మెయన్ ఫీచర్

‘చైనా వస్తు బహిష్కరణ’కు తరుణమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ లేని బతుకు ఎంత దుర్భరమైనదో అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న వాళ్ళకు బాగా అనుభవానికి వస్తుంది. ఒకరి దయాదాక్షిణ్యాల వల్ల దొరికిన పంచభక్ష్య పరమాన్నాల కన్నా.. మన ఇంట్లో మన చేతులతో తయారుచేసుకుని తిన్న పచ్చడి మెతుకులైనా ఎంతటి రుచిని, సంతృప్తిని ఇస్తాయో స్వయంసేవ చేతనైన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఈ విషయాలు ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ నుంచి మొదలుకుని దేశ స్వాతంత్య్రం వరకూ వయో భేదం లేకుండా సర్వత్రా వర్తించేవే! ఒక వ్యక్తి కుటుంబ సభ్యులంతా తనతో కలిసిమెలిసి ప్రేమగా ఉండాలనీ.. తన మీద పెత్తనం, దాష్టీకం, ఆధిక్యభావం ఎవరూ చూపించకూడదని కోరుకుంటాడు. తన ఇంటి ఇరుగుపొరుగూ తనతో స్నేహభావంతో మెలగాలని ఆశిస్తాడు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకూ అడపాదడపా తన కంటికి కనిపిస్తూ.. గోడమీది నుంచో.. కిటికీ రెక్కలలోంచో.. గేటు పక్క నుంచో కలుస్తూ పలకరించే ఇరుగుపొరుగు ఆత్మీయంగా. పరస్పర సహాయ సహకారాలు అన్నట్టుగా ఉండాలని కోరుకుంటాడు. అలాకాక ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీదికి వాలితే గొడవలు పెట్టుకునే వాళ్ళు.. గోడ మీద నుంచి చెత్తాచెదారాన్ని ఇటు వైపు పోసేవాళ్ళు అయితే అది ‘నిత్య న్యూసెన్స్’ అన్నట్టుగా మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
మనుషుల మధ్య, ఇరుగుపొరుగు ఇళ్ళ మధ్యే కాదు- దేశాల మధ్య కూడా ఈ స్నేహాలు, ఇలాంటి ఆత్మీయ భావనలు ఉండితీరాలి. లేకుంటే దేశ పాలకులకు, దేశ ప్రజలకు ముఖ్యంగా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఈ సమస్య శాంతి సౌఖ్యాలు లేకుండా చేస్తుంది. మన దురదృష్టం కొద్దీ మన పొరుగు దేశాలయిన పాకిస్తాన్, చైనా నిత్యం మనకు దాయాదిపోరును తెచ్చిపెడుతూ అలాంటి పనే చేస్తున్నాయి. ఒకప్పుడు మన దేశంలోని భాగమే అయినా పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోయాక ‘కాశ్మీర్ మాది’ అని మనతో నిత్యం కలహం పెట్టుకుంటూ సైనికదాడులతో కాశ్మీర్ ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోంది. గ్రెనేడ్ దాడులు, తుపాకీ మోతలు, రాళ్ళ దాడులతో కాశ్మీర్‌ను ఎప్పటి నుంచో రావణకాష్టంలా మార్చేసింది. దీనికితోడు అడపా దడపా దేశం మీద పాక్ ప్రేరిత ఉగ్రవాదుల అమానుష దాడులు! అలాగే సరిహద్దు ప్రాంతాలైన డోక్లాం, లడఖ్ ప్రాంతంలోని మన భూ భాగంపైకి చైనా చొచ్చుకురావడం, మన సైన్యం మీద రాళ్ళు విసరడం, రోడ్లు, వంతెనలు నిర్మిస్తూ కవ్వింపు