ఎడిట్ పేజీ

సమష్టి వ్యవసాయంతోనే పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా విప్లవం విజయవంతమైన తర్వాత గ్రామాల్లో భూసమస్య ముందుకు వచ్చింది. అప్పటిదాకా భూస్వాముల చేతుల్లోగల వేలాది ఎకరాల భూమి వ్యవసాయదారుల పరమైంది. అలా వచ్చిన భూముల్ని ఎలా సాగుచేయాలో, ఎలా పరిష్కరించుకోవాలో వ్యవసాయదారులకు అర్థం కాలేదు. దానికి విప్లవ పోరాట అనుభవంతో వున్న రైతులంతా సమానంగా పంచుకోవాలనే ఆలోచన చేసారు. గ్రామాలవారీగా భూకంపం ప్రారంభమైంది. ఓ గ్రామ రైతులు తమతోపాటుగా లెనిన్‌కు కూడా భూమి పంచాలని తీర్మానించి పంపిణీ చేసి ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా లెనిన్‌కు తెలిపారు. సోవియట్ పునఃనిర్మాణంలో, మంత్రిమండలి సమావేశాలతో తాను తలమునకలై వున్నానని, తనకు భూమి పంపిణీ చేసినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన భాగాన్ని రైతులు ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు అని సూచించాడు. దీంతో ఆ గ్రామ రైతులు లెనిన్ వాటాని ఎవరికీ ఇవ్వకూడదని, పంచుకోవద్దని, బదులుగా ఉమ్మడి ఉపయోగంలో సాగు చేయాలని తీర్మానం చేసారు. ఆ విధంగా ఆ వాటాలో పండిన పంటను సమాజ అవసరాలకై నిల్వ చేయడం, ఏ రైతుకైనా పంట నష్టం జరిగితే, దాచిన ధాన్యాన్ని పంచడంతో రైతులు చీకుచింతా లేకుండా వుండేవారు. ఈవిధంగా పోగుపడిన లెనిన్ వాటా ధాన్యంతో గ్రామ అవసరానికి సంబంధించిన యంత్ర పరికరాల్ని, హార్వెస్టర్లని కొనడం చేసారు. మరోసారి, కొంత ధాన్యాన్ని కార్మికులకు పంపి, అది మామూలు ధాన్యం కాదని, లెనిన్ వాటా ధాన్యమని లేఖ జత చేసారు. అలా పదేళ్లు గడిచాయి. చివరికి లెనిన్ వాటా విధానం గ్రామంలో సమష్టి ఆలోచనలకు, సమష్టి వ్యవసాయ విధానానికి బీజాలు వేసాయి. విప్లవాలకి ముందు ఆకలితో, పంట నష్టాలతో, అప్పులతో బాధపడిన రైతులకు ఈ సమష్టి వ్యవసాయ విధానం స్వయం సమృద్ధివైపు దారితీసింది. చైనాలో, జపాన్‌లో, ఈ విధానాన్ని మరింత అభివృద్ధి పరిచి అమలు చేయడంతో అతి స్వల్పకాలంలోనే వ్యవసాయంలో అనూహ్య పురోగతిని సాధించాయి.
ఇలాంటి వ్యవసాయ విధానం మన దేశంలో, ముఖ్యంగా గిరిజన ఆవాస ప్రాంతాల్లో వుండేది. ఇప్పటికీ మధ్య భారత్‌లో నివాసముండే గోండులు, కోయలు ఈ వ్యవసాయ విధానాన్ని పాటిస్తూ వున్నారు. ఆయా ఆవాస ప్రాంతంలోని యువత, ఆ ప్రాంత అభివృద్ధికి సమష్టి శ్రమను చేయడం, దీన్ని ‘గోతుల్’ అనే సంస్థ నిర్వహించడం జరిగేది. నేటి పనికిరాని విద్యావిధానం, గిరిజనేతరుల వలసలు ఈ విధానానికి గండి కొట్టాయి. అలాగే యాంత్రీకరణకు ముందు మన గ్రామాల్లో ఈ విధానం కనపడేది. అనగా ‘బదలు’ ‘వంతు’ అనే పేర్లతో పిలవబడే ఈ విధానంలో సహకార పద్ధతి అమలు జరిగేది. రెండు, మూడు కుటుంబాల రైతులు వారివారి కమతాల్లో ఈ విధానాన్ని పాటించేవారు. ఎక్కువ తక్కువల్ని సర్దుబాటు చేసుకోవడం, ధాన్యంతో సరిపెట్టడం జరిగేది. దాదాపుగా సున్న శాతం పెట్టుబడితో వ్యవసాయం సాగినరోజులు మన గ్రామీణ వ్యవస్థకు అనుభవంలో వున్నదే! దున్నడం, విత్తడం, కలుపుతీయడం, నూర్పిళ్లదాకా ఈ విధానం కొనసాగేది. యాంత్రీకరణ, సంకరజాతి విత్తనాలు, రసాయన ఎరువులు, వాణిజ్యపంటలు ప్రవేశించి, ఈ విధానాన్ని గండికొట్టాయి. బడితున్న వారిదే బర్రెలా (గేదె), డబ్బున్నవారి, ట్రాక్టర్లు వున్నవారి వ్యవసాయం కొనసాగడం, చిన్న కమతాల వ్యవసాయం కుంటుపడటం, బీళ్లుగా మారడం జరుగుతున్నది. దీనికితోడు వలసలు, గల్ఫ్ బాటలు, కూలీల కొరత గ్రామీణ వ్యవసాయాన్ని వల్లకాడుగా మార్చాయి. దాదాపు ప్రతి అయిదు, పది గడపల్లో ఓ మృత్యు ముఖం కనపడుతుంది.
పెరిగిన వ్యయం, కలసిరాని కాలం, కనికరం లేని మార్కెట్ తీరు, సహకారం, సానుభూతి కొరవడిన గ్రామీణ వ్యవస్థ వెరసి రైతును పరాధీనతకు, భూమికి దూరం చేస్తున్నాయి. నలుగురి బాగోగులు చూసిన ఒకప్పటి రైతు ఇతరుల సహాయానికై దీనంగా చూడాల్సి వస్తున్నది. వీటికి విరుగుడుగా ప్రభుత్వాలు ప్రకటించని పథకాలు లేవు. రైతు పక్షాన మాట్లాడని రాజకీయ నాయకుడు లేడు. అయినా అంతా విలోమమే! కాలికి పడిన ఉచ్చు తీయకపోతే, మెడకు ఉచ్చు తగిలిన చందంగా రైతుల సమస్యలు అప్రతిహతంగా కొనసాగుతూనే వున్నాయి. రుణమాఫీ పథకాలు సబ్సిడీలు, మాటల గారడీలు రైతుకు గుండె ధైర్యాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ నియంత్రిత వ్యవసాయ విధానమని, కాంట్రాక్టు విధానమని, ఫసల్, పంటల బీమా అని ఎన్ని యుక్తులు పన్నినా రైతు కడగండ్లకు శాశ్వత పరిష్కారం దొరకడంలేదు. పైగా ఇవన్నీ అమెరికాలాంటి విశాల క్షేత్రాలున్న వ్యవసాయ విధానాల నమూనాలుగానే వుంటున్నాయిగాని, మన స్థానిక చిన్న కమతాల వ్యవసాయ విధానానికి అతకడం లేదు. ఈ చిట్కాలన్నీ రైతును వ్యవసాయానికి దూరం చేస్తూ వున్నాయి. ఇలాంటి స్థితిలో తిరిగి రైతును తాను నమ్ముకున్న వ్యవసాయ క్షేత్రాల్లో నిలబెట్టాలంటే, పైన ప్రస్తావించిన సమష్టి వ్యవసాయ విధానాల్ని మరింత అభివృద్ధి పరిచి ఆచరణలోకి తీసుకురావాలి.
