మెయన్ ఫీచర్

ఆంగ్లేయుల కుట్ర విఫలమైన వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్‌వారు దేశం వదలి వెళ్లిపోవటంతో, అప్పటివరకు వారి సామంత రాజుగా కొనసాగిన తాను ఇక స్వతంత్ర రాజ్యాధిపతినని విర్రవీగిన నిజాం మెడవంచి, భారత్‌లో విలీనం కావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులను సృష్టించడంతో 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది. మతోన్మాదం సృష్టించిన తీవ్ర అరాచక పాలన నుండి ప్రజలు విముక్తులయ్యారు. అయితే ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్‌వారి కుట్రనుండి విముక్తిచేసిన రోజని గమనించాలి.
తప్పనిసరి పరిస్థితులలో, సైన్యం నుండి తిరుగుబాటు తథ్యమని గ్రహించి, దేశం వదలి వెళ్లవలసిన సమయంలో వెడుతూ వెడుతూ భారత్‌లో విభజన కుంపట్లను రగిల్చి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా పరోక్షంగా తమ ఆధిపత్యంలో కొనసాగే విధంగా బ్రిటిష్ పాలకులు ఏర్పర్చుకున్న బృహత్తర కుట్రని నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ అత్యంత ధైర్యసాహసాలు, రాజనీతి ప్రదర్శించి భగ్నం చేయగలిగారు.
1857లో వలే సైనికులు తిరుగుబాటుకు తలపెడితే తట్టుకోవడం కష్టమని గ్రహించిన బ్రిటిష్ పాలకులు దేశాన్ని రెండు ముక్కలుగా- భారత్, పాకిస్తాన్ అని విభజించడంతోపాటు, ఇక్కడ గల 500కు పైగా సంస్థానాలకు ఎవరికీ వారుగా అధికారం చెలాయిచే సౌలభ్యం కల్పించడం ద్వారా భారత్ ఒక దేశంగా కొనసాగలేని పరిస్థితులు కల్పించడానికి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే దేశం మధ్యలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నిజాంతో ప్రభుత్వం భారత్‌లో విలీనం సమస్య లేదని, స్వతంత్ర దేశంగా కొనసాగుతామని ప్రగల్భాలు పలికించారు.
వాస్తవానికి స్వాతంత్య్ర ఉద్యమం అంతా నాటి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న భూభాగం అంతా ఒక సమైక్య, స్వాతంత్య్ర దేశంగా అవతరించడం కోసం జరిగినదే. కానీ బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన భారత్ స్వాతంత్య్రం బిల్లులో పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పర్చడంతోపాటు ఇక్కడ ఉన్న సంస్థానాలు అన్నింటికీ ఏ దేశంతో అయినా విలీనం కావటానికి లేదా స్వతంత్రంగా ఉండడానికి సౌలభ్యం కల్పించడం అందరికీ విస్మయం కలిగించింది.
కేవలం భారతదేశ నాయకులను బ్లాక్‌మెయిల్ చేయడంకోసం ఈ ప్రమాదకర ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారని అప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు అందరూ విమర్శించారు. ఈ సంస్థానాలు అన్ని బ్రిటిష్ భారత్‌లో భాగంగానే ఉన్నాయి. అయితే చారిత్రక కారణాలతో- యుద్ధం లేదా దౌత్యంతో వాటిపై ఆధిపత్యం పొందినా, ఇప్పుడు దేశాన్ని వదలివెళ్లిపోతున్నందున వారి ఇష్టానికి వారి భవిష్యత్‌ను వదలివేస్తున్నట్లు బ్రిటిష్ పాలకులు ప్రకటించారు.
