మెయన్ ఫీచర్

దురాక్రమణతో నిరంతర సంఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరం కరం కలసి కలసి
కాంతి వ్యూహమవుతున్నది,
కణం కణం కలసి విశ్వ
గణం విస్తరిస్తున్నది..
చినుకు చినుకు చేరి చేరి
సరిత పరుగు తీస్తున్నది,
చేయి చేయి చెలిమి చేసి
శక్తి అవతరిస్తున్నది...
దురాక్రమణ శక్తి దుర్జనుని చేతి ఆయుధం.. దురాక్రమణను దునుమాడగల ప్రతిఘటన శక్తి సైనికుల చేతి శస్త్రం, అస్త్రం.. పడమటి దేశాల శక్తి ప్రపంచాన్ని దిగమింగడానికై దురాక్రమించడం సహస్రాబ్దుల చరిత్ర, భారతీయుల శక్తి దురాక్రమణను ప్రతిఘటించడం, దురాక్రమణకు బలైన వారిని ఆదుకోవడం ఆదరించడం కూడ ఈ సహస్రాబ్దుల చరిత్ర.. ఈ సహస్రాబ్దుల చరిత్ర ‘తుది మొదలు’ లేని ప్రపంచ చరిత్రకు పునరావృత్తి! ‘చీకటి’ దాడి చేయడం ‘వెలుగు’ తిప్పి కొట్టడం ఆద్యంత రహితమనై సృష్టిక్రమం! సమాజం సృష్టి నిహిత వాస్తవం..
ఈ దురాక్రమణ ప్రవృత్తి ప్రస్తుతం చైనాను ఆవహించి ఉంది. టిబెట్-త్రివిష్టపం-ను, సింకియాంగ్-హూణదేశం-ను మంగోలియాలో సగాన్ని, మంచూరియాను శతాబ్దుల పాటు దిగమింగిన ‘హాణ’ భూతం చైనాకు ఆకలి తీరడంలేదు! ఆకలి తీరక పోవడం ‘తోడేలు’ స్వభావం, దురాక్రమణ స్వభావం! తోడేలు పొట్ట ఎప్పటికీ నిండదు, అందువల్లనే తోడేలు ‘మంద’లోకి చొరబడిన తరువాత ఒక పాడిపశువును మాత్రమే అపహరించుకుని పోదు, పది పదిహేను పాడిపశువుల, దూడల గొంతులను కొరికి గాయపరుస్తుంది, చంపుతుంది! ఇలా గాయపరచడం భయ విభ్రాంతికి గురి చేసే వ్యూహం! చైనా తనకు దక్షిణంగాను, తూర్పుగాను విస్తరించిన సముద్ర ప్రాంతంలో ఇలా భయ విభ్రాంతిని సృష్టిస్తోంది. ఈ అంతర్జాతీయ సముద్ర జలాలు, సముద్ర మార్గాలు తమ సొంతమని, తమ అనుమతి లేకుండా ఈ సముద్ర ప్రాంతంలో ప్రవేశించరాదని చైనా ప్రకటిస్తోంది. వియత్నాం జపాన్‌లతో సహా ఎనిమిది తూర్పు ఆసియా దేశాల సార్వభౌమ అధికార పరిధిలోకి చైనా చొచ్చుకుని వస్తోంది, భూభాగాలపై జల మండలాలపై కొత్త తగాదాలను సృష్టిస్తోంది! చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌ను మన దేశంపైకి ఉత్తరకొరియాను జపాన్‌పైకి ఉసిగొల్పుతోంది! ఇదంతా వ్యూహాత్మక విస్తరణలో భాగం. వ్యూహాత్మక విస్తరణ భౌతిక దురాక్రమణకు పూర్వ రంగం! క్రీస్తుశకం పదహైదవ శతాబ్దంనుంచి ఐరోపా దేశాల తస్కరముష్కర మూకలు ‘వాణిజ్యం’ కోసం మన దేశంలోకి చొరబడడం వ్యూహాత్మక విస్తరణ.. ఆ తరువాత ఐరోపావారు ప్రత్యేకించి బ్రిటన్ బీభత్సకారులు మన దేశాన్ని భౌతికంగా దురాక్రమించడం చరిత్ర.. చైనా మన దేశం చుట్టువున్న సముద్రతీర దేశాలలో సైనిక స్థావరాలను నెలకొల్పడం ద్వారా ఉచ్చులను బిగిస్తోంది! అరేబియా సముద్రంతో ఎఱ్ఱ సముద్రం కలిసే చోట ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో జిబౌటీ దేశం నెలకొని ఉంది. ఈ జిబౌటీలో చైనా తన నౌకాదళ, వైమానిక దళ స్థావరాలను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక విస్తరణలో భాగం! తమకు ఎలాంటి సంబంధంలేని హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను స్థాపించడం మనదేశంపై చేయ తలపెట్టిన భౌతిక దురాక్రమణకు పూర్వరంగం మాత్రమే. చైనా ‘దానవీయ శక్తి’ ఇలా నిరంతరం ఇతర దేశాలను దురాక్రమించడం కోసం బలపడుతోంది! పూర్వయుగాలలో త్రిపురాసురుడు, మహిషాసురుడు, రావణుడు, నరకుడు వంటి దుర్జనులు దానవశక్తులు! తపస్సు చేసి శక్తులను సాధించడం ఆ దానవుల ‘వ్యూహాత్మక ప్రగతి’, మానవులపై దేవతలపై దాడులు చేయడం ‘్భతిక దురాక్రమణ!
