మెయన్ ఫీచర్

రాజ్యాంగేతర శక్తులుగా బాబాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిప్పు పవిత్రమైందని అది చెడును దహించివేస్తుందని అనుకుని అజాగ్రత్తగా వుంటే- అది మనల్ని కూడా దహించివేస్తుంది. మతం కూడా నిప్పులాంటిదే! నియంత్రణ కరువైన మతం వ్యక్తుల్నే కాదు, యావత్ సమాజాన్ని నాశనం చేస్తుంది. మతం నేడు ఏ సామాజిక సమస్యకూ పరిష్కారం చూపకపోగా, మరిన్ని సమస్యల్ని సృష్టిస్తోంది. ‘మతం వ్యక్తిగతంగానే వుండాలి, రాజకీయం దాని దరి చేరరాదు’ అన్న గాంధీజీ మాటలు అక్షర సత్యాలే అయినా, వాటిని పట్టించుకున్న దాఖలాలు కానరావు. మతమే మానవాళి మనుగడకు కారణమని నమ్మేవాళ్ళు సమాజంలో అధికమే అయినా, వీరి అంతరాత్మ కూడా మతం ఓ మత్తుమందు అని ఘోషిస్తూనే వుంటుంది.
భూస్వామ్య భావజాలం బలంగాను, జన చైతన్యం తక్కువగాను ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో మత వ్ఢ్యౌం ఎలా వెర్రితలలు వేస్తుందో 2011లో వచ్చిన దేవుల్ (ఉ్జ్జజ) అనే చలన చిత్రాన్ని ఉదహరించవచ్చు! మహారాష్టల్రోని మరట్వాడా ప్రాంతంలో మంగ్యూల్ అనే గ్రామం కరవు కాటకాలకు నిలయం. కేశవ అనే వ్యక్తి తన పాడి ఆవును బోడగుట్టలపై మేపడానికి తీసుకెళ్లి, ఓ రోజు మేడిచెట్టు కింద కునుకు తీస్తాడు. కలత నిద్రలో ఆ చెట్టు కాండంలో దత్తాత్రేయుడు ఉన్నట్టు భ్రమించి ఇంటికి వెళ్లి తల్లికి, గ్రామపెద్ద బాహుకు, గ్రామ క్షేమాన్ని కోరే ‘అన్న’ అనే పెద్దమనిషికి చెపుతాడు. దారినపోయే దానయ్య ఆ కాండంపై రాయితో కొన్ని గీతలు ఆకతాయిగా గీస్తాడు. గ్రామమంతా కదిలి, ఆ గీతల్ని దత్తాత్రేయుడిగా భ్రమించి పూజలు చేస్తారు. గ్రామానికి తాగునీటి సౌకర్యం, హాస్పిటల్, ఓ మంచి పాఠశాలకై తపనపడే ‘అన్న’ బాహు సహాయంతో వాటిని సాధించాలని చూస్తాడు. కొందరు నిరుద్యోగ యువకులు గ్రామస్తుల బలహీనతల్ని సొమ్ముచేసుకోవాలని ఆలోచించి స్థానిక విలేఖరి సహకారంతో ఈ కథనాల్ని పతాక శీర్షిక మొదటి పేజీలో ప్రచురించేలా చేస్తారు. ఈ వార్త దావాలనంలా వ్యాపిస్తుంది. ఇదంతా ఓ గుడ్డి నమ్మకంగా భావించే బాహును తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఓ రాజకీయవేత్త సాయంతో ఒత్తిడి తెస్తారు. గుడి నిర్మించాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. దీంతో తాగునీరు, ఆస్పత్రి, పాఠశాల వంటి వౌలిక సౌకర్యాలు కార్యరూపం దాల్చకుండా పోతాయి. భారీ ప్రచారం ఫలితంగా గుడి నిర్మాణానికి దండిగా విరాళాలు వస్తాయి.
గుడి నిర్మించగా తిరునాళ్ళు జరుగుతాయి. అదో దివ్యక్షేత్రంగా మారడం, నిజాయితీగా బతికే గ్రామస్థులు సొమ్ముచేసుకోవడం మొదలౌతుంది. ఇదంతా ఓ అభివృద్ధే కదా అని ‘అన్న’తో ‘బాహు’ అనే మాటలు నేటి అభివృద్ధికి నమూనాలకు మచ్చుతునకలే! ఈ తతంగానికి ఆవు కూడా కారణమని భావించిన గ్రామ ఆలయ కమిటీ దాన్ని అలంకరించి గర్భగుడి ముందర ఉత్సవ విగ్రహంలా బంధిస్తారు. అది మేత లేక కుప్పకూలుతుంది. దీన్ని గుర్తించిన కేశవ్ చూడాలని ప్రయత్నిస్తే అదే యువత దాడి చేస్తుంది. ఈ మూర్ఖత్వానికంతా తానే కారణమని భావించిన కేశవ్ ఓ రాత్రి గుడిలోని విగ్రహాన్ని తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తాడు. తిరిగి బాహు నాయకత్వంలో గ్రామస్తులు మరో పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. ఈ తతంగానికి తట్టుకోలేని ‘అన్న’ గ్రామాన్ని వదిలిపోతాడు.
