మెయిన్ ఫీచర్

తిరువీధుల మెరిసే దేవదేవుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలేశుడు, తిరుమలప్ప, శ్రీగిరీశుడు, వేంకటేశుడు. ‘తిరు’ అంటే ‘శ్రీ’, ‘మల’ అంటే కొండ, గిరి, పర్వతం. కనుక ‘తిరుమల’ అంటే శ్రీగిరి. శ్రీగిరిమీద స్వయంభువుగా వెలసిన కరుణామయుడు, వేంకటేశ్వరుడు- ఏడుకొండలవాసి. ఆధ్యాత్మిక యోగ సాధనతో ఉన్నత స్థితికి చేరుకొని శ్రీమంతుడైన భక్తుని హృదయపీఠమే-శ్రీగిరి, దాని ప్రభువే పరమాత్మ, నిరాకార నిరంజన పరబ్రహ్మము, సాకార రూపంగా తొమ్మిదిన్నర అడుగుల సాలి గ్రామ శిలావిగ్రహం- సర్వమంగళ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరస్వామి.

అలర్మేల్ మంగ అంటే ఎవరు?

ముందుగా తిరుచానూర్ అంటే తెలుసుకుందాం. తిరు అంటే శ్రీ, చాన్ అంటే ‘దేవి’. తిరుచానూర్ అంటే ‘శ్రీదేవి’. ఆవిడే అలమేలుమంగ, అలర్మేల్ మంగ. అలరంటే- పద్మం. ‘మేర్’ అంటే ‘మీద’. పద్మంమీద నివసించే, ‘మంగై’ అంటే మాత- పద్మాలయ అయిన మాత పద్మావతి. పారమేశ్వరమైన శక్తికి నిలయాలు ‘పద్మాలు’. ఈ పద్మాలేమిటి? పద్మాలేవో కావు మన శరీరంలోని మూలాధారాది షట్చక్రాలు, అవే షట్కమలాలు. వాటిలో విహరిస్తుందా శక్తి. అంత్యంలో సప్తమ చక్రమైన అనగా ఏడు కొండలపైన ఆనంద నిలయంలో తనకాశ్రయమైన పరమాత్మతో వేంకటేశునితో ఏకమవుతుంది
.
ఆనందనిలయమంటే?

కుండలినీశక్తి సుషుమ్నానాడి ద్వారా ఆరు చక్రాలు దాటి సప్తమ చక్రమైన సహస్రారాన్ని చేరగానే అమృతధారలు వర్షిస్తాయి. జ్ఞానజ్యోతి ద్యోతమవుతుంది. అలాగే భక్తుడు ఆరుకొండలు దాటి ఏడవ కొండ చేరుకుని ఆనంద నిలయంలో అమృతమయమైన స్వామిని దర్శించి ఆత్మానందానుభూతిని పొందుతాడు. అటువంటి బ్రహ్మాండనాయకునికి, సర్వదేవతా స్వరూపునికి, పరబ్రహ్మకు నిత్యోత్సవాలు, వారోత్సవాలు, తిరునక్షత్రోత్సవాలు సంవత్సరోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

బ్రహ్మోత్సవాలు

సంవత్సరానికొకసారి జరిపే బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి. పదిరోజులపాటు జరిపే ఉత్సవం. ‘‘ఉత్ సూతే హర్ష అనేన ఇతి ఉత్సవః’’- మనలో ఉన్న ఆనందాన్ని పైకి భక్త్భివంతో వ్యక్తీకరించటాన్ని ఉత్సవం అంటారు.

కోయిల్ ఆళ్వారు తిరుమంజనం

బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో సమాప్తమవుతాయి. ఇది పది రోజుల ఉత్సవం. వేడుకలు ప్రారంభించటానికి ముందే ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. దీనే్న ‘కోయిల్ ఆళ్వారు తిరుమంజనం’ అంటారు. విద్యుత్ దీపాలతోను, పూల పందిళ్ళతోను, మామిడాకులతోను శుభకార్యములను సూచించే అరటి స్తంభాలతోనూ శోభాయమానంగా అలంకరిస్తారు.

