మెయన్ ఫీచర్

కేరళలో పాదయాత్రలు ఫలిస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ పాదయాత్రలకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇదొక అహింసామార్గం. జన చైతన్యానికి తోడ్పడింది. గాంధీ శిష్యుడు వినోబాభావే తన పవనార్ ఆశ్రమం నుండి బయలుదేరి కాలి నడకతోనే సందేశం వినిపించేవాడు. ఎన్నికల సమయంలో విమానంలో యాత్ర, బస్సు యాత్రలకన్నా పాదయాత్రలు ఎక్కువ ప్రఖ్యాతిగా ఉంటాయని రాజకీయవేత్తల నమ్మకం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అక్టోబర్ 3వ తేదీ 2017 మంగళరంనాడు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేరళలోని కన్నూరు జిల్లాలో దాదాపు పదివేల మందితో పాదయాత్ర చేశాడు. కేరళలో వామపక్ష ఉగ్రవాదుల చేతుల్లో హతులైన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయటం ఈ పాదయాత్ర ప్రయోజనం. యాత్ర పయ్యనూర్ నుండి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ నేతృత్వంలో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరైనారు. దేశవ్యాప్తంగా ఈ పాదయాత్రలు జరుగుతాయి. జనరక్ష యాత్ర పేరుతో కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లోను ఈ ప్రదర్శనలుంటాయి. న్యూఢిల్లీలోని సిపియం కార్యాలయం ముందు కూడా ప్రదర్శనలు జరగబోతున్నాయి.
కేరళలో పిన్నారాయ్ విజయన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ హత్యలు పెరిగాయి. ఈ సంగతి స్వయంగా సిపియం కేంద్ర కమిటీ ప్రముఖ నాయకుడు, రాజ్యసభ ప్రస్తుత సభ్యుడు ఋతువ్రత ముఖర్జీ ఇటీవల ఒక ఇంగ్లీషు టీవీ చానెల్‌లో చెప్పాడు. ‘‘ఈ హత్యలకు ముఖ్యమంత్రితోబాటు కోజికోడి బాలకృష్ణన్ కూడా బాధ్యులే’’ అని ఋతువ్రత ముఖర్జీ ఆరోపించారు. వీళ్లను కన్నూరు మాఫియా గ్యాంగ్ అంటారు. ‘ప్రత్యర్థులను చంపి ఉప్పు బస్తాలలో పెట్టి కాలువలలో పడేయండి’ అంటూ స్వయంగా పిన్నారాయ్ విజయన్ పిలుపునిచ్చాడు. 1968లో కన్నూర్‌లో జరిగిన రామకృష్ణ హత్య కేసులో విజయన్ తొలి ముద్దాయి. మరి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలు ఎలా ఎన్నుకున్నారు? అంటే కన్నూరు జిల్లాలో విజయన్ ముఠాకు వ్యతిరేకంగా ఎవరూ ఎన్నికలలో నిలబడకూడదు. నిలబడితే కాళ్లూ చేతులూ నరికివేస్తారు. మరి పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? అంటే సిపియం అనుబంధ విద్యార్థి సంస్థలనుండి వచ్చినవారినే పోలీసు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇదే ధోరణి గత నలభై సంవత్సరాలుగా బెంగాల్‌లో సాగింది. అక్కడ మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసకు ప్రతిహింస అంటూ సిపియం కార్యకర్తలను ఎదుర్కొన్నారు. పోలింగ్ బూత్‌లను సిపియం కార్యకర్తలు ఆక్రమించుకొని రిగ్గింగ్ చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకున్నది. ఫలితంగా సిపియం సహజంగానే ఓడిపోయింది.
కమ్యూనిస్టులు విలాస జీవితాలకు అలవాటుపడ్డారు. వ్యసనాలకు బానిసలైనారు. స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడం, అడ్డం వచ్చినవారిని హత్యలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు బెంగాల్‌లో అట్టడుగు వర్గాల ప్రజలు కూడా కాళీమాతను పూజిస్తారు. అలాంటి కాళీమాతను నీచమైన భాషలో నిందించారు. ఇవన్నీ సిపియం ఓటమికి కొన్ని కారణాలు. దానితోబాటు ఇంతకాలం ఏ ముస్లిం ఓటు బ్యాంకుమీద వామపక్షీయులు ఆధారపడ్డారో ఆ బ్యాంక్‌ను మమతా బెనర్జీ కొల్లగొట్టింది. అంటే సిపియం చైనా మీద ఆధారపడగా, మమత బంగ్లాదేశ్ మీద ఆధారపడింది.
కేరళలో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. ఓనం పండుగను కేరళలో హిందువులే కాదు క్రైస్తవులు కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అలాంటి ఓనం ముగ్గులమీద విజయన్ ఆంక్షలు విధించాడు. ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలల్లో కొబ్బరికాయలు కొట్టకూడదు. జ్యోతి ప్రజ్వలన చేయకూడదు. మంత్రాలు చదువకూడదు. ఐతే రంజాన్‌లో ఇఫ్తార్ విందులు మాత్రం ముస్లిం లీగ్ నేతృత్వంలో ఇవ్వవచ్చు. బెంగాల్ త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో ఈ హిపోక్రసీ సాగుతున్నది.