చర్యలకు పూనుకుంటూ యుద్ధ సంకేతాలను పంపిస్తున్నది. చైనా ఇలా మన భూభాగంలోకి చొరబడి తుపాకులతో యుద్ధం చేయటమే కాదు.. వ్యాపారం పేరుతో అక్కడ విస్తారంగా, విరివిగా తయారయ్యే నాసిరకం వస్తువులను మన దేశానికి దిగుమతి చేసి మన దేశ ప్రజల మెదళ్ళ మీద కూడా యుద్ధం చేయాలని పన్నాగాలు పన్నుతోంది. మన యువతను ఆకర్షించి, మన స్వదేశీ వస్తు ఉత్పత్తులను మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది. మన దేశంలోని సహజ సంపదను, మూలవనరులను దిగుమతి చేసుకుని వాళ్ళ ఖార్ఖానాల్లో వస్తువులుగా తయారుచేసి తిరిగి మనకే ఎగుమతి చేయడం చైనా అతితెలివికి నిదర్శనం. ఒక్క మన దేశంలోనే కాదు.. అమెరికా వంటి అనేక దేశాలలో ‘మేడ్ ఇన్ చైనా’ వస్తువులు విపరీతంగా ఎక్కడపడితే అక్కడ అన్నట్లుగా విస్తరించిపోయాయి. చైనాకు బుద్ధి చెప్పడం కోసమని మన ప్రభుత్వం చైనా వస్తువులకు ‘క్విట్ ఇండియా’ అని హెచ్చరికలు జారీచేయటమేగాక దేశ ప్రజలకు ‘మేక్ ఇండియా’ నినాదం ఇస్తూ మన వస్తువులను మనమే తయారుచేసుకనే ఏర్పాట్లకు పెద్ద ఎత్తున దేశవ్యాప్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. చైనా వస్తువులకు చెక్ పెట్టే ఉద్దేశంతో దిగుమతులను పూర్తిగా తగ్గించనున్నది కూడా!
మన ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి, మన విదేశీ రాయబారులు చైనా ఎత్తుగడల నుంచి భారత్‌ను రక్షించడం కోసం నిరంతరం కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మన వీరసైనికులు అవిరామంగా ప్రతికూల వాతావరణంలో సరిహద్దుల వద్ద పహారా కాస్తూ.. దేశం కోసం కుటుంబానికి, భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ మనను, మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మన పాలకుల వ్యూహాలు ఫలించాలన్నా, మన సైనికుల ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా ఉండాలన్నా ఈ దేశ పౌరులుగా మనమూ చేయాల్సింది ఎంతో ఉంది!
అందుకోసం మనం కొన్ని అలవాట్లను, ‘వ్యతిరేక ఆలోచనా విధానా’న్ని మార్చుకుంటూ, మనసంతా దేశభక్తి భావాలను నింపుకుని కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటూ భారతమాత సౌభాగ్యం కోసం, దేశ రక్షం కోసం ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. అదే - చైనా వస్తు బహిష్కరణ. ప్రతిజ్ఞ చేశాక దాన్ని కార్యాచరణలో పెడుతూ చైనా తిండిని, చైనా ఎలక్ట్రానిక్ వస్తువులను, ఇతర సామగ్రిని వాడకుండా స్వదేశీ సరుకులనే కొని, ఉపయోగించాల్సి ఉంది. దీనిని స్వాతంత్య్ర పోరాటం నాటి ‘సహాయ నిరాకరణ ఉద్యమం’లా ఇంటింటా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే చైనా వ్యాపార వ్యవస్థను మనం దెబ్బతీయగలుగుతాం.