సంస్థానాధీశుల ఛాంబర్ చైర్మన్ ఒక పర్యాయం పమిర్ నుండి సిలోన్ వరకు, అరేబియా సముద్రం నుండి నేపాల్ వరకు ఒక విమానంపై వెడుతుంటే వచ్చే ప్రాంతం అంతా సుమారు 5 లక్షల చ.కిమీ భారతదేశం అని అభివర్ణించారు. చాలావరకు ఇక్కడ సంస్థానాధీశులు ఎప్పుడూ స్వతంత్ర పాలకులుగా లేనే లేరు. 1857 తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని సొంతం చేసుకున్న బ్రిటిష్ పాలకులకు వీరంతా నమ్మిన బంటులుగా ఉంటూ వచ్చారు.
వీటిల్లో బరోడా, గ్వాలియర్, హైదరాబాద్, కాశ్మీర్, మైసూర్, సిక్కిం పాలకులు నేరుగా స్థానికంగా గల రెసిడెంట్‌ల ద్వారా బ్రిటిష్ వారి భారత ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేవారు. సంస్థానాలు అన్ని బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, ఆదేశాలనే అమలు పరుస్తూ ఉండెడివి. జైపూర్, జోధాపూర్, జైసల్మేర్, బికానూర్ వంటి కొద్ది సంస్థానాలలోనే వంశపారంపర్య రాజులు అధికారంలో ఉండేవారు. హైదరాబాద్‌తో సహా మిగిలిన సంస్థానాధీశులు అందరూ బ్రిటిష్‌వారి దయా దాక్షిణ్యాలపై అధికారంలో కొనసాగేవారు.
భారత్‌లో తమ దోపిడీకి, పరిపాలనకు సహకరించిన సంస్థానాధీశులు కృతజ్ఞతగా, తాము లేకపోతే భారత్ ఒక జాతిగా కొనసాగలేదని నిరూపించడం కోసం దేశ విచ్ఛిత్తికి మార్గం ఏర్పర్చడం కోసమే సంస్థానాలకు స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కల్పించారు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో సహితం నిజాంలు ఒక రాజ వంశానీకి చెందినవారుగాని, స్వతంత్ర పాలకులు కాదని గ్రహించాలి. మొఘల్ రాజవంశంలో చివరి రాజయిన ఔరంగజేబ్ 1707లో మృతి చెందే సమయానికి సామ్రాజ్యం ముక్కలు కావడం ప్రారంభమైంది. అంతకుముందు శివాజీ ఇచ్చిన తిరుగులేని దెబ్బనుండి వారు కోలుకోలేదు. డిల్లీలోని తురనియన్ పార్టీలో బలమైన నాయకుడైన మొహమ్మద్ అమిర్‌ఖాన్ సోదరుడు, అసఫ్‌జహగా పిలువబడే చిన్‌కీలిచి ఖాన్‌ను 1713లో దక్కన్ ప్రాంతానికి సుబేదార్‌గా ‘నిజాం-ఉల్-ముల్క్’ (రాజ్యాన్ని నియంత్రించేవాడు)గా నియమించారు. ఉత్తరాన మాలవ నుండి దక్షిణాదిన తిరుచిరాపల్లి వరకు విస్తరించిన దక్కన్ ప్రాంతానికి ఇది కీలకమైన పదవి.
అంతలో ఢిల్లీలో మొఘల్ రాజ్యంలో కీలకులైన సయ్యద్ సోదరులు అదృశ్యులు కావడంతో క్షీణ దశలో ఉన్న ఢిల్లీ వజీర్ పదవిని అసఫ్ జహాకు అప్పజెప్పారు. అయితే తెలివిగా తిరస్కరించి దక్కన్‌తో తిరిగివచ్చాడు. దక్కన్‌లో తన ఆధిపత్యాన్ని స్థిరీకరించుకోవడం వజీర్ షాకు అంత సులభం కాదు. దీనిని ఒక అవకాశంగా తీసుకొని ఒకవంక ఢిల్లీ పాలకులకు అనుకూలంగా ఉంటూనే, ఇతరులకు సహితం లొంగి ఉండేవాడు.
