మెయిన్ ఫీచర్

జ్ఞానజ్యోతి.. జగన్మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరన్నవరాత్రి సంబరాలు ఆరంభమయ్యాయ. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మను ఈ శరన్నవరాత్రులలో భక్తితో పూజిస్తారు. ఆదిపరాశక్తి తొమ్మిది అవతారాల్లో పూజలందుకుంటుంది. ఈ పండుగు సందర్భంగా అమ్మవారి లీలను స్మరించుకుంటూ పూజిస్తే ధర్మం ఆచరించేవారికి అండదండగా నిలిచి తన బిడ్డలను కాపాడుతుంది. అమ్మ దయార్థస్వరూపిణి. ఆమె కనులలో కరుణను కురుపిస్తుంది. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. అందుకే ఆ పరమేశ్వరి బుద్ధి ప్రదాత అయంది. ఈతల్లిని వేడుకున్నవారికి ధర్మాచరణలో ఆటంకాలు కలుగవు. మృత్యువు సైతం దూరవౌతుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం లభిస్తుంది. ఇది హిందువుల విశ్వాసం.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు కేంద్ర బిందువు పండుగలు. ఆధ్యాత్మిక చింతనను, సర్వమానవ సౌభ్రాతృతను సౌహార్ద్భావాన్ని పెంపొందిస్తూ, నూతన తేజోత్సాహాన్ని కలుగజేస్తూ జీవన సరళిని సుగమమము సుసంపన్నం చేసేవి పండుగలు.
పండుగలోని పరమార్థం
అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించే భక్తి, జ్ఞానాన్నిచ్చి, కామాల్ని ధర్మబద్ధంగా అనుభవించటానికి పురుషార్థములలో, అర్థకామాల్ని ధర్మబద్ధంగా అనుభవించటానికి, ఆచరణాత్మకంగా ప్రకటించటానికి ఏర్పడినవి పండుగలు. మన సంస్కృతిలోని సామరస్యము, సమైక్యతను ప్రకటిస్తూ, దైవప్రీతి పాపభీతి సంఘనీతిని అలవరచి సంస్కరించటానికి నిర్దేశింపబడినవి- పండుగలు.
శ్రీ దేవీ శరన్నరాత్రుత్సవాలు
అటువంటి పండుగలలో ముఖ్యంగా పేర్కొనబడినది - శ్రీ దేవీ శరన్నవరాత్రుత్సవములు. మానవుని మనస్సు తమస్సుచే ఆవరించబడి వుంటుంది. మనస్సులో పరమాత్మను నిలుపుకొంటే, క్రమేపి తమస్సనే చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. దృశ్యమవుతున్న సర్వ వస్తు ప్రపంచం, వెలుగునుంచి ప్రభవించినవే, వెలుగులోనే లీనమయ్యేవే. ఆ వెలుగు శక్తే శాశ్వతమైనది. అదే ‘విశ్వశక్తి’. ఇదే శ్రీదేవి అనగా జగన్మాత స్వరూపం. ఇది శ్రీ శంకర భగవత్పాదులు ‘సౌందర్య లహరి’లో మనకు బోధించిన ముఖ్యాంశం. ఇదే శ్రీ దేవీ శరన్నరాత్రి మహోత్సవములకు పూర్తి స్ఫూర్తి.

నాదయోగి కీర్తనలో విశ్వవెలుగు

‘‘అంతర్భహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’’ అని పరమాత్మ వెలుగు అంతటా నిండి వున్నదని, పరమాత్మ చైతన్యశక్తి గురించి, నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్త్వాన్ని, వాగధీశ్వరీరాగంలో ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే..’ అని కీర్తించాడు. ఈ వెలుగు శక్తినే సాకార సగుణంగాను, నిర్గుణ నిరాకారంగాను ఉపాసించవచ్చు.
ఏ ఆకారం లేకుండా ఆ నిరాకార తత్త్వాన్ని ఆరాధించటం, ఉపాసించటం అంతగా అందరికీ సాధ్యపడే విషయం కాదు. అందుకే సాకార రూపానే్న భజించి, జపించి ఉపాసించటమే తరుణోపాయంగా ఎంచుకున్నారు. ఇది సాకార భక్తి.

ఏ నక్షత్రంలో ప్రారంభిస్తారు?

శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములను ప్రారంభించే ఆశ్వయుజ శుద్ధపాడ్యమి రోజున, సర్వసాధారణంగా ‘హస్తా’ నక్షత్రం ఉంటుంది. హస్తా నక్షత్రం చంద్రునిది. చంద్రుడంటే మనస్సుకు అధిపతి- తల్లే జగన్మాత. మరల విజయదశమి రోజున చంద్ర నక్షత్రమైన శ్రవణంలో కలశోద్వాపనతో ఉత్సవములు ముగుస్తాయి. మనోనిశ్చలతను, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది-

శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు.

