మెయిన్ ఫీచర్

విష్ణుమయం జగత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సర్వం విష్ణుమయం’ అన్న భావనే ముక్తికి సోపానమని, భాగవతాది గ్రంథాలు విశదపరుస్తాయి. హరి లేని చోటేలేదని, విశ్వమంతా తనలోనే వుందని, విశ్వంలో అణువణువునా తానేయని ‘్భగవతం’ బోధిస్తుంది. అష్టాదశ పురాణాలు విష్ణువు వివిధ అంగముల నుండి ప్రభవించినవేయని, అతడే పురాణ పురుషుడని, ‘నారద మహాపురాణం’ చెబుతోంది. మానవుడుగా ఈ నేలపై మనిషి జన్మించడం అపురూపమని విష్ణు పురాణం వర్ణిస్తుంది.
ఏ దేవుడు అగ్నియందును, జలము, ఓషధులు, సమస్త జగత్తు యందు అంతటా వ్యాపించి వున్నాడో ఆ దేవ దేవునకు వందనాలని ‘శే్వతాశ్వతరోపనిషత్’ విశద పరుస్తుంది. కోటి నామాలతో, శతకోటి లీలలతో సర్వజనులను సకల ప్రాణికోటినీ సంరక్షిస్తూ వెలుగొందుచున్న ఆ ప్రభువు దివ్య పాదారవిందములే శరణ్యం అందరికీ. ఆ దివ్య పాదారవింద చింతనామృతమును గ్రోలు భక్తుల జన్మమే జన్మయని పురాణ కథనం.
శ్రీమన్నారాయణుడు, ధర్మ సంరక్షణార్థమై అనేక అవతారాలను ధరించి, దుష్టశిక్షణ, భక్తరక్షణను గావిస్తూ, మానవుల్లో భక్తిని పెంపొందిస్తాడు. శ్రీహరి భక్తుడు కానివాడు మానవుడే కాదంటూ, శ్రీ శంకరులు వెల్లడించారు. నాలుగు పురుషార్థముల సాధనకు ఒక్క మానవ జన్మలోనే అవకాశం వున్నందున మానవ జన్మ మహనీయమైనదని తెలిపారు.
జగత్తునకు ఆధారం విష్ణువే. అస్తిత్వమును కలుగచేయువాడు విష్ణువే. కావున సదా నారాయణ నామమంత్రాన్ని నాలుకపై నిల్పుకొన్నచో, సకల దేవతారాధన గావించినట్లేయని నిత్య నారాయణ మంత్ర జపవంద్యుడు నారద మహర్షి వివరించాడు. పరబ్రహ్మ విష్ణువే, ఓంకార స్వరూపుడు, సృష్టి స్థితి లయకారకుడు విష్ణువే, త్రిమూర్తి స్వరూపుడు నారాయణుడే. అంతటి మహిమాన్వితుడైన భగవంతుని తెలుసుకోబడని యెడల మానవ జన్మ నిరర్ధకమగునని పండితుల అభిప్రాయం.
గ్రామం పోతే మరల సంపాదించుకోవచ్చు. పంట పొలం పోతే తిరిగి చేకూర్చుకోవచ్చును. అలాగే శుభాశుభ కర్మలనూ మరల చేసుకోవచ్చును. కాని పోయిన శరీరం మాత్రం మరల ఎన్నటికీ తిరిగిరాదని, దీనిని గ్రహించి మసలుకోవాలని ‘గరుడపురాణం’ తెలుపుతోంది.
‘‘స్వశరీరే స్వయం జ్యోతి’’ స్వయం జ్యోతి స్వరూపుడగు పరమాత్మ మన శరీరములందే నిల్చి వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు, భగవద్గీత బోధిస్తున్నాయి. కావున స్వశరీర స్థితుడగు పరబ్రహ్మని మనస్సునందే మనం ద్వారా ప్రత్యక్ష మొనర్చుకొని ఆత్మానుభూతిని పొంది పరమశాంతిని, నిత్యానందాన్ని పొందవచ్చునని పురాణ ప్రభోదం. సహనంతో ఉంటూ, చిన్నవారిపై దయను చూపిస్తూ, సమానుల యెడల మైత్రీ భావంతో వుంటూ, సకల జీవుల యెడ సమత్వ బుద్ధిని కలిగియుంటే, సర్వాంతర్యామియగు మహావిష్ణువు ప్రసన్నుడౌనని భాగవతం చెబుతోంది.
నరుని నాలుక కర్తవ్యం నారాయణ స్మరణేయని, పూర్వం అజామీళుడనే బ్రాహ్మణుడు క్రూరాత్ముడై వుండెను. కానీ మరణ సమయంలో తన కుమారుడైన నారాయణుని నామాన్ని స్మరించాడు. అలా నారాయణ శబ్ద స్మరణతో విష్ణు కృపకు పాత్రుడై వైకుంఠం చేరుకున్నాడని శ్రీకృష్ణ శతకకర్త వివరించాడు.
దేవదేవుడైన విష్ణువును ఆశ్రయించినవారికి శారీరక మానసిక దైవిక భౌతిక దుఃఖములు ఏవిధములైన కష్టములు కలుగవని పురాణ ప్రభోదం.
‘‘యస్యస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్’’ విష్ణు దేవుని స్మరణతోనే జన్మజన్మల సంసార బంధనాలన్నీ తొలగిపోతాయని ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ తెలుపుతోంది. ‘‘మద్భక్తాయత్ర గాయంతి, తత్ర తిష్ఠామి నారద’’ నేను వైకుంఠంలోగాని యోగి పుంగవుల హృదయాలందుగాని ఉండడంకంటే నా భక్తులు ఎక్కడ నా నామస్మరణను గావిస్తూ వుంటారో అక్కడ నేనుంటానని, విష్ణువు నారదునితో చెప్పినట్లు వివరించబడింది.
ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, పరాశర, పుండరీక, భీష్మ, అంబరీష, రుక్మాంగద, విదుర, అక్రూర, శుక-శౌనక, వ్యాసాది మహాభక్తులు తరించారు. ‘యజ్ఞోవైవిష్ణుః’ అని శతపథ బ్రాహ్మణం, యజ్ఞ స్వరూపుడు విష్ణువే అని చెబుతోంది. తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, విద్య, ధనం అన్నీ విష్ణువే అని తలుస్తూ అంతటా నిండియున్నవానిని వేడుకుందాం.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు