మెయన్ ఫీచర్

కస్తూరి రంగన్ కమిటీకి లేఖలు రాయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిగిన పద్యాన్ని అప్పజెప్ప లేదని టీచర్ చావబాదగా వనపర్తి జిల్లా శేర్‌పల్లిలోని ఆనంద్ అనే మూడో తరగతి విద్యార్థి వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చావుబతుకులతో పోరాడుతున్నాడు. ఆనందంగా గడపాల్సిన ఈ విద్యార్థి జీవితానికి ఉపాధ్యాయుడు యమకింకరుడుగా మారితే, విద్యా విధానం యమపాశంగా మారింది. అయినా బండబారిన మన హృదయాలకు ఇదో బాధాకరమైన వార్త కాకపోవచ్చు! ఇదే రోజున నిజామాబాద్ పట్టణంలో పేకాట ఆడుతూ పట్టుబడిన గ్రూప్‌లో ఓ ఇన్స్‌పెక్టర్‌తో పాటుగా ముగ్గురు ఉపాధ్యాయులుండడం గమనార్హం!
పై రెండు కథనాలు పెద్ద వార్తగా నేటి సమాజానికి అనిపించకపోవచ్చు! పాఠశాలంటేనే యమశాలగా భావించే సమాజానికి తన్నడం, గుద్దడం, తిట్టడం అనివార్యం అనే ధోరణే! పైగా తరగతి గదిలోని ఉపాధ్యాయుడికిది ఓ హక్కుగా భావించేవారి సంఖ్య ఈ దేశంలో అధికమే! బోధించిన ప్రతీ అంశాన్ని నేర్చుకోవడం, కోరినప్పుడల్లా రికార్డింగ్ చేసిన యంత్రంలా అప్పజెప్పాలనే బాపతు జనాలకు, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు అప్పజెప్పాలని విద్యార్థి తిరిగి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం వుందా అనేది ఏనాటికి తేలని ప్రశ్ననే! శిక్షణ పొందిన ఉపాధ్యాయుడికి ఎలాంటి బోధనా సామర్థ్యాలు అబ్బాయో, ఎలాంటి విలువలు మొలకెత్తాయో పై ఉదాహరణలు చెప్పకనే చెపుతున్నాయి. భ్రష్టుపట్టిన మన విద్యా విధానానికి ఇవో రెండు మచ్చుతునకలని గుర్తించినా రేపటి తరం ఆరోగ్యంగా ఎదుగుతుంది. రేపటి భవిష్యత్ అంతా విద్యతోనే అనే ఓ ఊహాజనిత ఆలోచనతో విద్యార్థుల్ని ఎలా చంపుకుతింటున్నామో గత నాలుగు నెలలుగా ఇదే కాలంలో వివిధ వ్యాసాల ద్వారా వివరిస్తూ రాయడం, పాఠకుల స్పందన ఊహించినదానికన్నా ఎక్కువ మోతాదులో ఉండడం ఆహ్వానించదగ్గ విషయమే అయినా, ఇవన్నీ పోగుపడిన ఆలోచనలుగా మారి ఓ ఉద్యమ రూపం దాల్చకపోవడం బాధాకరం! పోతే, ఈమధ్యన గుంటూరు కేంద్రంగా భారతీయ విద్యాభవన్, హైదరాబాద్ కేంద్రంగా బివిఆర్‌ఎస్ పేరున ఓ తల్లిదండ్రుల సంఘం విద్యా రంగ దుస్థితి గూర్చి మాట్లాడడం ప్రారంభించింది. నూతన విద్యా విధానానికి సూచనల పేరున గుంటూరు సమావేశం జరిగితే, సమాన విద్య, సమాన అవకాశాలు అనే భావంతో బివిఆర్‌ఎస్ గత రెండు సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నది. ఇలాంటి చర్చలు అన్ని ప్రాంతాల్లో జరగాల్సిన ఆవశ్యకత వుంది. ఇక ప్రైవేట్ పాఠశాలల తల్లిదండ్రులది ఫీజుల్ని తగ్గించాలనే గోల తప్ప నిర్దిష్టమైన ఓ ఎజెండానే లేదు.