ఉత్సవం అంటే

ఉత్ సూయతే హర్షః అనేన ఇతి ఉత్సవః ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ఉత్సవం.
వ్రతమంటే? వరం తనో తీతి వ్రతమ్- వరమనగా శ్రేష్ఠము, తేజస్సు, శుభము మంగళప్రదము అని అర్థాలు. వీటిని ప్రసాదించేది వ్రతము. ఇదీ సూక్ష్మంగా శ్రీదేవీ శరన్నవరాత్రి వ్రత పూజా మహోత్సవముల వివరణ. ఇక ప్రతిరోజూ అమ్మను దర్శించుకునే అలంకారమలు అవతారముల గురించి విశే్లషించుకుందాం.
బాలాత్రిపురసుందరి
సదా ఆనందంలో ఓలలాడుతూ తనభక్తులకు చిన్మయానందాన్ని ప్రసాదించే ఆనందమయి- బాలాత్రిపురసుందరి. ఈ విశాల కువలయం, ఆమెకు ఆలయం. మేధాశక్తికి మేరు పర్వతంలాంటిది. అర్చనకూ, అర్పణకు, విద్యకు అవిద్యకు, జగన్మాత అధీశ్వరి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే జగదీశ్వరిని సేవించాలనే బుద్ధిపుడుతుంది. తల్లిని సేవిస్తే రోగభయం ఉండదు, మృత్యుభయం దరిచేరదు. భవబంధాన్ని పారద్రోలి, భక్తులకు ముక్తిని ప్రసాదించే మోక్షప్రదాయిని

బాలాత్రిపురసుందరి.

భండాసురుడు- బండలాంటివాడు. ఉన్నచోటే ఉంటాడు. చలించడు. ఎంత ప్రయత్నించినా లేవడు. తనకంటె మించినవాళ్ళులేరంటాడు. మన శక్తి కంటే మించిన శక్తి ఉన్నదని వాడికి తెలియదు, చెప్పినా వినడు, విన్నా నమ్మడు. కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోయి సుఖంగా హాయిగా కాలం గడపటమే జీవిత పరమావధి అని వితండంగా వాదించే మొండివాడు భండాసురుడు. ఛండాసురుని కుమారులు ముప్పది మంది రాక్షసులను తొమ్మిది సంవత్సరముల వయసుగల బాలాత్రిపుర సుందరి వధించింది. ‘్భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ వందితా’ అన్నది లలితా సహస్రనామం.
సాలోక్యాది ముక్తిప్రదానకరి, సదాశివకరి, మూలాది నవాధారేశ్వరి, నీలాలకధరి, నిత్యానందకరి, లీలావిశ్వోత్పత్తి స్థితి లయకరి, బాలాత్రిపుర సుందరి, సర్వశుభకరి అని కీర్తించారు దీక్షితార్. శ్యామకృష్ణ సోదరి, శుకశ్యామల, త్రిపురసుందరి అని కీర్తించాడు లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ.

గాయత్రీదేవి

కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు- సూర్యుడు. చండమార్తాండ మండల మధ్యలో, సూర్యునికి అధిష్ఠాత అయి, సూర్యునికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి. సకల జగత్తును నియతగా నడిపేది ధర్మం. ధర్మదేవత- గాయత్రి.
గాయత్రికి మించిన మంత్రంగాని, తల్లికి మించిన దైవంగాని లేరు. గాయత్రీమాత కాంతి స్వరూపం, తేజోమయి. కాంతివంతమైన కాంతి. వెలుగులలోకెల్లా వెలుగు. అది స్వప్రకాశం కలిగిన అఖండ వెలుగు. సూర్యుని సూర్యునిగా భాసింపజేసి, విశ్వానికి కనుపింపజేసే ప్రభావతి- గాయత్రి.
ఆనందాన్ని అనుభవించాలన్నా, పొందాలన్నా కాల నియమాన్ని పాటించాలి, కాలప్రాముఖ్యాన్ని గుర్తురెగాలి. కాలస్వరూపమే బ్రహ్మతత్త్వం. బ్రహ్మతత్త్వం- త్రిమూర్త్యాత్మకం, త్రికాలాత్మకం, త్రిశక్త్యాత్మకం. ఇదే ప్రాతః మధ్యాహ్న, సాయం సంధ్యలు. సంధ్యాదేవత- గాయత్రి. అందుకే ‘సంధ్యాదేవీం, సావిత్రీం, వరగాయత్రీం, సరస్వతీం భజేహం..’ అన్న దేవక్రియరాగ కీర్తనలో గాయత్రీ తత్త్వాన్ని హృద్యంగా అందించాడు ముత్తుస్వామి దీక్షితులు. ‘సరిగమపదని’ సంగీత సప్తస్వర సుందరులకు నిలయమని ‘్ధర ఋక్రామాదులలో వర గాయత్రీ హృదయమున..’ అనే నాదయోగి త్యాగరాజు స్వామి వారి కీర్తన, గాయత్రీ పూజకు స్ఫూర్తినిస్తుంది.