అసఫ్ జహ 1848లో చనిపోవడంతో, అతని ఇద్దరు కుమారులమధ్య వారసత్వం పోరు జరిగింది. భారత్‌లో ఫ్రెంచ్ పాలన స్థాపించిన డూప్లెయిక్స్ వ్యూహాత్మకంగా వారిద్దరిలో ఒకరైన సలాబత్ జహకు మద్దతు ఇచ్చి, అతనికి హైదరాబాద్ అధికారం దక్కేటట్లు చేశాడు. అతనికి మరాఠాలనుండి రక్షణ కల్పించే పేరుతో ఫ్రెంచ్ జనరల్ బస్సీను హైదరాబాద్‌లో ఉండేటట్లు చేశాడు. అందుకు బదులుగా సరిగ్గా 200 ఏళ్ళ తరువాత తన ఆధీనంలోకి తీసుకోవాలని రజ్వి ప్రయత్నించిన ఉత్తర సర్కార్ జిల్లాలు నాలుగింటిని ఫ్రెంచ్‌వారు కైవసం చేసుకున్నారు.
1763లో పారిస్ ఒప్పందంతో ఏడేళ్ల ఐరోపా యుద్ధం పూర్తికావడంతో ఐరోపా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పాలకులు సలాబత్ జహను తమ చట్టబద్ధ సుబేదార్‌గా ప్రకటించి, సంయుక్తంగా ఆధిపత్యం వహిస్తూ ఉండేవారు. అయితే వారు ముగ్గురు ఎవ్వరికివారు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేస్తూ ఉండేవారు. 1766లో సలాబత్ జహ తమ్ముడైన నిజాం అలీఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అవగాహనకు వచ్చి పశ్చిమాన మరాఠాలనుండి, దక్షిణాదిన హైదర్ అలీ నుండి రక్షణ కల్పించే ఏర్పాటు చేసుకున్నాడు. అయినా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువకాలం అనువుగా వుండకుండా హైదర్ అలీతో చేతులు కలిపి బ్రిటిష్ వారిపై దాడి చేశాయి. ఆ దాడిని 1768 నాటికి తిప్పికొట్టి, మసులీపట్నం ఒప్పందాన్ని చేసుకొని, హైదరాబాద్‌లో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
నిజాం ద్వంద నీతిని అవలంబిస్తూ రెసిడెంట్‌తో మామూలుగా ఉంటూనే వెనుక బ్రిటిష్ వారిని తొలగించడానికి మరాఠాలతో చేతులు కలిపాడు. ఆ ప్రయత్నం వికటించడంతో నిజాం కోర్ట్‌లో బ్రిటిష్ రాజు సైనిక అధికారిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంచడం ప్రారంభించింది. దానితో దక్కన్‌లో బ్రిటిష్ ప్రాబల్యం పెరగడంతో నిజాం నిస్సహాయంగా ఉండిపోయాడు. భారత్‌లో బ్రిటిష్ రాజ్యం ఏర్పాటు అవకాశాలను వారెన్ హేస్టింగ్స్ ప్రారంభించినప్పటినుండి వెల్లస్లేయ్ బ్రిటిష్ సర్వాధికారం ఏర్పాటుకు ప్రయత్నించే వరకు నిజామ్ ప్రాంతంలో పరిస్థితులు చాలా దమనీయంగా ఉండెడివి.
1778 నాటికి దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బలమైన సైనిక శక్తిగా ఎదగడంతో హైదరాబాద్ నుండి ఫ్రెంచ్ సేనలను వెనుకకు పంపివేసి, భారీగా బ్రిటిష్ సైనిక బలగాలను అక్కడ ఉండేట్లు నిజాంపై వెల్లస్లేయ్ వత్తిడి తీసుకువచ్చారు. అదే సంవత్సరం హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. అతని రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి, కొంత భాగం నిజాంకు తమకు లొంగి ఉన్నందుకు బహుమానంగా ఇచ్చారు. నాటి భారత గవర్నర్ జనరల్ వెల్లెస్లేయ్ సహాయం తన శత్రువులను కొద్దిపాటి ప్రయత్నంతో అణచివేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని, స్థిరీకరించుకోగలిగారు.
