మెయన్ ఫీచర్

వ్యవసాయానికి మద్దతు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 80 శాతం ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయంలో 76 శాతం పనిచేసేది ఎవరో తెలుసా! ఆకాశంలో సగమని చెప్పే మహిళ! ‘నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతకోయడం, అవసరమైతే దున్నడం, రొప్పడం, బరం పెట్టడం, పశువులను మేపడం వంటి పనులన్నీ నేనే చేస్తాను. అప్పులకు జడిసో, బెదిరో ధరలేదనో ఇంటాయన తనువు చాలిస్తే ఇంటిల్లిపాదినీ సాకేది నేనే! అత్తమామల్ని, ఆడబిడ్డల్ని వదిలి గల్ఫ్ బాట పడితే వారి బాగోగుల్ని చూసేది నేనే! పెళ్లిళ్లు, కార్యాల బాధ్యత నాదే! అయినా ముందుండి చేయలేని బతుకునాది. పాడిని పెంచేది, పాలను పితికేది, పిల్లల్ని సాకేది, పేడ తీసి రొచ్చు కడిగేది నేనే! అయినా నాదీ బతుకేనా? కుక్కలవలె ఇంటికాడ, నక్కలవలె చేనుకాడ, కట్టుకున్నోడు కల్తీగాడైనా తాగుబోతైనా, జూదగాడైనా భరిస్తూ తన్నులు తింటూ బతకాల్సిందేనా?’ అంటూ జాతీయ వ్యవసాయ సదస్సులో నర్మగర్భితంగాకాదు... నగారా మోగించింది మహిళ గొంతు.
హైదరాబాద్ రాజేందర్‌నగర్‌లోని వరి పరిశోధనా కేంద్రం ఆడిటోరియంలో సెప్టెంబర్ 23, 24వ తేదీలలో ‘రిజువనేట్ ఇండియన్ అగ్రికల్చర్ ఫర్ సస్టెయినిబిలిటీ’ అనే నినాదంతో జరిగిన రెండో రోజు సమావేశంలో ‘వ్యవసాయంలో మహిళలు - సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సెషన్‌లో ఢిల్లీనుంచి వచ్చిన ప్రొ.కౌషల్ కుమార్ శర్మ సమర్పించిన ఓ పేపర్ సారాంశమే పైన పేర్కొన్న కొన్ని వాక్యాలు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో మహిళలు పాల్గొనే దృశ్యాలతో, కథనాలతో, గణాంకాలతో సమర్పించిన పత్రం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కళ్లకు కట్టినట్టు చూపడంతో సదస్సులో పాల్గొన్న దాదాపు వెయ్యిమందిని మంత్రముగ్ధుల్ని చేసింది. వ్యవసాయంలో అంతా తానై చేసే వ్యవసాయంలో తనకు భూమి కావాలంటూ భుజంపై గుత్ప కట్టెతో, చురుకైన చూపుతోగల మహిళ ఫోటోతో పేపరు సమర్పణ ముగియడం గమనార్హం!
రెండురోజులు సాగిన ఈ జాతీయ సదస్సులో ఆరు సెషన్సు నిర్వహించగా 11 పేపర్లను వివిధ అంశాలపై వ్యవసాయ వేత్తలు, సామాజిక ఆర్థిక వేత్తలు ఉద్విగ్న భరిత వాతావరణంలో సమర్పించారు. వీటికి తోడుగా ప్రారంభ సమావేశాన్ని దీన్‌దయాళ్ మెమోరియల్ లెక్చర్‌తోపాటు ముగింపు సమావేశాలు కూడా జరిగాయి. ప్రజ్ఞ్భారతి విశిష్ట కృషితో, క్రమశిక్షణతో జరిగిన ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిణి పురందరేశ్వరి, సంస్థ చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, విశ్వవిద్యాలయ ఉపకులపతి వి.ప్రవీణ్‌రావులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి, భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేయాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని, గిట్టుబాటు ధరలు అన్ని పంటలకు వుండాలని, పోచారం చెబుతూ ఫసల్ భీమా యోజన రైతు యూనిట్‌గానే లెక్కించాలని ఉద్ఘాటించారు. పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిగా కొన్ని విషయాల్ని మాట్లాడలేనని, డబ్ల్యుటివోలాంటి అంశాలపై అందులో భారత్ చేరికపై మాట్లాడడం సున్నితంగా వుంటుందని, ప్రభుత్వాలు రూపొందించే విధానాలు ఆచరణలో