చైనా ఫుడ్‌కు మనం, ముఖ్యంగా మన పిల్లలు ఎంతగా అలవాటుపడి పోయామంటే ఇంట్లో ఎవరి బర్త్‌డే వచ్చినా ‘చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్దాం’ అంటారు. ‘చైనీస్ ఫ్రయిడ్‌రైస్, నూడుల్స్, చికెన్ లావీపప్స్, మంచూరియా’ అంటూ అక్కడికి వెళ్ళాక ఆర్డర్ జారీ చేస్తారు. నిజానికి చైనీస్ ఫుడ్ తినటానికి ఇప్పుడు అందాకా ఎందుకు? గల్లీగల్లీలో, ప్రతిచోటా మోటా సెంటర్లలో రోడ్డుపక్కన ప్రతి నాలుగు చక్రాల తోపుడు బండి మీదా ఫాస్ట్ఫుడ్ చైనీస్ తిండ్లు వెలిసాయి. అందులో నాసిరకం నూనెలు, కల్తీ మసాలాలు, నాణ్యత లేని సాస్‌లు ఉపయోగించి నూడుల్సు, మంచూరియాలు వగైరా వగైరా తయారు చేస్తున్నారు. ఆ బండ్ల చుట్టూ మూగి పిల్లలు, యువకులు లొట్టలేసుకుంటూ చైనా వంటకాలు తింటున్నారు. ఈ విధంగా మన యువత ఆరోగ్యం మీద పరోక్షంగా దాడి చేసి వాళ్ళ శారీరక, మేధాశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు.
యువతీ యువకులకు స్మార్ట్ఫోన్లు అంటే మహా మోజు. అది చేతిలో ఉంటే ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉందని అనుకుంటారు. అందులోనూ అది విదేశీ సరుకు అయితే, కాస్త తక్కువ ధరకూ వస్తే సంబరపడిపోయి వెనకా, ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. చైనాలో తయారైన ఏ వస్తువు అయినా తక్కువ ధరకు వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ అవి నకిలీలని, నాసిరకంవని మాత్రం చాలామందికి తెలియదు. పైగా విదేశాల నుంచి వచ్చే సెల్‌ఫోన్లలో వాడే చిప్ వల్ల అసాంఘిక కార్యకలాపాలు, దేశ భద్రతకు సంబంధించిన రిస్కులు అక్కడక్కడా ఉంటాయన్న ఆలోచన, ముందుచూపు పిల్లలకు ఉండవు. గాడ్జెట్స్ మీద మోజు వాళ్ళను అంతదూరం ఆలోచించనివ్వదు. నాసిరకం ఫోన్లు కావడం వల్ల కొన్న కొద్దిరోజులకే అవి పాడవ్వడం, చార్జింగ్‌కు పెట్టినప్పుడు పేలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.
చైనా నుంచి భారత్‌కు దిగుమతి కాని వస్తువంటూ ఏదీ లేదు. మన వినాయకుని విగ్రహాలను, మన దేవతల బొమ్మలను, దీపావళి టపాకాయలను, దీపాలను అన్నీ వాళ్ళే తయారుచేసి మనకు ఎగుమతి చేస్తారు. ఆఖరుకు పతంగులను కూడా! దీపావళి మతాబుల్లో ప్రమాదకరం రసాయనాలను, పతంగం దారానికి వాడే మాంజాలో నాసిరకపు ప్రమాదకర పదార్ధాలను వాడుతున్నారన్న విషయం ఈ మధ్యనే బయటికి వచ్చింది. దాంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసి యువతను, వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. అయినా వాటి కొనుగోళ్ళు తగ్గలేదు...!
మన దేశం జనం సైకాలజీ ఏమిటంటే- నాణ్యత గురించి పట్టించుకోకుండా, ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఎక్కడైనా ఏ వస్తువైనా తక్కువ ధరకు వస్తుందంటే అక్కడికి పరుగులు తీస్తారు. ఫ్రీగా వస్తే మరీ సంతోషం. జియోఫోన్ కొంటే మూడు నెలలు కాల్స్ ఫ్రీ.. అనగానే లక్షల సంఖ్యలో యువకులు, పెద్దలు ఎగబడి ఆ ఫోన్లు కొనలేదూ! వ్యాపారం అంటే అందులో కొన్ని ఎత్తులు, వ్యూహాలు ఉంటాయని, లాభాపేక్ష లేకుండా ఏ వ్యాపారస్తుడూ వ్యాపారం చేయడన్న విషయం తెలిసీ, తెలియనట్లు ఒక మేనియాకు, క్రేజ్‌కు, మాస్ హిస్టీరియాలాంటి ఎక్జయిట్‌మెంట్‌కు గురికావడం మన యువతరానికి బాగా అలవాటైపోయింది. తిండి విషయంలోనూ అంతే.! మన ఇంట్లో శుచిగా, రుచిగా వండుకున్న పప్పులు, కూరలు, పచ్చళ్ళు, పులిహోరలు ఈ కాలం పిల్లలకు నచ్చవు.
