మెయిన్ ఫీచర్

వసూల్ రాజా ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సాఫీస్‌ను షేక్ చేసి కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ప్రస్తుతం టాలీవుడ్ పావులు కదుపుతోంది. తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లు వున్నాయి. అవి సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి ఇలాంటి సీజన్‌లలో విడుదలయ్యే చిత్రాలకు మినిమం గ్యారంటీతో పాటు, ఆయా చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భలే గిరాకీ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లలో తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అంతేకాదు, ఇలాంటి సమయంలో విడుదలయ్యే సినిమాలపై ఇటు పరిశ్రమ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలుంటాయి. ఇలా విడుదలైన సినిమాల్లో ఏదైనా బావుంది అనిపిస్తే చాలు.. ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కాసులపంటే పండుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతల జేబులు నిండుతాయి..రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడతాయి. ఆ ఆనందం పరిశ్రమలో.. ముఖ్యంగా నిర్మాతల్లో వెల్లివిరిస్తుంది. సాదాసీదా సినిమా కూడా ఇలాంటి సీజన్‌లలో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ చిత్రం గట్టెక్కినట్లేనని సినీ పెద్దలు చెబుతుంటారు. ఇది నిజం కూడా. ఎందుకంటే గతంలో ఈ సీజన్‌లలో విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయమే మనకు స్పష్టమవుతుంది.
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి సీజన్‌లను టార్గెట్ చేసుకొనే చాలా మంది దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను రూపొందిస్తుంటారు. గంపెడాశతో ఇలాంటి సీజన్‌లలో తమ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని, జేబులు నింపుకోవాలని కలలుకంటారు. నిజానికి వాళ్లు అలా ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడివున్న వినోదం. భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి, అంతే భారీగా చిత్రాన్ని తెరకెక్కించినప్పుడు లాభం ఆశించడం ఎవరికైనా సహజమే కదా! ఈ ఏడు కూడా ఈ సీజన్‌లనే టార్గెట్ చేసుకొని అగ్ర తారల సినిమాలు ప్రేక్షకుల తీర్పును కోరుతూ విడుదలయ్యాయి.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలోనే వసూళ్లు రాబట్టాయి.. ఇంకా ఆ చిత్రాలు వసూళ్ల బాటలోనే పయనిస్తున్నాయి. ఎన్‌టిఆర్ హీరోగా విడుదలైన ‘జై లవకుశ’, మహేష్‌బాబు ‘స్పైడర్’, శర్వానంద్ ‘మహానుభావుడు’ ఈ దసరాకే విడుదలై పండగకు బాక్సాఫీస్ కళను తీసుకువచ్చాయి. ఊహించిన రీతిలోనే నిర్మాతల జేబులు నింపుతున్నాయి. ఇవి ఇంకా థియేటర్లలో వీరవిహారం చేస్తూనే వున్నాయి. ఈ సీజన్‌లనే నమ్ముకొని మరెన్నో చిత్రాలు నిర్మాణంలో ఊపందుకున్నాయి. అయినా.. అవి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ఈ ఏడాదికి సంబంధించిన చిత్రాలతో సీజన్లలన్నీ ఇక పూర్తయినట్లే. మరి రాబోయే చిత్రాల పరిస్థితి ఏంటి? సీజన్లు పూర్తయినా కానీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ముందుకు భారీ స్థాయిలో రావడానికి క్యూకట్టబోతున్నాయి. రాబోయే మూడు నెలల్లోనే కోట్ల వ్యాపారాన్ని టాలీవుడ్ లక్ష్యంగా చేసుకుంది. దీపావళి, క్రిస్‌మస్ పండుగల సమయంలోనూ కొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. సినిమాల సీజన్‌లు పూర్తయినా రాబోయే మూడు నెలల్లో ఆశలపల్లకిలో పోటాపొటీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈనెల 13న నాగార్జున, సమంత నటించిన ‘రాజుగారి గది-2’ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని కూడా దీపావళి చిత్రంగానే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’, రామ్ హీరోగా ‘ఉన్నది ఒకటే జిందగీ..’, గోపీచంద్ ‘ఆక్సిజన్’, రాజశేఖర్ ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’ చిత్రాలతో పాటు, సందీప్‌కిషన్ ‘కేరాఫ్ సూర్య’, మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’, సాయిధరమ్ ‘జవాన్’, సాయికుమార్ ‘నెక్ట్స్ నువ్వే’, నాగ్ అనే్వష్ ‘ఏంజెల్’, శ్రీవిష్ణు ‘మెంటల్ మదిలో...’, ‘దేవిశ్రీ ప్రసాద్’, ‘గోలీసోడా’, ‘లండన్‌బాబు’లతో పాటు మరో పది సినిమాలు ఈ వరుసలోనే రావడానికి సిద్ధంగా వున్నాయి. ఆక్సిజన్, గరుడవేగ 126.18ఎం చిత్రాలు ఈ అక్టోబర్‌లోనే సందడి చేయనుండగా, నవంబర్‌లో విడుదలకు మరి కొన్ని సినిమాలు రానున్నాయి. ఇక డిసెంబర్ 22న అఖిల్ రెండో చిత్రం ‘హలో’ విడుదలకానుంది. డిసెంబర్ అనేది నాగార్జున కలిసొచ్చిన సెంటిమెంట్. అందుకే తనయుడి చిత్రాన్ని ఈనెలలోనే తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంతో పాటు ఇదే నెలలో నాని ‘ఎంసీఎ, వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ థియేటర్లలో సందడి చేయనున్నాయ.
హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే హీరో మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ ఈనెల 18న విడుదలవుతోంది. ‘పటా స్’, ‘సుప్రీమ్’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది. దిల్‌రాజుతో ‘్భద్ర’ తర్వాత 13ఏళ్ల గ్యాప్‌తో రవితేజ చేసిన సినిమా ఇది కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనిల్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. అలాగే హీరోయిన్ మెహరీన్ కూడా హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది. దిల్ రాజు ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో సక్సెస్‌ను అందుకున్నారు. ఐదో సక్సెస్ కోసం ఈ చిత్రాన్ని చేశారు. సాధారణంగా తెలుగులో సంక్రాంతి, దసరాలకే ప్రేక్షకుల ముందుకు పెద్ద సినిమాలు వస్తుంటాయి. ఇకపై దీపావళికి కూడా పెద్ద సినిమాలు వచ్చేలా చేసింది ‘రాజా ది గ్రేట్’. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతే భారీగా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.
ఇక గోపీచంద్ హీరోగా వస్తున్న ‘ఆక్సిజన్’ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా కథానాయికలు రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్యర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. హై టెక్నికల్ స్టాండర్ వాల్యూస్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ఈ చిత్రం రూపొందింది. గోపీచంద్ కెరీర్‌లోనే సెనే్సషనల్ చిత్రం అవుతుందన్న గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మాత. జగపతిబాబు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్క డా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ‘ఉన్నది ఒకటే జిందగీ..’ చిత్రం కూడా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. స్నేహమేరా ప్రాణం అనుకునే యువకుడు అభిరామ్. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా జీవితం మొత్తం మనతో వుండే వాడే స్నేహితుడంటారు. నలుగురు స్నేహితులతో కలిసి ర్యాక్‌బ్యాండ్ మొదలెడతాడు. ఆ బ్యాండ్‌కి అతనే లీడర్. ఆడుతూ పాడుతూ గడిపే అభిరామ్ జీవితంలోకి అనుకోకుండా ఇద్దరమ్మాయిలు ప్రవేశిస్తారు. వాళ్లతో అభిరామ్‌కి ఉన్న బంధం ఎలాంటిది.. ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతాడు? అభిరామ్ ప్రేమకథలో స్నేహితుల పాత్ర ఎలాంటిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాలంటున్నారు దర్శకుడు. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిషోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. రామ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదవ చిత్రమిది. ‘జగడం’, ‘రెడీ’, ‘శివమ్’, ‘నేను శైలజ’ చిత్రాలతో పాటు పాటలూ హిట్టయి మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ‘నేను శైలజ’ తర్వాత రామ్- కిశోర్ తిరుమల- దేవిశ్రీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అభిరామ్‌కు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్ నటించారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం రామ్ సరికొత్త స్టయిల్‌లోకి మారాడు. అభిరామ్ అనే యువకుడి బాల్యం, కాలేజీ జీవితం, కాలేజీ తర్వాత అతని జీవితాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నట్టు దర్శకుడు చెబుతున్నారు. దీనికి తోడు ఇందులో ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, స్నేహం మధ్య ప్రధానంగా సాగుతుంది. రామ్ నటనతోపాటు, కిషోర్ తిరుమల రాసుకొన్న కథ, కథనాలు, ఆయన దర్శకత్వం కొత్త పంథాలో వుంటాయి. ‘నేను శైలజ’ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా వుంటుంది అని చిత్ర సమర్పకుడు ‘స్రవంతి’ రవికిషోర్ పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఓ సిన్సియర్ ఎన్‌ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పిఎస్‌వి గరుడ వేగ 126.18ఎం’. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్‌మేన్ డా.రాజశేఖర్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. మంచి కథ, పవర్‌ఫుల్ హీరోయిజం, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠత రేపే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ‘మగాడు’ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రాజశేఖర్ ప్రజెంట్ చేయాలని దర్శకుడు పడ్డ తపన తెరపై సినిమా రూపంలో కనిపిస్తుంది. జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై 25 కోట్ల భారీ బడ్జెట్‌తో కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి మంచి స్పందన లభించింది. ఈ బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచి ప్రతీ పాత్రను రివీల్ చేస్తూ, దేనికదే ప్రత్యేకం అనేలా అందరిలో ఆసక్తిని కలిగించేలా ప్రమోషన్ ప్లాన్ చేస్తూ వచ్చారు. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్రలో కనిపించనున్నారు. అదిత్ అరుణ్ కీలక పాత్రలో నటించారు. శ్రద్దాదాస్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. కిషోర్ మెయిన్ విలన్‌గా నటించాడు. పోసాని కృష్ణమురళి, రవివర్మ, నాజర్, పృథ్వీ, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సినిమాను హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో ‘డియో..డియో..’ అం టూ సాగే ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ నర్తించింది. సన్నీ నృత్యం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఈ ఒక్క పాటకోసమే సన్నీకి యాభై లక్షల రూపాయలు ఇచ్చుకున్నారట.