ఈ కలియుగంలో ఈ దానవీయ శక్తి భారతీయతను మరచిన వేద విజ్ఞానానికి దూరమైన విదేశీయ ‘మ్లేచ్ఛ’ జాతులను ఆవహించి ఉంది. ఇందుకు భిన్నంగా ‘దానవీయ’ దుర్జన శక్తిని ప్రతిఘటించడం కోసం భారతీయ శక్తి సమీకృతం కావడం సంఘటితం కావడం కూడ చరిత్ర! ఈ భారతీయ శక్తి దురాక్రమణను ప్రతిఘటించి తిప్పి కొట్టిన శక్తి మాత్రమే, ఇతరదేశాలపై దురాక్రమణ జరిపిన శక్తికాదు! ఇది భారతీయ స్వభావం మాత్రమే కాదు సృష్టిగతమైన సహజ స్వభావం! ఈ సృష్టిగత స్వభావం భారతీయ జాతీయ- లేదా- హైందవ జాతీయ స్వభావం కావడం కూడ చరిత్ర! ‘హిందుత్వం’ ‘్భరతీయత’ ఒకే ‘సనాతన జాతి’కి పర్యాయపదాలు. త్రిపురాసురులు దురాక్రమించడం సృష్టిగత చరిత్ర.. త్రిమూర్తులు సమీకృతం కావడం ప్రతిఘటనకు లభించిన విజయం! మహిష రక్కసుడు దురాక్రమణ శక్తికి ప్రతీక... అనాది అనంత శక్తి అయిన ‘దుర్గ’ దురాక్రమణను అణచివేసిన సుసంఘటిత ప్రతిఘటనకు పతాక... వివిధ యుగాలలో వలెనే ఈ కలియుగంలో కూడ ఈ భరత భూమిని తల్లిగా భావిస్తున్న ఈ ‘సనాతన’ జాతి స్వభావం ఇది! కలియుగంలో ప్రస్తుతం 5119వ సంవత్సరం నడుస్తోంది. ఈ ఐదు సహస్రాబ్దుల కాలంలో భారతదేశం విదేశాలలోకి చొరబడి దురాక్రమించిన చరిత్రలేదు. మనదేశంలోకి చొరబడిన భయంకర బీభత్సకారులను హైందవ జాతీయ శక్తి నిరంతరం ప్రతిఘటించింది! ఈ స్వభావం బ్రిటన్ దాస్య విముక్త భారతదేశంలో కూడ సహజంగా కొనసాగుతోంది! దురాక్రమణలను మనదేశం ప్రతిఘటిస్తోంది.. సహస్రాబ్దుల ఈ సతత సంఘర్షణలో పరాజయాలు, ఘనవిజయాలు మన చరిత్రలో దోబూచులాడుతుండవచ్చు! కానీ అంతిమ విజయం దురాక్రమణ శక్తికి లభించదు, దురాక్రమణను ప్రతిఘటిస్తున్న సజ్జన శక్తిదే తుది విజయం. మన దేశం అనాదిగా ప్రతిఘటన శక్తి.. ఈ హైందవ జాతీయ శక్తి ‘విఘటిత’మైనప్పుడు పరాజయం పాలైంది, దేశంలోకి వివిధ వికృత విదేశీయ మూకలు చొరబడిపోయాయి, తిష్టవేశాయి! ‘విఘటన’నుంచి విముక్తమైన స్వజాతీయ శక్తి మళ్లీ ‘సంఘటితం’ అయినపుడు మన ‘ప్రతిఘటన’కు విజయం లభించింది, లభిస్తోంది..