అధికారులకు ఇబ్బంది కలిగించకుండా వుంటే ముందుకు తీసుకు వెళ్లడం సులభమని, అందుకు అనుగుణంగా నిధులుండాలని కోరారు. ఒడిస్సానుంచి వచ్చిన భారతీయ కిసాన్‌సంఘ్ కార్యదర్శి మోహిన్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు సంక్షేమానికన్నా తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాయని, డబ్ల్యుటివోలో భారత్ చేరాల్సింది కాదని, గాట్స్ ఒప్పందాల్ని ఒప్పుకోవాల్సిందికాదని, అప్పటినుంచే సంప్రదాయ వ్యవసాయ విధానం నాశనమైందని, సంకరజాతి విత్తనాల్ని, జన్యుమార్పిడి విత్తనాల్ని, రసాయన ఎరువుల్ని అధిక ఉత్పత్తి పేరున వాడాలని ప్రోత్సహించిన ప్రభుత్వాలు తిరిగి సంప్రదాయానికి మళ్లాలని కబుర్లు చెపుతుందని, నిజానికి భారతీయ వ్యవసాయదారునికి వున్న మంచిపట్టును సడలించి నిస్సత్తువుగా మార్చి, తిరిగి బలోపేతం కావాలని కోరడం హాస్యాస్పదంగా వుందని తీవ్రంగా విమర్శించారు.
దాదాపుగా చర్చించబడిన పేపర్లన్నీ కూడా రైతుకు బాసటగా నిలబడాలనే గొంతును వినిపించడం గమనార్హం. కనీస మద్దతు ధర ఇస్తే ఆర్థిక మాంద్యత ఏర్పడుతుందని సలహా ఇచ్చే బ్యూరోక్రాట్లు, తాము మాత్రం సంవత్సరానికి రెండుసార్లు డిఏను పెంచుకుంటూ, 5-10 సంవత్సరాలకోసారి జీతాల్ని పెంచేసుకుంటున్నారని, ఇక మంత్రులదీ, ఎంఎల్‌ఏలది అయితే ఏ కమీషన్ లేకుండానే జీతాలు పెరిగి పోతాయని ధ్వజమెత్తడం జరిగింది. ఈ మద్దతు ధర కూడా అన్ని పంటలకు లేవని, అది సకాలంలో అందదని, రైతు కల్లం నాటిన తర్వాత ధరల్ని ప్రకటించడం జరుగుతుందని విమర్శలు వచ్చాయి. ఇక వినియోగదారులు షాపింగ్ మహల్స్, బజార్లో చెప్పిన ధరల్ని చెల్లిస్తారని, అదే రైతు నేరుగా అంగళ్లలో అమ్మితే కొసరి కొసరి కొంటారని ఆవేదన వ్యక్తమైంది. రైతు కాడెడ్లను కసాయికి అమ్మేలా చేసిన యాంత్రీకరణ, పశువులు, పాడి పశువులు తిరగడానికి బంజర్లను రియల్ ఎస్టేటుకు అంటగట్టిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పాడితో అనుసంధానం చేయాలని సూచించడం శోచనీయం కాదా అని ప్రశ్నించారు. పైగా వీరే వేలాది ఎకరాల అమెరికా వ్యవసాయ క్షేత్రాల్ని, ఇజ్రాయిల్ లాంటి సెన్సర్ల సేద్యాన్ని పదే పదే ఉదహరించి, ప్రకృతి సహజ సిద్ధంగా చక్కని వర్షాలు కురిసే భారతావనిని అపహాస్యం చేస్తున్నారని గొంతెత్తారు. హెక్టారు భూమి కూడా లేని భారతీయ రైతులకు ఇదెలా సాధ్యమనే అంశాల్ని ఈ పాలకులెప్పుడు పట్టించుకోలేదని సదస్సు వాపోయింది. చివరికి వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు అమ్మాయిల్ని ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నారని స్పందించడం సదస్సు అర్ధ్రతకు అద్దం పట్టింది.
అయినా ఔత్సాహికంగా, సేంద్రీయ వ్యవసాయానికి మారిన కొంతమంది రైతుల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు లేవని, పైగా రసాయనిక ఎరువులతో పండించిన పంటలు పోటీపడడంతో తాము అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని సదస్సుకు హాజరైన కొంతమంది రైతులు తెలుపగా అది ప్రభుత్వ బాధ్యత అని, దానికై రైతులు సంఘాలుగా ఏర్పడాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో వున్నట్టుగా పీర్ గ్రూప్ గ్యారంటీ సర్ట్ఫికెట్లను పొందే విధానం చర్చకు పెట్టాల్సింది. కానీ సమయాభావం ఈ అవకాశాన్ని ఇవ్వలేకపోయింది.
