మెయన్ ఫీచర్

జనంలో మార్పు రాదు.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారంలో ముగిసిన నంద్యాల ఉప ఎన్నికలో నిర్మొహమాటంగా చేయి చాచిన జనం అవినీతి, రెండురోజుల క్రితం దేశాన్ని కుదిపివేసిన డేరా బాబా అనుచరుల అరాచకం చూసిన తర్వాత మెడమీద తల ఉన్న వారికెవరికైనా వచ్చే ఆవేదనే ఇది! ఈ రెండు ఘటనల్లో ఒకటి జనం అవినీతి, రెండోది వారి అరాచక మనస్తత్వం ఆవిష్కృతమయింది.
నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టిడిపిలోకి మారిన తర్వాత మృతి చెందిన సందర్భంలో జరిగిన ఉప ఎన్నిక అది. నిజానికి ఆ ఎన్నికలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఒరిగేదీలేదు. కాకపోతే అధికారపార్టీకి ఆ విజయం అతి ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షానికీ ముఖ్యమైనప్పటికీ అది అధికార టిడిపికే అవసరం. ఆ ఎన్నికలో టిడిపి ఓడిపోతే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఇప్పటినుంచే నీళ్లొదులుకోవలసిందే. వైసీపీ గెలవకపోతే ఇక జగన్ మరో చిరంజీవి అవుతారు. జగన్ సభలకు జనం విరగబడి వస్తారే తప్ప, అవి ఆయన పార్టీకి ఓట్లు రాల్చవన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి.
అందుకే రెండు పార్టీలు ఆ ఎన్నికను ప్రతిష్ఠగా తీసుకున్నాయి. ఇద్దరి అవసరాన్ని గమనించిన జనం తమ ఓటు రేటును పెంచుకున్న తీరు ఆశ్చర్యం కలిగించింది. ఉప ఎన్నిక తీరు పరిశీలించేందుకు మూడురోజులు అక్కడి గ్రామాలకు వెళ్లిన నాకు, వారి తీరు ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ యప్ప (వైసీపీ నేత)మాకు ఓటుకు వెయ్యి ఇచ్చినాడు. ఈ యప్ప (టిడిపి నేత) రెండువేలు లెక్క ఇస్తున్నాడంట. మరి మాకీ పొద్దు వరకూ ఇయ్యలేదు. ఈ పక్కనోళ్లకు రెండు వేలిచ్చి మాకియ్యలేదు. లెక్క ఇయ్యకపోతే మేమెందుకు ఓటేస్తాం? అయినా వాళ్ల ముల్లె మాకేమీ ఇయ్యడం లేదుగా? పైనుంచి లెక్క వచ్చా ఉంటే వీళ్లకేమైతాది? సూడాల. సాయంత్రానికి లెక్క వచ్చాదంటున్నారు. వచ్చేఏసాం. లెక్క అందకపోతే ఎందుకు ఏస్తామూ?’ అని ఓ గ్రామంలో కొంతమంది నిర్మొహమాటంగా చెప్పిన వైనం! మరి ఇద్దరూ డబ్బులిస్తే ఎవరికి ఓటేస్తారని అడిగితే.. ఆ తేడా ఏముండదు. ధర్మం ప్రకారం చెరో రెండు ఓట్లేస్తాం. అంత అన్యాయం చేస్తామా? అని ధర్మపన్నాలు కూడా వినాల్సివచ్చింది.
గతంలో రాజకీయ అవినీతి గురించి నేను ప్రస్తావించిన సందర్భంలో.. ప్రజలే అవినీతి పరులయ్యారు. వారికి ఎన్నికల్లో డబ్బులివ్వడానికే మేము అవినీతి చేయాల్సి వస్తోందని నాయకులు, మా ఓట్లతో గెలిచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నందుకే తాము డబ్బులు అడుగుతున్నామని జనం స్పష్టం చేస్తున్న పరిస్థిని ప్రస్తావిస్తే.. చాలామంది మిత్రులు, ప్రజలు అవినీతిపరులు ఎలా అవుతారని నాతో వాదించారు. నంద్యాల ఉప ఎన్నికలో అనేకమంది ఓటర్ల తీరును గమనించినప్పుడు నావాదనలో తప్పులేదనిపించింది. గతంలో చాలాచోట్ల అపార్టుమెంట్లు, పెద్ద భవంతుల్లో ఉన్న వాళ్లు కూడా డబ్బులు తీసుకున్న సందర్భాలున్నాయి. కొన్ని వందల గ్రామాల్లోనయితే డబ్బులిస్తేనే ఓటింగుకు వస్తామని భీష్మించిన వార్తలూ చూశాం.
