మెయన్ ఫీచర్

పేదరికం నుంచి విముక్తి తక్షణావసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుశా ప్రపంచ చరిత్రలో తెలంగాణ విముక్తి ఉద్యమమంతటి అద్భుతమైన పోరాటం మరొకటి లేకపోవచ్చు, పోరాటం ముగిసి ఏడు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా అది విలీనమా? విమోచనమా? విముక్తినా? అనే చర్చలు సాగిన అంశమూ చరిత్రలో మరోటి ఉండి ఉండదు. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన ఏడు దశాబ్దాల తరువాత కూడా ఇది విలీనమో విముక్తో? ఆక్రమణలో మేధావులు తేల్చ లేకపోతున్నారు. ఎవరికి వారే బలమైన వాదనలు వినిపిస్తున్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత ఈ అంశం మళ్లీ తెరపైకి బలంగా వచ్చింది. కర్నాటక, మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుండగా రాష్ట్రంలో ఎందుకు నిర్వహించ లేదని కెసిఆర్ బలంగా ప్రశ్నించారు. ఆనాటి కెసిఆర్ వాదనను ఇప్పుడు బిజెపి వినిపిస్తూ ఎంఐఎం ఒత్తిడి వల్లే విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని, తాము అధికారంలోకి రాగానే నిర్వహిస్తామని చెబుతూ తెలంగాణలో బిజెపి యాత్రలు నిర్వహిస్తోంది. ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రథ యాత్రతో రెండు సీట్లు ఉన్న బిజెపిని అద్వానీ అధికారంలోకి తీసుకువచ్చారు. తొలుత కూటమితో ఇప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చేంతగా బిజెపి బలపడినా, ఆ పార్టీకి పునాదులు మాత్రం రామాలయం అంశం నుంచి లభించాయి. మోదీ కన్నా ముందు రెండు సార్లు అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చినా బిజెపి మాత్రం రామాలయం ఇంకా నిర్మించలేదు. ఇప్పుడీ అంశాన్ని కాంగ్రెస్ తీసుకుని రామాలయాన్ని నిర్మించడంలో బిజెపి విఫలమైంది, తాము నిర్మిస్తామని జనంలోకి వెళితే ఎలా ఉంటుంది? అధికారంలోకి వచ్చే మాట ఎలా ఉన్నా ఉన్న కొద్ది పాటి ఓటు బ్యాంకు కూడా పోతుంది. ఒక్కో అంశం ఒక్కో కాలంలో ఒక్కో పార్టీకి ఉపయోగపడుంతుంది. ఒక పార్టీకి ఉపయోగపడిన అంశం మరో పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటే అమాయకత్వమే. బిజెపికి ఉపయోగపడిన రామాలయం కాంగ్రెస్‌కు ఉపయోగపడదు. అలానే ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిన విమోచన దినోత్సవ అంశం ఇప్పుడు బిజెపికే కాదు ఏ పార్టీకీ ఉపయోగపడదు. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన విమోచన లేదా విలీనం పేరుతో నిర్వహించే ఉత్సవం ఇప్పుడు ముఖ్యం కాదు.
ఏడు దశాబ్దాల దారిద్య్రం, వెనకబాటుతనం, పేదరికం నుంచి విముక్తి కలిగించడం ఇప్పుడు కీలకం. ప్రజలు ఇప్పుడు పేదరికం నుంచి, సమస్యల నుంచి విముక్తి కావాలని, దానికి అధికార పక్షం ప్రయత్నించాలని కోరుకుంటారు. కానీ విమోచన విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తారా? లేదా అని కాదు.
తెలంగాణ సాయుధ పోరాటం గురించి మంచికైనా చెడుకైనా మాట్లాడే అధికారం, హక్కు వామపక్షాలకు ఉంటుంది కానీ అప్పుడు పుట్టని బిజెపికి కాదు. బిజెపి డిమాండ్ తరువాత సిపిఎం సైతం చిన్నగా అదే స్వరం వినిపిస్తోంది. కానీ దీన్నో రాజకీయ అంశంగా భావించడం లేదు.