నిజానికి ఈ అంశాలన్నింటిని మీదేసుకొని పోరాటం చేయాల్సిన బాధ్యత వామపక్ష భావజాలంగల ఉపాధ్యాయ సంఘాలది, విద్యార్థి సంఘాలదే! కాని ఇవి ఏనాడో కాడిని దించేశాయి. ఇక విద్యారంగ మేధావులది అంటిముట్టని వ్యవహారం కాగా, బాలల హక్కుల సంఘాలది తరగతి గదివైపు కనె్నత్తి చూడని వ్యవహారమే! వీరికి బడి బయట కన్నా, బడే భద్రం వుందనే భావన! ఈ సందిగ్ధ కాలంలో పాలకులు తమ పనిని తాము చేసుకుంటూ ఏకంగా 7 దశాబ్దాలు గడిపేశారు. విద్యారంగానికి కావాల్సిన ప్రజాస్వామ్య, శాస్ర్తియ చికిత్స ఏనాడు చేయకపోగా అనేక అప్రజాస్వామిక చర్యల్ని పురికొల్పడంలో కృతకృత్యులైనారు. ఈ కోవలోనే తిరిగి డిటెన్షన్‌ను అమలుచేయాలని కోరడమే! ఓవైపు లక్షల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నా, డిఎస్సీ, టెట్ లాంటి దొంగాటతో ఉపాధ్యాయ ఖాళీలను నింపకపోవటం ఒకవైపు, పిల్లలు లేరంటూ పాఠశాలల్ని మూయడం మరోవైపు కొనసాగిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం 23(1), (2)ల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విధిగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని నియామకం చేయాలని హెచ్చరిక వున్నా ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే దాదాపు ఐదు లక్షలమంది శిక్షణ లేని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా విధిగా 2015 నాటికి శిక్షణ పొందాలని అదే సెక్షన్ సూచించినా, పట్టించుకోని ప్రభుత్వాలు, దీన్ని 2017 నాటికి, ఇప్పుడు 2019 నాటికి పొడిగించడం ప్రభుత్వ బాధ్యాతా రాహిత్యానికి చిహ్నం కాదా?
గత 7 దశాబ్దాలుగా విద్యా రంగంతో దాగుడుమూతలాడుతున్న ప్రభుత్వాలు ప్రపంచంలో మరెక్కడా కానరావు. యునెస్కో మరియు గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ప్రకారమే 2.9 మిలియన్ బడి ఈడు పిల్లలతో భారత్ నైజీరియా, పాక్ తర్వాత మూడో స్థానంలో వున్నట్లు తేలింది. నిజానికి ఈ సంఖ్య ఇంతకు మూడు నాలుగు రెట్లు వుంటుందనేది అనధికారిక లెక్కలు. ప్రపంచ వ్యాపితంగా దేశాలన్నీ ప్రభుత్వ రంగంలోనే సరాసరి 12 సం. నిర్బంధ ఉచిత విద్యనందిస్తే, భారత్ కేవలం 8 సం.లకే ఆపసోపాలు పడుతున్నది. ఏడు సంవత్సరాలు దాటినా అమలుకాని విద్యాహక్కు చట్టమే దీనికి ఉదాహరణ! ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా కేంద్ర విద్యా సలహా మండలి (సిఎబిఇ) విద్యారంగ సమస్యల విరుగుడు డిటెన్షన్‌తోనే సాధ్యమని సెలవివ్వడం సమస్యల్ని పెనంపైనుంచి పొయ్యిలో వేసినట్లే అవుతుంది.
ఈ విధంగా కేంద్ర మంత్రి మండలి, సలహా మండలి విద్యారంగంలో చేయకూడని పనుల్ని చేస్తూనే, కంటితుడుపు చర్యలుగా కమిటీలు వేయడం ప్రారంభించింది. గతంలో ఏ ప్రభుత్వం వేయని విధంగా మోడీ ప్రభుత్వం సంవత్సరకాలంలో నూతన విద్యా విధానం అనే నినాదంతో రెండు కమిటీలను వేయడం వెనుక ఆంతర్యం తెలియడంలేదు. అందుతున్న చదువు కూడా దేశీయ అవసరాలకు కాకుండా, విదేశాలకు వలసలు వెళ్ళే విధంగా ఉండడం జరుగుతున్నది. వీరే 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తుచేసుకోవడం గమనార్హం! నిజంగా వీరంతా ‘క్విట్ పాలిటిక్స్’కు అర్హులు. మూడు శాతం విద్యా సెస్సు వసూలు చేస్తూ కూడా, బడ్జెట్‌లో విద్యారంగానికి నిధుల్ని తగ్గిస్తూ పోతున్నారు. 2013-14లో యుపిఎ హయాంలో బడ్జెట్‌లో 4.57 శాతం నిధుల్ని కేటాయిస్తే, 2016-17లో ఎన్‌డిఎ ప్రభుత్వం వీటిని 3.65 శాతానికి తగ్గించింది. జిడిపిలో యుపిఎ 0.63 శాతం ఖర్చు చేస్తే, ఎన్‌డిఎ కేవలం 0.47 శాతానికి కుదించింది. పేరుకు 2011-15 మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 9,448కి పెరిగినా, విద్యార్థుల సంఖ్య 1.13 కోట్లకు పడిపోవడం గమనార్హం. ఇదేకాలంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య 1.85 కోట్లకు పెరగడం కూడా గమనించాలి. పట్టింపు లేని విద్యా విధానంతో పిల్లలు ప్రాథమిక స్థాయిని కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల్లో 47 మిలియన్లు ఉచ్ఛతర స్థాయికి పోలేని దీనావస్థ!
