మెయన్ ఫీచర్

సుపరిపాలన శూన్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రభుత్వంలోనైనా సుపరిపాలన సాగుతున్నదా, లేదా! అన్నది చెప్పడానికి రెండే గీటురాళ్లు. ఒకటి ప్రజల సమస్యలు, రెండోది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రజలకు నిత్యసమస్యలు అనేకానేకం ఉన్నా, అన్నిటికంటె ప్రధానమైనది నిత్యావసరాల ధరవరలు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రధానంగా చూడవలసింది కేటాయింపులు, అప్పులు. ఈ రెండింటిని బట్టి చూస్తే ప్రభుత్వపాలన ఏ విధంగా ఉన్నదో తేలికగానే చెప్పవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన 16 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం సుపరిపాలనకు ఇంకా చాలా దూరంగానే ఉన్నదని ఆ రెండు గీటురాళ్లను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
సుపరిపాలన ఉన్నదని చెప్పడానికి మరో గీటురాయి హామీల అమలు. ఈ అం శంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యానికి ఆమడ దూరంలోనే కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడకముందు ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలు చేసినవెన్ని? ఇంకా ఇస్తున్నవెన్ని? అన్నది పరిశీలిస్తే పది శాతం కూడా మార్కులుపడే అవకాశంలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీయే ‘సుపరిపాలన’. ఇంకా మిగిలిన హామీలు కోకొల్లలు. ఆ హామీలు అమలు జరిగి ప్రజలు సంతృప్తిగాఉంటే సుపరిపాలన సాధించినట్లవుతుంది. కానీ ప్రధాన హామీలే అమలుకానప్పుడు రాష్ట్రం లో సుపరిపాలన ఉన్నదని ఎలా చెప్పగలం! అది లేనప్పుడు ప్రజలు వేసిన ఓటుకు విలువ ఏముంటుంది!
అధికారంలోకి వచ్చిన రోజునుండి ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులను పరిశీలిస్తే ప్రజలకు తాను ఇచ్చిన హామీలను గాలికివదిలివేసి కొందరు సంపన్నులు, పార్టీలోని ‘అస్మదీయుల’ ప్రయోజనాలకోసం మాత్రమే- పనిచేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడం, అనుత్పాదక కార్యక్రమాలపై అధికంగా వెచ్చించడంవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది గాని, ప్రజలకు ఎంతమాత్రం ప్రయోజనం కలిగించడం లేదు. ఆ కమిటీలు, ఈ కమిటీలు అంటూ కాలక్షేపం చేయడంలోనే 16 నెలలు గడిచిపోయాయి. వందలు, వేల, కోట్లల్లో ప్రజాధనం దుబారా ఒక్కటే ఈ పదహారునెలల్లో కనిపిస్తున్న సత్యం అనిపిస్తుంది.
చంద్రబాబు అధికారంలోకి రావడానికిముందు ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది రైతు రుణమాఫీ. ఈ విషయంలో ప్రభుత్వం పాక్షికంగానే మాట నిలబెట్టుకొన్నదని రైతుల ఆక్రందనలు, వారి ఆత్మహత్యలు చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం రైతులకు చెల్లించినట్లుగా చెబుతున్న మొత్తం వడ్డీకైనా సరిపోదనీ, అసలు అలాగే ఉండడంవల్లనే వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనీ అర్థమవుతుంది. చివరికి గిరిజన సహకార కార్పొరేషన్ పరిధిలోని రైతులకు సైతం రుణమాఫీ అందడంలేదంటే ప్రభుత్వ నిర్వాహకాన్ని ఏమనుకోవాలి! రకరకాల కారణాలవల్ల ఆ రైతులకు రుణమాఫీ వర్తింపచేయడంలేదని తెలుస్తోంది. ఏవో కుంటిసాకులు చెప్పి 80 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగకుండా ఎగ్గొడుతున్నప్పుడు అది ‘సంక్షేమ పాలన’ ఎలా అవుతుంది? ఆ రైతులు ఏంచేయాలి! డ్వాక్రా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీచేస్తామని ఎన్నికలముందు వాగ్దానంచేశారు. కానీ చివరికి అది కూడా శుష్క వాగ్దానమే అయింది.
ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌నుండి కొత్త రాజధానికి వారు తరలివచ్చే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల వారు తీవ్ర అగచాట్లకు గురికావలసి వస్తోంది. పదో వేతన సవరణ సంఘం నివేదికను ఆమోదిస్తున్నామంటూ బహిరంగంగా ప్రకటించిన ప్రభుత్వం తర్వాత మాటమార్చిందని ఆ ఉద్యోగులే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిఆర్‌సిని ప్రకటించకపోవడమేగాక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల విషయంలో కూడా ప్రభుత్వం హామీలను విస్మరించింది. ప్రభుత్వంలో 40నుంచి 45 శాతం పోస్టులు ఖాళీగాఉన్నా వాటిని పట్టించుకోవడం మానేసి, కనీసం కాంట్రాక్టు సిబ్బంది సమస్యలనైనా పరిష్కరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తుంది.
ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీనీ పది లక్షల రూపాయలకు పరిమితంచేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయించడం కూడా వారికి ‘దీపావళి షాక్’లా మారింది. పదో వేతన సంఘం 12 లక్షలు ఇవ్వాలని సూ చించగా, ప్రభుత్వం దానిని పది లక్షలకే పరిమితం చేయడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేగాక పెన్షనర్ల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం చిన్నచూపుతో ఉన్నట్లు కనబడుతోంది. పెన్షనర్ల మెడికల్ అలవెన్స్‌లో కోత పెట్టాలనుకోవడం అటువంటిదే.
ఇంటికో ఉద్యోగం, లేదంటే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు చంద్రబాబు వాగ్దానం చేశారు. అయితే ఒక్క ఇంటికి కొత్తగా ఉద్యోగమూ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతీ చెల్లించడం లేదని లెక్కలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు అంతం త మాత్రంగానే ఉండడంతో నిరుద్యోగ యువతలో విషాద ఛాయలు అలముకొంటున్నాయి. అటు ఉద్యోగుల సంక్షేమాన్ని వదిలేసి, ఇటు నిరుద్యోగుల భవిష్యత్తునూ కాలరాచి చంద్రబాబు సర్కార్ ఇక ఎలాం టి ‘సుపరిపాలన’ అందిస్తున్నట్లు!
గత కొన్ని నెలలుగా బియ్యం, పప్పులు, చక్కెర వంటి అన్ని నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగిపోయాయ. గత అక్టోబర్‌తో పోల్చితే ఈ అక్టోబర్‌కు 12నెలల్లోను మూడురెట్లు పైగా అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయ. ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గిపోవడం ఒక కారణమైతే కావచ్చు, కానీ ప్రభుత్వంనుండి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ‘పార్టీ ఫండ్’లు పెద్దమొత్తాలలో ఇచ్చిన వ్యాపారులందరూ ఖర్చుచేసిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడంకోసం గణనీయంగా ధరలు పెంచేస్తున్నారు. నిత్యావసరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తుండడంతో సగటు ప్రజలు సరుకులను దుకాణాలలోనో, మాల్స్‌లోనో చూసి మాత్రమే తృప్తిపడవలసిన దుస్థితి ఏర్పడుతోంది. దీనిని ఎలాంటి సుపరిపాలన అంటారో మరి? తాము అధికారంలోకి వస్తే ధరలు యధేచ్ఛగా పెరగకుండా సమీక్షించడానికి ధరల నియంత్రణ కమిటీ వేస్తామని చంద్రబాబు చాలా గొప్ప హామీ ఒకటి ఎన్నికలముందు ఇచ్చారు. కానీ అలాంటిది ఇప్పటివరకు వేయనే లేదు.
ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయంటూ రోజూ ప్రకటనలే ప్రకటనలు. కానీ వాటిలో ఎన్ని కంపెనీలు మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఎన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నది ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటే చేసే ప్రకటనల్లో ఐదారు శాతం మినహా కార్యరూపం దాల్చడంలేదు గనుక. విభజన తర్వాత పదమూడు జిల్లాల సీమాంధ్రలో ఐటి రంగం పూర్తిగాదెబ్బతిన్నది. విశాఖ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఐటి రంగ అభివృద్ధికి పాటుపడతామనీ, 2020నాటికి ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామనీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే హామీఇచ్చారు. కానీ ఇదికూడా ఇంతవరకు ఎక్కడా ఆచరణలోకి రాలేదు. మెగా ఐటి హబ్‌లు, ఐటి పార్కులంటూ ఊరిస్తున్నారే గాని వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయో ఏలినవారికే తెలియదు! కొత్త ఉద్యోగులను సృష్టించలేక పోవడం, కనీసం ఉన్న ఖాళీలనైనా భర్తీచేయలేకపోవడం... దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది గాని తగ్గదు కదా! మరి నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామనే హామీని ఎన్ని ‘టర్మ్’లలో నెరవేర్చగలరు?
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నదంటూ ఆర్థికమంత్రిగా ఉన్న యనమలే కొద్దిరోజుల క్రితం స్వయంగా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన దానికంటే ఏడువేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే సూచనలున్నాయని కూడా ఆయనే చెబుతున్నారు గనుక దాన్ని వేలెత్తి చూపనక్కరలేకపోయినా- ఒక ప్రశ్నమాత్రం వేయవలసి వస్తుంది. ఈ ఏడాదిన్నరగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఎలాంటి ఉత్పాదక చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే 1.25 లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉంది. అది చాలదన్నట్లు ఇంకా ఇంకా రుణాలు తెచ్చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానికంగా ఆదాయం పెరగడంలేదు, తెచ్చే అప్పులుమాత్రం పెరిగిపోతున్నాయి. మరో మూడున్నరేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా చితికిపోతుంది. ఆర్థికంగా రాష్ట్రం ఇంతగా చితికిపోతున్నపుడు ‘సుపరిపాలన’ఏ రూపంలో సాగుతున్నదనుకోగలం?
కేంద్రంనుంచి రావలసిన 12వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును రాబట్టుకోవడంలో గాని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలోగాని ఒక్క అడుగైనా ముందుకు పడడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు తరచుగా ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఆర్థికంగా మళ్లీ ఎప్పటికి సుసంపన్నమవుతుంది? ఆర్థికంగా సుసంపన్నమైతేనేకదా సుపరిపాలన సాగుతున్నదనుకోగలం? ఎన్నికలముందు ప్రచారంలో ఇచ్చిన హామీలమేరకు ప్రమాణ స్వీకారం రోజున అదే వేదికపై ఐదు ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. రైతులు, డ్వాక్రాగ్రూపుల రుణమాఫీ దానిలో ఒకటి. అది ఎంత అధ్వాన్నం ఉన్నదో చూశాం. రైతు సాధికార కమిటీ వేస్తున్నామంటూ చాలా గొప్పగా ప్రకటించారు. కానీ అది ఏం చేస్తున్నదో, ఏం చేయాలో ఎవరికీ తెలియదు. రెండోది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ పథకం. కానీ అది సక్రమంగా అమలుకావడం లేదనీ, ముఖ్యంగా వికలాంగులకు పెన్షన్ అందడంలేదనీ ఆరోపణలున్నాయి. మూడోది- రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోను రెండు రూపాయలకు 2 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా పథకం. ఈ పథకం ఊసు ఇప్పటిదాకా ఏ గ్రామంలోనూ లేదు. నాలుగోది- మద్యం దుకాణాల బెల్ట్‌షాపుల రద్దు. అది సంతకం దాటి ముందుకు నడవనే లేదు. అయిదవది- ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడం. ఇది గతంలో ఉన్నదే తిరిగి అమలులోకి తెచ్చారు గనుక దానిలో కొత్తదనమేమీ లేదు.
ముఖ్యమంత్రి స్వయంగా సంతకం చేసిన ఫైళ్ళలోని హామీల పరిస్థితే ఇలా ఉంటే, కేవలం మైకుల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని, ఎప్పటికి అమలు జరుగుతాయి? ఎప్పటికి ప్రజలు ‘సుపరిపాలన’ చూడగలుగుతారో మరి!

- అడుసుమిల్లి జయప్రకాష్ సెల్: 98481-28844