దాదాపు ఇలాంటి సంఘటనలు మనకు ఊరూరా కనపడతాయి. చైతన్యపూరితంగా వుండాల్సిన యువత గాడి తప్పితే, స్వార్థపూరిత రాజకీయాలు వారిని ఏ విధంగా నాడుకుంటాయో చూపడమే ఈ చిత్రం ఉద్దేశం. ఇలా మనుషులు చేసిన దేవుళ్లే కాదు, మనుషులే బాబాల, గురువుల, పీఠాధిపతుల, మఠాధిపతుల రూపాల్లో దేవుళ్లుగా మారి సమాజాన్ని శాసిస్తుంటే, నియంత్రించాల్సిన రాజ్యం అచేతనంగా మారిపోయింది. రాజకీయ శక్తులే ఇలాంటివారిని పెంచి పోషించడం జరుగుతోంది. నేతలే బాబాలకు ప్రచార సాధకులుగా మారుతున్నారు. రాజకీయ ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని విస్మరించి సంబంధిత ఆహార్యాల్ని ధరించి అధికారిక విధులకు నేతలు హాజరుకావడం చూస్తునే వున్నాం. ఏ కొందరో తప్ప, ఈ ముసుగులో ప్రజావ్యతిరేక చర్యలు, చట్ట వ్యతిరేక చర్యలు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రాజకీయ అండతో, దోపిడీ వర్గాల సహకారంతో ఎదిగిన ఈ బాపతు బాబాలను చేరదీసి జనాల్లోకి పంపించి, తమ గొప్పతనాల్ని ప్రచారం చేసుకోవడం చూస్తున్నాం. ఉన్నత స్థాయి అధికారులు, డాక్టర్లు, న్యాయాధీశులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు వీరికి శిష్యులుగా మారడం మరో విపరిణామం. రాజకీయ నేతల అండతో వందలాది ఎకరాల్ని ఆక్రమించి ఆశ్రమాల్ని నిర్మించడం, విదేశాల్లో కూడా వీరి అడ్డాలు ఏర్పడడం తెలిసిందే! పైగా విదేశీయులే ఫలానా వారి శిష్యులని గొప్పగా భావించే మనస్తత్వం మనది.
ఈ ఆశ్రమాల్లో రెండు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి- పైకి కనిపించే పూజలు, యజ్ఞాలు, ఉపదేశాలు, దర్శనాలుకాగా, మరొకటి- రహస్యంగా జరిగే అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యక్రమాలు. సుఖలాలస, ఖరీదైన ఆహారం, మద్యం, మత్తు పదార్థాలు మహిళా భక్తులను సైతం ప్రభావితం చేస్తాయి. ఆ వలలో చిక్కుకుని కొందరు మహిళలు అకృత్యాలకు గురవుతుంటారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారి కుటుంబ సభ్యులతోనే బెదిరించేలా చేస్తారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు బయటకు కనిపించకుండా కొందరు బాబాలు విద్యాలయాల్ని, వైద్యశాలల్ని నిర్వహించి జనాల్ని మచ్చిక చేసుకుంటారు. ప్రభుత్వం చేయాల్సిన ఈ బాధ్యతల్ని ఈ వర్గాలెందుకు నెత్తిన వేసుకుంటాయో మెదడున్న వారికి ఏనాడు బోధపడదు. బాధ్యతల్ని విస్మరించిన ప్రభుత్వాలు ఈ పీఠాలు సమాజ వికాసానికేనని భ్రమింపజేయడం, భూరి విరాళాలను ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటికి నిధుల్ని, భూముల్ని ఇవ్వకూడదన్న మద్రాస్ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల్ని ఏనాడూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా, రాష్టప్రతి నుంచి ముఖ్యమంత్రుల దాకా బాబాలకు అనుంగు శిష్యులుగా మారడం, క్రమం తప్పకుండా దర్శించుకోవడం, ఇలా చేయడం వారి వృత్తి ధర్మంగా భావించడం జరుగుతూనే వున్నది. ఇక కొందరు గవర్నర్లైతే వీరికి రాజపోషకులే!