విద్యారంగానికి పెడుతున్న ఖర్చులపై 2016లో ఆర్‌బిఐ జరిపిన సర్వేలో ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత బడ్జెట్‌ను తగ్గించినట్లు గుర్తించింది. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెరగడం గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 2000-01లో సరాసరి 13.3 శాతం బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయిస్తే, రాష్ట్రం విడిపడిన తర్వాత 2015-16లో 9.69 శాతాన్ని, 2016-17లో కేవలం 8.23 శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. దేశంలోనే ఇది అత్యల్పం కాగా అత్యధికంగా అస్సాం 20 శాతాన్ని కేటాయిస్తే, దేశ సరాసరి 16.4 శాతంగా వుంది. ఇదేకాలంలో ఆం.ప్ర. 16.2 శాతాన్ని ఖర్చు చేసింది. ఈ విధంగా విధానాలు గాని, బడ్జెట్ గణాంకాలు కాని ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడం ఒకటైతే, నిర్వహణపరంగా విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురౌతున్నది.
ఏ ప్రభుత్వమైనా విద్యారంగాన్ని రిపేర్ చేయదని, చేస్తున్నట్లు మాత్రం నటిస్తుందని గత అనుభవాలు తెలుపుతున్నాయి. కాబట్టి, ఈ రంగాన్ని బాగుచేసుకొనే బాధ్యతను పౌర సంస్థలు, తల్లిదండ్రుల సంఘాలు చేపట్టాల్సిందే! ఈ దిశగా దేశ వ్యాపితంగా చర్చలు జరిపి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాల్సిందే! లేదంటే ఈ కాస్త విద్య కూడా పిల్లలకు అందకుండా పోతుంది. ఇప్పటికే విద్యను అందించే బాధ్యతనుంచి తప్పించుకుంటున్న ప్రభుత్వం, పూర్తిగా ప్రైవేటుమయం చేస్తుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ఊపందుకున్నది తెలిసిందే. మెకాలే విద్యా విధానం కనీసం దేశీయ స్థాయి గుమాస్తాలనన్నా తయారుచేసింది. కాని నేటి విద్య పూర్తిగా విదేశీ బానిసల్ని తయారుచేస్తుంది. దీన్ని నిలువరించాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది. ఈ సందర్భంగా గత జూన్ నెలలో ఏర్పాటైన కస్తూరిరంగన్ కమిటీకి తగు సూచనల్ని పంపాల్సిన బాధ్యతల్ని పౌర సమాజం గుర్తించాలి. లేదంటే, ఆ కమిటీ అన్ని ప్రాంతాలనుంచి, వర్గాలనుంచి, సంస్థలనుంచి, మేధావులనుంచి సలహాల్ని, సూచనల్ని స్వీకరించామని, సేకరించామని వారిచ్చే నివేదిక పీఠికల్లో రాసుకొని అటు ప్రభుత్వాన్ని నమ్మిస్తుంది, ఇటు జనాలకు కుచ్చుటోపీ పెడుతుంది. కమిటీలు వస్తూ వుంటాయి, పోతూ వుంటాయి, మనకెందుకులే అని భావిస్తే, మన పిల్లలే మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందని తల్లిదండ్రులు ఈ సందర్భంగా గుర్తించాలి.
