ఎడిట్ పేజీ

బిజెపి సైద్ధాంతిక నిబద్ధతకు సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షాకు చెందిన కంపెనీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయంటూ వచ్చిన వార్తలు ఇప్పటివరకు సైద్ధాంతికత, పటుత్వం గురించి ఘనంగా చెప్పుకునే బిజెపి అధినాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు జయ్‌షాకు చెందిన కంపెనీలు తీవ్ర నష్టాల్లో వున్నాయని, 2014 తరువాతే జయ్‌షాకు చెందిన టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టర్నోవర్ అకస్మాత్తుగా 16 వేల రెట్లు పెరిగిందంటూ వచ్చిన కథనం బిజెపిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ విషయమై బిజెపి స్పందించిన తీరుతో ఆ పార్టీ నైతికతను కోల్పోయిందని ఆ పార్టీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి నేత యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించడం పార్టీని వెంటాడుతున్న సంక్షోభాన్ని వెల్లడి చేస్తున్నది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జయ్‌షా వ్యవహారంలో బిజెపి స్పందించిన తీరు ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేసిందని ఆయన స్పష్టం చేసారు. మరోవంక అవినీతిని చీల్చి చెండాడుతాను అంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీపై విశ్వాసం కోల్పోయినట్టు అయిందని ప్రముఖ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే వాపోయారు. అవినీతిని రూపుమాపుతామంటూ మోదీ ఇన్నాళ్లు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను ప్రజలు ఇక నమ్మబోరని ఆయన దుయ్యబట్టారు.
వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని అక్రమాలు జరిగినట్టు వెల్లడైతే తగుచర్య తీసుకుంటామని, ఎవ్వరూ చట్టానికి అతీతులు కారని ప్రకటన చేసి ఉంటే గౌరవంగా వుండేది. ఆ విధంగా కాకుండా వార్త రాసిన ఆన్‌లైన్ వార్త పత్రికపై రు.100కోట్లకు పరువునష్టం దావా వేస్తామనడం, అందుకోసం అదనపు సొలిసిటర్ జనరల్ సేవలను ఉపయోగించుకోవాలని అనుకోవడం గమనిస్తే ఏమాత్రం నైతికత కూడా బిజెపి ప్రవర్తనలో వ్యక్తం కావడం లేదు.
కంపెనీల రిజిస్ట్రార్‌కు అమిత్‌షా కుమారుడికి చెందిన సంస్థ సమర్పించిన వివరాలను కథనంలో ప్రస్తావించినందున కోర్టుకు ఈడ్చే ప్రయత్నం చేయడం ప్రభుత్వానికీ, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు సంబంధించి వ్యతిరేక వార్తలు రాస్తే జాగ్రత్త అని హెచ్చరించినట్టు అయింది. ఈ కథనంలో అంశాలు ఏమాత్రం వాస్తవాలు, అమిత్‌షా అన్నట్టు సాంకేతికపరమైన సమస్యలు మాత్రమేనా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ విషయమై అసహనం వ్యక్తం చేయడం, ఒక విధంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించడం బిజెపి సైద్ధాంతిక భూమికనే ప్రశ్నించే విధంగా వుంది. జయ్‌షాకు చెందిన సంస్థలో అక్రమాలేవీ జరగలేదని కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ సర్ట్ఫికెట్ ఇవ్వడం కూడ విస్మయం కలిగిస్తున్నది. యశ్వంత్ సిన్హా అన్నట్టు ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా షా చార్టర్డ్ అకౌంటెంట్‌వలె వ్యవహరించినట్టు భావించాల్సి వస్తున్నది. బిజెపి జాతీయ అధ్యక్షులపై ఇటువంటి ఆరోపణలు రావడం ఇదే ప్రధమం కాదు. గతంలో కూడా వచ్చాయి. అయితే అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వ్యవహరించిన తీరే విభిన్నంగా వుంటూ వస్తున్నది.
మొదటగా మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వానీ హయాంలో ఆయనకు హవాలా కుంభకోణంలో ముడుపులు చెల్లించినట్టు ఒక డైరీ ఆధారంగా ఆరోపణలు వస్తే ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆరోపణలనుండి బయట పడేవరకు ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి, ఇతర పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు.
