ దృక్పథపు విలువలను గాంధీజీ సమర్ధించినా, క్రమేపీ హిందూ-ముస్లిం ఐక్యతా భావాన్ని ప్రబోధించారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ- నెహ్రూ-పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ మధ్య ఒప్పంద వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసారు. 1937 వరకు కాంగ్రెస్‌తో ఉన్న సయోధ్య, 1950 నాటికి పూర్తిగా తొలగిపోవడంతో ముఖర్జీ 1951లో జనసంఘ్‌ను స్థాపించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ పార్టీకి సైద్ధాంతిక భూమిక, సంస్థాగత పునాదులు నిర్మించారు. 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న జనసంఘ్ 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపుమేరకు జనతాలో విలీనమైంది. జనతాపార్టీ విచ్ఛిన్నం తర్వాత- 1980లో వాజపేయి, అద్వానీ, ఎంఎం జోషి, మల్హోత్రా, సికందర్ భక్త్, రామ్‌జెఠ్మలాని వంటి నేతల సారధ్యంలో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించింది. ఇపుడు ఆ పార్టీ కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తోంది. సుదీర్ఘ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సారధ్యం వహిస్తున్న యుపిఏకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదిగి ప్రస్తుత దేశాధికార బాధ్యత ప్రధాని మోదీ చేపట్టడం, 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య విజయం.

-జయసూర్య