దేశమంతా మోదీ హవా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో బిజెపి ప్రభావం చూపలేకపోయింది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బిజెపి కనీసం హైదరాబాద్ నగరంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఏ అంశంపై ఉద్యమించాలో తెలియని పరిస్థితిలో విమోచన దినోత్సవ అంశం తమ ఉనికి చాటుకోవడానికి దొరికిన బ్రహ్మాండమైన అస్త్రంగా బిజెపి భావించింది.
ఉద్యమ కాలంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కెసిఆర్ ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు అన్నారు. అలా అనలేదు అని కూడా ఇప్పుడు చెప్పడం లేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు తెలంగాణకు ఏది ముఖ్యం అనేది తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం ముఖ్యం. బిజెపి నాయకులు వాదిస్తున్నట్టు ఎంఐఎంకు భయపడే అధికార పక్షం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు అనుకుందాం. ఎందుకు భయం. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం సైన్యం, రజాకార్లతో తెలంగాణ ప్రజలకు మధ్య జరిగిన పోరాటం. అంతే కానీ అది హిందూ ముస్లింల మధ్య జరిగిన యుద్ధం కాదు. తొలి పోరాట యోధుడు బందగీ హిందువు కాదు, ముస్లిం. రజాకార్ల ఆకృత్యాలు నిజమే, పోలీసు చర్యతో సైన్యం అటూ కమ్యూనిస్టులను, ముస్లింలను ఊచకోత కోసినమాటా నిజమే. దశాబ్దాల క్రితం జరిగిన ఉదంతంపై తిరిగి ఏటేటా తెలంగాణలో ఉద్రిక్తతలు కలిగించడం బిజెపికి అవసరమేమో కానీ జనానికి ఆసక్తి ఉండదు.
తెలంగాణ ఉద్యమం ముగిసిన అంకం, తెలంగాణ సాకారం అయితే తెలంగాణ సాధారణ ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని చెప్పారో అది చేసి చూపించాల్సిన సమయం ఇది. పోలీసు చర్య ద్వారా అటు కమ్యూనిస్టులను ఇటు రజాకార్లను అణిచివేయడానికి వచ్చిన మిలటరీ చేపట్టిన చర్యలవల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనపై వేసిన కమిషన్ నివేదికను బహిర్గతం చేయాని ఎంఐఎం మొదటి నుంచి కోరుతోంది. ఈ అంశంపై బిజెపి వాదనలు బిజెపికి ఉన్నాయి, ఎంఐఎం వాదన ఎంఐఎంకు ఉంది. రెండు వాదనలు బలమైనవే కానీ రెండూ ప్రజలకు మేలు చేసేవి కాదు.
సాయుధ పోరాటాన్ని ఇంకెంత కాలం కొనసాగించాలి, కొనసాగించాలా? వద్దా అనే విషయం తేల్చుకోవడానికి కమ్యూనిస్టు యోధులు అప్పటి సోవియట్ రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిశారు. 1951లో అమృత్ డాంగే, అజయ్ ఘోష్, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావులతో కూడిన బృందం మాస్కో వెళ్లి స్టాలిన్‌ను కలిసింది. వీళ్లు చెప్పింది అంతా విన్న స్టాలిన్ ఇండియా మ్యాప్ తెప్పించుకుని అందులో విముక్తి ఉద్యమం జరుగుతున్న హైదరాబాద్ సంస్థానం ప్రాంతాన్ని చూసి, ఈ ప్రాంతం నుంచి తప్పించుకుని వెళ్లేందుకు సరిహద్దుల్లో మరో దేశం ఉందా? సముద్రం ఉందా? అనే ప్రశ్నలు అడిగి ఇవేవీ లేనప్పుడు విముక్తి ఎలా సాధ్యం అని ప్రశ్నించారని చెబుతారు. ఇదేమీ కట్టుకథ కాదు. సాయుధ పోరాటం ముగిసిన కాలంలోనే ఈ విషయం వెలుగు చూసింది. రహస్య సమాచార వెల్లడి నిబంధనల మేరకు రెండు మూడేళ్ల క్రితం రష్యా ఈ అంశాన్ని అధికారికంగానే ప్రకటించింది. అంటే అప్పటి వరకు పోరాట యోధులకు దీనిపై అవగాహన లేదా? స్టాలిన్ చెప్పేంత వరకు తెలియదా?