క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీసు దేశపు రాజు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు, మన దేశం వరకూ వివిధ దేశాలను జయించాడు. గెలిచిన చోటల్లా గ్రీసు సైనికులు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. గ్రామాలను దోచుకున్నారు. ఇళ్లను తగలబెట్టారు! సైనికులు శత్రు సైనికులతో మాత్రమే యుద్ధం చేయడం భారతీయ శక్తి స్వభావం. శత్రు రాజ్యాలకు చెందిన ప్రజలను, నిరాయుధులను హతమార్చడం భారతీయ సైనికులకు తెలియదు. కానీ గ్రీసు సైనికులు ప్రజలను, నిరాయుధులను హింసించడం చరిత్ర! అలెగ్జాండర్‌కు పూర్వం కూడ అనేక పాశ్చాత్య దేశాల ‘శక్తిమంతులు’ మన దేశంపై దాడులు చేసారు, ప్రజలను హింసించారు. మహిళలను లైంగిక అత్యాచారాలకు గురి చేసారు. సంపదను కొల్లగొట్టుకుని పోయారు. ఇలాంటి బర్బర మ్లేచ్ఛ బీభత్స మూకలను కలియుగంలో ప్రతిఘటించినవాడు భారత సమ్రాట్ పుష్యమిత్రుడు. కలియుగం పంతొమ్మిదవ శతాబ్దిలో అంటే క్రీస్తునకు పూర్వం పనె్నండవ శతాబ్దంలో జీవించిన శుంగ వంశపు పుష్యమిత్రుడు భారతీయ సముత్కర్ష సమర పటిమకు, సంఘటిత శక్తికి చారిత్రక సాక్ష్యం! సమకాలీన ప్రపంచంలో సర్వాధిక శక్తిమంతుడైన పుష్యమిత్రుడు విదేశాలను దురాక్రమించలేదు. భారతదేశంలోకి చొరబడిన విదేశీయ మ్లేచ్ఛ మూకలకు గుణపాఠం చెప్పాడు. కానీ ఆ మ్లేచ్ఛుల దేశాలను దురాక్రమించడానికి వెళ్లలేదు, ‘విశ్వవిజేత’ కావాలని కలలు కనలేదు. ఈ సంస్కారం వల్లనే భారతదేశం విశ్వగురువు అయింది. భారతీయ శక్తి విశ్వానికి సంస్కారం ప్రసాదించింది, మానవాళి నడవడిని దిద్దింది. అవనీతలం నలువైపులనుంచి శరణార్ధులుగా వచ్చిన వారికి అన్నం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది! పుష్యమిత్రుని తరువాత కశ్మీరు రాజు మిహిరకులుడు కూడ విదేశీయ బీభత్స మూకలను మనదేశంనుండి తరిమికొట్టాడు. భారతీయ శక్తి విదేశీయ హంతకులను ఇలా సహస్రాబ్దులుగా ప్రతిఘటించింది, భారతీయ శక్తి విదేశీయులను హత్య చేయలేదు..
