ఎడిట్ పేజీ

మడులు, దడులకు వ్యతిరేకం కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివంగత కాళోజీ నారాయణరావు ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ను నేను గత పదిహేను సంవత్సరాలలో అనేకసార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ పదిమందీ తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో లేదో? తెలియదు. మొన్నీమధ్య ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్దమనిషి, తనకా పుస్తకం చదవాలని ఎనే్నళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది.. ఎందుకు? అందులోని విషయాలను కనీసం కొన్నైనా పంచుకోకూడదని. ‘ఇదీ నా గొడవ’లోని కొన్ని విషయాలు.. ఒక్కొక్కటే..
మడులు, దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు ఆయన. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య తెలుగు భాషమీద ఎలా గల్లంతు లేచింది, ఆయనపై ఎలాంటి కార్టూన్లు వచ్చిందీ తెలియచేస్తారు. ఒకరి భాష విషయంలో, యాస విషయంలో ఎగతాళి చేస్తే అతడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని అంటారు. ‘జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా మడులూ, దడులు కట్టుకోవడం, గీతలూ, గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తాను. మనం ఎప్పుడో ఒకప్పుడు బతుకుతెరువుకోసం ఎక్కడెక్కడికో పోతుంటం. ఎవరెవరితోనో వుంటూంటం. మనం అప్పుడు అక్కడ మందిలో ఒకరుగనే కలిసిమెలి వుండాలె. నేను వేరు, వారు వేరు అనేటి ఆలోచనలే తప్పు. కానీ బాగా చదువుకున్నోళ్లు, పెద్ద పెద్దోళ్లు కూడా ఇలాంటి ఆలోచనల్లోంచి అంత తేలిగ్గా బయటపడలేరు. తమకు అనుకూలమైన, తమకిష్టమైన మార్పు అయితే సంస్కారవంతమైనదనుకోవడం, తమకిష్టం కానిదైతే భ్రష్టమైనదనుకోవడం, చెడిపోయిందనుకోవడం తప్పు. తన విషయంలో, తన అలవాట్ల విషయంలో, తన చర్యల విషయంలో అయితే ఇంకో అభిప్రాయం మంచిది కాదు. నా ఇజం గేయంలో దీనే్న ఎండగట్టిన. భాష, సాహిత్యం, సంస్కృతి మనల్ని (తెలుగువాండ్లని) ఒకటిగనే వుంచెగద. నన్నయ్య మహాభారతం, పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి, అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి అన్నీ తెలుగు పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నాం, ఇప్పుడూ అనుకుంటాం. వాండ్లు వేరు, మనం వేరు అనే భావం తెలంగాణ వాండ్లకి ఎన్నడూ లేదు. కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే అనేటి భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు. కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు.. కృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్యభట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన తెలుగువాడేనని మేమనుకునేటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పదిమందికే ఇది పరిమితం’’.
‘‘మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణ, రాయలసీమ- రెండూ కూడా కలసి వుంటేనే అది తెలుగు రాష్టమ్రవుతది. మొదటినుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాలవాండ్లూ కలిసిగట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు తెలంగాణ వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద! ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణ) తెలుగుమీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య తెలుగు ఎంత చదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యాబిడ్డలతో గానీ, బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనే మాట్లాడిండు గద! అతని మాతృభాష (తెలుగు)లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్లాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పనిచేసినోడు ముఖ్యమంత్రి కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే.. రావిశాస్ర్తీ విశాఖ భాషని తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగు కాదనీ రాయలసీమవాడు- ఇట్లనుకుంటపోతె మన మధ్య సుహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్- ఆత్మీయత ఏముంటది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం..’’
హైదరాబాద్ రేడియోలో ‘బాలల కార్యక్రమం’లో తెలంగాణ పిల్లలు పాల్గొనే అవకాశం రాకపోవడాన్ని కాళోజీ విమర్శించారు. ఎలా కేవలం రెండు జిల్లాల భాషనే ఇతరులపై రుద్దే ప్రయత్నం జరిగిందో కూడా వివరిస్తారు. ‘మన విద్యాశాఖ వారు వాడుక భాషలో పాఠ్యపుస్తకాలు పెడ్తమన్నరు. అవి ఎవరి వాడుక భాషలో రాయిస్తరు? కృష్ణా, గుంటూరు జిల్లాల వాడుక భాష అయితే వరంగల్ పోరడు ఎట్ట చదువుతడు? దీనివల్ల తరతరాల ప్రజకి ఎంత ద్రోహం జరుగుతది. ఇవాళ పాఠ్యగ్రంథాలకి పరిమితమైన భాష రేపుప్రభుత్వ కచేరీలకు, కోర్టులకు కూడా పాకుతుంది. ప్రామాణికభాష అనో, శిష్ట వ్యావహారిక భాష అనో పేర్లు పెట్టి ఒక గ్రాంథికాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం. నువ్వేదైనా పేరు పెట్టు. నీ వాడుక భాషలో నువ్వు రాస్తే నీ జిల్లావాడికి సౌలభ్యం వుంటుంది. తక్కిన జిల్లాల వాండ్లు ఎనే్నళ్లు తపస్సు చేసినా నీ వ్యావహారికం, నీ యాస వాండ్లు రాయలేరు. ఇవాళ సినిమా భాష, పత్రికా భాష, టీవీల భాష ఎవరిది? రెండు జిల్లాల వాండ్లదే కదా? అన్నిట ఈ రెండు జిల్లాల వాండ్లే ముందుంటరు. తక్కిన జిల్లాల వాండ్లు ఏనాటికైనా ముందుకు రావడానికి వీల్లేదు. వారికి అడుగడుగునా అసౌకర్యం, అడుగడుగునా కష్టమే. మన తెలంగాణ వాండ్లు ఏం మాట్లాడరాదు. ఏవో లెక్కలు చూపిస్తరు.. హైదరాబాద్ రేడియోలో బాలల కార్యక్రమం వుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచీ ఈనాటి (1985) దాకా అంటే దాదాపు 30 ఏండ్ల పాటు బాలల కార్యక్రమాలు వందలు,వేలు జరిగి వుండాలె కదా.
