ఎడిట్ పేజీ

బాలునికున్న జ్ఞానం మావోలకు లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో అమితుమి తేల్చుకోవడానికి భద్రతా బలగాలు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇటీవల సిఆర్‌పిఎఫ్, కోబ్రా, ఎస్‌టిఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా బీజాపూర్, సుకుమా జిల్లాల్లో ‘ప్రహార్’ పేర రెండు రోజుల ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మరణించినట్టు, ఐదుగురు గాయపడినట్టు ప్రత్యేక డిజిపీ అవస్థీ చెప్పారు. మావోయిస్టుల వైపుకూడా భారీ నష్టం జరిగి ఉంటుందని అయితే ఒకే ఒక శవాన్ని స్వాధీనం చేసుకోగలిగామని ఆయన తెలిపారు.
మావోయిస్టుల కంచుకోటగా భావిస్తున్న చింతగుఫా ప్రాంతంలో భారీ ఎత్తున దాడులు జరపడం, దాడిలో మావోల ఆయుధ కర్మాగారం ధ్వంసం కావడం, మావోలకు పెద్దఎత్తున నష్టం జరగడం చూస్తుంటే భద్రతా బలగాలు దృఢ చిత్తంతో ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తోంది.
గత మార్చి నెలలో సుకుమా జిల్లా బురకాపాల్ ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడి చేసి 12మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చిన అనంతరం మొత్తం దృశ్యం మారిపోయింది. మావోయస్టుల విముక్తి ప్రాంతంగా భావిస్తున్న అంజ్‌మాడి ప్రాంతానికి 72 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పలు దఫాలుగా మావోలు అడ్డుకున్నారు. గత మార్చిలోను, ఆ రోడ్డు నిర్మాణ పనులకు కాపలాగా ఉన్న సమయంలోనే జవాన్లను మావోయిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటన అనంతరమే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఇక ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పారు. ‘సమాధాన్’ పేర ఓ దిశానిర్దేశిత కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రకటించారు.
కేవలం ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను ఏరివేయడమే కాక లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. బుర్కాపాల్ ఘటన అనంతరం దాదాపు వందమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. బుర్కాపాల్ దాడిలో పాల్గొన్న కొందరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసారు. రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దండకారణ్యంలో మరిన్ని బలగాలను మోహరించి గాలింపు చర్యలను ముమ్మరం చేసారు. వర్షాకాలం కావడంతో మావోయిస్టులు గెరిల్లా దాడులు పెరిగి అవకాశాలున్నాయి. అంతకు ముందేవారిని కట్టడి చేయడం వారి కదలికలను నిరోధించడానికి గాను భద్రతాబలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 16 వేలమంది సుశిక్షితులైన కమాండోలతోపాటు లక్షమందిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. సంయుక్త దళాలతోకూడిన దాడులు, గాలింపు చర్యలను పెంచారు. హెలికాప్టర్ సేవలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. తాజా ఘటనలో వైమానిక దళానికి చెందిన ఎం-ఐ17 హెలికాప్టర్లలో గాయపడిన జవాన్లను చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఎంతో చాకచక్యంగా హెలికాప్టర్లను తీసుకువెళ్లి క్షతగాత్రులను తక్షణమే తరలించడంలో వైమానిక సిబ్బంది చూపిన ధైర్య సాహసాలను అందరు కొనియాడారు.
మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, గెరిల్లాలు ఇలా అనుత్పాదక రంగంపై శక్తి సామర్థ్యాలను, ఆర్థిక వనరులను ఖర్చు చేయడంవల్ల ఒరిగేది ఏమీ లేదు. మావోయిస్టులు కలగంటున్న మార్కెట్ రహిత వ్యవస్థ ఏర్పడే సూచనలు లేశమాత్రం కనిపించడంలేదు. సోషలిస్టు సమాజాన్ని తీర్చిదిద్దే అవకాశాలు అణువంత కూడా అగుపించడం లేదు. అయినా మావోలు రావణకాష్టం రాజేసి దశాబ్దాల పాటు వనరులను ధ్వంసం చేస్తున్నారు. నరమేధాలకు పాల్పడుతున్నారు.
చైనా దేశాన్ని ఆదర్శంగా తీసుకుని మావో ఆలోచనా విధానాన్ని ఇక్కడ ఆచరణలో పెడతామని ఆధునిక కాలంలో ఇంత రక్తాన్ని ఏరులై పారించడం అమానుషం. 70 సంవత్సరాల క్రితపు మావో ప్రవచనాలు ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో అన్వయమవుతుందనుకోవడం విడ్డూరం. ఈ ఏడు పదుల కాలంలో గంగా నదిలో ఎంత నీరు ప్రవహించిందో తెలుసుకోకపోవడం పూర్తిగా అజ్ఞానం.
