మెయన్ ఫీచర్

నినాదాలతో ‘రాజ్యాధికారం’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టి-మాస్’.. ఇది యూట్యూబ్ లాంటి ఏ సోషల్ మీడియానో, ఏ టెలివిజన్ చానల్ పేరో కాదు. ‘ప్రజా గాయకుడు’ గద్దర్ నాయకత్వంలో వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరు ‘టి-మాస్’. ఈ ఏడాది జూలై నెలలో హైదరాబాద్‌లోని ఎల్.బి.నగర్‌లో ఓ ఫంక్షన్ హాలులో దీని ఆవిర్భావాన్ని ఘనంగా ప్రకటించారు. ఈనెల 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో మరో సభను నిర్వహించారు. ఈ వేదిక బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కేలా పనిచేస్తుందని రెండు సభల్లోనూ నిర్వాహకులు నొక్కి చెప్పారు. ‘టి-మాస్’ ఒక రాజకీయ శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షను సైతం పలువురు వ్యక్తం చేశారు. అంటే భవిష్యత్తులో ‘టి-మాస్’ రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశాలున్నాయన్నమాట!
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (తెరాస) అధికారంలోకి వచ్చాక చాలామందిలో తామూ ఒక వేదికనో, పార్టీనో పెట్టి రాజ్యాధికారం చేపట్టాలనే భావన బలంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఇపుడు పురుడు పోసుకుంది. ఆ పార్టీలోనూ గద్దర్ క్రియాశీలకంగా కనిపిస్తారు. గత జూన్ నెలలో ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో కలిసి ఈ ‘ప్రజా గాయకుడు’ విస్తృతంగా చర్చించారు, పత్రికల వారితోనూ మాట్లాడారు. అప్పుడు కూడా బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కడానికి తమ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఓటు ద్వారా భావ విప్లవం తీసుకొస్తామని, ‘పల్లెపల్లెకు పాట, పార్లమెంట్‌కు- అసెంబ్లీకి బాట’ అనే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడతామని ఆయన గంభీరంగా వాగ్దానం చేశారు.
‘తెలంగాణ ఇంటి పార్టీ’ వేదికపై, ‘టి-మాస్’ వేదికపై దాదాపు ఒకే రకమైన అభిప్రాయాలను, ఆలోచనలను గద్దర్ వెలిబుచ్చారు. వాటి అంతఃస్సారం మాత్రం ‘రాజ్యాధికారం’. గత ఏప్రిల్ నెలలో తాను విప్లవ రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన ప్రకటించారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు, ఇతర సంఘాలు ఆయనను ఆహ్వానించాయి, స్వాగతించాయి, సన్మానించాయి.
ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ తమ ఉనికిని అతి కష్టం మీద కాపాడుకుంటున్న వామపక్షాలకు గద్దర్ దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగాయి. అలాగే ఆ పార్టీలు ఆయన పలుకుబడిని తమ విస్తృతికి ఉపయోగించుకోవాలని ఆశపడ్డాయి. అప్పటికే గద్దర్ కొమరెల్లి మల్లన్న ఇతర దేవుళ్లకు ముడుపులు చెల్లించి తన భవిష్యత్ ప్రస్థానం సజావుగా సాగేందుకు దీవెనలు పొందారు. ఇదంతా సమాంతరంగా కొనసాగుతూనే వుంది. తెలంగాణలో చెరువుల మరమ్మతులపై ఆసక్తిని కనబరిచి గ్రామీణుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కూడా ఆయన చేశాడు. తాజాగా ‘టి-మాస్’తో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందేలా పాటుపడతానని, పాట పాడుతానని ‘ప్రతిజ్ఞ’ చేశారు.