సిపియంలోని ఉగ్రవాదులు బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనే కాక తమ పార్టీ విడిచివెళ్లిన తిరుగుబాటు సిపియం కార్యకర్తలను కూడా హత్య చేశారు. వీటి సంఖ్య 250. గత రెండు సంవత్సరాలల్లో 120 మంది హత్య చేయబడగా గత ఆరు నెలల్లో కన్నూరు ప్రాంతంలోనే 13 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. తిరువనంత పురంలో హత్యకు గురైన రాజేశ్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. తక్కిన వారు కూడా బిసి, ఎస్‌సి వర్గలవారు. చంద్రశేఖరన్ అనే స్కూలు టీచరును క్లాసు రూములోనుండి బయటకు లాగి 51సార్లు కత్తితో పొడిచి చంపారు. అతడు చేసిన నేరం ఏమిటంటే విద్యార్థులచేత ‘వందేమాతరం’ పాడించటం. భారతమాతాకీ జై అని నినాదాలిప్పించటం.
ఇలా ఎందుకు జరుగుతున్నది? అంటే ఇక్కడ ఒక వౌలికాంశాన్ని గుర్తించాలి. మార్క్సిజం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గుర్తించదు. హింస ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలనేది వారి మూల సూత్రం. 1917 రష్యాలోను, 1948 చైనాలోను, ఇంకా క్యూబా, హంగరీ, నేపాల్ వంటి ఎన్నో దేశాల్లో హింసతోనే రాజ్యాధికారం సంపాదించుకున్నారు. 1950 ప్రాంతాలలో తెలంగాణాలోని భూస్వాములను చంపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మాస్కోలో స్టాలిన్ మాకినేని బసవపున్నయ్య బృందాన్ని ఆ ప్రయత్నం మానుకోవలసిందిగా హెచ్చరించి పంపివేశాడు. ఇది తెలంగాణ చరిత్ర గ్రంథాల్లో రికార్డు.
‘‘మాకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఎట్టి నమ్మకం లేదు. ఐనా ఈ ఓట్ల ప్రక్రియలో ఎందుకు పాల్గొంటున్నాము? అంటే ఈ విధానంలో ఉన్న డొల్లతనాన్ని నిరూపించటం కోసమే’’ అన్నాడు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్. అందువల్ల పిన్నారాయ్ విజయన్ హత్యా రాజకీయాలు ఎందుకు ఎన్నుకున్నాడో మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం గమనించవలసిన అంశం ఏమంటే, బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది. ఐనా పాదయాత్రలు అనే వినోబాభావే మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నది? బహుశా జన జాగరణ కలిగించి తన కేడర్‌ను పెంచుకోవటం కోసం కావచ్చు. అంతకుమించి ఈ పాదయాత్రలవల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు.
అక్టోబర్ 3 మంగళవారం రాత్రి ఒక ఇంగ్లీషు టీవీ చానల్‌లో కేరళ హత్యా రాజకీయాలపై చర్చ జరిగింది. అందులో భారత రక్షణ మంత్రిణి శ్రీమతి నిర్మలా సీతరామన్ పాల్గొన్నారు. ఇంకా రాజీవ్ దేశాయ్ అనే కాంగ్రెస్ పార్టీ ప్రవక్త పాల్గొని ‘‘సౌ చువ్వే ఖాకే బిల్లీ హజ్ గయే’’ అన్నాడు. ఈ ఉర్దూ సామెతకు అర్థం ఏమిటంటే ‘‘బిజెపివారు గాంధేయమార్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఇది నూరు ఎలుకలను తిన్న పిల్లి హజ్ పవిత్ర యాత్ర చేసింది’’ అన్నట్లుంది. అంటే బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్యలు చేసి ఇపుడు పాదయాత్రలు చేస్తున్నారని రాజీవ్ దేశాయ్ తాత్పర్యం. ఇది నిజమేనా? 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు న్యూఢిల్లీలో వేలాదిమంది అమాయకులైన సిక్కులను సజ్జనకుమార్ జగదీశ్ టైట్లర్ అనే కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలో ఊచకోతలు కోశారు. దీనిని ఖండించకపోగా రాజీవ్ గాంధీ ఏమన్నాడు? ‘‘ఒక మహావృక్షం కూలినప్పుడు ఈ మాత్రం ప్రకంపనలు తప్పవు’’ అని. దీనికి రాజీవ్ దేశాయ్ ఏం సమాధానం చెపుతారు?