ఒక సంస్థానంలో దొరలు, దేశ్‌ముఖ్‌లు రజాకార్ల ముఠాపై సాయుధ పోరాటం సాగించడం వేరు. సువిశాలమైన భారత దేశ సైన్యంపై పోరాటం వేరు. ఈ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. హిందువులు, ముస్లింలు ఏ మతం వారు ఎక్కువ మంది చనిపోయారు? ఏటేటా లెక్కలు కావాలా? ఆ లెక్కల పేరుతో సమాజంలో అరాచకం ప్రబలిపోవాలా?
తెలంగాణ ఏర్పడితే మావోయిస్టుల రాజ్యం అవుతుంది అని తెలంగాణను వ్యతిరేకించిన వారు ఉద్యమ కాలంలో బలంగా వాదించారు. తెలంగాణ ఏర్పడగానే మావోయిస్టు సానుభూతి పరులు హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి అడిగితే ప్రభుత్వం నిరాకరించింది. ఆనాటి నుంచే మావోయిస్టు సానుభూతి మేధావులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. మీడియాలో వీరి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వీళ్ల మాట వినేవారు తక్కువ. అనుమతి ఇవ్వలేదు అనే విమర్శ ఒక్కటే వచ్చింది కానీ అనుమతి ఇచ్చి ఉంటే పట్టపగలే హైదరాబాద్‌లో మావోయిస్టులకు రాచమర్యాదలు అంటూ మరో వర్గం వీరిని మించి ప్రచారం చేసి హైదరాబాద్ ఇమేజ్‌ను చావు దెబ్బతీసి ఉండేవారు. మతపార్టీ ఎంఐఎం గుప్పిట్లో టిఆర్‌ఎస్ అని బిజెపి ఆరోపిస్తుంది.
తెలంగాణ ప్రయోజనాల కోసం మోదీతో ఘర్షణ వైఖరి అవలంబించే అవకాశం లేదు కాబట్టి అంశాలవారిగా మోదీకి మద్దతు ఇస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ఊపిరి హైదరాబాద్, రాజధాని నగరంలో శాంతిభద్రతలు ముఖ్యం దాని కోసం ఎలా వ్యవహరిస్తే మేలు అనుకుంటే అలా ఉంటారు.
తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోవాలి అనుకునే వారు ఉద్యమ కాలంలో అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెబుతున్నారు అని విమర్శించవచ్చు. ప్రతిపక్షంగా విమర్శించాలి కూడా. కానీ అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. తెలంగాణకు ఏది ప్రయోజనమో అది చేయాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆ రోజుల్లో రాష్టమ్రంతా కదిలింది. కేంద్రంలో తమ పలుకుబడి ఉపయోగించి బయ్యారం ఉక్కు సాధించి అధికార పక్షం సాధించలేని దాన్ని మేం సాధించాం అని బిజెపి సగర్వంగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఆంధ్రలో వెంకయ్య నాయుడుకు చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. తెలంగాణలో బిజెపి నాయకులు చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. చివరకు ఉన్న ఒక్క కేంద్ర మంత్రికి ఉద్వాసన పలికారు. అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి హామీ ఇస్తోంది. ఈ హామీ కోసం తెలంగాణ ప్రజలు బిజెపికి పట్టం కట్టాలన్నమాట! తెలంగాణలో టిడిపి ప్రభావం లేదు. కాంగ్రెస్ నిరాశలో ఉంది. ఈ పరిస్థితిలో వాటి స్థానం కోసం బిజెపి ప్రయత్నించాలి. తెలంగాణ ఏర్పడితే టిడిపి స్థానాన్ని బిజెపి ఆక్రమిస్తుందని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. కానీ తెలంగాణకు మేం ఇది చేశాం అని చెప్పుకోవడానికి తెలంగాణ బిజెపి నాయకులకు బలమైన అంశాలేమీ కనిపించడం లేదు. ఉద్యమ కాలంలో సెంటిమెంట్లు పని చేశాయి. కానీ అవే మంత్రాలు ఇప్పుడు పని చేయవు. గర్వంగా చెప్పుకునే విధంగా బిజెపి తెలంగాణకు ఏమైనా సాధించి ఎన్నికల్లో చెప్పుకుంటే బాగుంటుంది. కానీ విమోచన దినోత్సవాలు, యాత్రలతో ఒరిగేదేమీ ఉండదు.

-చాణక్య