మెయిన్ ఫీచర్

జానపద కళకు కాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరంకెల జీతాలు.. వారాంతపు వినోదాలు.. ఈ మోజులో పడి యువత సమాజాన్నీ, సామాజిక స్పృహనీ బొత్తిగా మరిచిపోయింది. ఎంతసేపూ నేనూ, నా జీవితం అనుకునే రోజులు. అలాంటి జమానాలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఒక ఇద్దరమ్మాయిలు అంతరించిపోతున్న కళకు పూర్వవైభవం తెచ్చే యజ్ఞంలో కూర్చున్నారు. సోషల్ ఆంట్రపెన్యూర్లుగా మారి చితికిపోతున్న కళాకారులకు జీవనోపాధి కల్పిస్తున్నారు.
వంద్యా, రేఖ ఇద్దరూ ప్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్టూడెంట్స్. కాలేజీ రోజుల్లో ప్రొడక్ట్ డిజైనింగ్‌లో భాగంగా ఒకసారి క్రాఫ్ట్ విజిటింగ్ చేశారు. ఆ వారం రోజులు వాళ్ల గమనానే్న మార్చేశాయి. అంతరించిపోతున్న ప్రాచీన కళకు జీవం పోయాలని ఆ రోజే మనసులో బలంగా నాటుకుంది. మరుగున పడిపోతున్న సృజనకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో అడుగు ముందుకు వేశారు. ప్రాచీన సంప్రదాయానికి ఆధునికత మేళవించి మసకబారిన కళాకారుల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలనే మహత్కార్యాన్ని భుజాన వేసుకున్నారు. ఇష్మ పేరుతో ఒక స్టార్టప్ మొదలుపెట్టారు.
ఆలోచన బాగుంది! ఆశయం ఇంకా బాగుంది! కానీ ఎలా? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? దిశా నిర్దేశం ఎవరు చేయాలి? సరిగ్గా ఇలాంటి వారికోసమే బాలవికాస ఇంటర్నేషనల్ పనిచేస్తోంది. సామాజిక స్పృహ కలిగిన సోషల్ ఆంట్రపెన్యూర్లకు బాలవికాస కావాల్సినంత చేయూతనిస్తుంది. అన్‌లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ ఆ కోవలోకి చెందిందే. ఈ రెండింటి సహకారంతో వంద్యా, రేఖ కలిసి ఇష్మ అనే స్టార్టప్ మొదలుపెట్టారు.
జివెల్రీ యాక్సెసరీస్ అంటే అందరూ ఇష్టపడతారు. అందుకే ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టాం. డిజైనింగ్ కాకుండా బిజినెస్ కోసం ఏమేం అవసరముంటాయి. ఫైనాన్షియల్, మార్కెటింగ్ ఎలా చేయాలి? బిజినెస్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? వీటన్నిటిపై బాలవికాస, అన్‌లిమిటెడ్ హైదరాబాద్ శిక్షణ ఇస్తాయి.

ఇష్మ కానె్సప్ట్ ఏమిటి?
తోలుబొమ్మలు- ఇది అతి ప్రాచీ నమైన జానపద కళారూపం. మొట్టమొదటి రంగస్థల ప్రదర్శన అని కూడా చెప్తారు. ఒకప్పుడు అది భారతదేశంలోనే ఒక విలక్షణమైన ఆర్ట్. సంగీతం, నాట్యం కలగలసిన ఈ కళనుంచే 2డి యానిమేషన్, షాడో ఆర్ట్ పుట్టుకొచ్చాయి. అయితే కాలక్రమేణా ఆ కళ మసకబారింది. ఇప్పుడు తోలుబొమ్మలు చూద్దామన్నా కనిపించట్లేదు. ఇష్మ వేసిన మొదటి అడుగు తోలుబొమ్మల నుంచే మొదలైంది. కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన లెదర్ ఇయర్ హ్యాంగింగ్స్, యునిక్ పెండెంట్స్, టియర్ డ్రాప్ ఇయర్‌రింగ్స్, ఫ్లోరల్ స్టేట్‌మెంట్, గోల్డ్ టోన్ హాంగింగ్స్, గార్డెన్ థీమ్ ఇంకా అనేక రకాల యాక్సెసరీస్ తయారుచేయిస్తున్నారు.
ఆ తర్వాత పెంబర్తి క్రాప్ట్స్ మీద ఫోకస్ చేశారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఈ లోహ కళాకారులున్నారు. కాకతీయుల శైలిని అనుకరించడం వీరి ప్రత్యేకత. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు కలగలసిన నైపుణ్యం వీరిది.
ప్రస్తుతానికి తోలుబొమ్మలు, పెంబర్తి కళాకారుల నుంచి జివెల్రీ, డెకొరేషన్ ఐటెమ్స్ లాంటివి తయారుచేయించి వాటికి మార్కెటింగ్ కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ట్రెండ్ ఫాలో అవుతూ లెదర్ జివెల్రీని, మెటల్ ఆర్నమెంట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.
కొన్ని డిజైన్లను క్లిప్ ఆర్ట్ రూపంలో పేపర్‌మీద ప్రింట్ చేసి, కళాకారులకు ఆ డిజైన్ల గురించి విడమరిచి చెప్తారు. వీళ్లిచ్చిన ఇన్‌పుట్ ఆధారంగా వాళ్లు ఆర్నమెంట్స్ అవుట్‌పుట్ చేసేస్తారు. వాటిని ఎగ్జిబిషన్ల ద్వారా కస్టమర్ టు కస్టమర్
బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు కళాకారులు ఇష్మ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. బంజారా కుట్లు అల్లికలను ఇప్పుడిప్పుడే ప్రోత్సహిస్తున్నారు.

సవాళ్లతో ప్రయాణం
మొదలుపెట్టిన ప్రయాణం అనుకున్నంత ఈజీ కాదు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో ప్రతికూల అంశాలు. అయినా వంద్యా, రేఖ భయపడలేదు. సామాజిక స్పృహతో ముందుకు వేసిన అడుగును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యంగా పెంబర్తి కళాకారులను ఒప్పించడం అతి పెద్ద సమస్యగా మారిందంటారు వంద్యా.
వీళ్లకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకోవడం కష్టతరమైన పనే అంటారామె. అయినా ఓపికగా వివరించి ఐటెమ్స్ తయారుచేయించుకుంటారు. తోలుబొమ్మల విషయంలోనూ అంతే. వీళ్ళిచ్చిన డిజైన్ అనుగుణంగా ఒక ప్రోడక్ట్ రాబట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తోందని రేఖ అంటోంది. ఇదంతా ఒకెత్తయితే జివెల్రీ చేసే కళాకారులను వెతికి పట్టుకోవడం మరో ఎత్తని వంద్యా చెప్తోంది.
ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోదు. ప్రస్తుతానికైతే వీరికి బాల వికాస ఇంటర్నేషనల్, అన్‌లిమిటెడ్ హైదరాబాద్ చేయూతనిస్తోంది. తమలాంటి సోషల్ ఆంట్రపెన్యూర్లను టీ హబ్ కూడా ప్రోత్సహించాలని వంద్యా కోరుతోంది. టెక్ స్టార్టప్స్ మాత్రమే కాదు. కళాకారులనూ బతికించాలని తపనపడే ఇష్మ లాంటి స్టార్టప్స్‌ను కూడా ఇంక్యుబేట్ చేయాలని రేఖ అభిప్రాయపడుతోంది.

-హరిచందన