ఎడిట్ పేజీ

లక్ష్యానికి బిజెపి ఎంత చేరువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ రాజకీయ పక్షాలు 2019 సార్వత్రిక ఎన్నికలకోసం అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. సమయం ఇంకా పద్ధెనిమిది నెలలు ఉండగా ఇప్పటికే బిజెపి అభ్యర్థుల జాబితా తయారయింది. ఖాయంగా గెలిచే సీట్లు ఎంపిక చేసుకొని అందులో అభ్యర్థుల పేర్లు తాత్కాలికంగా నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి స్వీయ బలం 284 ఉండగా ఈసారి 350 సీట్లు గెలిచి తీరాలని నిర్ణయించింది. ఇందుకు తోడ్పడే పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు ఏమిటి? 2017 సెప్టెంబర్ 25వతేదీ పండిత దీనదయాల్ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకొని ‘సౌభాగ్య’ విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. దీనివలన మూడు కోట్ల సామాన్య ప్రజలకు లాభం కలుగుతుంది. లోగడ ప్రకటించిన జన్‌ధన్ యోజన వంటివి సరేసరి. జి.ఎస్.టివల్ల కేంద్రం సాధించిన ప్రయోజనం ఏమిటి? పెద్ద నోట్ల రద్దు అంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే బిజెపి ఆశించిన ప్రయోజనం వేరుగా వుంది. కుమారి మాయావతి, ములాయంసింగ్ యాదవ్, లల్లూ, సోనియా గాంధీ, పి.చిదంబరం వంటివారి ఆర్థిక మూలాలపై ఈ పెద్ద నోట్ల రద్దు భారీగా దెబ్బకొట్టింది. కుమారి మాయావతి ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘నాకు పూలదండలు వద్దు నోట్ల దండలు వేయండి’’ అని కోరింది. అలా ఆమె సేకరించిన వేల కోట్ల ధనం ఇప్పుడు నిష్ప్రయోజనమైంది. అంటే యూపిలో బిజెపి తిరుగులేని శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్నది.
బిహారులో యూపిలల్లో కలిసి 120 సీట్లు ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఎన్‌డిఎలో చేర్చుకోవడం, లల్లూయాదవ్ కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకురావడం ద్వారా బిహార్‌లో బిజెపి బలపడాలని ప్రయత్నిస్తున్నది. ఐతే ‘మై’ కాంబినేషన్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా బలంగానే వుంది. మై అంటే ముస్లిం ప్లస్ యాదవ్ ఓట్ బ్యాంక్. ఈ రెండు వర్గాలతోనూ సంబంధం లేకుండా మూడవ శక్తిని బిజెపి నిర్మించుకుంటున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బిజెపి విజయాలు నల్లేరుమీద బండి నడకలాంటివి. దాదాపుగా అక్కడ ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒకనాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ రాజకీయ సన్యాసం తీసుకొని ‘నర్మదా పరిక్రమ’ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం సెప్టెంబర్ 2017లో చేయటం ఆ పార్టీ దుస్థితికి అద్దంపడుతున్నది. గుజరాత్ పటేల్ కులస్థుల రిజర్వేషన్ ఉద్యమం బిజెపిని కొంత బలహీనపరచినా ఆ మేరకు కాంగ్రెసు పూర్తిగా పుంజుకున్నది అని చెప్పలేము. మొన్న రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో సోనియా గాంధీకి సన్నిహితుడైన అహ్మద్ పటేల్ వ్యూహాత్మకంగా రాజ్యసభకు గెలవటం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశమే. అసెంబ్లీలకు ఇప్పుడు కర్ణాటక, గుజరాత్‌ల ఎన్నికలు జరపాలా? వద్దా? అని కేంద్రం ఆలోచిస్తున్నది. 2019 సార్వత్రిక ఎన్నికలను 2018 నవంబరు, డిసెంబరులకు తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభలకు ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుంది? అనేది ఒక ఆలోచన. ఇందులోని ఆర్థిక లాభం సుస్పష్టం. రెండుసార్లు ఎన్నికలు జరపడం ద్వారా జరిగే ఖర్చులను తగ్గిస్తే మరో నాగార్జునసాగర్, భాక్రానంగల్, నర్మదా సరోవర్ డాములు కట్టుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందే నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పు వెలువడితే రాహుల్‌గాంధీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాగలదు. న్యూఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ అవినీతి ఊబిలో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే కమ్యూనిజం సైద్ధాంతికంగా అంతరించింది. రెండు కోట్ల మంది రోహింగ్యా (మయన్మార్ నిర్వాసితులు) ఓటు బ్యాంకు కోసం అస్సాంలో కాంగ్రెస్ పాకులాడుతున్నది. ఇదే పరిస్థితి బెంగాల్ మాల్దా ప్రాంతంలో