బాబాలుగా అవతారాలెత్తినవారు సమాంతరపాలన సాగించడం ఒక ఎత్తు ఐతే, గతంలో సమాజ హితం కోరిన పెద్దల్ని అవతార పురుషులుగా భావించి వారికి దేవాలయాలు నిర్మించడం మరో రాజకీయంగా మారింది. వీరు జీవించిన కాలంలో మాతృభాష తప్ప మరో భాషను ఎరగని వారికి, ధూప, దీప నైవేద్యాలతో, సంస్కృత శ్లోకాలతో అర్చనలు చేయడం మనకెవరికీ ఆశ్చర్యం అనిపించదు. ఇదంతా వారి ఆలోచనలకు బ్రాహ్మణీకరణం చేసి మను సంస్కృతిని పులమడం తప్ప మరొకటి కాదు. ఒకనాడు ఓ వర్గానికే పరిమితంగా వున్న వీరిని, నేడు సర్వాంతర్యామిగా ఎదిగించడం ఓ రాజకీయ చతురతనే కాదు, ఈ నేపథ్యంలో దోపిడీ చేయడం, సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. వీరు ప్రవచించిన ఉపదేశాలు శాస్ర్తియంగా వుంటాయా? కాదా? అనేది పక్కనపెడితే, ఒకరు చెప్పినదాన్ని మరొక బాబా, అధిపతి, మతపెద్ద కాదంటాడు. ఈ వైరుధ్యాలెందుకో మనకు అర్థమై చావదు.
నిజానికి వీటన్నింటిని విద్యాలయాలు నియంత్రించాలి. రాజ్యం శాసించాలి. కాని ఈ దేశంలో ఇవి ఏనాడూ కానరావడం లేదు. సమాజం ఎదిగించుకున్న అత్యున్నత సాంఘిక సంస్థ ‘పాఠశాల’. సమాజాన్ని చైతన్యపూరితంగా మార్చాల్సిన పాఠశాలలే నేడు మతం ముసుగును ధరించాయి. ఉపాధ్యాయులదీ ఇదే స్థితి. చదివిన చదువు, పొందిన శిక్షణ ఏనాడూ తరగతి గదిలో పనిచేయవు. అత్యధికుల ఆలోచన దైవాధీనంగానే వుంటుంది. వీరే బాబాలకు, మత సంస్థలకు దగ్గరగా మసలుతారు. మనసా వాచా వాటిని వ్యక్తపరుస్తూ విద్యార్థుల్ని అటువైపే మరలుస్తారు. అమాయకమైన జనాలకు ఇలాంటివారే ఉత్తమ గురువులుగా తోస్తారు. విశ్వవిద్యాలయాలదీ ఇదే తీరు. శాస్ర్తియ పరిశోధనలకు కూడా అశాస్ర్తియ భావాల పుట్టతో ముసుగు వేస్తారు. అయితే, అక్కడక్కడా సమాజ బాగును కాంక్షించేవారు, ఎదిగించాలనే కోరుకునేవారు లేరని కాదు. కాని, వీరి సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడమే బాధాకరం! ఇలా ధైర్యంగా నిలబడినవారు దాడుల్ని ఎదుర్కోవడం కూడా జరుగుతున్నది. ఇలా దాడుల్ని చేసే వారిని ప్రభుత్వమే ప్రోత్సహించిన సంఘటనలు, కీర్తించిన సందర్భాలు అనేకం. ఈ వ్యవస్థలన్నీ ఓటు బ్యాంకు కేంద్రాలుగా విరాజిల్లడంతో ప్రజా సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధుల్ని దొంగబాబాలకు దారిమళ్లించడం జరుగుతున్నది. గుళ్ళు, గోపురాలు, మత సంస్థలు, ప్రార్థనా మందిరాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి. విద్యాలయాలు కూడా బాధ్యతల్ని, బోధనల్ని మరిచి సరస్వతి, జీసెస్, మేరీమాత తదితర విగ్రహాల్ని ప్రతిష్ఠించి యువతను గాడి తప్పిస్తున్నాయి. ఇందులో ఏది మంచో, ఏది చెడో విశే్లషించుకునే స్థాయి లేని సమాజం వీటినే అభివృద్ధి సూచికలుగా, చోదక శక్తులుగా భావిస్తున్నది. మరింతగా ప్రోత్సహిస్తున్నది. ఈ బలహీనతల్నే ఎజెండాగా మార్చుకొని నేతలు పాలన సాగిస్తున్నారు. దీంతో వ్యవస్థ ఎముకలగూడుగా మారిపోయింది. ఇది చికిత్సతో బాగుపడుతుందా? అనేది పెద్ద అనుమానమే! ఏం చేస్తే బాగుపడుతుందో పాలకులు, మేధావులు ఇకనైనా ఆలోచించాలి. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162