గ్రీసు దేశపు అలెగ్జాండర్ కలియుగం ఇరవై ఎనిమిదవ శతాబ్దిలో అంటే క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో అనేక దేశాలలో భయంకర బీభత్సకాండ సృష్టించాడు. కానీ మన దేశంలోని తక్షశిల మహా విద్యాలయంలోకి గ్రీసు సైనికులు చొరబడలేదు... ఎందుకంటే తక్షశిల మహా విద్యాలయ ప్రాంగణంలో విదేశీయ బీభత్స మూకలకు అంతకు పూర్వం దాదాపు యాబయి ఏళ్లనాడు ఎదురైన పరాభవం గురించి పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా ప్రచారమైంది! తక్షశిల ఏ రాజ్యానికి రాజధాని కాదు, అక్కడ ‘రాజు’ లేడు, అది విద్యాకేంద్రం. ప్రపంచంలోని నలుమూలలనుంచి వచ్చిన విద్యార్థులు తక్షశిలలో సంస్కారాలను నేర్చుకుని వెళ్లారు. అందువల్లనే
‘‘ఏతత్ దేశ ప్రసూతస్య
సకాశాత్ అగ్రజన్మనః
స్వం స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాః సర్వ మానవాః’’
అన్నది భారతదేశపు విశ్వగురు స్వభావమైంది. ‘‘ఈ దేశంలో వికసించిన ఉత్తమ విజ్ఞానవంతులవద్ద ప్రపంచంలోని మానవులు సౌశీల్య సంస్కారాన్ని నేర్చుకొనిరి...’’ ఇదీ తక్షశిల మహా విద్యాలయం చరిత్ర. ఇలాంటి తక్షశిల విద్యాలయంలోకి విదేశీయ బీభత్సమూకలు చొరబడినాయి! ‘‘మహా విద్యాలయ ప్రాంగణం ప్రశాంతంగా ఉండింది. ఆచార్యులు కాని విద్యార్థులు కాని శత్రుసైనికులను పట్టించుకోలేదు. తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించారు. శత్రుసైనికులు విదేశీయులు విధ్వంసకాండ ప్రారంభించారు. ఈ విధ్వంసకులపై వెంటనే పిడుగుల వర్షం కురిసింది, నిప్పుల జడి ధాటికి శత్రు సైనికులు మిడతలవలె మాడిపోయారు, వందల బీభత్సకారులు అగ్నిశస్త్రాలకు ఆహుతి కాగా వేలమంది పారిపోయారు..’’ ఈ వాస్తవగాధ అలెగ్జాండర్ నాయకత్వంలోని గ్రీసు సైనికులకు తెలుసు. అందువల్ల అలెగ్జాండర్ ‘తక్షశిల’ జోలికి పోలేదు! తక్షశిలలో ‘లేని రాజు’ తమకు శరణుచొచ్చినట్టు గ్రీసు చరిత్రకారులు ఆ తరువాత అబద్ధాలు ప్రచారం చేసారు! కానీ బీభత్సకారుడైన అలెగ్జాండర్ అప్పుడు దేశంలో పరిపాలనను ఆరంభించి ఉండిన గుప్త వంశపు చంద్రగుప్తుని సైనిక శక్తిని గురించి విని భయపడి పారిపోయాడు..
ఇదీ ‘్భరతీయ శక్తి’ వాస్తవ చరిత్ర! ఇలా భారతీయ శక్తి దురాక్రమణను ప్రతిఘటించడానికి కారణం, దురాక్రమించకపోవడానికి కారణం సృష్టిగత వాస్తవాలతో భారతీయ సమాజం అనుసంధానం అయి ఉండడం... అందువల్లనే ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’-్భమి తల్లి, నేను ఆమె బిడ్డను-అని తొలి మానవుడు గ్రహించాడు.. తొలి మానవుడు భారతీయుడు! సృష్టిలో ‘సమన్వయం’ సహజంగా నిహితమై వుంది, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నెలకొని ఉంది! ‘ఏకైవ మూర్త్భిఃబిదే, త్రిధాసా..’- ‘‘ఒకే శక్తి మూడుగా ప్రస్ఫుటిస్తోంది’’! భౌతిక శక్తి, బౌద్ధిక శక్తి, జీవశక్తి! ఈ వైవిధ్య శక్తులమధ్య ఏకాత్మభావం సనాతన- శాశ్వత- సమన్వయం! ఈ సమన్వయం స్వభావమైన భారతజాతి ఇతర జాతులను గాయపరచలేదు, గాయాలను మాన్పింది. ‘క్షతత్రాణ’ అయింది! ఈ ‘సమన్వయం’ గ్రహించని మ్లేచ్ఛ విదేశీయ జాతీయల వారు నిరంతరం ఇతరులను ఇతర దేశాలను గాయపరుస్తున్నారు... వారు ‘క్షతి కారకులు‘.. అందుకే భారతీయుల శక్తి వేల ఏళ్లుగా ప్రతిఘటిస్తోంది!

-హెబ్బార్ నాగేశ్వరరావు