ఈ దేశంలో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రం అందరికీ ఉన్నందున ఎవరైనా రాజ్యాధికారం కోసం మాట్లాడవచ్చు, నినదించవచ్చు. ప్రయత్నమూ చేయవచ్చు. ఆ విధంగా మాట్లాడే, నినదించే, పిలుపునిచ్చే వ్యక్తి, వ్యక్తుల, శక్తుల విశ్వసనీయత (క్రెడిబిలిటీ) గత చరిత్ర (ట్రాక్ రికార్డ్) తదితర అంశాలు పరిగణనలోకి వస్తాయి, రావాలి కూడా. గద్దర్ కాని ఆయన మద్దతుదారులు కాని వాటి అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. అందుకే నెలకో వేదికపై వివిధ పార్టీల కార్యక్రమాల్లో ప్రసంగిస్తారు. వినోదపరమైన పాట- ఆట- మాటలతో పౌరుల్ని ఆకర్షించడానికి, మీడియాలో కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ గద్దర్ వామపక్షాలతో ఉన్నారా?.. తెలంగాణ ఇంటి పార్టీలో ఉన్నారా?.. దళిత వేదికలతో మమేకమవుతున్నారా? ‘టి-మాస్’లో ఉన్నారా? అన్న మీమాంస కలిగేలా ఆయన రాజకీయ ప్రకటనలు వినిపిస్తాయి. ఈ ధోరణి రాజకీయ విశ్వసనీయతను పెంచేది మాత్రం కాదు. రాజకీయాలు నడిపేవారికి, వౌలికంగా తెలియాల్సిన అంశమిది. తన ‘వాణి’ వినిపించడానికి అన్ని పార్టీలతో మమేకమై ఆయా పార్టీల ‘వౌత్ పీస్’గా ప్రసంగిస్తే, పాటలు పాడి, ఆట ఆడితే ‘ట్రాక్ రికార్డ్’ సవ్యంగా కొనసాగుతుందనుకోవడం శుద్ధ అమాయకత్వం లేదా అజ్ఞానమవుతుంది తప్ప ఆదర్శప్రాయం మాత్రం కాదు.
సరే.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎలా అందుతుందో..? అన్న విషయంపైనైనా చాలా స్పష్టత ఉండాలి. ఎవరికైనా రాజ్యాధికారం రెండు పద్ధతుల్లో లభిస్తుంది. ఒకటి ఆయుధ బలంతో పాలకులను కూలదోసి అధికారాన్ని కైవసం చేసుకోవడం. రష్యా, చైనా దేశాల్లో ఈవిధంగానే రాజ్యాధికారాన్ని ఒకప్పుడు చేపట్టారు. రెండవది- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ప్రజల మన్ననలు పొంది, వారి విశ్వాసాన్ని చూరగొని, కాలానుగుణమైన వ్యవహార శైలిలో నైపుణ్యం సాధించి అశేష ప్రజానీకానికి మేలు కలుగజేస్తామన్న నమ్మకాన్ని కల్పించి రాజ్యాధికారాన్ని చేపట్టడం. మన దేశంలో ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానం గత 70 ఏళ్ళుగా కొనసాగుతోంది. మరి కొన్ని దేశాల్లోనూ ఇలానే పాలన జరుగుతోంది. మొదటి పద్ధతిలో గద్దర్ తన సహచరులతో కలిసి పనిచేసి, చివరికి వారి ‘వెలి’కి గురై విఫలమయ్యారు. అంటే ఆ పద్ధతిని ఎంతో కొంత ఆచరణలో పెట్టి విఫలమయ్యారు. అలా విఫలమై, వైరాగ్యంతో కొంతకాలం గడిపి, అనేకానేక సమాజ సేవల పేర ఆరంభ శూరత్వం ప్రదర్శించి, గుళ్ళు గోపురాలను దర్శించి అంతిమంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథా ద్వారా అంటే- రెండవ పద్ధతిలో రాజ్యాధికారం సాధించడానికి ఆశపడుతున్నారు. గతంలోనూ ‘తెలంగాణ ప్రజాఫ్రంట్’ పేర ఓ ప్రయోగం చేసి విఫలమయ్యారు. అంటే రెండు పద్ధతుల్లోనూ ఆయన ఏదీ సాధించలేక పోయారు.
