మెయన్ ఫీచర్

మైనర్ వివాహితలకు ఇకనైనా మేలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న పిల్లలకు వివాహాలు చేసే చెడు సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగిన భారతీయ సమాజంలో వాటిని నిలిపివేసేందుకు స్వాతంత్య్రం రాక ముందే బాల్య వివాహాల నిరోధక చట్టం -1929 అమలులోకి వచ్చింది. పెళ్లికూతురును, పెళ్లికొడుకుని పెద్దవారు ఎత్తుకుని నిల్చుంటే వారిద్దరి మధ్య వివాహాలు జరిగే పరిస్థితి ఉండేది. బాల్య వివాహాలను నేరంగా పరిగణించారు. దీనినే శారదా చట్టం అని పిలిచేవారు. అయితే దురదృష్టవశాత్తు ఈచట్టంలో మొదట్లో వివాహ పరిమితి వయస్సు 12 ఏళ్లు మాత్రమే. ఈ చట్టాన్ని అతిక్రమించడానికి పిల్లలను బ్రిటిష్ భూభాగంలో లేని అప్పట్లో ఫ్రెంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న యానాంకు పట్టుకువెళ్లి వివాహాలు చేసే వారు. అది బ్రిటిష్ భూభాగం కాదు కనుక, వేరే దేశం కనుక అక్కడ వివాహం చేస్తే నేరం కాదని, శిక్ష నుండి తప్పించుకోవచ్చు అనుకునేవారు. తర్వాత కొంతకాలానికి యానాం భారత భూభాగంలో విలీనం అయింది. దాంతో యానాంలోనూ బ్రిటిష్ చట్టాలు అమలులోకి వచ్చాయి.
వాస్తవానికి భారతదేశంలో మైనర్, మేజర్‌కు సంబంధించి చాలా దశాబ్దాలు స్పష్టత లేదు. సహజ సిద్ధంగా మేజర్, మైనర్‌కు ఒక పరిమితి, వివాహాలకు ఒకటి, బాల కార్మికులను నిర్వచించడానికి మరో పరిమితి, పనిచేసే హక్కు కల్పించడానికి ఇంకో పరిమితి ఉండేది, అలాగే వివిధ చట్టాల్లో కూడా భిన్నమైన నిర్వచనాలు ఉండేవి.
1860లో వివాహానికి 10 ఏళ్ల వయస్సుంటే చాలు, 1891లో దానిని 12 ఏళ్లకు పెంచారు. 1925లో ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు చేసి దానిని 14 ఏళ్లకు పెంచారు. అదే నిబంధన 1929లో చేసిన బాల్య వివాహాల నియంత్రణ చట్టంలోనూ చేర్చారు. ఇదే సమయంలో ఐపిసి, ఐపిసిలోని 375 నిబంధనలకు, పిసిఎంఎ చట్టానికి మధ్య నిబంధనల్లో తేడా వచ్చాయి. 1949లో వివాహ వయస్సు 15 ఏళ్లయింది. స్వాతంత్య్రానంతరం భారతీయ చట్టాల ప్రకారం 1955లో వధువుకు 15 సంవత్సరాలు, వరుడికి 18 సంవత్సరాలుగా సవరించారు. తిరిగి 1982లో వధువుకు 16 సంవత్సరాలు చేశారు. 2013లో దానిని 18 సంవత్సరాలకు పెంచారు. 2012 పోస్కో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు ఆడపిల్ల బాలికగా చెబుతుండగా, సెక్షన్ -375 ప్రకారం వివాహం జరిగి ఉంటే ఆమె బాలిక కాదని చెబుతోంది. నిర్బయ చట్టం చేసినపుడు దీనిని సవరించాలనుకున్నా సాధ్యపడలేదు. ఫలితంగా 375 సెక్షన్ మొత్తంగా వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాలను అనుమతిస్తున్నట్టు తయారైందనే వాదన ఇన్నాళ్లూ వినిపించింది.
మేజర్, మైనర్ అంశాలపై హిందు వివాహ చట్టం-1955లోనూ, హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎవరు మైనరో ఎవరు మేజరో స్పష్టంగా పేర్కొనబడింది. ఆధునిక హిందు న్యాయశాస్త్రం, హిందూ మైనార్టీ, గార్డియన్‌షిప్ యాక్ట్ -1955లోనూ, భారత విడాకుల చట్టం-1869, ముస్లిం న్యాయ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం -1954, వరకట్న నిషేధ చట్టం -1961, బాల్య వివాహాల నిరోధక చట్టం-1929లోనూ మైనర్ , మేజర్ ప్రస్తావన ఉంది.
హిందూ వివాహ చట్టం 1955 మే 18 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి 1976లోనూ, 1978లోనూ తెచ్చిన సవరణలతో మేజర్- మైనర్ నిర్వచనాలు మారాయి. ఈ చట్టం కాశ్మీర్ మినహా భారతదేశం అంతటికీ వర్తిస్తుంది. హిందూ వారసత్వ విధానంలో ఈ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది.