వుంటుంది. మొన్న కలకత్తాలో ముస్లిముల భారీ ప్రదర్శన జరిగింది. రోహింగ్యాలను వెనుకకు పంపకూడదు అంటూ వీరు కేంద్రాన్ని బెదిరించారు. మమతా బెనర్జీ తల్లి ముస్లిం, తండ్రి బ్రాహ్మణుడు. అందువల్ల ఆమెలో ఇస్లామిక్ అభిమానం జన్మసిద్ధంగా ఉంది. ఇప్పుడామె బెంగాల్‌లో ముస్లిం ఓటు బ్యాంకుమీద ఆధారపడింది. కమ్యూనిస్టులు మళ్లీ అధికారంలోకి రారు. ఐనా బిజెపి బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో లేదు. దక్షిణాది రాష్ట్రాలల్లో 120 పార్లమెంటు సీట్లున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కేరళలో, తమిళనాడులో బిజెపి స్వంత జెండా అజెండాతో ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలుచుకోలేకపోవచ్చు. ఎందుకంటే తమిళనాడు ద్రవిడ సెంటిమెంటు బలంగా వుంది. ఎన్నికల సమయంలో దానిని పైకి తీసుకువస్తారు. కర్ణాటకలో ఎడ్యురప్ప, గాలి జనార్దన్ రెడ్డి గార్లమీద ఆర్థికమైన అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ సిద్ధరామయ్య పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. కర్ణాటకలో బిజెపి విజయధ్వజం ఎగురవేయవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ మాటేమిటి? ఇక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని కాదని ఎవరూ గెలవలేరు. అందుకని బిజెపి నారావారికి దూరం కావడం జరుగదు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆశలమీద నీళ్లు చల్లినట్లయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించగలడు. కాకుంటే బిజెపి ఎంపిక చేసుకున్న విశాఖ వంటి కొన్ని పార్లమెంటు సీట్లలో విజయం సాధించవచ్చు. రాజమండ్రి నుండి రాంమాధవ్‌ను బరిలోకి దించితే అతడు సులభంగానే గెలుస్తాడు. మంచి వక్తగా పేరొందిన ఎం.వెంకయ్య నాయుడుగారి పదోన్నతివల్ల ఎ.పిలో ‘వక్తల కరవు’ను సృష్టించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అజేయుడు. భగీరథ, కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రపంచ బతకమ్మ వంటి పథకాలు ఆయనకు మంచి డివిడెంట్లు తెచ్చిపెట్టాయి. దానికితోడు ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాము అనే హామీ ఆయనకు కలిసి వచ్చే అంశమే. అది అమలుకాకపోతే తప్పును కేంద్రంమీద వేయవచ్చు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఓయు టీచర్ గాలి వినోద్‌కుమార్‌ను లోక్‌సభకు నిలబెడితే వచ్చిన ఓట్లు 14 వేలు. ఇది తెలంగాణలో వామపక్షాల వర్తమాన స్థితికి అద్దం పడుతున్నది. రాబోయే కొద్ది వారాలల్లో భారీగా కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వలసలు ప్రారంభమవనున్నాయి. ఆ పేర్లు ఇప్పటికే ఢిల్లీ ఆమోదం కోసం పంపించారు. హైదరాబాదు రాజధానిలోని పార్లమెంటు స్థానాలతో సహా ఎక్కువ భాగం అసెంబ్లీ స్థానాలను బిజెపి ఇప్పటికే సూత్రప్రాయంగా అభ్యర్థుల ఖరారు చేసింది. వీరిలో ఎందరు నెగ్గుతారో తెలియదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ‘ప్రాంతీయ’ సెంటిమెంటు మీద కెసిఆర్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగవలసి వస్తుంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బోనాలు, బతుకమ్మ పండగ చీరెల పంపిణీ ఆయనకు ఓట్ల వర్షం కురిపించవచ్చు. మహారాష్టల్రో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం శివసేన నుండి గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. నిజానికి శివసేన అతివాద హిందూ పార్టీయే అయినప్పటికి హిందూ బిజెపిని ముప్పతిప్పలు పెడుతున్నది. ఎందుకని? ముంబాయిలో మహారాష్ట్రులు తప్ప తక్కిన హిందీ, ఇత్యాది భాషలవారు ఉండకూడదని శివసేనవాదం. ఇది నిజం కాదు. పంజాబులో బిజెపి ఏటికి ఎదురు ఈదుతున్నది. బిజెపి చేతిలో ఇంకా పద్ధెనిమిది నెలల సమయం ఉంది. ఈలోపల ఏం జరుగబోతున్నది? ప్రతిపక్షాల నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టవచ్చు. తమిళనాడులో బిజెపి రజనీకాంత్ గ్లామర్‌ను పొలిటికల్ గ్రామర్‌గా వాడుకోవచ్చు. కమల్‌హాసన్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కేంద్రంపై యుద్ధం ప్రకటించడం ద్వారా ఇటు చిత్రసీమలోనూ అటు రాజకీయాల్లోనూ స్థానం లేకుండా రెంటికి చెడిన రేవడి అనే సామెతను నిరూపించగలడు. తెలుగునాట చిరంజీవి మాదిరిగా ఆయన మిగలవచ్చు.