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మార్కెట్ రహిత వ్యవస్థ పిండరూపాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రకటిస్తున్న సమయంలోనే చైనాలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకపోవడం దారుణం. చైనాలో ప్రపంచీకరణ పరాకాష్ఠకు చేరింది. మార్కెట్ ఎకానమీ మూడు కంప్యూటర్లు, ఆరు రోబోలుగా వర్ధిల్లుతోంది. గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అమెరికాను అధిగమించి అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇదంతా మావో సిద్ధాంతపరంగా, సూక్తుల పరంగా జరగడంలేదు. చైనా ప్రజలు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. సంపూర్ణంగా ప్రపంచీకరణను ఆలింగనం చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. ఆ రకంగా ఆ దేశ జిడిపి పెరుగుతోంది. ఈ ‘అభివృద్ధి నమూనా’ సరైనది కాదని మావోయిస్టులు దండకారణ్యంలో తమదైన, మావో ప్రవచించిన మార్కెట్ రహిత నమూనాతో జనతన సర్కారును బలోపేతం చేస్తున్నామంటున్నారు. మార్కెట్ ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో కొనసాగడంలేదు. చైనాలో జాక్‌మా (జాక్ అనేది ఆంగ్ల పేరు) ఈ-కామర్స్‌తో తన అలీబాబా డాట్‌కామ్ కంపెనీ ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు, అలాగే ప్రపంచంలోని పలు నగరాలకు విస్తరించాడు. ఇప్పుడు జాక్‌మా చైనాలోనే కాదు ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందాడు. భారతదేశంలోను ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై అమెరికాలో లక్ష ఉద్యోగాల కల్పనపై చర్చ చేసారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అన్ని రంగాల్లో అనూహ్యమైన విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భారతదేశ మావోయిస్టులు మావో కాలపు చైనా మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని ఆ కాలపు అభివృద్ధి నమూనాను ఆచరణలో పెడతామని నెత్తుటి ఏరులు పారించడం, వనరులను ధ్వంసం చేయడం సబబుగా ఉందా? ప్రపంచం ఓవైపువేగంగా పయనిస్తుంటే ప్రజలంతా అటువైపు నడుస్తుంటే...కాదు కాదు..దండకారణ్యంలోకి రమ్మని ఆహ్వానించడం అంత వివేకమైన చర్య కానే కాదు. ఇటీవల హైదరాబాద్‌లో బిగ్ డేటా, అనలిటిక్స్‌పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ మూలాలున్న కెనడాకు చెందిన 13 సంవత్సరాల తన్మయ్‌భక్తి కృత్రిమ మేథపై, రోబోల ఆవశ్యకతపై కంప్యూటర్ ప్రోగ్రామ్‌లపై చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. మావోలు చెప్పే మార్కెట్ రహిత వ్యవస్థకు, తన్మయ్ భక్తి కృత్రిమ మేథ తీసుకొస్తున్న విప్లవాన్ని గురించి ఇచ్చిన వివరణకు ఎంత తేడా ఉందో ఎవరైనా ఇట్లే ఊహించవచ్చు. 13 ఏళ్ల బాలుడు ప్రపంచ ఐటిరంగ నిపుణులను సైతం అబ్బురపరిచే జ్ఞానాన్ని ప్రదర్శించి మానవాళికి కృత్రిమ మేథ ఎలా ఉపయుక్తంగా వుంటుందో చేసిన జ్ఞానోదయం గొప్పదా? మావోలు దండకారణ్యంలో జనతన సర్కారు పేర రూపొందిస్తున్న కార్యక్రమం గొప్పదా?...అని ఎవరికి వారే ఊహించవచ్చు.
కృత్రిమ మేథ ఆధారంగా హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడు చైనాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని అందమైన పెళ్లి కూతుళ్ల రూపంలో వున్నాయి. జుట్టు, చేతులు, కాళ్లు.. ఇలా సుకుమారంగా వాటిని రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. వివిధ హోటళ్లలో అవి సేవలందిస్తున్నాయి. వివిధ ఉత్పత్తి రంగాల్లో, ప్రమాదకరమైన ప్రాంతాల్లో మనుషులకు బదులు రోబోలు చాలాకాలంనుంచి పనిచేస్తున్నాయి. ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ ఉత్పత్తి సంబంధాల్ని మావోయిస్టులు ఎలా విశే్లషిస్తారో?.. ఏరకంగా చూసినా మార్క్సిజం - మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతాలని జరిగిన, జరుగుతున్న అనేక పరిణామాలు, ప్రజాస్వామ్య మార్పులు చాటిచెబుతున్నా మావోయిస్టులు పట్టించుకోకుండా తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లని దశాబ్దాలుగా దబాయించడం దారుణాతిదారుణం. అన్ని పనులను నైపుణ్యంతో రోబోలు చేస్తున్న సందర్భంలో మావోల ప్రాపంచిక దృక్పథంలో మార్పు రాకపోవడం ఘోరం. ఆవిరి యంత్రాల కాలంనాటి జ్ఞానం, చైతన్యం, భావజాలం నాల్గవ పారిశ్రామిక విప్లవం పురివిప్పిన సమయంలోనూ ప్రాసంగికమని పేర్కొనడం అసంబద్ధం.. అజ్ఞానం. నేటి కాలానికి తగ్గ చైతన్యం, భావజాలం ప్రజల్లో వ్యాప్తి చేయడంలో అర్థం ఉంది కానీ రెండు వందల ఏళ్లనాటి భావజాలంతో జనతన సర్కారును నిర్మిస్తామని అడవిని ఎర్రబార్చడం చదవేస్తే ఉన్న మతి పోయిన చందంగా ఉంటుంది. ఇప్పటికైనా మావోయిస్టులు వారి మద్దతుదారుల్లో సానుభూతిపరుల్లో తన్మయ్‌భక్తి మాటలతో జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం!

చిత్రాలు.. తన్మయ్

-వుప్పల నరసింహం