ధ్వజారోహణం, అంకురార్పణ

ధ్వజారోహణకు ముందు రోజు సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది. సర్వసైన్యాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయానికి నైఋతి మూల భాగంలో వున్న వాసంత మండపానికి వైభవోపేతంగా తరలి వెళ్లి, భూమి పూజాది వైదిక కార్యక్రమాలు నిర్వర్తించి, మృత్సంగ్రహణం చేసి ప్రదక్షిణంగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు. ఆ రాత్రి అంకురార్పణ జరుగుతుంది.
మరునాడు కార్యక్రమం:్ధ్వజారోహణం. గరుడకేతన ప్రతిష్ఠ, కంకణధారణ, బలిహరణ జరుగుతుంది. వేద స్వస్తి, మంగళవాద్యాలు మ్రోగుతుండగా, శ్రీదేవి భూదేవి సహితుడైన మలయప్పస్వామివారి సమక్షంలో అర్చక స్వాములు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. పెసరపప్పు బియ్యంతో చేసిన ముద్గలాన్నాన్ని నివేదిస్తారు. ఆ రాత్రినుంచే ఊరేగింపులు ప్రారంభమవుతాయి.

పెద్ద శేషవాహనం

ధ్వజారోహణం అయిన తరువాత పెద్ద శేషవాహనంపై ఇద్దరు దేవేరులతో మలయప్పస్వామిని పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. ఈ ఆదిశేషుడే భూభారాన్ని వహించేది. వైకుంఠంలో పాలసంద్రంలో స్వామి శేషశయనుడు. ఈ శేషుడే లక్ష్మణుడుగా అవతరించి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చెంత నిలిచాడు. ఈ విషయానే్న హరికాంభోజ రాగ కీర్తనలో త్యాగరాజస్వామి తెలియజేశాడు. ఈ ఆదిశేషుడే, ఆశేషాచలం.

రెండవ రోజు ఉత్సవం:

ఉదయం వెండి చిన శేష వాహనంలో స్వామి ఒక్కరే ఉత్సవం జరుపుకుంటూ దర్శనమిస్తారు. ఆయనలోనే శ్రీదేవి భూదేవి ఉంటారు. ‘‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఈశా వాస్యమిదం సర్వం..’’ యిలా శృతి స్మృతి పురాణాలలో పేర్కొనబడిన విశేషాల్ని వేంకటేశుని పరబ్రహ్మతత్త్వాన్ని తెలియపరస్తుంది. ఉన్నదంతా ఒకే శుద్ధ చైతన్యం. దానికి భిన్నంగా సృష్టిలో మరేదీ లేదని, శ్రీగిరీశుని పరబ్రహ్మతత్త్వాన్ని చాటి చెప్తుందీ ఉత్సవం.

రెండవ రోజు రాత్రి:

బంగారు హంస వాహనంపై స్వామివారొక్కరే వీణాపాణి అయి చదువుల తల్లికి, శారదా మాతకు, సరస్వతీదేవికి ప్రతిరూపంగా భక్తజనావళికి దర్శనమిస్తారు. మనం పీల్చేగాలి, వదిలే గాలి- ప్రాణాయామం చేసేటప్పుడు సోహం- హంస శబ్దం వినపడుతుంది. ఇది ప్రాణశక్తి. ఇది ఉంటేనే జీవుడు ‘శివం’, లేకపోతే ‘శవం’. ‘‘హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహే త్వంనో హంస ప్రచోదయాత్’ అన్నది శృతి. గంగానది తనకు అంటిన పాపాల్ని పోగొట్టుకోవటానికి నల్లని కాకి రూపంలో, కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేసి, తెల్లని రాజహంసగా మారి వెడుతుందని ప్రశస్తి. మన మానవ హంసల్ని, స్వామి పరంచేస్తే, కరుణాళుడై శ్రీవేంకటేశుడు మనల్ని హంసలుగా మార్చి ఆనందమయ కోశంలో విహరింపజేస్తాడు. ధర్మంతో అర్థకామాల్ని అనుభవింపజేసి, అంత్యంలో మోక్షపురుషార్థాన్ని అనుగ్రహిస్తాడు. ‘సరాంసి జలాని సన్తి అస్యాః యితి సరస్వతి’ జ్ఞానదేవత సరస్వతి ఆమె వాహనం హంస (హంసి) బ్రహ్మదేవుని వాహనం- హంస. ఈరోజున స్వామి ఉత్సవంలో పాల్గొని, దర్శిస్తే, గొప్ప చదువులు, రసజ్ఞత కలుగుతుంది.

మూడవ రోజు ఉదయం:

ఈ రోజు స్వామివారు ఒక్కరే సింహ వాహనంపై ఊరేగింపబడతారు. శత్రువులను సంహరించేది సింహం. శౌర్య, ధైర్య సాహసములకు ప్రతీక సింహం. ‘మృగాణాంచ మృగేంద్రోహం’ అన్నారు గీతాచార్యుడు. సంసారఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి మద మాత్సర్య మత్త్భాల్ని అణచేశక్తికి ప్రతీకయే సింహవాహనుడైన శ్రీగిరీశుడు వేంకటేశుడు.