ఢిల్లీలో నరేంద్ర మోడీ, హైదరాబాద్ గల్లీలో కెసిఆర్ ఇద్దరూ మాటల మాంత్రికులే. వీరిని జయించడం కష్టం. 2019 ఎన్నికల ముందే ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే చెప్పలేము. కాని ప్రస్తుత పరిస్థితులల్లో ఢిల్లీలో బిజెపి, హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ను, ఎపిలో టిడిపి ప్రభుత్వలే మళ్లీ రాగలవు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ ముక్త్భారత్ నినాదం సాకారమయినట్లే! సారాంశమేమంటే తమిళనాడులో బిజెపికి రజనీకాంత్ అని పేరు. సీమాంధ్రలో ‘నారా’ అని పేరు. కాశ్మీర్‌లో ముఫ్తి మహమ్మద్ అని పేరు. బిజెపి రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నది. మొదటిది తన పాలనా పరిధిని పెంచుకోవటం, రెండవది తన సిద్ధాంతాలను దేశమంతా ప్రతి ఇంటికీ చేరాలని చూడటం. ఇక్కడ ఒక ప్రముఖ రాజకీయ సమీకరణాన్ని గురించాలి. బెంగాల్‌లో మమతా బెనర్జీ తన గొప్పతనంవల్ల అధికారంలోకి రాలేదు. అక్కడి ప్రజలు కమ్యూనిజాన్ని తిరస్కరించారు. అందుకు ప్రత్యామ్నాయంగా వారికి బలమైన నాయకురాలిగా మమత కన్పించింది. సరిగ్గా నరేంద్ర మోడీ విజయ రహస్యం కూడా ఇదే. కాంగ్రెస్ పరాజయంతో ఏర్పడిన ‘శూన్యాన్ని’ మోడీ పూరించాడు. ఇదే ఆయన బలం.
టార్గెట్ 350 అతిశయోక్తి కావచ్చు కానీ సులభంగా 290-300 మధ్య గెలుచుకోగలడు. అటు కాశ్మీరు లోయ, కేరళలను మినహాయిస్తే తక్కిన భారతదేశం మొత్తం 2019లో బిజెపి జయకేతనం ఎగరవేయవచ్చు. దేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోగా బిజెపి మాత్రం ‘కాడర్’ను గణనీయంగా పెంచుకున్నది. కేరళలో బిజెపి వెంటనే అధికారంలోకి రాకపోవచ్చు. కాని గణనీయంగా ఓట్ల శాతం పెంచుకుంటున్నది. హత్యా రాజకీయాలలో పిన్నారాయ్ విజయన్ బాగా అన్‌పాపులర్ అవుతున్నాడు. కరుణాకరన్ యుగం తర్వాత ఇవ్వాళ కాంగ్రెస్‌కు అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయింది. త్రిపుల్ తలాక్‌ను తిరస్కరించడం ద్వారా అక్కడి ముస్లిం మహిళల ఓట్లను కూడా బిజెపి కైవం చేసుకోవాలని అనుకుంటున్నది. కేంద్రంలో నరేంద్ర మోదీ చేతిలోనే మొత్తం అధికారం కేంద్రీకృతమై వుంది. అంటే ఒక వ్యక్తి గ్లామర్ మీద పార్టీ నడపటం ఇబ్బందికరమే- ఇలా ఎన్నో సమస్యలున్నప్పటికీ బలమైన ప్రతిపక్షం లేకపోవటమే బిజెపికి కలిసి వస్తున్న అంశం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నారు? 2018లో ప్రజలను ఆశ్చర్యచకితులను చేసే చర్యలు- ప్రకటనలు చేసి భారత జాతిని తనవైపు తిప్పుకోబోతున్నారని రాజకీయ విశే్లషకుల అంచనా! ఆ ప్రకటనలు ఏమిటి? వేచి చూడాలి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్