బిర్యానీలు, పలావులు, మసాలా కూరలు, కుర్మాలు, వేపుళ్లు, పిజ్జాలు, బర్గర్లు అంటే ఇష్టపడతారు. ఫారెన్ ఫుడ్ అంటే చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఫీలైపోతారు. అమెరికా వారి పిజ్జాలకు, బర్గర్‌లకు ఉన్న క్రేజ్ మన పరాటాలకు, బొబ్బట్లకు, దిబ్బరొట్టెలకు లేదు. మన ఈ బలహీనత, ఈ విదేశీ మోజు కారణంగానే చైనా రెస్టారెంట్లు పుట్టగొడుగుల్లా వీధివీధినా వెలుస్తున్నాయి. చైనా ఉత్పత్తులు ప్రతి షాపులో వెలుస్తున్నాయి. మన దగ్గర అనే కాదు... చైనా వ్యాపార సామ్రాజ్యం అన్ని దేశాల్లోనూ ‘చైనా బజార్లు, చైనా రెస్టారెంట్ల’ పేరిట విచ్చలవిడిగా విస్తరించి మోసాలతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు సంపాదించుకుంటోంది. మన దగ్గర కూడా చైనాబజార్ లేని నగరం లేదు. అక్కడ ఏది కొన్నా చాలా చౌక. అందుకే జనం ఎగబడుతుంటారు. కాని మన్నిక గురించి మాత్రం ఆలోచించరు. మన దేశంలో సహజ సిద్ధ ముడిసరుకులతో చేసిన వస్తువులు మనకు నచ్చవు. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద మందులు, రసాయనాలు లేని పంట ధాన్యాలు అంటే మనకు గిట్టదు. కానీ ఇంపోర్టెడ్ అంటే మోజు... అదొక ‘స్టేటస్ సింబల్’ అయిపోయింది. అందుకే చైనాకు మనమంటే అలుసు.! ఈ దృక్పథం మన మనసుల్లో నుంచి తొలగిపోయిన నాడే భారత్ ఇతరదేశాల ముందు తలెత్తుకుని గర్వంగా నిలబడగలుగుతుంది.
‘మన దేశం, మన వస్తువులు, మనం తయారుచేసుకున్న సాత్త్విక ఆహారం’ అన్న ప్రేమ, గౌరవం మన మనస్సుల్లో మొలకెత్తిననాడే విదేశీయులు మన వైపు కనె్నత్తి చూడటానికి కూడా భయపడతారు. భారత్ శాంతి కాముక దేశం. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలిన చూస్తుందే గానీ శత్రుత్వంతో యుద్ధాలు చేయాలని చూడదు. మన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారం నాడే పొరుగు దేశాలకు ఆహ్వానం పంపి తన స్నేహశీలతను చాటుకున్నారు. ఎన్నో విదేశీ పర్యటనలు చేసి ‘అన్ని దేశాలూ శాంతియుతంగా, ప్రశాంతంగా కలిసి మెలిసి జీవించటంపట్ల ప్రజలకు మేలు జరుగుతుందనీ.. అభివృద్ధి సాధ్యమవుతుంద’నీ అంటూ స్నేహహస్తం చాచారు. చైనా కూడా తన దూకుడును, కుటిల ఎత్తుగడలను కట్టిపెట్టి మనతో చేయి కలిపేందుకు చొరవ చూపాలి.

-డా. కొఠారి వాణీ చలపతిరావు