అన్నపూర్ణాదేవి

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువనసాక్షి, కటాక్షి ఉన్నత గర్తా తీర విహారిణి, పరమేశ్వరి, విశే్వశ్వరి, భాస్వరి.. అంటూ మాణిక్యమయమైన పాత్రలో ప్రీతికరమైన పాయసాన్ని బంగారు గరిటెతో ప్రసాదిస్తూ మోక్షానిచ్చే తల్లి- అన్నపూర్ణాదేవి, అని దేవగాంధార రాగంలో (ప్రస్తుతం సామరాగంలో పాడుతున్నారు) గానం చేసి ‘‘ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే, సువర్ణే మాం పాహి, కాశీ క్షేత్ర నివాసిని, కమల లోచని విశాలినీ విశే్వశ మనోల్లాసిని పున్నాగ వరాళి ప్రకాశినీ, సువాసినీ భక్త విశ్వాసినీ, చిదానంద విలాసినీ’’అంటూ తేజోరూపంగా దర్శనమిచ్చిన అన్నపూర్ణా కటాక్షసిద్ధిని పొందిన ముత్తుస్వామి దీక్షితుల్ని ఈ రోజు తప్పక జ్ఞప్తి చేసికోవాలి.
అఖిల విశ్వమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’, ‘ఆ పూర్ణశక్తే’ అన్నపూర్ణ. ‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే’’.

శ్రీలలితా త్రిపుర సుందరి

శ్రీమాతలోని దేవీతత్త్వం, శ్రీమహావిష్ణువులోని దివ్యతత్త్వం- రెండూ ఒకే తత్త్వానికి చెందినవే. అదే పరమ తత్త్వం. ఆ పరమతత్త్వానికి అవి రెండూ రూపాలు మాత్రమే. సగుణ సాకారంగా రెండూ వేర్వేరుగా కనపడినా, నిరాకార నిరంజనంగా, చిన్మయదృష్టితో తన్మరుూభావంతో తరచి తరచి భావన చేస్తే, రెండింటిలోనూ ఒకే ఆనందమయ బంధువు దర్శనమ్తింది. ఆ పరమానందమయి బిందువే శ్రీలలితా పరమేశ్వరి, శ్రీ లలితా త్రిపురసుందరి. ‘‘స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితవిశ్వవిగ్రహ’’ తనలోని ఆత్మతత్త్వమే లలితా పరమేశ్వరి అని పేర్కొన్నది, భావనోపనిషత్. విశ్వమంతా తల్లి రూపమే. కదిలే ప్రతి కణంలో, జరిగే ప్రతిక్షణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణిలో, లలితా పరమేశ్వరి లాలిత్యం కనపడుతుంది. లాలిత్యం అంటే చలనం, స్పందనం, నర్తనం, ఆవర్తనం, చైతన్యం- ఇవన్నీ రూపుదాల్చితే శ్రీలలితా పరమేశ్వరి. ‘ననుబ్రోవు లలిత వేగమే, చాల నిన్ను నెఱ నమ్మియున్న వాడగద భక్త కల్పికలతా’’ అన్న శ్యామశాస్ర్తీ లలితరాగాకీర్తన, ముత్తుస్వామి దీక్షితుల లలితా నవావరణ కీర్తనలు దీప్తినిస్తాయి.

శ్రీమహాలక్ష్మి

ఈ విశ్వమంతా విష్ణుమయం. విశే్వశ్వరి- శ్రీమహాలక్ష్మి. విశ్వానికీ విష్ణువుకీ భేదం లేదు. అలాగే శ్రీమహావిష్ణువుకి, శ్రీమహాలక్ష్మికి తేడా లేదు. శ్రీమహాలక్ష్మి భోగరూపంలో భవానిగా, రణరంగంలో దుర్గగా, రౌద్రంలో మహాకాళిగా, పుంభావ రూపంలో విష్ణువుగా భాసిల్లుతుంది.
మంచి పనులకు, మంచి ఆలోచనలకు మహాలక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మహాలక్ష్మీ కటాక్షంతో, మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుడే లక్ష్మీదేవికి సహోదరుడు గనుక. లక్ష్మీ అష్టోత్తరంలో ‘చంద్ర సహోదర్వై నమః’ అని ఉంటుంది. అర్థ కామాల్ని ధర్మంతో అనుసంధానిస్తే, మోక్షాన్ని ప్రసాదిస్తానంటుంది శ్రీమహాలక్ష్మి.