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఈ విధానం సాధ్యమా అనేవారు కొందరైతే ఇది రాజకీయ రంగు పులుపుకుంటుందని భావించేవారు మరికొందరుండవచ్చు. ఎన్ని రాజకీయాలున్నా, లోపభూయిష్టంగా నడుస్తున్నా గ్రామస్తుల్ని ఒక తాటిపైకి తెచ్చిన ఘనత గ్రామీణ ఉపాధి హామీ పథకానిదే! దీన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసి నడిపితే సమష్టి వ్యవసాయ విధానం విజయవంతంగా కొనసాగుతుంది. దీనిపై ఒక్కో ఆవాస ప్రాంతాన్ని యూనిట్‌గా గుర్తించాలి. పెద్ద ఆవాస ప్రాంతాలైతే తరి, మెట్ట ప్రాంతాల ఆధారంగా, ఖరీఫ్, రబీ పంటల ఆధారంగా క్షేత్రాలుగా విభజించాలి. ఈ విధానంలోకి రాని రైతుల్ని మినహాయించి, మిగతావారితో రైతు నిర్వహణ కమిటీలను ఏర్పర్చుకోవాలి. రాజకీయ రంగు లేకుండా, ఆర్థిక కమిటీ, ఆడిట్ కమిటీ, సమీక్ష కమిటీలను ఏర్పాటు చేసుకుని, నిపుణులతో వీరికి స్వల్పకాలిక శిక్షణ ఇప్పించాలి. ఈవిధంగా ఏర్పడిన కమిటీలు, ఈ విధానంలో చేరిన రైతుల భూముల్ని సర్వే చేసి, నీటి తీరునుబట్టి, నేల స్వభావాన్ని బట్టి పంటలు వేయడాన్ని నిర్ధారించాలి. ఈ విధంగా చేరిన రైతుల భూములకు, పంటలతో సంబంధం లేకుండా, ఎకరానికి ధరల్ని (పరోక్షంగా కౌలు) నిర్ణయించి, పంపిణీ చేయాలి. రబీలో తక్కువ భూమి సాగైతే, సాగైన ఫలసహాయాన్ని సమష్టిగా పంపిణీ చేయాలి. సాగు చేయని భూముల్ని పశువుల పెంపకానికి, మేపకానికి, ఇతర అవసరాలకు ఉపయోగించాలి. సమష్టి క్షేత్రాల మధ్యలో వున్న రైతు ఈ విధానంలోకి రాకపోతే, దానికి సమానమైన భూమిని మరో ప్రాంతంలో చూపి, ఈ భూమిని సమష్టిగా సాగుచేయాలి. సమష్టి వ్యవసాయ ఫలాల్ని చూసి, ఇలాంటి రైతులు ఏదోరోజున ఈ విధానానికి మొగ్గు చూపడం జరుగుతుంది. ఈ సమష్టి వ్యవసాయ విధానంలో భూకమతాలకు పరిమితి వుండాలి. అత్యధిక ఎకరాల్లో భూములుండి, పట్టణాల్లో నివాసముంటూ వ్యవసాయం చేయించేవారు కూడా వుంటారు. వారు ఏనాడు వ్యవసాయ పనుల్లో పాల్గొనరు. పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయించే ఇలాంటివారి భూముల్ని పది ఎకరాలకు మించకుండా చూడాలి. మిగతా ఎకరాలకు, ప్రతి పది ఎకరాల చొప్పున కౌలును తగ్గిస్తూ నిర్ణయం చేయాలి. ఇది పరోక్షంగా, సాగు చేసేవారికే ఫలసాయం అనే నానుడికి ఊతమిస్తుంది. అలాగే అదనపు భూమి ఫలసహాయాన్ని యావత్ గ్రామం అనుభవించే అవకాశం ఏర్పడుతుంది.
