మెయన్ ఫీచర్

అసహనమే అసలు సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఒడిస్సాలోని స్థానిక రాజకీయ గూండాల అక్రమాల్ని రిపోర్టు చేసినందుకు ఓ స్థానిక దినపత్రిక రిపోర్టర్ భార్య అయిన చాచిరాణిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. నాడు ఇదో సంచలన వార్త! ఎంత నిజాయితీపరులైన జర్నలిస్టులుగాని ఇలాంటి ఘటనలతో తిరిగి ఇదే వృత్తిని కొనసాగించే సాహసం చేయలేరు. పైగా జీవచ్చవంలా మారిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు. 1984లో వచ్చిన ‘మశాల్’ హిందీ చిత్రంలో ఇలాంటి సంఘటన కాకున్నా, ఓ పత్రికా సంపాదకుడి భార్య నడి బజారులో ప్రాణాల్ని వదలడం, ఎవరూ సహాయానికి రాని దృశ్యాన్ని చూపించారు. రాతలకే కాదు, గీతలకు భయపడే అసాంఘిక శక్తులు, రాజకీయ అండతో అవుట్‌లుక్ ఆంగ్ల పత్రికకు పనిచేసే నాగపూర్‌కు చెందిన ప్రముఖ కార్టూనిస్టు ఇర్ఫాన్ హుస్సేన్‌ను ఢిల్లీ శివారుల్లో మార్చి 1995 అతి ఘోరంగా చంపివేశారు. నిందితులుగా గుర్తించబడిన అయిదుగురిని ఆధారాలు సరిగా లేవనే సాకుతో వదిలివేశారు.
1983లో అధికార పగ్గాలు చేపట్టిన ఎన్‌టిఆర్ పాలన ఓ వర్గ ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నదనే కథనాన్ని తన పత్రిక ‘ఎన్‌కౌంటర్లో’ రాసినందుకు పింగళి దశరథమును అక్టోబర్ 1985లో విజయవాడలో దారుణంగా హత్య చేశారు. ఓ బినామీని పోలీసులు నిందితునిగా చూపగా, దశరథము తల్లి నిరసించింది. డేరా గుర్మిత్‌పై ఆరోపణ చేసిన అజ్ఞాత మహిళ లేఖను ప్రచురించినందుకు సిర్సాకు చెందిన రామచంద్ర ఛత్రపతిని 2000లో హత్య చేసిన విషయం తెలిసిందే! నూనెను కల్తీ చేస్తున్న వ్యాపారుల గూర్చి పదే పదే రిపోర్టు చేస్తున్నందుకు శంకర్ అనే చిలుకలూరిపేట రిపోర్టుపై 2014లో దాడి జరగగా, మరుసటిరోజు ప్రాణాల్ని వదిలాడు. కత్తిమీద సాములాంటి జర్నలిజానికి ఇవి కొన్ని మచ్చుతునకలే! పత్రికా స్వేచ్ఛ గూర్చి 180 దేశాల్లో జరిగిన సర్వేలో భారత్ 136వ స్థానంలో నిలవడాన్ని బట్టి, ప్రజాస్వామ్యం ముసుగులో పత్రికా స్వేచ్ఛ ఏ మోతాదులో వుందో తెలుస్తున్నది. ఇలాంటి వాతావరణంలో గౌరీ లంకేష్ హత్య జరగడం ఆశ్చర్యమేమీ కాకపోవచ్చు! ఈ హత్యలకు మూలాలు వ్యక్తిగత శతృవుల్లో వుంటే ఎదుర్కొని పోరాడడం కొంతమేరకు సాధ్యమే! కాని వీటి మూలాలన్నీ రాజకీయ భావాల్లో, నమ్మకాల్లో, మతోన్మాదంలో వున్నపుడు ఎదుర్కోవడం దుస్సాహసమే అవుతుంది. భావాల మధ్యన చర్చలకే తావు లేనపుడు, వైరుధ్యాలు సంఘర్షించుకునే అవకాశాన్ని ఇవ్వనపుడు, వీటినే నమ్ముకున్న భావవాదులు, రాజకీయవాదులు ఒడిగట్టేవి హత్యలే! ఇది ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో కాదు, యావత్ దేశానికి అంటుకున్న చికిత్సలేని రోగం లాంటిది.