శతాబ్దాలు, సహస్రాబ్దాలుగా హిందూ వివాహాలకు లేని ‘విడాకులు’ ఈ చట్టం తెచ్చింది. బహు భార్యత్వం, బహు భర్తృత్వాన్ని నిషేధించింది. ఈ చట్టం హిందువులకే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా వర్తిస్తుంది. ముస్లింలు, క్రైస్తవులకు వివాహానికి సంబంధించి కొంత మినహాయింపులు ఉన్నా, మేజర్, మైనర్ విషయంలో ఇదే చట్టం అమలులో ఉంది. వివాహానికి సంబంధించి ఈ రెండు మతాల వారికీ వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయి. క్రైస్తవులకు భారత క్రైస్తవ వివాహ చట్టం-1872, భారత విడాకుల చట్టం-1869 వర్తిస్తాయి. ముస్లింలకు షరియత్ చట్టం-1937, ముస్లిం వివాహ చట్టం -1939 ప్రత్యేక వివాహ చట్టం -1954తో పాటు ఇతర సంప్రదాయ స్వీయ మత చట్టాలు వర్తిస్తున్నాయి.
హిందూ వివాహ చట్టం సెక్షన్ -5 ప్రకారం ఇద్దరు హిందువులకు వివాహం జరగాలంటే తప్పనిసరి ఇద్దరిలో ఏ ఒక్కరికీ గతంలో వివాహం జరిగి ఉండకూడదు, ఒక వేళ వివాహం జరిగి ఉంటే భార్య లేదా భర్త బ్రతికి ఉండకూడదు. వివాహం జరిగే నాటికి ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా అవివేక చిత్తం వల్ల తమ వివాహానికి సమ్మతి ఇవ్వలేని స్థితిలో ఉండకూడదు. ఒక వేళ అలా సమ్మతి ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నా మానసిక వైకల్యంతో బాధపడుతూ వివాహానికి తద్వారా పిల్లలను కనడానికి గాని అసమర్ధులుగా ఉండరాదు. తరచూ మూర్చ, మతి చాంచల్యంతో బాధపడుతూ ఉండకూడదు. 1976కు ముందు చట్టం ప్రకారం పెళ్లికుమారుడి వయస్సు 18, పెళ్లికుమార్తె వయస్సు 15 ఉండేది, దానిని తర్వాత సవరించి పెళ్లికుమారుడి వయస్సు 21, పెళ్లికుమార్తె వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలని నిర్ణయించారు. ఆచారం లేదా సంప్రదాయం (ముస్లింలు, క్రైస్తవులు) ఉంటే తప్ప వధూవరుల్లో నిషేధిత సంబంధాలు ఉండకూడదు. ఒక వేళ ఉన్నా అది జ్ఞాతుల మధ్య ఉండకూడదు.
సుప్రీం ఆదేశాలు
తాజాగా భారత శిక్షాస్మృతిలోని నిబంధనలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన తీర్పు పెనుసంచలనంగా చెప్పవచ్చు. సుప్రీం తీర్పునకు అంతా జేజేలు పలుకుతున్నారు. అత్యాచారాన్ని నిర్వచించే భారత శిక్షాస్మృతి సెక్షన్ 375పై న్యాయస్థానం తమ వైఖరినే కాకుండా శిక్షలను కూడా ఖరారు చేసింది.
ఈ చట్టం కింద జరిగిన నేరాన్ని ఏ ఫిర్యాదులు లేకుండానే పోలీసులు నేరుగా వచ్చి విచారణ జరిపి కేసులు పెట్టవచ్చు. బాల్య వివాహం జరగకుండా కోర్టు ఈ చట్టం కింద ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే శిక్షలు భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)-1860లో నిర్వచించారు.
తాళి కట్టించుకున్న భార్యే అయినా ఆమె వయస్సు 18 ఏళ్లలోపు ఉంటే భర్త ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తల ధర్మాసనం 127 పేజీల తీర్పును వెలువరించింది. 15-18 ఏళ్లలోపు భార్యతో కలయిక అత్యాచారం కిందకు రాదని 1860 నాటి భారత శిక్షా స్మృతి ఇచ్చిన మినహాయింపు పూర్తిగా ఏకపక్షమని రాజ్యాంగానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఒక యువతి తన సమ్మతి తెలిపేందుకు వయస్సు 18 ఏళ్లయినపుడు 15-18 ఏళ్ల భార్యతో సంగమించడం అత్యాచారం కిందకు రాదని ఉన్న 375 క్లాజును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఒక బాలిక శరీరం మీద ఆమెకు సహజంగా ఉండే హక్కులకు ఇతర నిబంధనల స్ఫూర్తికి విరుద్ధంగా ఈ మినహాయింపు ఉందని పేర్కొంది. 18 ఏళ్లలోపు వివాహిత బాలికను ఓ వస్తువుగా చూడలేమని, ఆమెకు తన దేహంపై ఎలాంటి హక్కు లేనట్టు చూడలేమని స్పష్టీకరించింది. సామాజిక న్యాయ చట్టాలను పార్లమెంటు ఏ స్ఫూర్తితో చేసిందో ఆ స్ఫూర్తి అమలుకావడం లేదని వ్యాఖ్యానించింది. 18 ఏళ్లు పై బడిన భార్యతో ఆమె సమ్మతి లేకుండా లైంగిక చర్య జరపడం వైవాహిక అత్యాచారం అవుతుందా అనే విస్తృత అంశం గురించి ఈ కేసులో తమ ముందు ప్రస్తావన తీసుకురాకపోవడం వల్ల దాని జోలికి తాము వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంతో ఏకీభవిస్తూనే జస్టిస్ దీపక్ గుప్త మరో 57 పేజీల తీర్పును వేరుగా రాశారు.