తాజాగా నంద్యాల ఉప ఎన్నిక చూసిన తర్వాత ఓటుకు వెయ్యి, రెండువేలు తీసుకుంటున్న జనానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అవినీతిని వేలెత్తి చూపి, ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని విమర్శించే నైతిక అర్హత ఉందా అనిపిస్తుంది. తమకు రోడ్లు లేవని, కరెంటు లేదని, నీళ్లివ్వడం లేదని పాలకులను నిలదీసే అధికారం-అవకాశం ఎందుకు ఉంటుంది? డబ్బులిస్తేనే ఓటేస్తామని జనం భీష్మిస్తే, అదే డబ్బు సంపాదన కోసం రాజకీయ పార్టీలు అడ్డదారి తొక్కి, ఓటుకు నోటిస్తే అది కూడా క్విడ్ ప్రో కోనే కదా? ఇక ప్రజలే అవినీతిపరులుగా మారితే అడ్డదారులు తొక్కే పాలకులు, పార్టీలను నిలదీసేదెవరు? ఈ దౌర్భాగ్య పరిస్థితికి అందరూ కారణం కాకపోవచ్చు. నిజాయితీగా ఓటు వేసే వారూ లేకపోలేదు. కానీ వారి సంఖ్య తక్కువే!
ఎలాగూ జనాలకు డబ్బులివ్వాలి కాబట్టి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం ఉండదన్న భావన పార్టీలలోఏర్పడి, ఆ పార్టీలు అడ్డదారితొక్కితే దానికి బాధ్యత కచ్చితంగా ప్రజలదే అవుతుంది. సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి, వాటి ద్వారా జనం నుంచి ఓట్లు ఆశించే కన్నా, అదేదో ఎన్నికల్లోనే ఓటుకు ఐదు వేలో, పదివేలో ఇస్తే సరిపోతుందన్న ఆలోచనకు రాజకీయ పార్టీలు వస్తే, దాని ఫలితం అనుభవించేది కూడా తామేనన్న విషయాన్ని జనం గుర్తించకపోవడమే అవివేకం. ఓట్ల పండగ రోజు ఇచ్చే తాయిలాలకు ఆశపడి, పాలకులు-పార్టీలను నిలదీసే నైతిక అర్హత కోల్పోయే వారిపై ఎవరికి మాత్రం సానుభూతి ఉంటుంది?
* * *
తాజాగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని బస్తీలు మునిగిపోయాయి. నాలాలు, గతంలో చెరువులున్న ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. పండగరోజు ఆ దృశ్యాలు, బాధితుల రోదన టివి చానెళ్లలో చూసిన వారికి మాత్రం నిజంగా గుండె తరుక్కుపోయింది. ప్రభుత్వాలు వారికోసం ఏమీ చేయడం లేదని, ఏదో పైపై ప్రకటనలు, పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారనిపిస్తుంది. గతంలో కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లిలోని కొన్ని అపార్టుమెంట్లు సగానికిపైగా నీళ్లు నిలిచిపోయిన వైనాన్ని కూడా టివి చానెళ్లు పోటీ పడి చూపించడమే కాదు. ఆ ఘటనకు సర్కారుదే బాధ్యత అని స్క్రిప్టు చూసి చదివిన యాంకరమ్మలు, గొట్టం పట్టుకున్న రిపోర్టర్లూ తీర్పు కూడా ఇచ్చేశారు. ఇదంతా చూసే బయట జనాలకు నిజమేకామోసనిపిస్తుంది.
కానీ, నాలాలు-చెరువులు స్వేచ్ఛగా పై ప్రాంతాలకు వెళ్లడానికి ఉన్న స్థలాలను ఆక్రమించి అక్కడ ఇళ్లు కట్టుకున్నారని, అందుకే వరద నీరు ముందుకు వెళ్లలేక అక్కడున్న ప్రాంతాలను మింగేశాయని ఏ ఒక్క మీడియా కూడా రిపోర్టు చేస్తున్న పాపాన పోవడంలేదు. ఇక్కడ అధికారులు, పాలకులను సమర్థిస్తున్నాననుకుంటే పొరపాటు. జనాలిచ్చే డబ్బులకు ఆశపడి, చెరువులు-నాలాలను ఆక్రమించిన ఇళ్లకు రేషన్‌కార్డులు, కరెంటు మీటర్లు, ఇంటినెంబర్లు ఎడాపెడా ఇచ్చేసిన పాపంలో వారే అసలు ముద్దాయిలు. కానీ భవిష్యత్తులో రాబోయే ఇలాంటి గత్తరను గ్రహించి, అవి తమ జీవితాలనే కబళిస్తాయని తెలుసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి, ముంపు ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న జనాలదే తప్పున్నరతప్పు!