మూడవనాటి రాత్రి:

ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్పస్వామి వారిని ఊరేగిస్తారు. ముత్యమనగానే మనకు జ్ఞాపకం వచ్చే గ్రహము-చంద్రుడు. ‘‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీసుతుడు’’ అన్నాడు అన్నమయ్య. మాయను జయించి మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే కలియుగ దైవం- శ్రీవేంకటేశ్వరస్వామి. ఏడుకొండల శ్రీనివాసుని ఆరాధిస్తే, అర్చిస్తే, ఉపాసిస్తే, పనికిరాని గవ్వ స్వాతిచినుకువల్ల ముత్యంగా మారినట్లు, మన జీవితాలు ధన్యమవుతాయని ముత్యాల పందిరి వాహనం ప్రబోధిస్తోంది.

నాల్గవనాటి ఉదయం:

కల్పవృక్ష వాహనం. ఉభయ దేవేరులతో కూడి ఏడు కొండల శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తాడు. విత్తనాన్ని నాటి, కాసిని నీళ్ళు పోస్తే మొక్కయి, మానయి పెద్ద వృక్షమవుతుంది. పుష్పాలను, ఫలాలను, నీడను ఇస్తోంది- వృక్షజాతి. మానవుడు కాసిని నీళ్ళు పోసినందుకుగాను, ఈ సమాజానికి ఋణం తీర్చుకుంటోంది. మానవుడు కూడా తమని ఆదర్శంగా తీసుకొని సమాజానికి తన వంతు కర్తవ్యాన్ని అందించి, నిస్వార్థ సేవతో కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండమని హితబోధ చేస్తోంది వృక్షజాతి. ‘వృక్షో రక్షతి రక్షితః’- వృక్షసంపదను పెంపొందించండి. అవి అనేక విధాలుగా మన జీవనాన్ని సుసంపన్నం చేస్తాయి. ‘మీ పాలిటి కల్పవృక్షాన్ని నేనే. మీరు కోరుకున్నవి నేను తీరుస్తాను’ అని కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ ఆపదమ్రొక్కులవాడు అభయమిస్తున్నాడు.

నాల్గవనాటి రాత్రి:

సర్వభూపాల వాహనం, శోభాయమానంగా అలంకరించబడిన బంగారు మండపం. మండప మధ్యలో ఉభయ దేవేరులతో కూడి, సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి, మహారాజ ఠీవితో ఊరేగుతూ దర్శనమిస్తూ, భక్తుల కోర్కెలను అనుగ్రహిస్తూ, అభయమిస్తాడు. ‘‘శీఘ్రమేవ గృహే శుభకార్య ప్రాప్తిరస్తు’ అని దీవిస్తారు.

ఐదవ నాటి ఉదయం:

మోహినీ అవతారం దాల్చి, దందపు పల్లకినెక్కి దర్శనమిస్తాడు. అమృత కలశాన్ని చేతిలో పట్టుకుంటాడు. ‘న కర్మణా న ప్రజ యాధనేన త్యాగే నైకే అమృతత్వ మానసుః’ అన్నది శృతి. త్యాగగుణం ఉన్నవారికి అమృతమైన మనస్సు ఉంటుంది. బాహ్య సౌందర్యానికి భ్రమపడి భ్రష్టులవకుండా సర్వాంతర్యామిగా జగదానందకారకునిగా పుంసాం మోహనరూపునిగా దర్శించి ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలిసికోరే’ అని హితవు పలుకుతూ నన్ను శరణు వేడండి, అమృతమయమైన మనస్సు ప్రసాదిస్తానని అభయమిస్తున్నాడు వేంకటాద్రి నిలయుడు.

ఐదవనాటి రాత్రి:

ఈ రోజు జరిగే వాహన సేవ ‘గరుడోత్సవం’. అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. ఆ రోజు మూల విరాట్టుకు అలంకరించే మకరకంఠి లక్ష్మీహారాది శ్రేష్టమైన రమ్యమైన ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. ఆ రోజే శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పూలమాలను తెచ్చి స్వామివారికి అలంకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తమిళనాడులోని మిరాశిదారులు, కాలినడకన పది రోజులు ముందుగా బయలుదేరి క్రొత్త గొడుగులను తెచ్చి స్వామికి సమర్పిస్తారు. గరుత్మంతుడు వేదస్వరూపం, అప్రతిహత శౌర్యవంతుడు బలవంతుడు, తల్లికి దాస్యవిముక్తి చేసిన ఆదర్శ తనయుడు. శ్రీవేంకట పరబ్రహ్మను బంగారు గరుడోత్సవంలో దర్శించటం- సర్వపాపహరం, సర్వసంపత్కరం, సర్వశ్రేయోదాయకం.