ఈ క్షేత్రాల్లో పనిచేయడానికి ముందు భూములు కలవారికి, తర్వాత రైతు కూలీలకు ప్రాధాన్యతనివ్వాలి. పనిచేసేవారి సంఖ్య అధికమైతే, సీజనుకు ప్రతి వ్యక్తి 60 రోజులకు మించకుండా చూడాలి. భూమి లేని రైతు కూలీలకు, కనీసంగా పది శాతం పనిదినాల్ని కల్గించాలి. అధిక లేబర్ అవసరం వున్నపుడు, పక్క గ్రామాల నుంచి తీసుకురావాలి. వీరందరికీ కనీస వేతన నిబంధనల కింద దినసరి వేతనాల్ని, స్ర్తి పురుష భేదం లేకుండా నిర్ణయించి, హాజరు పట్టికల్ని నిర్వహించాలి. పండించిన పంటల్ని అమ్మడం, నిల్వ చేయడం గ్రామ యూనిట్‌గా జరగాలి. వచ్చిన డబ్బులో కూలీల కూలి, నిర్వహణ, విత్తనాల, ఎరువుల ఖర్చులు పోగా, మిగిలిన దాంట్లో అయిదు నుంచి 10 శాతాన్ని ఈ కమిటీలకు, గ్రామ వికాసానికి (విద్య, వైద్యం మొ..) జమ చేయాలి. నష్టం వస్తే (నిజానికి రాదు) సమష్టిగా భరించాలి. నీటి యాజమాన్యం, భూగర్భ జలాల వినియోగం సమష్టిగా, వాల్టా చట్టానికి లోబడి జరగాలి. ఈ విధానం ఒకటి, లేదా రెండు సంవత్సరాలలోనే లాభాలతో మిగులుతో నడుస్తూ రైతుకు రంది లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. వ్యవసాయానికి పూర్వ వైభవం సిద్ధిస్తుంది. వ్యవసాయం నుంచి వైదొలిగే ఎక్సిట్ పాలసీ నుంచి ఎంట్రీ పాలసీ తిరిగి ఊపందుకుంటుంది. వ్యవసాయం సాఫీగా సాగి, అనుబంధ పరిశ్రమలకు దోహదపడుతుంది. లేదా ఈ కమిటీలే ఇలాంటి అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోగలవు. ఉదాహరణకు, నూనె గింజల నుంచి నూనెను తీసి శుద్ధిచేసి అమ్మడం, బియ్యాన్ని మరపట్టి అమ్మడం, మొక్కజొన్న, జొన్నల నుంచి కార్న్‌ఫ్లాక్స్‌లు తయారు చేయడం, టొమాటోలతో సాస్‌ల్ని, రసాల్ని తయారు చేయడం, పళ్లను, కూరగాయల్ని ప్రాసెసింగ్‌తో ఎగుమతి చేయడం లాంటివి అమలు చేయవచ్చు. అనంతపురం జిల్లాలో కరువు నివారణకు ఏర్పాటైన వ్యవసాయ విస్తరణ, అటవీ యాజమాన్య కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది కూడా! దశాబ్దం క్రితం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పీపుల్స్‌వార్ నాయకత్వం ఈ విధానాలకై కొంత రూపకల్పన జరిగింది. విధానాలు మంచివైనపుడు, రాజకీయాలకు అతీతంగా వాటిని అమల్లోకి తీసుకెళితే మంచి ఫలితాలు వస్తాయి. లేదా ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, రైతుల ఐచ్చికం మేరకు వీటిని అమలు చేసేవిధంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వపరంగా, సహాయ సహకారాల్ని అందించాలి.
ఈ విధానం ఓ ఆశల సౌధం అనుకోవద్దు. అసాధ్యం అంతకన్నా కాదు. భయానకంగా మారిన వ్యవసాయాన్ని, దీనిపై ఆధారపడిన అశేష ప్రజానీకాన్ని కాపాడుకోవాలంటే ఇదే ప్రత్యామ్నాయ మార్గం. ఇది అమలైతే, గ్రామీణ ప్రాంతాల్లో, రైతుల్లో, యువతలో మనోధైర్యం పెరిగి, వ్యవసాయాన్ని వృత్తిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162