ఎడిట్ పేజీ

కాంట్రాక్టు వ్యవసాయంతో కష్టాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతు ఆదాయం 2022 నాటికి రెట్టింపు అనే నినాదం బాగా ప్రచారాన్ని పుంజుకుంటున్నది. రైతు ఆదాయం రెట్టింపు అవుతుందా, రైతు పండించిన పంటలు ఉత్పత్తుల విధానం రెట్టింపు అవుతుందా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. ఇది జరగాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి కేంద్రానికి తోచినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు తోచినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం అనే ఎజెండాను ముందేసుకుని ఊరడింపు కార్యక్రమాన్ని ప్రారంభించాయి. రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి రైతులకు ఇలాంటి తాయిలాలు లేకుంటే ఓట్లు తారుమారయ్యే ప్రమాదం ఉంటుందనేది పాలకుల అనుభవం.
అందుకే ప్రతి ప్రభుత్వం, ఓ పథకాన్ని ఆకర్షణీయమైన నినాదంతో ముందుకు తెస్తూ ఉన్నాయి. గత ఫిబ్రవరి 16న ప్రారంభించబడిన ప్రధాన మంత్రి ఫసల్ బీమాలో చేరింది రమారమి మూడుకోట్ల పైచిలుకు రైతులు మాత్రమే! ఇందులో బినామీలదే పై చేయి కూడా! గత సంవత్సరం మధ్యప్రదేశ్‌కు చెందిన 52మంది సోయా చిక్కుడు రైతులకు ఈ బీమా కింద వచ్చింది రు. 4.75 పైసలే అంటే ఆశ్చర్యం కావచ్చు! కానీ, ఇది వాస్తవం. అనంతపురం జిల్లాలో కూడ ఇలాంటి కథనాల్ని విన్నాం. తెలంగాణలోనైతే ఈ ఫసల్ బీమా వైపు ఆలోచించేవారే లేరు. దీనికి తోడు 1999-2000లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బీమా పథకం, 2003-2004లో ప్రవేశపెట్టిన పంట ఆదాయ బీమా పథకాలు రైతు కన్నీటిని తుడిచిన కథనాలు ఎక్కడా కానరావడంలేదు. సేద్యాన్ని నమ్ముకున్న రైతులను సేద తీర్చాల్సిన ఇలాంటి పథకాలు విష గుళికల్ని మాత్రం ఆవిష్కరిస్తున్నాయి. పైగా ఈ పథకాల రూపకర్తలకు, ఆచరించాల్సిన పాలకులకు వ్యవసాయ స్థితిగతులు బొత్తిగా తెలియకపోవడం గమనార్హం! వ్యవసాయ రంగం సంక్షోభంపై ఏర్పాటు చేసిన కమిటీల సిఫార్సుల కనీసం ఎంపిక చేసిన ఒకటి, రెండు ప్రాంతాల్లోనన్నా అమలు చేసిన పాపాన పోని వైనం. వీరిచ్చిన రిపోర్టులు వేదికలపైన మాట్లాడడానికి, వ్యవసాయ శాస్త్రం చదువుకునే విద్యార్థులకు మాత్రం పనికి వస్తున్నాయి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఆత్మహత్యలుండవనుకున్నాం. రాష్ట్రం ఆవిర్భావంతో ఆ పరంపర కొనసాగడంతో, దిక్కుతోచని ప్రభుత్వం ఆచరణ సాధ్యంకాని, అవసరం లేని అనేక పథకాల్ని ముందేసుకుని, రైతు కన్నీటిని తానే తుడుస్తున్నామని ప్రకటిస్తున్నది. నిజానికి తెలంగాణ సాధించుకున్నదే ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం. ఏ ప్రభుత్వం, చివరికి తెలంగాణలో తెలుగు దేశం పాలనలోకి వచ్చినా ఇలాంటి పనులే చేసేది. లేదంటే బతికి బట్టకట్టడం కష్టం. ఈ దిగులు ఇప్పుడు తెరాసది కూడా! క్షేత్రస్థాయి మూలాల్లోకి పోకుండా, కాంట్రాక్టర్ల లబ్ధి పధకాల్ని, మెగా ప్రాజెక్టు పథకాల్ని ముందేసుకుని, ఇవి పూర్తయితేనే రైతు సమస్యలు పరిష్కరింపబడతాయని కూడబలుకుతూ, సత్వర సమస్యల్ని గాలికి వదులుతున్నది. గత సంవత్సరం మిర్చి, పసుపు పంటలు పండించిన రైతుల దీనావస్థను చూసాం. ఈసారి మొక్కజొన్న పంటల పరిస్థితి అచ్చుకెక్కబోతున్నది.