1959లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆనాటి నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. నేడు కేరళలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఐనా నరేంద్ర మోదీ ప్రభుత్వం పిన్నారాయ్ విజయన్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎందుకు రాష్టప్రతి పాలన ప్రవేశపెట్టలేదు. దేశ రక్షణను గాలికి వదిలివేస్తే 2019లో తిరిగి మోదీ అధికారంలోకి రావటం అసంభవం. ప్రజలకు కూడు గుడ్డ విద్య ఉద్యోగాలతోబాటు ప్రాణ రక్షణ కూడా కావాలి. ఇవ్వాళ కేరళలో, బెంగాల్‌లో, చత్తీస్‌గఢ్‌లో ఎవరికీ రక్షణ లేదు.
‘సౌ చువ్వే’ సామెతలు చెపుతూ రాజీవ్ దేశాయ్‌లు, మణిశంకర అయ్యర్‌లు, పిన్నారాయ్ విజయన్‌లు పేట్రేగిపోతున్నారు. వియ్యానికైనా కయ్యానికైనా సమాన స్థాయి వర్తిస్తుంది. వాళ్లు తుపాకులతో అణ్వస్త్రాలతో దాడి చేస్తుంటే మీరు పాదయాత్రలతో ‘సహనావవతు’ అంటూ శాంతి మంత్రం పఠిస్తే ఫలితం ఉంటుందా? ఇంకా అట్టడుగు వర్గాలకు చెందిన ఎన్ని వందలమంది హిందూ సామాజిక కార్యకర్తలు బలిదానాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది?
కేరళలో ఈనెలలో బిజెపి దాదాపుపదిహేను రోజులు జనరక్షాయాత్ర నడిపింది. ఇందులో యోగి ఆదిత్యనాధ్ (యుపి ముఖ్యమంత్రి) వంటి ఎందరో ప్రముఖులు ప్రతిరోజూ పాల్గొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఇతరుల మద్దతుతో నడిచే రాష్ట్రాలు మొత్తం 14 ఉన్నాయి. వీటిల్లో కేరళలో జరిగినట్లు ఎక్కడైనా ‘రాజకీయ హత్యలు’ జరిగాయా అని సూటిగా యోగి ఆదిత్యనాధ్ విలేకరులను ప్రశ్నించారు. నిజమే! కాని హత్యల ద్వారానే రాజ్యాధికారాన్ని పొందవచ్చని నమ్మిన పిన్నారాయ్ విజయన్, కోజికోడ్ బాలకృష్ణన్ జంటపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కేరళలో మాట్లాడుతూ ‘‘తుపాకీ గొట్టం ద్వారా ప్రజలను బెదిరించి భయభ్రాంతులను చేసి రాజ్యాధికారం చేజిక్కించుకుంది. డెంగు చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించినా విద్య, వైద్యం వంటివి పట్టించుకోకుండా ప్రత్యర్థుల ప్రాణాలు హరించడమే పనిగా పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు. సరే! ఇవన్నీ నిజమే అనుకుందాం.. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎందుకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ రాక్షస పాలనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? శశిధరూర్ మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని ముస్లిం లీగ్ ఉగ్రవాద సంస్థ కావచ్చు కాని కేరళలోని ముస్లిం లీగ్ సెక్యులర్ సంస్థ అని వ్యాఖ్యానించారు. అంటే మస్లింలు తమ ఓట్లను మూకుమ్మడిగా సిపియంకు కాక కాంగ్రెస్‌కు వేయాలి అని ఈ వాక్యానికి అర్థం.
హత్యా రాజకీయాలు అనగానే దభోల్కర్, గౌరీ లంకేశ్, కలుబురిగి వంటి పేర్లు ఉదహరిస్తున్నారు. వీరిని హత్య చేయటం చట్టవిరుద్ధం. ఇంగితం కలవాడెవడూ సమర్థించడు. కాని కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ బజరంగ్‌దళ్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను 250 మందిని సిపియం కార్యకర్తలు చంపారు. ఎందుకని? పండిత దీన్‌దయాల్ ఉపాధ్యాయ కోజికోడ్‌లో జనసంఘ్ అధ్యక్షునిగా ఎన్నికైనాడు (1968). ఆ తర్వాత ఆయనను మొగల్ సరాయ్‌లో కమ్యూనిస్టులు హత్య చేశారు. బెంగళూరుకు కొంత దూరంలో వున్న మూడాచిద్రిలో ఒక హిందూ క్రియాశీల కార్యకర్తను 1915లో చంపారు. టిప్పు సుల్తాను జయంతి జరుపవద్దు అన్నందుకు పోలీసులే ఒక వృద్ధుణ్ణి మడికెరలో కాల్చి చంపారు. అప్పుడు పౌర హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఆందోళన చేయలేదు. ఎవార్డు వాపసీ బ్రిగేడ్స్, ప్రకాశ్‌రాజ్‌లు కనీసం నిరసన కూడా తెలుపలేదు. ఇదీ మనవాళ్ల లౌకికవాదం.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్