ఇండిపెండెంట్ థాట్ అనే మానవ హక్కుల సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పును అక్టోబర్ 11న ఇచ్చింది. తగిన వయస్సు రాకుండానే గర్భం దాలిస్తే అది తల్లికి, బిడ్డకు ప్రమాదకరమని తన పిటీషన్లో ఆ సంస్థ పేర్కొంది. మైనర్ భార్యతో సంగమించడం నేరం కాదంటూన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆ సంస్థ సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలను ఉల్లంఘించే రీతిలో ఈ మినహాయింపు ఉందని ధర్మాసనానికి తెలిపింది.
తీర్పు సారాంశం
బాలికల అక్రమ రవాణా ఓ భయానకమైన సామాజిక రుగ్మత, బాలికలపై కృత్రిమ బేధాన్ని తీసుకువచ్చిన వారి అక్రమ రవాణాపై మాత్రం ఎలాంటి దృష్టి సారించలేదు, మనలో ప్రతి ఒక్కరూ దీనిని అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. బాల్యవివాహాలు ఎన్నో యుగాల నుండి కొనసాగుతున్నాయి కనుక వాటిని చట్టసమ్మతమైనవని భావించి కొనసాగించడం తగదు, ఆ ఆచారానికి చరమగీతం పలకాలి. ఇది యావత్ సమాజానికి మేలు చేస్తుంది, ఈ విషయంలో కేంద్రం వాదనను అంగీకరించలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితురాలితో సంబంధం ఏమిటనే దానితో ప్రమేయం లేకుండానే అత్యాచారానికి పాల్పడిన వాడు రేపిస్ట్ అవుతాడు, 18 ఏళ్ల లోపు బాలిక వివాహిత అవునా కాదా అన్నదానితో సంబంధం లేకుండా ఆమెతో లైంగిక చర్య జరపడం అత్యాచారమే అని వారు పేర్కొన్నారు. ఐపిసిలో దీనికి ఇచ్చిన మినహాయింపు వల్ల అవివాహిత బాలికలకు, వివాహిత బాలికలకు మధ్య అవసరమైన కృత్రిమమైన బేధం సృష్టించినట్టయిందని, ఈ మినహాయింపు కొట్టి వేయాల్సిందేనని పేర్కొంది. ‘ఐపిసీలో ఉన్న మినహాయింపు ఏకపక్షం, చపలమైనది, బాలికలకు ఉన్న హక్కుల్ని అది ఉల్లంఘిస్తోంది. ఇది సహేతుకం కాదు, సమంజసం కాదు, రాజ్యాంగంలోని 14,15,21 అధికరణలకు ఇది విరుద్ధం, బాలికల ప్రయోజనం దృష్ట్యా మేం దీనిని పరిష్కరించాల్సి ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గౌరవ ప్రదమైన జీవితాన్ని కలిగి ఉండే ప్రాధమిక హక్కు బాలికలకూ ఉందని, చిన్నవయస్సులోనే వారికి వివాహం జరిగితే శారీరక మానసిక ఆరోగ్యంపైనే కాకుండా పోషకాహారంపైనా, విద్యపైన కూడా ప్రభావం పడుతుందని బాలికలకు తమ హక్కుపై గుర్తింపు లభించాల్సి ఉందని జస్టిస్ మదన్ బి లోకుర్ అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో హిందువులు, ముస్లింల చట్టాల మధ్య వైరుధ్యం ఉందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ధర్మాసనం కర్నాటక ప్రభుత్వం చేసిన చట్టాన్ని గుర్తుచేసింది. వధువుకు 18, వరుడుకు 21 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉంటే ఆ వివాహం చెల్లదని కర్నాటక ప్రభుత్వం చట్టం చేసింది. ఇలాంటి చట్టం దేశం అంతా ఉండాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పుతో బాలికల సమస్యలు తీరిపోలేదు. ఇంకా ఈ చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటినీ సవరించాల్సి ఉంది. బాల్య వివాహాలను ఆపగలిగినపుడే బాలికలకు మెరుగైన, ఆరోగ్యకరమైన జీవనం సాధించగలుగుతాం, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి.

-బి.వి.ప్రసాద్