రెండవ పద్ధతిలో రాజ్యాధికారం సాధించాలంటే దానికి ఉండాల్సిన ప్రాథమిక హంగులు రాజకీయాలతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రధానంగా ఒక అజెండా కావాలి. జెండా కావాలి. రాజ్యాధికారమన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అజెండా ముఖ్యం. టి-మాస్ ముందుగాని, గద్దర్ ముందుగాని అది లేదని మనం కచ్చితంగా చెప్పొచ్చు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన తెరాస అధికారంలోకి రాగా- తామెందుకు అధికారంలోకి రాలేం? తెరాస పార్టీ కన్నా ముందునుంచి రాజకీయం చేస్తున్నాం, ప్రజలతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి రాజకీయాధికారం తమకు తప్పక దక్కాలి.. దక్కి తీరాలన్న కాంక్ష తప్ప సరైన కార్యాచరణ గద్దర్ వంటి వ్యక్తుల వద్ద లేదు. ప్రజల దగ్గరకెళ్లి ప్రస్తుత పరిస్థితులు వివరించడమే కార్యాచరణ అనుకోవడం, ఆటపాటలతో ఆకర్షించడమే అజెండా అనుకోవడం బోళాతనానికి నిదర్శనం తప్ప రాజకీయ చతురత అనిపించుకోదు. నైపుణ్యం, చతురత, ముందుచూపు, రాజకీయ అధ్యయనం, పరిస్థితుల విశే్లషణతోపాటు ప్రజల్ని ఏ అంశంపై కదిలించదలచుకున్నామన్న స్పష్టత నిరంతరం వెంటాడుతూ వుండాలి. కాని దురదృష్టవశాత్తూ అవేవీ ఆయనలో గాని ఆయన సహచరుల్లోగాని కనిపించవు. ఆ ‘స్పార్క్’ ఎక్కడో ఒకచోటనైనా కనిపించాలి. కాని ఏ కోశానా అది దర్శనమియ్యలేదు.
వామపక్ష రాజకీయాలు, విప్లవ రాజకీయాలు, ఆ భావజాలం, ఆ పంథా, ఆ ధోరణికి విలువ లేదని పరోక్షంగా తామే అంగీకరించి, ఆ పరిస్థితులు తమ చుట్టూ స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకుండా, తమకు పరిచయమైన ఆ పాత భావజాలం నీడలోనే, ఆటపాటల ద్వారానే రాజ్యాధికారం సాధించి పెడతామని నెలకో చోట ప్రసంగించి ప్రకటనలు చేస్తే తెలంగాణ ప్రజానీకానికి ఒరిగేది ఏమీ ఉండదు. హళ్ళికి హళ్ళి, సున్నాకు సున్నానే మిగులుతుంది. ఈ రకమైన ఆకాంక్షలతో, అపరిపక్వ మానసిక స్థితితో రాజ్యాధికార నినాదం ఇస్తూ తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ ఎన్నో వేదికలు, పార్టీలు ప్రజల ముందుకొచ్చి అనంతరం తోక ముడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఎంతో కొంత రాజకీయ చైతన్యం గలవారు గత దశాబ్దం, దశాబ్దంన్నర కాలంలో తెలంగాణ గడ్డపై అనేక పార్టీలను ప్రకటించారు. ఎన్నికల కమిషన్ దగ్గర వందల పార్టీలు ఇప్పటికే నమోదయ్యాయి. వీటి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నను కొత్తగా ఆవిర్భవించే వేదికలు, పార్టీలు వేసుకోవలసిన అవసరముంది. కాని దురదృష్టవశాత్తూ రాజ్యాధికారం యావ, ఆ మత్తు, ఆ ‘ఆరా’ చాలామందిని అటువైపు దృష్టి సారించకుండా చేస్తోంది. అందులో గద్దర్, ఆయన సహచరులూ కనిపిస్తారు. ఇది ఆహ్వానించే ప్రయత్నమా? అన్న ప్రశ్నకు కాదనే సమాధానం వస్తోంది!
ప్రపంచీకరణ అనంతరం, నాల్గవ పారిశ్రామిక విప్లవం అం తటా విస్తరిస్తున్న సమయాన, ఆటోమేషన్‌తోపాటు రోబోల వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రజల మానసిక చైతన్యం ఇంకా యాభై ఏళ్ళ క్రితం మాదిరే ఉంటుందని ఊహలు చేయడం కాలం చెల్లిన వైఖరి. ఈ వైఖరి గల గద్దర్ బృందం భవిష్యత్‌లో రాజ్యాధికారం చేపడుతుందని, ప్రధాన స్రవంతి రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్న కలను ఎవరూ కనడం లేదు. కొద్ది మంది ఆయన అభిమానులు తప్ప! ప్రజా సంఘాలు, చైతన్యంగల వ్యక్తులు- శక్తులు ప్రజల ‘సాధికారిత’ కోసం విశేషంగా కృషిచేయడంలో అర్థం ఉంది గాని అందని ద్రాక్ష కోసం ఆరాటపడటంలో- ‘రాజ్యాధికార పోరాటం’ ఇసుమంతైనా అర్థం కనిపించదు. దీన్ని గమనంలోకి తీసుకుంటేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదు కదా!

- వుప్పల నరసింహం సెల్: 99857 81799