మెయిన్ ఫీచర్

ఆయన ఆశయం అక్షరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఉన్నత చదువులేమి చదవలేదు. కటిక పేదరికం ఆయనను ఓ టాక్సీ డ్రైవర్‌గా మార్చింది. కాని చదువు మీద ఉన్న తృష్ణ ఆయనను ఓ విద్యాదాతగా మలిచింది. విద్యాదానాన్ని జీవిత ఆశయంగా మలుచుకున్న ఆరు పదులు దాటిన ఘాజీ జలాలుద్దీన్ చదువే జీవన స్థితిగతులను మారుస్తుందని నమ్మాడు. ఆ నమ్మకంతోనే అరవై ఐదేళ్లు పైబడినా అనాథ పిల్లల కోసం రెండు పాఠశాలలు, ఒక శరణాలయం
నడిస్తున్నాడు ఈ టాక్సీ డ్రైవర్.

వరద బీభత్సాలకు నెలవైన సుందర్ బన్స్(పశ్చిమ బెంగాల్) ప్రాంత నివాసి అయిన జలాలుద్దీన్ టాక్సీ నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో స్కూల్, శరణాలయం నిర్వహణ ఇంకా ఎంతకాలం సాధ్యమవుతుందోనని ఆవేదన చెందుతున్నాడు. అతడి కొడుకులిద్దరూ కూడా ఈ బృహత్ కార్యక్రమంలో చేయూతనిస్తున్నప్పటికీ, వారు కూడా టాక్సీ డ్రైవర్లే! ప్రస్తుతం జలాలుద్దీన్ పుణ్యమాని అటు విద్యతోపాటు ఇటు భుక్తి కూడా పొందుతున్నారు 425 మంది అనాథ బాలబాలికలు. సుందర్‌బన్ ఆర్ఫనేజ్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరిట అతడు నడుపుతున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు సమకూరడం లేదు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలను సహాయ సహకారాల కోసం ఎంతగా అర్థించినా లాభం లేకపోయిందంటాడు జలాలుద్దీన్.
బాల్యమంతా భిక్షాటన..
ఈ కార్యక్రమంలో తన భార్య ప్రోత్సాహం ఎంతో ఉందని, ప్రస్తుతం తన కుటుంబం ఒక స్కూల్ ఆవరణలోనే నివసిస్తుందని అతడు చెప్పాడు. ‘ఏడేళ్ళ వయస్సులోనే చదువు ఆగిపోయింది. రెండోక్లాస్‌లో మొదటి ర్యాంకు స్టూడెంట్‌గా పేరుతెచ్చుకుని, మూడో తరగతికి వెళ్ళబోయే సమయమది. నా తల్లిదండ్రులు పుస్తకాల కోసం డబ్బులు ఇవ్వకపోవడమే అందుకు కారణం. నాలాంటి పేద పిల్లలకు ఎప్పటికైనా సహాయపడాలన్న ఆలోచన అప్పుడే నాలో అంకురించింది’. అని వివరించాడు ఘాజీ. అతడి బాల్యమంతా కోల్‌కతా వీధుల్లో భిక్షాటన చేయడంతోనే గడిచిపోయింది. అలా కొంతకాలం గడిచాక రిక్షాలు తొక్కడం మొదలెట్టాడు. ఆ తర్వాత టాక్సీ నడపడం ప్రారంభించాడు.
అనాథ పిల్లల అవసరాలు తీరుస్తూ..
1980 నుంచి అనాథ పిల్లలకు పుస్తకాలు, దుస్తులు సమకూరుస్తూ వాళ్ళు సక్రమంగా స్కూళ్ళకు వెళ్ళేలా చర్యలు తీసుకునేవాడు. కొందరు యువకులకు డ్రైవింగ్ నేర్పిస్తూ, వాళ్ళు జీవనాధారం పొందేలా సాయపడేవాడు. ఈ క్రమంలో 1998నాటికి జలాలుద్దీన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం, 16మంది పిల్లలతో ఒకచిన్న ప్రాథమిక పాఠశాలను సొంత స్థలంలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత మరికొంత స్థలం సంపాదించి, ఆ స్కూల్‌స్థాయి పెంచి, దానికి తోడుగా ఒక అనాథ శరణాలయాన్ని కూడా ప్రారంభించాడు. మరికొంతకాలం గడిచాక రెండో పాఠశాలకు అంకురార్పణ జరిగింది. జలాలుద్దీన్‌కు మొదట్లో టాక్సీ ద్వారా లభించే ఆదాయం రోజు రూ.450. ఈ ఆదాయంలో కుటుంబ పోషణ, టాక్సీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును స్కూళ్ళ కోసం వెచ్చించేవాడు. రెండు పాఠశాలల్లోనూ నాలుగో తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తుండగా, ఒక స్కూల్‌లో ఇటీవలె రాష్ట్రప్రభుత్వం నిర్వహించే పదో తరగతి పరీక్షలకు శిక్షణ ఇచ్చే తరగతులను కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ స్కూళ్ళస్థాయి మరింతగా పెంచి, ఇందులోని పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం వైపు మళ్ళేలా చర్యలు తీసుకోవడం అతడి లక్ష్యం. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ద్వారా సమాజానికి తనవంతు ఉడతాభక్తిగా సాయం చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్నాడు జలాలుద్దీన్.

ఆ టాక్సీకి అపరాధరుసుం ఉండదు..

24 పరగణాల జిల్లా జోయ్‌నగర్ పట్టణం కోల్‌కతాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ జలాలుద్దీన్ నడుపుతున్న స్కూళ్ళు, అనాథ శరణాలయంలో 21 మంది ఉపాధ్యాయులతో సహా మొత్తం 25 మంది పనిచేస్తుంటారు. వీరికి జీతాలు, వేతనాలు- అతడి టాక్సీ ద్వారా లభించే ఆదాయం, దాతలు ఇచ్చే విరాళాల ద్వారా సమకూరుతుంటాయి. ఒక్కోసారి టాక్సీలో వెళ్ళే ప్రయాణికులు కూడా అతడి కథ విని, ఇతోధికంగా సాయం చేస్తుంటారు. అలాగే, తన టాక్సీ సర్వీసు చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ‘ఈ టాక్సీకి ఎటువంటి జరిమానాలు, అపరాధ రుసుం విధించవద్దని, ఎందుకంటే ఈ బండి ద్వారా వచ్చే ఆదాయం ఎంతోమంది అనాథల జీవితాల్లో వెలుగునింపుతుంద’ని జలాలుద్దీన్ తన టాక్సీపై రాయించుకున్నాడు.

- జి.కల్యాణి