ప్రస్తుత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడుగా వున్న సమయంలో నెల్లూరు జిల్లాలో స్వగ్రామం వద్ద దళితులకు కేటాయించిన భూములను కొనుగోలు చేసారనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే ఆ భూములను తిరిగి ఇచ్చివేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఆయనపై పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎటువంటి విచారణ జరిపే ప్రయత్నం చేయనేలేదు. ఈ రెండు సంఘటనల్లో మొత్తం పార్టీ యంత్రాంగం వారిద్దరికీ బాసటగా నిలిచింది. వారు నిర్దోషులు అంటూ విచారణ ప్రారంభం కాకుండానే సమర్ధించుకుంటూ వచ్చారు. కానీ ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ విషయంలో భిన్నంగా వ్యవహరించారు. ఆయన పార్టీ నిధిగా ఒక లక్ష రూపాయలు తీసుకున్న అంశం తెహల్కా టేప్‌లలో అల్లరి కావడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. కుట్రపూరితంగా తనను ఇరికించారని ఆయన స్పష్టం చేసినా, అనేకమంది ప్రముఖులు సైతం భావించినా పార్టీ పరంగా ఆయనకు అండగా వుండే ప్రయత్నం చేయనేలేదు. చివరకు కోర్టు జైలు శిక్ష విధించి, బెయిల్ ఇవ్వడంలో కూడా అసాధారణ జాప్యం జరిగినా జరుగుతున్న కుట్రను ప్రశ్నించే ప్రయత్నం పార్టీ చేయలేదు.
జైలులో తగు వైద్య సదుపాయం లభించక ఆయన అనారోగ్యానికి గురై తరువాత కొద్ది కాలానికే మృతి చెందినా అప్పటి యుపిఎ ప్రభుత్వాన్ని ఫ్రశ్నించే ప్రయత్నం బిజెపి నాయకులు ఎవ్వరు చేయలేదు. జైలులో వున్నప్పుడు అనారోగ్యానికి గురైతే ఢిల్లీలో వున్న పార్టీ పెద్దలు ఎవరూ పరామర్శ కూడా చేయలేదు. కనీసం ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన దళిత్ కావడంతోనే ఇటువంటి వివక్ష చూపారన్న విమర్శలు వచ్చాయి. ఆ తరువాత తనకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరపడంతో నితిన్ గడ్కరీ మరోమారు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టలేకపోయారు. కానీ ఇప్పుడు కుమారుడి కంపెనీలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్‌షా ఎటువంటి బాధ్యత వహించేందుకు సిద్ధ పడడంలేదు.
ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వంనుండి లభించిన స్పందన సైతం ప్రశ్నార్ధకంగా భావించాల్సి వస్తుంది. బంగారు లక్ష్మణ్ స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వాన్ని కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని తనపై జరిగిన కుట్రను గురించి వివరించినా కల్పించుకోలేదు. అయితే గడ్కరీ విషయంలో మాత్రం ఎస్.గురుమూర్తితో విచారణ జరిపించి ఆయన ఏ తప్పు చేయలేదని సర్ట్ఫికెట్ ఇప్పించారు. ఒక నాయకుడి వ్యక్తిగత కంపెనీలపై వచ్చిన ఆరోపణల వాస్తవికతను చట్టప్రకారం నిర్ధారింప చేసుకునే అవకాశం వుండగా గురుమూర్తిని నియమించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అదే బంగారు లక్ష్మణ్ విషయంలో ఎందుకు వౌనం వహించారు? అదే విధంగా అమిత్‌షా కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని నుండి అందరూ ఎందుకు వౌనంగా వుంటున్నారు? కేవలం దళిత్ కావడంతో లక్ష్మణ్ కుట్రకు బలయ్యారా? ఇలాంటి కారణాలవల్ల బిజెపి సైద్ధాంతిక భూమిక, నైతిక ప్రాతిపదికలు బీటలు వారుతున్నట్టు స్పష్టం అవుతున్నది.
ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావనకు వస్తున్నది. లక్ష్మణ్, గడ్కరీ, అమిత్‌షాలపై వచ్చిన ఆరోపణల వెనుక పార్టీలోని ఒక నాయకుడి ప్రమేయం వున్నదనే అభిప్రాయం కూడా కలుగుతున్నది. బంగారు లక్ష్మణ్‌ను అప్రదిష్టపాలు చేసిన తెహల్క సంస్థతో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మంచి సంబంధాలు వున్నాయి. పైగా ఆ ఆరోపణలు రాగానే లక్ష్మణ్‌ను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించమని తాను వెంటనే వెళ్లి ప్రధాని వాజపేయికి సూచించానని అంటూ ఒక వ్యాసంలో కూడా అంగీకరించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. గడ్కరీ తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపడితే 2014 ఎన్నికల్లో పార్టీని తమ ప్రయోజనాలకు అనువుగా మలుచుకోవడం సాధ్యం కాదనుకుంటున్న కొందరు సీనియర్ నాయకుల ప్రమేయంతోనే నాటి యుపిఎ ప్రభుత్వం ఆదాయపన్ను శాఖ నుండి ఆయనకు చెందిన కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ తరువాత ఆ కేసుల గురించి ఎవ్వరు పట్టించుకోకపోవడం గమనార్హం. కుట్రపూరితంగా తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనీయకుండా బిజెపిలోని బలమైన వర్గాలే ఈ విధంగా చేయించినట్టు స్పష్టం అవుతున్నది.
ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయినట్టు యశ్వంత్‌సిన్హా, అరుణ్ శౌరీ వంటివారి నుండి దాడులు ముమ్మరం కావడం, అరుణ్ జైట్లీ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ తీరుపట్ల బిజెపి వర్గాల్లో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతుండడం జరుగుతున్న సమయంలోనే అమిత్‌షా కుమారుడిపై ఆరోపణలు వెలుగులోకి రావడం గమనార్హం.
యశ్వంత్ సిన్హా ఆరోపణలను కొట్టిపారేసిన ప్రభుత్వంలోని పెద్దలు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగంలో కూడా ప్రభుత్వ ఆర్ధిక విధానాలపట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మారు మాట్లడలేకపోయారు. సంవత్సర కాలంగా ఆర్థిక శాఖ పనితీరుపట్ల సంఘ్ పరివార్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఆర్థిక శాఖ నుండి జైట్లీని మార్చాలని అమిత్‌షా పట్టుబడుతు వస్తున్నారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ మార్పులలో అటువంటి ప్రయత్నం జరిగినా ఆయా ప్రయత్నాలను జైట్లీ తిప్పికొట్టగలిగారు. కానీ తాజాగా వస్తున్న దాడులతో కలత చెందిన ప్రధాని మోదీ ఈ విషయమై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ ఆలోచనను జైట్లీ పసిగట్టే మొత్తం వ్యవహారాన్ని అమిత్‌షాపైకి మళ్లించే ప్రయత్నం చేసారా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి.
అవినీతి, నల్లధనంపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇవ్వడం ద్వారా అధికారంలోకి వచ్చిన మోదీనుండి దేశ ప్రజలు ఈ విషయాలపై చాలా ఆశించారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేయడానికి కారణం జైట్లీ అని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో సాహసోపేత నిర్ణయాలుగా భావిస్తున్న నోట్ల రద్దు, జిఎస్టీలు సైతం ఈ విషయంలో ఆశించిన ఫలితం ఇవ్వకపోగా ఆర్థిక వృద్ధిరేటు మందగించడానికి దారి తీయడం ఆందోళన కలిగిస్తున్నది.
మరో 20 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో ఆర్థిక రంగంలో తగు పురోగతి చూపలేని పక్షంలో 2019 ఎన్నికల్లో తిరిగి గెలవడం అసంభవం అనే ఆందోళన సైతం బిజెపి వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. అందుకనే ఈ పరిణామాలు ప్రధాని మోడీకి విషమ పరీక్షగా మారాయి. ఆయన ఏర్పరుచుకున్న నైతిక శిఖరాలు కూలిపోతున్నట్టు స్పష్టం అవుతున్నది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని ఆర్థిక అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ఒక అధికారిని ప్రాముఖ్యతలేని స్థానానికి బదిలీ చేయడము, మరో అధికారిని అవినీతి కేసులో బుక్ చేయడంతోపాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులపై వస్తున్న ఆర్థిక నేరాల ఆరోపణల విషయంలో ఈ ప్రభుత్వం మొక్కుబడిగా మాత్రమే వ్యవహరించడం కూడా అవినీతిపై వారికి గల పోరాట పటిమను ప్రశ్నార్ధకం చేస్తున్నది. విజయమాల్య పార్లమెంటులో అరుణ్ జైట్లీని కలిసిన తరువాతనే ఇంగ్లండ్ పారిపోవడం, అతనిని తీసుకువచ్చే ప్రయత్నాలు దృఢంగా జరగకపోవడం చూస్తున్నాము. లలిత్ మోడీ విషయాన్నీ నీరుగార్చే ప్రమాణాలు జరుగుతునే వున్నాయి. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై విమర్శలు మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో వ్యక్తులను బట్టి కాకుండా సైద్ధాంతిక భూమికను కాపాడుకునే రీతిలో మోదీ కఠిన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో ప్రజలు ఇచ్చిన ఒక మహావకాశాన్ని వృధా చేసుకున్నట్టు కాగలదు.

-చలసాని నరేంద్ర9849569050