కాబట్టి ఈ కింద చూపిన డిమాండ్లను, మీ ఆవాస ప్రాంతాల్లో, పాఠశాల ప్రాంతాల్లో చర్చించండి. లేదా ఆలోచనాపరులతో చర్చకు పెట్టండి. ఇదో బాధ్యతగా గుర్తించండి. 1. విద్యారంగం విధిగా ప్రభుత్వ రంగంలోనే వుండాలి. అప్పుడే రాజ్యాంగబద్ధంగా విద్య అందరికీ సమానంగా అందుతుంది. 2. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థాయికి అతీతంగా దేశ పిల్లలందరికీ ఒక విధమైన, ఒకే స్థాయి విద్య అందాలి. రాజకీయ, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, ఉన్నతవర్గాల, సాధారణ ప్రజల పిల్లలందరూ ఒకే తరగతి గదిలో చదువుకోవాలి. అప్పుడే పిల్లల్లో నేర్పరితనం, సౌభ్రాతృత్వం, మానవీయ కోణం వికసిస్తుంది. 3. మొత్తం పాఠశాల విద్య అంతా మాతృభాషలోనే కొనసాగాలి. అన్ని దేశాల్లో ఇది అమలు జరుగుతుందని గుర్తించాలి. మన పిల్లలు మన అవసరానికేగాని, విదేశీయుల అవసరాలకు కాదని గుర్తించాలి. పైగా ఈ స్థాయిలోనే ఒక సబ్జెక్టుగా ఆంగ్లాన్ని అందిస్తే సరిపోతుంది. విషయ పరిజ్ఞానాన్ని కాదని, ఆంగ్ల పరిజ్ఞానమే మిన్న అనే తప్పుడు భావన మనల్ని పెంచుతుంది. మన పిల్లల్ని ఇతర దేశాలకు బానిసలుగా తయారుచేస్తుందని తెలుసుకోవాలి. 4. ఉమ్మడి జాబితాలో వున్న విద్యా రంగాన్ని విధిగా రాష్ట్ర జాబితాలోకి (1976కి ముందున్నట్లు) మార్చాలి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఫెడరల్ విధానాన్ని పెంపొందించి, రాష్ట్రాల బాధ్యతను పెంచుతుంది. 5. పుస్తకాల భారాన్ని తగ్గించాలి. 6. పాఠశాల పనివేళలను, పనిదినాలను శాస్ర్తియంగా నిర్ణయించాలి.
ఇలా ఆరు డిమాండ్లను ముందుకు తెచ్చి, కస్తూరి రంగన్ కమిటీకి నివేదికలుగా ఇవ్వాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు, పౌర సమాజం గుర్తించకపోతే, మన పిల్లలపట్ల మనమే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లే అవుతుంది. పిల్లల చదువుకై పడరాని పాట్లు పడుతున్న తల్లిదండ్రులు కనువిప్పు తెచ్చుకొని భవిష్యత్ తరాలకై విద్యారంగాన్ని సమూలంగా మార్చాల్సిన బాధ్యతల్ని మీదేసుకోవాల్సిందే! ఇక పాఠ్యంశాల రూపకల్పన, పరీక్షల విధానం, చదువుతోపాటు వుండాల్సిన ఇతర కృత్యాలు, ఉపాధ్యాయ శిక్షణ గూర్చి ఇందులో ప్రస్తావించడంలేదు. ఓపిక వుంటే, మీ మీ ఆవాస ప్రాంతాల్లో, పాఠశాల అనుబంధ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా తల్లిదండ్రుల సంఘాల్ని ఏర్పాటుచేసుకోవాలి. కుల, మత, వర్గ, వృత్తిసంఘాల ఏర్పాటుకు చూపే శ్రద్ధను, పిల్లల విద్యాపరమైన అంశాల్ని చర్చించే సంఘం కోసం ఆలోచించడం లేదంటేనే, మనమెంత స్వార్థపరులమో తెలుస్తున్నది. ఈ జాడ్యాన్ని విడనాడాల్సిన అవసరం వుంది. మీ పిల్లల భవిష్యత్తును కార్పొరేటు చేతుల్లో పెట్టి బలిచేయడం ఓ నేరపూరిత ఆలోచన అని గుర్తిస్తే విధిగా మీరు స్పందించగలరు. ప్రభుత్వాన్ని నిలదీయగలరు. పాఠశాలల బాగుకై పోరాడగలరు. అందరికి ఒకే రకమైన విద్యను మనం చెల్లిస్తున్న పన్నులనుంచే పొందగలరు. ఓ రాజకీయ నాయకుడు (ప్రజాప్రతినిధి) చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉప ఎన్నికల్ని నిర్వహించి వ్యక్తిని భర్తీచేసే వ్యవస్థలో ఏండ్ల తరబడి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా నడుస్తుంటే చూస్తున్నామంటే, మనం రాజకీయ నాయకులకన్నా పెద్ద నేరస్థులం కాదా..?

- డా. జి.లచ్చయ్య, సెల్: 94401 16162