మహాసరస్వతి

జ్ఞాన విజ్ఞానదేవత, చదువులతల్లి- మహాసరస్వతి. సంగీత సాహిత్యాది లలిత కళలన్నీ ఆ దేవీ స్వరూపం. మంచి మాట తీరునిచ్చే జగన్మాత మహాసరస్వతి. శ్రీదేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవమములలో ప్రధానమైనది సరస్వతీ పూజ. ఎంత భాగ్యం ఉన్నా, దాన్ని అనుభనంలోకి తెచ్చేది విజ్ఞానం. అది లేకపోతే అన్నీ వ్యర్థం. సప్తమి తిథి, మూలానక్షత్రం కలిసిన రోజు చేసే పూజ- సరస్వతీపూజ. జీవితలక్ష్యాన్ని పొందించే జగన్మాత మహాసరస్వతి.

శ్రీదుర్గామాత

దుఃఖనివారణి శ్రీదుర్గామాత. క్షేత్రము, తీర్థము, దైవము అనే రుూ మూడు, దేనికవే పవిత్రమైనవి. అవి మూడూ త్రిపుటిగా ఒక్కచోటే నెలకొని ఉంటే- అది మహాపవిత్రమైన పుణ్యక్షేత్రం. క్షేత్రం- ఇంద్రకీలాద్రి తీర్థము- పవిత్ర కృష్ణవేణీ నది, దైవము- స్వయంభువు శ్రీ కనకదుర్గాదేవి. మరి ఆ ప్రదేశము విజయవాడ. రాహు, కేతు దోషాల్ని పోగొట్టే మాత శ్రీ దుర్గ. శ్రీదుం దుర్గే శివసంసర్గే అన్న శ్రీరంజని రాగంలోని ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తన దుర్గాపూజకు స్ఫూర్తి.

మహిషాసురమర్దిని

మహిషాసురుడనే రాక్షసుణ్ణి వధించి సర్వులకు ఆనందాన్ని చేకూర్చిన జగన్మాత మహిషాసుర మర్దిని. ’మహిషాసుర మర్దినీం నమామి మహనీయ కపర్తి నీ...’ అని తల్లిని అద్భుతంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. ‘శక్తి’ సంపదను లోక కల్యాణానికి ఉపకరించి, కామాన్ని ధర్మంలో అనుసంధించి అనుభవించి పూర్ణత్వాన్ని పొంది లోక కల్యాణాన్ని కాంక్షించే మోక్షమార్గాన్ని అనుసరించాలని మహిషాసుర మర్దిని పూజ హెచ్చరిస్తోంది.

శ్రీ రాజరాజేశ్వరి

తల్లిగా కరుణించి లాలించి తండ్రిగా పోషించి, గురువుగా విజ్ఞానాన్ని అందించి, తప్పుదోవ పట్టకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది జగన్మాత. అందుకే ఆవిడ శ్రీమాత. బ్రహ్మాండమంతా జగన్మాత సామ్రాజ్యం- మహారాజ్ఞి. సింహాసనేశ్వరి- శ్రీ రాజరాజేశ్వరి. పురాణి ధర్మసంవర్థని శ్రీ పురాధీశ్వరి రాజ రాజేశ్వరి అని త్యాగరాజస్వామి మనకందించిన కీర్తనలు. మనకు సంప్రాప్తించిన జ్ఞానాన్ని, శక్తిని స్వార్థరహితంగా సర్వుల క్షేమానికి ఉపకరించాలని హెచ్చరిస్తోంది శ్రీ రాజరాజేశ్వరి.

స్ర్తిమూర్తినే ఉపాసించటంలో ఆంతర్యం

సగుణోపాసనలో భగవత్ తత్త్వాన్ని పురుషుడుగా గాని, స్ర్తిమూర్తిగా గాని ఉపాసించవచ్చు. అయితే పరాభక్తి ప్రేమరూపమైనదేగాని, భయంవలన కలిగేది కాదు. తల్లి ప్రైమైక స్వరూపాణి. బిడ్డ చేసిన తప్పుల్ని క్షమిస్తుంది. అందువలన తల్లిగా పరతత్త్వాన్ని ఆరాధించటం సులభం. ఈ విధంగా పరమాత్మ తత్త్వ శక్తి వెలుగును స్ర్తి రూపంగా ఆదిపరాశక్తిగా, జగన్మాతగా ఉపాసించి జన్మ సాఫల్యం పొందించే పర్వదినములే శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవములు.