ఆరవనాటి ఉదయం:

స్వామికి హనుమంత వాహనం. హనుమంతుడు ఈశ్వరాంశయని పురాణ ప్రశస్తి. ‘‘అంతకారి నీ చెంత చేరి హనుమంతుడై కొలువలేదా’’ అన్నాడు త్యాగయ్య. ‘సంస్కారక్రమ సంపన్నా’ అంటూ హనుమంతుడు మా కులదైవమన్నాడు శ్రీరామచంద్రుడు. సర్వరోగములను హరించి, భయాన్ని పారద్రోలి, గ్రహపీడను తొలగించే అభయప్రదాత ఆంజనేయుడు. ‘గీతార్థము సంగీతానందము నీ తావున జూడరా మనసా, సీతాపతి చరణాబ్జములిడుకొన్న వాతాత్మజునికి బాగా తెలుసురా’’ అనే సురతిరాగ కీర్తన, ‘పాహి రామ దూత జగత్ప్రాణ కుమార మాంపాహి’ అన్న వసంతవరాళి రాగ కీర్తనలలో త్యాగరాజస్వామి, అన్నమయ్య ఆంజనేయ తత్త్వాన్ని హృద్యంగా వివరించారు. అవి హనుమంతుని సంపూర్ణ భక్త్భివాన్ని తెలుపుతాయి. సీతాప్రాణప్రదాత హనుమంతుడు. హనుమంత వాహనంపై ఊరేగుతూ ‘‘మా యిరువురికి భేదంలేదని’’ చాటుతూ దర్శనమిస్తాడు వేంకటాద్రి రాముడు.
ఆరోరోజు మధ్యాహ్నం: శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం ఉభయ దేవేరుల సమేతంగా మలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి తిరుమల పురవీధుల్లో వేద పారాయణ మంగళవాద్యములతో ఊరేగుతాడు. హితము రమ్యము అయినది హిరణ్యం- బంగారం. ‘హిరణ్యవర్ణాం హరిణీమ్ సువర్ణ రజ తస్తజామ్’ అని శ్రీమహాలక్ష్మిని శ్రీసూక్తంలో అభివర్ణించి స్తుతించారు. అందుకే ఈ ఉత్సవం ‘సువర్ణరథరంగ డోలోత్సవం’ అని పిలువబడుతుంది.

ఆరవనాటి రాత్రి:

గజవాహనం ఏండ్ల తరపడి చిన్న మొసలితో పోట్లాడి, చివరకు విధిలేక పూర్తి శరణాగతితో స్వామిని వేడుకొంటే, ఉన్నపళంగా వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఇదే ఉత్తరాయణ పుణ్యకాలము, మకర సంక్రాంతి పండుగకు స్ఫూర్తి. భగవదనుగ్రహంతోనే జీవితం చరితార్థత చెందుతుందని, రక్షణభారం అంతా నామీద ఉంచండి, పురుష ప్రయత్నం చేయండని గజవాహనుడైన శ్రీగిరీశుడు, గీతలో చెప్పిన విషయాన్ని ప్రస్ఫుటిస్తున్నాడు.
ఏడవ రోజున: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. మానవ జీవితానికి మంగళతోరణం- సూర్యకిరణం. ప్రాణికోటికి ప్రాణాధారం సూర్యుడు. సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యుడు. మనమందరం సూర్యుని ఆత్మస్వరూపం. మనస్సుకు అధిపతి చంద్రుడు. సూర్యచంద్రుల గమనమువల్లనే కాల భేదము లేర్పడతాయి.