యువ హీరో సందీప్‌కిషన్ కథానాయకుడిగా ‘కేరాఫ్ సూర్య’ కూడా విడుదలకు సిద్ధమయింది. ఇందులో అతడికి జోడీగా మెహరీన్ నటిస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్ పేరు కామినేని సూర్య. డిగ్రీ పూర్తయింది. కానీ ఉద్యోగం లేదు. అందుకే ఆ ఇంట్లో, వీధిలో, ఆ ఊరిలో అందరికీ లోకువ. ఆ గల్లీలో క్రికెట్ ఆడుకునే పిల్లలు కూడా సూర్య మాట వినరు. ఇంట్లోనూ అదే పరిస్థితి. ఆఖరికి ప్రేమించిన అమ్మాయి కూడా అంతే. ఇంతటి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న సూర్య ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురయ్యాడు. అదేంటి? సూర్యకు ఎదురైన సమస్య ఏంటి? అందులోంచి అతడెలా బయటపడ్డాడు? అనేదే ‘కేరాఫ్ సూర్య’. దీనికి చక్రి చిగురిపాటి నిర్మాత.
ఆది, వైభవి, శాండిల్య, రష్మీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్న ‘నెక్ట్స్ నువ్వే’ నవంబర్ 3న విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ద్వారా ప్రభాకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బన్నీ వాసు నిర్మాత. హోటల్ నేపథ్యంగా సాగే థ్రిల్లర్ ఇది.
శ్రీవిష్ణు, నివేతా పెతురాజ్ జంటగా నటిస్తున్న ‘మెంటల్ మదిలో..’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మాత. ఆ కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బుద్ధిమంతుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడు. కాకపోతే ఒకటే సమస్య. తనకు ఏది కావాలో తేల్చుకోలేడు. రెండు సినిమాలు ఒకసారి వస్తే ఏది చూడాలో తెలియక తికమక పడి రెండు సినిమాల టికెట్లు కొంటాడు. కానీ గందరగోళంతో దేనికి వెళ్లడు. జీవితమంతా అదే కన్ఫ్యూజన్. ఆ గందరగోళం అతడిని అయోమయంలో నెట్టేసింది. చివరికి అతడు ఏం చేశాడు? అన్నదే చిత్రకథ.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌తో మరో విభిన్నమైన చిత్రం ‘దేవిశ్రీ ప్రసా ద్’ సైతం విడుదలకు రెడీ అయింది. దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్లు. దేవి ఓ ఆటోడ్రైవర్, శ్రీ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంటాడు. ప్రసాద్ క్యాంటీన్ నడుపుతుంటాడు. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. వీళ్లు లీలా అనే నటిని ఇష్టపడతారు. ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ లోపే ఆ నటి హత్యకు గురయిందనే విషయం బయటికొస్తుంది. అసలు లీలను ఎవరు హత్య చేశారు? ఆ హత్యతో ఈ ముగ్గురికి సంబంధం ఉందా? లేదా? అనే విషయాలకు తెరరూపం ఈ చిత్రం. శ్రీకిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీగా ధనరాజ్, దేవిగా భూపాల్‌రాజు, ప్రసాద్‌గా మనోజ్‌నందం, లీలగా పూజా రాంచంద్రన్ నటించారు. ఆర్.వి రాజు, ఆక్రోశ్ నిర్మాతలు.
ఇలా అనేక తెలుగు చిత్రాలు రాబోయే మూడు నెలల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు క్యూకట్టాయి. సీజన్లు.. పండుగలు.. సెలవులు.. ఇలా ఇవేమీ పట్టించుకోకుండా కొత్త తరహాలో బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించేందుకు రెడీగా వున్నాయి. ఈ పోటాపోటీగా జరుగుతున్న దీపావళి ధమాకాలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద వసూల్ రాజా ఎవరు? అని పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రాలన్నీ కోట్ల రూపాయలు లక్ష్యంగా ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడానికి సిద్ధంగా వున్నాయి. ఈ కొత్త తరహా టార్గెట్ తెలుగు సినిమాకు ఎలాంటి బాటను చూపుతుందో చూడాల్సిందే.

-ఎం.డి అబ్దుల్