వీటిల్లో తెలంగాణ పిల్లలు (ఆడ,మగ) ఎందరు పాల్గొన్నారు? ప్రతి ప్రోగ్రాంలో 15 మందో, 20 మందో పాల్గొంటే అందులో తెలంగాణ పిల్లగాండ్లేరి? వాండ్ల వాడుక భాష ఏది? వాండ్లు కనపడరు. వాండ్ల భాష వినిపడదు. బిరుదురాజు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడైనా బాలానందంలో పాల్గొన్నారా? వీండ్లంత పెద్ద పెద్దోండ్లు- వీండ్ల పిల్లలకే గతిలేకపోతే తక్కినోండ్ల పిల్లల గురించి చెప్పేటిదేముంటుంది? మాట్టాడాల్సిన పనే లేదు. ఎందుకంటే రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాస ఏదీ తెలంగాణాది కాదు..’’
సర్దార్ జమలాపురం కేశవరావుఅంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఎంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నపుడు జరిగిన సంఘటనను, ఆయన ఉదాత్తతను వివరించడంతోపాటు ఆయన ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మకథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఓడిన విషయం కూడా చెప్పారు. ‘నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నపుడు నిజాం మీద అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితోపాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చుపెరిగిపోయింది. నామీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష, ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్లనుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జెండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నామీద కేసు. నిజానికి నేను నిలబడ్డనెగాని వందనమైతే చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్‌ల వేసిన్రు. జమలాపురం కేశవరావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామారావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణరావు, సి.వెంకటరావు, అప్పి వెంకట రాజయ్య- ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతోపాటు నన్నూ పెట్టిన్రు. ఈ పదిహేను మందితోనె గడపాలె.. బాగా తినేటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునేటోండ్లం. అందరికంటె పెద్దవాడు, మొదటి నుంచీ ఉద్యమంలో వున్నవాడు. కష్టనష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవరావు. వల్లభభాయి పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పనిచేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్త పడివున్నపుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల పూడుస్తుంటే నువ్వు కూచున్నవ్? అని అడిగిన! ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నాననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ.. అని ఆయన అనగానే- ఈడ్చి చెంపమీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవరావు. అదీ ఆయన ఉదాత్తత’’.
‘కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొననందువల్ల కేశవరావు గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీకేమి లేదన్నా.. మొండి చేతుల అంగి మోకాలు దాకా నీ మొలగుడ్డతోటి తిరుగు కేశన్న!.. పల్లెబాటల బాధ ప్రజలతోబాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్ళు) బాగ గురుతన్నా!.. సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!.. దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా! జబ్బులేని ఒళ్ళు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా! కేశవరావుకి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరు శిష్యులుండేటోళ్ళు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణలో ఊరూరా తిరుగుతూ, ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. కేశవరావు ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునేటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకుని, బండలమీద పడుకుని, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు. ప్రహ్లాదునిది హరిభక్తి. వీండ్లది ప్రజాభక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషివల్లనే ఈ ప్రజా ఉద్యమాలు నడిచినై.. అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటివాళ్లే’’.
‘కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్‌లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్నచోట, తన సహచరులతోపాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ తాను కూడా చేసేటివాడన్నమాట. అతన్ని పెద్దన్నా అని పిల్చెటోన్ని.. 1952లో వరంగల్‌లో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్థన్నపేట నుంచి జమలాపురం కేశవరావు పోటీ చేసిండు- కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తికలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్టు అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు. వర్థన్నపేట బై ఎలక్షన్‌లో కేశవరావు మళ్లీ నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు.. కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిరలోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. కేశవరావు మంచి నడి వయసులోనే చచ్చిపోయిండు’’. .. ఇలా వుంటాయి కాళోజీ చమత్కారాలు.

-వనం జ్వాలా నరసింహారావు