కామ్రేడ్లు చాలాకాలం ఏలిన విజయవాడ నగరంలో ఎతె్తైన కొండలపై శ్లాబులు వేసిన ఇళ్లు ఇంకా దర్శనమిస్తుంటాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఎంతోమంది చనిపోయిన సందర్భాలున్నాయి. ఇది అప్పటి వామపక్ష పార్టీల నిర్వాకం. మరి తప్పెవరిది? ముప్పని తెలిసినా అంతెత్తు కొండలపైన ఇళ్లు కట్టుకున్న వారిదా? వారి ఓట్ల కోసం కొండపైన ఇళ్లు వేయించిన పార్టీలదా? వాటిని చూస్తూ కూడా కళ్లప్పగించిన అధికారులదా అంటే అంతా దోషులే మరి! వీటి వెనుక ఉన్న అసలు కారణాలు అనే్వషించి, వాటిపై చర్చించకుండా, టిఆర్‌పి రేటింగు కోసం వెంపర్లాడి నిజాన్ని సమాధి చేస్తున్న మీడియా మిడిమిడి జ్ఞానం సమాజానికి మరింత చేటు తెస్తోంది. సామాజిక బాధ్యత మీద పేటెంట్ తీసుకున్న మీడియా దానిని ఆచరణలో చూపిస్తేనే విలువ, గౌరవమూను!
* * *
పండగ రోజు టివి చానళ్లలో ఆధ్మాతిక గురువు గుర్మిత్‌రామ్ రహీం అనుచరుల హింసాకాండ చూసిన వారికి జనంలో ఆ స్థాయి ఉన్మాదం ఉందా అన్న విస్మయం కలిగితీరుతుంది. ఇద్దరు సాధ్వీలను దారుణంగా అత్యాచారం చేసిన డేరా బాబాకు లక్షలమంది అభిమానులుండటమే ఆశ్చర్యం. కొంతమంది పేదలకు ఆయన ఇచ్చే సబ్సిడీ బియ్యం, చేస్తున్న సేవా కార్యక్రమాలే ఆయనను దేవుడిని చేశాయట. బాగుంది! చిన్నప్పుడు పెద్దలను కొట్టి పేదలకు పంచిన రాబిన్‌హుడ్ లాంటి వాళ్ల కథలు విన్నాం.
గుర్మిత్ కథ అందుకు భిన్నం. తన వద్ద శిష్యరికం చేసిన ఇద్దరు మహిళలను ఒక ప్రత్యేక నివాసంలో అత్యాచారం చేసిన కేసులో ఈ బాబా ముద్దాయి. సదరు స్వామి చేసిన అరాచకాన్ని సీబీఐ కోర్టు ఖరారు చేసింది. ఆయన నేరాన్ని ధృవీకరిస్తూ కోర్టు తీర్పు వెలువడిన తర్వాత జరిగిన మారణకాండ, స్వామిభక్తులు సాగించిన అరాచకాలకు 35 మంది అమాయకులు తలవాల్చారు. దాదాపు 200 రైళ్లు బాబా భక్తుల దెబ్బకు నిలిచిపోయాయి.
ఇద్దరు మహిళలను రేప్ చేసిన ఒక వ్యక్తిని జనం ఆ స్థాయిలో ఆరాధించడమే దారుణం! ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఎంతమందిని హత్య చేస్తే వాళ్లకు అంత క్రేజ్. టౌన్లలో ఎంతమందిని కొడితే వాడు హీరో కిందే లెక్క. వారిని అప్పట్లో సైకోఫ్యాన్సీ లక్షణాలున్న వాళ్లు ఆరాధించేవాళ్లు. ఇప్పుడది దాదాపు తగ్గిపోయింది.కానీ డేరా బాబా అభిమానులు పైశాచికానంద స్థాయి కూడా దాటి, ఇంకా ఎలాంటి పేరు పెట్టాలో తెలియని ఉన్మాదంలో ఊగుతున్నారనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే జనం పాత రాతియుగాన్ని కోరుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి బాబాలకు ప్రచారం కల్పిస్తున్న మీడియా కూడా దోషి కిందే లెక్క!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144