1803 నాటికి హైదరాబాద్‌కు మరిన్ని బ్రిటిష్ సేనలు చేరుకొని, దక్షిణాదిన తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడాన్ని సికింద్రాబాద్‌ను భారీ సైనిక కేంద్రంగా చేసుకున్నారు. 1857లో హైదరాబాద్‌లోని ముస్లింలు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రెసిడెంట్‌పై రెండు సార్లు దాడులు చేశారు. నిజాం దర్బార్ నుండి పంపివేశారు. ఆ సమయంలో ఈ ఉద్యమంలో నిజాం చేరి ఉంటే మద్రాస్, మైసూర్, ట్రాంకోవర్- కొచ్చిన్ సంస్థానాలు సహితం తిరుగుబాటు చేసి ఉండెడివి. అయితే ఆ ఉపద్రవం నుండి బ్రిటిష్ పాలకులను సర్ సాలర్‌జంగ్ రక్షించారు.
ఈ అనుభవం నుండి గుణపాఠం చేసుకున్న బ్రిటిష్ పాలకులు సికింద్రాబాద్‌లోని సేనలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటట్లు చేశారు. మొత్తం నిజాం పాలనలో హైదరాబాద్ రెసిడెంట్ కీలక వ్యక్తిగా మారాడు. అన్ని విధాన నిర్ణయాలను అతనే తీసుకునేవాడు. అసలు అధికారాలు నిజాం చేతిలో కాకుండా అతని చేతిలోనే ఉండెడివి. నిజాం ముఖ్యమంత్రిని అతనే నియమించేవాడు. మంత్రుల నియామకం, తొలగింపు కూడా చేస్తూ రాజ్యాంగ, ఆర్థిక, పరిపాలనలో సంస్కరణలను తీసుకువచ్చేవాడు.
ఆ తరువాత 150 సంవత్సరాలపాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భారత ప్రభుత్వంలో భాగంగానే నిజాం పాలన ఉండెడిది. హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలకమైనదని 1930లో హైదరాబాద్ రెసిడెంట్ సర్ విలియం బార్టన్ తన నివేదికలో పేర్కొంటారు. ‘రాజకీయ, సైనిక, రీత్యా కూడా ఇది ముఖ్యమైనది. అత్యవసర సమయంలో ఉత్తర భాగంనుండి భారత్ దక్షిణ భాగాన్ని విడదీయడానికి కూడా ఉపయోగపడుతుంది’ అంటూ అప్పుడే హైదరాబాద్‌పై తమకుగల దుష్టపన్నాగాన్ని వివరిస్తాడు.
నిజాం పాలనలో వున్న హైదరాబాద్‌కు ఎప్పుడూ మరే దేశంతో స్వతంత్రంగా సంబంధాలు ఉండెడివి కావు. నిజాం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, రైల్వేలు, విమానాలు, పోస్టల్.. వంటి కీలక అంశాలను బ్రిటిష్ భారత్ ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండెడిది.
నిజాంకు సొంతంగా ఆయుధాలను దిగుమతి చేసుకోవడం, ఉత్పత్తి చేయడం వంటి అధికారాలు ఉండెడివి కావు. హైదరాబాద్‌లో గల బ్యాంక్‌లు అన్ని రిజర్వు బ్యాంకు పరిధిలోకి వచ్చే బ్రిటిష్ ఇండియా బ్యాంక్‌లకు బ్రాంచ్‌లుగానే ఉండెడివి. నిజాం తమ ఆదాయం కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలతో చేసే వాణిజ్యంపైననే ఆధారపడి ఉండేవాడు. బ్రిటిష్‌వారు నిర్ణయించిన విధంగా భారత కరెన్సీకి నిర్ణీత మారక విలువలతో నిజాం కరెన్సీ ఉండెడిది. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంలో ఇవన్నీ తెలుసుకోవడం సముచితం. అప్పుడే ‘విమోచన’ విలువ తెలుస్తుంది.

చిత్రం..సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

-చలసాని నరేంద్ర