యధార్థవాది ఎల్లవేళలా పాలకులకు శతృవే అన్న మాటలు ఈ దేశానికి అన్ని కాలాల్లో వర్తిస్తున్నాయి. ఇతిహాసాల కాలంనుంచి, నేటి ఆధునిక యుగం దాకా విమర్శను తట్టుకోలేని, స్వీకరించని పాలకులు శత్రుశేషం లేని ఎజెండాను కలిగివుంటున్నారు. అందుకే మూఢ నమ్మకాలు తగవన్నందుకు నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సరే, భిన్న ఆలోచనల్ని ముందుకు తెచ్చినందుకు కల్‌బుర్గి హత్యకు గురయ్యారు. గౌరీ లంకేష్‌తో సహా వీరిని చంపడానికి వాడిన ఆయుధం ఒకటేనని నేర పరిశోధన శాఖ ఒప్పుకోవడం గమనార్హం! అయినా సుశిక్షితులైన పోలీసు వ్యవస్థ నాలుగు సంవత్సరాలుగా హంతకుల్ని గుర్తించని వైనాన్ని ఏమనుకోవాలి? ఇవన్నీ రాజకీయ హత్యలు కాబట్టే, నేరస్తులు ఎల్లవేళలా తప్పించబడుతున్నారు. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి అరెస్టు చేసినా, స్థానిక పోలీసులు తయారుచేసే చార్జిషీట్లు వాదనలకు నిలబడలేని స్థితే అధికం. ఇలాంటి ఉదాహరణలు దేశ వ్యాపితంగా కోకొల్లలు. అదే సాధారణ పౌరులు, కూలి నాలి జనం, రాజకీయ అండలేని సామాన్యులు ఏ చిన్న నేరం చేసినా నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో మగ్గడం, అవమానాల్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం, లాకప్ హత్యలకు గురికావడం జరుగుతున్నది తెలిసిందే. ఇలా ప్రజాస్వామ్యంలో నాలగవ స్తంభంలా నిలబడాల్సిన పత్రికా రంగం గాడి తప్పి, పాలక భావజాలానికే మొగ్గుచూపితే, మూడో స్తంభంలా ఉండాల్సిన జుడిషరీ రాజకీయ పంచన చేరితే ప్రజాస్వామ్యానికి శాశ్వత సూర్యాస్తమయమే వుంటుంది! అందుకే ఇలాంటి ఘటనల సందర్భంగా మిఠాయిలు పంచుకుంటున్నారు. అనంతమూర్తి లాంటివారు చనిపోతే పండగ చేసుకున్నారు. యావత్ దేశానికి బాధ్యత వహించి, భద్రత కల్గించాల్సిన పాలకులే ఈ దుర్ఘటనల సందర్భంగా ప్రజాస్వామ్య విరుద్ధ ప్రకటనలివ్వడానికి కూడా వెనుకాడడం లేదు. ఇంత అసహనం వెలిబుచ్చిన వారిపట్ల అధి నాయకత్వం చూసీ చూడనట్లు వుండడం, అత్యవసరం అని భావిస్తే నర్మగర్భితంగా మాట్లాడడం, కనీస చర్యల్ని చేపట్టకపోవడంతో కొందరి నోటికి తాళాలు లేకుండా పోతున్నాయి.
ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో పెద్ద పత్రికలు పాలకపక్షం వహించగా, చిన్న పత్రికలు నడవలేని స్థితికి రావడం, విధిగా పాలక భిక్షకై వెంపర్లాడడం జరుగుతుంటే, నిజాయితీగల రిపోర్టర్లు, సంపాదకులు నిరంతరం హెచ్చరికల్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఫ్రీలాన్స్ జర్నలిస్టుల పరిస్థితి ఇంతే! రోజురోజుకు నిజాయితీ జర్నలిజానికి సమాధి కట్టే వారి సంఖ్య పెరుగుతున్నది. పాలకులకు బాకాలూదే వారు ఎదిగిపోతున్నారు. ఇలాంటివారికే అవార్డుల్ని, రివార్డుల్ని ఇచ్చి అందలమెక్కిస్తున్నది పాలకపక్షం. పత్రికా స్వేచ్ఛ గూర్చి, వ్యక్తి స్వేచ్చ గూర్చి మాట్లాడే పాలకులు, వీరి అనుంగులు నమ్ముకున్నది వారి వ్యక్తిగత స్వేచ్ఛనే! ఇలాంటి ఆలోచన కొంతకాలం పనిచేయవచ్చుగాని, ఎల్లవేళలా పనిచేయదని వీరు ఏనాడు గుర్తించకపోగా, అధికారం తమ చేతుల్లో వుందని, తమ వర్గంవారి చేతుల్లో వుందని భ్రమిస్తూ వుంటారు.
రాజ్యం స్వభావం ఎలా వుంటుందో, నేరారోపణ మోపబడినవారే నాయకత్వంలో వుంటే, సిబిఐ లాంటి సంస్థలు ఎలా రంగుల్ని మారుస్తుందో గుజరాత్ అల్లర్ల సందర్భంగా తెహల్కా రిపోర్టర్ రానా అయ్యూబ్ ధైర్యసాహసాలతో పరిశోధన చేసి రాసిన ‘గుజరాత్ ఫైల్స్’ ఓ వాస్తవ చిత్రీకరణ! ఉతరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి విభూతి నారాయణ్‌రాయ్ రాసిన ‘షహర్ మే కర్ఫ్యూ’ పాలనలో డొల్లతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. నిజానికివి తెలియని విషయాలేవీ కావు. వక్రంగా నడుస్తున్న వ్యవస్థను, ఏకదృష్టి వాదనను నమ్ముకునేవారికి ఇలాంటివేవి పట్టవు. గిట్టనివారు, దేశ వ్యతిరేకులు, ఓ వర్గం ప్రజల్ని సమర్థించేవారే ఇలాంటి కథనాలు ముందుకు తెస్తారని వాదిస్తూ, వారి వాదనవైపే జనాల్ని తిప్పుకుంటారు. దాదాపు ఇలాంటి వాతావరణం అద్వాని రథయాత్ర తర్వాత మరింత బలోపేతమైంది. చివరికిది బలమైన భావజాలంగా మారి, పాఠ్యాంశాల్లోకి చొప్పించబడుతున్నది. లౌకికవాద దృక్పథంతో పనిచేయాల్సిన ప్రభుత్వాలు హిందూత్వ భావజాలంవైపు దృష్టి మరల్చడం జరిగిపోయింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల్ని దారిమళ్లించి, జనాల్లో మత భావాల్ని మరింతగా పెంచి పోషిస్తున్నాయి. ప్రజోపకరమైన రంగాల్ని పట్టించుకోకపోవడం, నడపకపోవడం, మూసివేయడం, నిధుల కొరతని చూపుతూ నిరర్థక రంగాలుగా ముద్ర వేస్తున్నాయి. జాతీయ స్థాయి నవరత్నాలుగా పేరుపొందిన పబ్లిక్ రంగ సంస్థలనుంచి పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లోని పబ్లిక్ రంగ సంస్థలది ఇదే దీనావస్థ. ఒకప్పుడు ఇవి దేశానికి గర్వకారణంగా వుండడమేకాక, అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధిని కల్పించడంతో జాతీయ సమైక్యతకు తోడ్పడ్డాయి. ఇలా పబ్లిక్ రంగం దెబ్బతినడం, ప్రైవేట్ రంగం బలోపేతం కావడంతో కులాల వారీగా, మతాలవారీగా ఇవి రూపాంతరం చెందుతున్నాయి. విద్యాలయాలు, చివరికి వైద్యాలయాలు మతాల కుంపటిని రాజేసుకుంటున్నాయి.