ప్రభుత్వం ఓవైపు కాళేశ్వరం, మల్లన్న సాగర్ పథకాలంటూనే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకాలంటున్నది. అర్ధ శతాబ్దానికే, భారీ నీటి ప్రాజెక్టులైన పోచంపాడ్, నాగార్జున సాగర్, శ్రీశైలం వట్టిపోతున్న దృశ్యాలు కళ్లముందు కదలాడుతుంటే ఎలాంటి నదీ ప్రవాహం లేని మల్లన్న సాగర్ ప్రాజెక్టు రూపకల్పన జరగడంలోని ఆంతర్యం ఏమిటో తెలియడంలేదు. గోదావరి నదిపై మహారాష్ట్ర బాబ్లీ లాంటి చిన్న చితక ప్రాజెక్టుల్ని 40కి పైగా నిర్మించింది. వీటి నిర్మాణాల్లో ఎలాంటి అంతర్ రాష్ట్ర ఒప్పందాలు పనిచేయడం లేదు. ఇదే పరిస్థితి ప్రాణహిత నదికి జరగదనే గ్యారంటీ ఏమీ లేదు. అలాంటప్పుడు కాళేశ్వరం ప రిస్థితి ఏంటి? కాబట్టే ప్రభుత్వాలు పాత మత్తళ్లపైనే దృష్టి సారించే ప్రయత్నాలు ప్రారంభించాయి. వీటినుంచి రైతుల దృష్టిని మళ్లించాలంటే, ఏదో చేయాలి కాబట్టి రైతు సమన్వయ సమితిలంటూ రాజకీయ వేదికల్ని ఏర్పాటు చేసుకుంది తెరాస. 2014 ఆగస్టులో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక సర్వేను పక్కనపెట్టి తిరిగి భూముల సర్వే అంటూ ముందుకు వస్తున్నది. 2010-11 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో గల 55.56 లక్షల భూకమతాల్లో 15 శాతం మాత్రమే వివాదాదంగా తేలాయి. వీటికి తోడు ప్రభుత్వమే పెట్టుబడుల ఆకర్షణ పేరున పట్టణాల చుట్టూ భూసేకరణ ప్రారంభించడంతో మరికొన్ని కమతాలు వివాదాస్పదంగా మారాయి. ముందుగా వీటిని పరిష్కరించి, ఇంకా ఏమైనా వివాదాస్పదం అయనట్టయితే రెవిన్యు స్థాయిలో ప రిష్కారం చేయాలి. దీనికి ప్రభుత్వం తగు సూచనలు చేసి అవినీతికి తావులేకుండా అమలు జరిపితే బాగుండేది. కానీ ఈ భూమి సర్వే పేరున, పదివేల ప్రభుత్వ సిబ్బందితోపాటు వెయ్యిమంది ఐటి నిపుణులను వినియోగించి, దాదాపు రు.500 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలనుకోవడం, రైతు సమస్యకు మరో ముసుగు తొడగడమే అవుతుంది. రైతు కడగండ్లకు భూ రికార్డుల సమస్య ప్రధానం కాదు. చేతుల్లో భూమి ఉండి, కాలం కలిసివచ్చి పంట దిగుబడులు వచ్చినా, రైతు ఎందుకు దిగాలుగా ఉంటున్నారనేది ప్రధాన సమస్య! భూ రికార్డులు, భూ సంస్కరణలతో ముడిపడిన సామాజిక సమస్య. 40 సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లోని భూస్వాముల చేతుల్లో అక్రమంగా వున్న భూమిని ప్రజలు ఉద్యమాల ద్వారా సాగుచేసుకుంటున్నారు. మరి కొన్ని ప్రాంతాలలో బీడులుగా వున్న భూమిని ప్రజలు ఉద్యమాల ద్వారా సాగుచేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బీడులుగా ఉన్నాయి. వీటన్నిటినీ తిరిగి భూస్వాములకు తిరిగి అప్పచెప్పడానికే ఈ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. పోనీ ఈ సర్వే తర్వాత ప్రభుత్వమే ప్రకటించినట్టు భూమి లేని నిరుపేదలకు మూడెకరాల్ని ఇస్తుందనే గ్యారంటీ లేదు. మానకొండూర్‌లో ఏంజరిగిందో, దళిత యువకుడు శ్రీనివాస్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో తెలిసిందే!
ఇక కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్న కాంట్రాక్టు వ్యవసాయ విధానం, అమెరికాలాంటి వ్యవసాయ పద్ధతుల్ని అనుకరించడానికే! సెప్టెంబర్‌లో డ్రాఫ్ట్ రూపం దాల్చి, ముప్పై రోజుల పాటు రైతులతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధం లేనివారు ఈ డ్రాఫ్ట్‌పై చర్చించి సూచనల్ని చేయాలని కోరడం జరిగింది. తగిన సవరణలతో రాబోయే నవంబర్‌లో ఇది చట్టరూపం దాల్చితే వ్యవసాయదారులు తాము పండించే పంటల్ని ముందే కాంట్రాక్టల్లతో ఒప్పందం చేసుకుని అమ్ముకోవచ్చు అనేది దీని సారాంశం! అమెరికాలో సరాసరి కమతం 434 ఎకరాలుండగా, మన దగ్గర మూడెకరాలకు లోపే! ఈ కమతాల్లో ముందు ఇంటి తింటి గింజల్ని పండించుకోవాలని, మిగిలితే అమ్ముకోవాలని చూస్తాడు. అత్యధికంగా వరిని, లేదా వాణిజ్య పంటలైన మిరప, పత్తి, పసుపుని పండిస్తాడు. కాని ఈ కాంట్రాక్టు వ్యవసాయం ఆచరణలోకి వస్తే రైతు యూనిట్‌గా పంటలు పండించే విధానం తెరమరుగై సామూహిక పంటల విధానం, అందునా కాంట్రాక్టర్ కోరే పంటలు (కూరగాయలు? ఉద్యాన వన పంటలు/ఎగుమతులకోసం ఉపయోగపడే పంటలు మొ.) మాత్రపే పండించాల్సి వస్తుంది. లేదంటే కాంట్రాక్టు ఒప్పందం జరగదు.
ఉదాహరణకు ఓ ఆవాస ప్రాంతంలో 500 గడపలు, రెండువేల ఎకరాల సాగుభూమి ఉందనుకుందాం! ఇందులో సగం భూమి (1000) 15 శాతం కుటుంబాల చేతిలో మిగతా భూమిలో సగం (500) మరో 30 శాతం కుటుంబాల చేతిలో వుంటాయి. మిగిలిన 500 ఎకరాల భూమి మరో 40 శాతం కుటుంబాలకు చెందగా, దాదాపు15 శాతం కుటుంబాలకు భూమే లేకుండ వుంటుంది. లేదా కులవృత్తుల వారికి వుంటే గింటే ఇనామ్ భూములు, వెట్టి భూములుంటాయి. ఈ కుటుంబాలే పైనున్న 45 శాతం (15+30) కుటుంబాల భూముల్ని (1500 ఎకరాల్ని) సాగు చేయడమో, కూలీలుగా పనచేయడమో, లేదా యాంత్రీకరణ ద్వారా సాగైతే, వీరంతా ఉపాధి లేనివారిగానో మారి వలస కూలీలుగా మారతారు. కాంట్రాక్టు వ్యవసాయ విధానం అమల్లోకి వస్తే ఈ 45 శాతం కుటుంబాలు ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే ఇందులో చాలామంది పట్టణాల్లో ఉంటూ వ్యవసాయం కొనసాగిస్తారు కాబట్టి. మిగతా వారు కాంట్రాక్టు పద్ధతికి పోలేక స్వయంగా వ్యవసాయం కొనసాగించక, అనగా వీరు భూములు కాంట్రాక్టు ఒప్పంద భూముల మధ్యలో ఉంటాయి కాబట్టి సతమైతూ చివరికి కాంట్రాక్టుకు ఒప్పుకునే అవకాశమే ఎక్కువ. ఇలా ఓ ఆవాస ప్రాంత భూమి నయాన, భయాన కాంట్రాక్టు వ్యవసాయ భూములుగా రూపాంతరం చెందితే, అశేష ప్రజల కడుపు నింపే సంప్రదాయ, చిన్న కమతాల వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ వ్యవసాయంగా రూపాంతరం చెందుతుంది. ఇదే జరిగితే మరింత యాంత్రీకరణ పెరిగి, రైతు నేలకు దూరం కావడం తన క్షేత్రాల్లోనే వ్యవసాయ కూలీగా మారడం, లేదా వలస కూలీగా మారడం జరుగుతుంది. రైతులు కాంట్రాక్టు కుదుర్చుకుని, నచ్చిన పంటలు వేసుకోవచ్చు అని భావిస్తే కాలక్రమంలో ఆచరణ సాధ్యం కాకుండా మారే అవకాశాలే ఎక్కువ. అప్పుడు తిండిగింజలు, ఆహార భద్రత లాంటి సమస్యలు ముంచుకు వస్తాయి. అప్పుడు దిగుమతులే దిక్కయితే, కాంట్రాక్టు ద్వారా వచ్చిన డబ్బును తిరిగి తిండిగింజల్ని కొనుక్కోవడానికే రైతులు వెచ్చించాల్సి వస్తుంది. అంటే రైతు సమస్యలు పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టుగా వుంటాయి తప్ప పరిష్కారానికి నోచుకోవు.
కాబట్టి ఇలాంటి అనుకరణ, విదేశీ వ్యవసాయ ఆలోచన విధానాలకు స్వస్తి ప లికి, సంప్రదాయ వ్యవసాయ విధానానే్న రైతునేస్తంగా, శాస్ర్తియంగా అభివృద్ధిపరిచి ఆచరణలోకి తీసుకురావాలి. దీనికై ఆవాసాల ప్రాంతాలుగా సమష్టి వ్యవసాయ విధానాలే మేలు. వచ్చే వారం ఈ విధానాల గురించి చూద్దాం!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162