ఈవిధంగా సాగినన రెండురోజుల సదస్సులో వ్యవసాయదారుడి సాధికారత గూర్చి, వ్యవసాయ రంగ ఔచిత్యం గురించి సమస్యల గూర్చి, వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తున్న వ్యవసాయదారుల గూర్చి, పెరుగుతున్న వలసల గూర్చి, పట్టింపులేని గ్రామీణ వ్యవస్థ గూర్చి, తరిగిపోతున్న నీటి వనరుల తగ్గిపోతున్న భూగర్భ జలాల గూర్చి, మృగ్యమవుతున్న వాతావరణ పరిస్థితుల గూర్చి, పెరుగుతున్న వ్యయం గూర్చి,, రియల్ ఎస్టేట్ కబంధ హస్తాల గూర్చి, కల్తీవిత్తనాల గూర్చి, బ్యాంకుల శీతకన్ను గూర్చి, దళారీ వ్యవస్థ గూర్చి, ప్రభుత్వాల ద్వంద్వ విధానాల గూర్చి ప్రస్తావనకు తేవడం ముదావహం! పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజులు రైతులకు కడగండ్లే కాదు-యావత్ దేశానికి ఆహార ముప్పు ఏర్పడుతుందని, ఇదే జరిగితే దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని, జిడిపి అధిక మొత్తంలో కేటాయించవలసి వస్తుందని సదస్సు ఆవేదన చెందడం గమనార్హం. వేలాది సంవత్సరాలుగా వేలాది ఎకరాల స్వచ్ఛమైన వంగడాలకు నిలయమైన భారత్ నిజానికి వ్యవసాయ జీనోమ్‌కు నిలయమని, కానీ ఆధునిక సాంకేతికత అనే సూడో నినాదంతో ధ్వంసమవుతున్నదని, చివరికి మన జన్యువులు మనకు కాకుండాపోతున్నాయి, ఇతర దేశాల బహుళ జాతి కంపెనీలు వీటిపై గుత్త్ధాపత్యాన్ని పొందుతున్నాయని సదస్సు నిలదీసింది.
ట్రంప్ భార్య జన్యు సంబంధ మార్పిడి ఆహార పదార్ధాలు అనారోగ్యకరమని భావిస్తే, మనవారు ఇంకా వాటిని తెలుసుకోవాలని మన చేనుల్లో ప్రయోగాలు చేసి, మన ఆరోగ్యాల్ని దెబ్బ తీస్తున్నారని, ఇప్పటికే మన ఆరోగ్యాలు చెడిపోవాల్సిన దానికన్నా ఎక్కువగా చెడిపోయి కార్పొరేట్ వైద్య వ్యాపారం సాగుతుంటే, మన నాయకులకు పట్టడం లేదని, నిజానికి మన దగ్గరున్న వాతావరణ విభిన్న పరిస్థితులు మరే దేశంలో (127) లేవని, వీటి దృష్ట్యా కేవలం నీటి ఆధారిత పంటలు పండించాలనే దృక్పథం మారాలని, వరిలాంటి పంటలు సోమరిపోతుల పంటలని, మెట్టపంటలు, తృణ ధాన్యాలు ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులే కాక, మొత్తం సమాజానికి ఆరోగ్యప్రదాయనులని సదస్సు వక్కాణించడం గమనార్హం.
ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ సదస్సు బహుశా సమయం లేక తీర్మానాలు చేయలేకపోయింది. ఎక్కువ సెషన్స్ వుండడం, ఎక్కువ సంఖ్యలో పేపర్లు రావడంతో లోతైన చర్చకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి చర్చలు అన్ని ప్రాంతాల్లో, రైతుల సమక్షంలో జరిగితే, వాస్తవ సమస్యలు నిజంగా బయటికివస్తాయి. ఈ బృహత్కార్యాన్ని భుజాన వేసుకున్న ప్రజ్ఞ్భారతిని నిజంగా అభినందించలేకుండా వుండలేము. ఈ సదస్సు ద్వారా వచ్చిన స్పందనల్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదించి ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థపై ఉంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162