నిజానికి, వీటన్నింటిని ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా నియంత్రించాలి. ఈ మనస్తత్వమే వుంటే, దబోల్కర్ హంతకుల్ని వెంటనే పట్టుకునేవారు. గౌరీ లంకేష్ హత్య జరిగేదే కాదు. సమాజంలో ప్రశాంతత అడుగడుగునా కనపడేది. పత్రికా రంగం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చేవి. ఆరోగ్యకరమైన వ్యవస్థ పునాదులు రోజురోజుకు బలోపేతం అయ్యేవి. ప్రభుత్వ రంగం సాఫీగా సాగేది. జవాబుదారీతనం పెరిగేది. ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసి ఉత్పత్తి గణనీయంగా పుంజుకునేది. దేశం సర్వతోమఖాభివృద్ధి చెంది, అప్పుల ఊబినుంచి ఏనాడో బయటపడి, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేది. దేశ అంతర్గత సమస్యలు సమసిపోయి, భద్రత పెరిగి, ప్రజలమధ్యన సౌభ్రాతృత్వం వికసించేది. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్రాల స్వీయ మానసిక ధోరణులు దేశాన్ని అనైక్యతకు గురిచేసేవి కావు.
పాలనాపరమైన మార్పులు రాకపోతే, జవాబుదారీతనం పెరగకపోతే, రాబోయేవన్నీ ఎమర్జెన్సీలాంటి చీకటి రోజులే! ఇప్పటికే అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తులకు పై పూత మొలాంలు తాత్కాలిక ఉపశమనాల్ని కల్గిస్తాయి కాని శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. వీటిని పరిష్కార దృష్టితో చూడకుంటే, మరిన్ని విపత్కర పరిస్థితులు తోడౌతాయి. వీటిని పాలకులు గుర్తించడం లేదంటే పొరపాటే! పోటీపడి ప్రోత్సహించడమే బాధాకరం! ఇక మేధావులది, ఆలోచనాపరులది ఇదే తీరు. ప్రభుత్వాల బాధ్యతల్ని ఎప్పటికప్పుడు గుర్తింపచేయాల్సిన ఈ వర్గంలోని కొందరు పనిగట్టుకొని ప్రోత్సహించడం జరుగుతున్నది. ఇలాంటివారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహాలు, అభినందనలు అందవచ్చు. కాని సామాజిక ఎదుగుదలకు అడ్డుగోడలుగా నిలుస్తారనేది గుర్తించడంలేదు. ఈ సందర్భంగా గౌరీ లంకేష్ హత్య చివరిది కాకపోవచ్చు. కాని, కల్‌బుర్గి హంతకుల్ని పట్టుకోవాలనే నినాదంతోపాటు, గౌరీ లంకేష్ హంతకుల్ని పట్టుకొని శిక్షించాలనే వాదన మరింత బలోపేతం అవుతుంది. అప్పుడు, ఎల్లకాలం గొంతుల్ని నులమడం సాధ్యంకాదని గుర్తిస్తే చాలా ఆలస్యం అయిపోతుంది. ఇది చేజారి మరో రూపం దాలుస్తే, మరికొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయి. పాత సమస్యలు పరిష్కరించుకోకుండా, కొత్త సమస్యల్ని ఆహ్వానిస్తే, నివారణకన్నా చికిత్సకే ప్రాధాన్యత ఇచ్చిన విధంగా వుంటుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162