రాత్రి శబ్ద విశేషమేమిటి?

జగన్మాత రాత్రి స్వరూపిణి. పరమేశ్వరుడు పగలు, జగములనేలే తల్లి ఆరాధనే రాత్రి వ్రతము. ‘సీతామాత కాల రాత్రి. ఆమె జోలికి పోయినా అవమానించినా, బలాత్కరించటానికి ప్రయత్నించినా, మొత్తం లంకను భస్మం చేస్తుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. అయితే ఆమెను ఆరాధిస్తే, సీతామాత జ్ఞాన భిక్ష నొసగి కాపాడుతుంది. కాలరాత్రి అయిన సీతామాతయే వేదవిద్య అని చెప్పాడు రామాయణంలో హనుమంతుడు ద్వారా రావణాసురునికి జ్ఞానబోధ చేయిస్తూ వాల్మీకి మహర్షి. జగన్మాత ఆరాధనే రాత్రి వ్రతం. రాత్రిదేవియే, మహాకాళి మహాలక్ష్మి, మహాసరస్వతి రూప నామములతో పూజింపబడుతోంది. దుష్ట రాక్షస సంహారం గావిస్తుంది, శిష్టులను రక్షిస్తుంది. అందుకే జగజ్జననికి ‘కాలరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు, తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే అర్థాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థం వస్తుంది. పాడ్యమి మొదలు నవమి తిథి వరకు శ్రీ దేవీ పూజ, శరదృతువులో చేస్తారు.
పాడ్యమి తిథినాడే ఎందుకు ప్రారంభించాలి
‘పాడ్యమి’ అంటే బుద్ధి అని చెప్పబడింది. మన బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదాదేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది, సర్వశుభములను చేకూరుస్తుంది.

శరదృతువు విశిష్టత ఏమిటి?

మానవ జన్మకు సార్థకతను చేకూర్చేది, అతని బుద్ధి, మనస్సును సక్రమంగా ఉంచుకుంటే, బుద్ధి ఋజుమార్గంలో ఉంటుంది. మనఃకారకుడు చంద్రుడు. చంద్రుడు వెనె్నలను ఎక్కువగా పండించేకాలం- శరదృతువు. ‘‘ఇషశ్చోర్జేశ్చ శారదావృతూ’’- ఆశ్వయుజ, కార్తికమాసములు శరదృతువు. ‘శృణాతి పంకం ఇతి శరత్’- బురదను పోగొట్టి నిర్మలముగా ఉంచేది ‘శరత్’. కనుక శరదృతువులో మనస్సును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవటానికి మహర్షులు చెప్పిన మార్గాల్లో ‘జగన్మాత ఆరాధన’ ముఖ్యమయింది.
జ్యోతిషశాస్తర్రీత్యా చంద్రుడంటే తల్లి, జగజ్జనని. పూర్ణమయిన చైతన్య స్వరూపిణి. ‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనమ్, శాన్దిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’ అని, శరదృతువులో నవరాత్ర వ్రతం గురించి, స్కాందపురాణం పేర్కొన్నది. ‘నవ’ అంటే తొమ్మిది, క్రొత్త అనే అర్థాలున్నాయి. ఇవి కాక ‘నవ’ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి- పార్వతి. కనుక నవరాత్రమంటే పార్వతీ పరమేశ్వరులు, శివశక్తులు, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజా అని అర్థము. పరమాత్మ నవ స్వరూపుడు. ‘‘నవోనవోభవతిజాయ’మనగా అన్నది శృతి. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’- నవ శబ్దానికి స్తుతింపబడుచున్నవాడు అని అర్థము. శబ్దరూపమైన వేదము - ప్రకృష్టమైన నవ స్వరూపం. అదే ప్రణవ స్వరూపం. పరమేశ్వరుడు నిత్యనూతనుడు. సర్వకాల సర్వావస్థల యందు ఉండేవాడు. శివశక్తులకు భేదం లేదు. అందుకే జగన్మాతకు ‘శివా’ అని పేరు కూడా వున్నది. ‘పురాపినవం’- అనేదాన్ని బట్టి పురాణములెంత ప్రాచీనములైనా, నిత్యనూతనముగా భాసిల్లుతాయి. నవరాత్రులు కూడా ప్రాచీనకాలం నుండి ఆచరించబడుతున్న నిత్యనూతనములు, పూజనీయములు.

పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464