ఎనిమిదవ రోజు రథోత్సవం:

‘రథ్యతే ఇతి రథాః’, ‘రమంతే అత్ర రథాః ఇతి’ రమణీయత్వాన్నిచ్చేది రథం. అందరూ రమిస్తారు, కనుక రథమని పేరు. ‘బ్రహ్మాణం బ్రహ్మవాహనం’ పరబ్రహ్మ స్వరూపుడై శ్రీవేంకటేశ్వరస్వామికి రథోత్సవం. భగవంతునికి ‘బ్రహ్మ’ అని పేరు. కనుక బ్రహ్మాణం బ్రహ్మవాహనం అన్నారు. ఎన్ని వాహన సేవలు జరిగినా, రథోత్సవమే అన్నిటికీ మకుటాయమానం. యజ్ఞము కూడా రథమే. రథోత్సవమంటే యజ్ఞకార్యముగింపు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామిని రథోత్సవంలో దర్శించినవారి జీవితం ధన్యం.
ఎనిమిదవ నాటి రాత్రి అశ్వవాహనం:అశ్వనీ దేవతలు ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తారు. మన ఇంద్రియాలు గుఱ్ఱాలు. స్వామి శిరస్త్రాణాన్ని దాల్చి, చేత ఖడ్గం పూని అశ్వంపై సంచరిస్తాడు. మనల్ని జితేంద్రియులుగా చేస్తాడు.

తొమ్మిదవనాటి ఉదయం

చక్రస్నానం: శుభప్రదమైన దర్శనం చేత మోక్షాన్ని ప్రసాదించే స్వామి సుదర్శనుడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేది సుదర్శనం. పుష్కరిణిలో సుదర్శన చక్రాయుధాన్ని ధరించిన స్వామియే మనకు రక్షకుడు. పుష్కరిణిలో సుదర్శన చక్రానికి అవభృధ స్నానం చేయిస్తారు. భక్తులందరూ పవిత్ర స్నానాలాచరిస్తారు.
తొమ్మిదవనాటి రాత్రి: ధ్వజ అవరోహణంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి.
‘‘ఎక్కువ నీవని దిక్కుల బొగడగ అక్కర గొని మదిసొక్కి కనుంగొన నిక్కము నీవే గ్రక్కున బ్రోవు తళుక్కని మెరిసే చక్కదనముగల వేంకటేశ నిను సేవింపను పదివేల కనులు కావలెనయ్య’’ అన్న త్యాగరాజస్వామి వారి మధ్యమావతి రాగ కీర్తన బ్రహోత్సవాలకు దీప్తినిస్తుంది.

బ్రహ్మోత్సవం పేరెలా వచ్చింది?

శ్రీవేంకటేశ్వరుని దర్శించిన బ్రహ్మ ‘సమస్తజీవులకు పరమానందకరమైన నేత్రోత్సవం, దీనిని శాశ్వతంగా జరుపుకోవటానికి అనుగ్రహాన్ని ప్రసాదించండి’ అని ప్రార్థించాడు. శ్రీగిరీశుని అనుగ్రహానికి పాత్రుడై, తాను సంకల్పించిన బ్రహ్మోత్సవ క్రతువును ఆనాడే అంకురార్పణ చేసి ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని చేత ప్రారంభించబడినాయి కనుక ‘బ్రహ్మోత్సవాలని’ పేరొచ్చింది. శ్రీవారి పాదాలను బ్రహ్మ సేవించి ప్రారంభించినందుకే ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని పేరొందింది బ్రహ్మోత్సవం.
బ్రహ్మోత్సవాలకు ఆ పేరు రావటానికి మరొక ఉదంతం కూడా ప్రమాణంగా చెప్తారు. ‘నవ’ సంఖ్యకు ‘బ్రహ్మాభిదాఖ్య’ సంఖ్య అని పేరు. ముందురోజు జరిగే అంకురార్పణ, ధ్వజారోహణం ముగింపు రోజున జరిగే పుష్పయాగం. ఇవి మినహాయించి, మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక వీటికి బ్రహ్మోత్సవాలని ప్రసిద్ధి వచ్చింది. అంతేగాక, సాక్షాత్ పరమ్రహ్మ స్వరూపుడైన శ్రీగిరీశుడు వేంకటేశునికి జరుపబడుతున్న ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలని పేరు కలిగిందని చెప్తారు. అత్యున్నతంగా ‘బ్రహ్మాండంగా’ జరిగే ఉత్సవాలు కనుక ‘బ్రహ్మోత్సవాలు’ అని పిలువబడుతున్నాయని చెప్తారు.
బ్రహ్మోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు?
బ్రహ్మోత్సవాలను, సూర్యుడు కన్యరాశిలో ఉండగా నిర్వహిస్తారు. ఆశ్వీయుజ మాసంలో కన్యామాసం వస్తుంది. ప్రతి మూడు సంవత్సరాలకొకసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వస్తుంది. ఆ సంవత్సరం రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపదంలోను, ఆశ్వయుజ మాసంలోను జరుపుతారు.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464