మెయన్ ఫీచర్

కమలం వ్యూహం... మొదటికి మోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం కొనను ముద్దాడిన తర్వాత ఎవరైనా కిందకు దిగకు తప్పదు. ఎందుకంటే అదే తుది లక్ష్యసాధన కాబట్టి! దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ స్థితిగతులను పరిశీలిస్తే, బిజెపి భవిష్యత్తు కూడా అందుకు భిన్నంగా ఉండదన్న విశే్లషణ సర్వత్రా వినిపించడంలో ఆశ్చర్యం లేదు. అతిపెద్ద మెజారిటీతో గెలిచిన రాజీవ్‌గాంధీని జనం, మీడియా ఆకాశానికెత్తేశారు. ఆయన నిజాయితీ చూసి దేశం మిస్టర్‌క్లీన్ అని కీర్తించింది. అది కొన్నాళ్ల ముచ్చటే. తర్వాత రాజీవ్ రతన్‌గాంధీ రెండో రూపాన్ని దర్శించింది. ఆయన పెట్టుకున్న ఖరీదైన వాచీ, అతి ఖరీదైన సూట్లు, కార్లు, ఎవరి మాట వినరన్న ప్రచారం, ఇవన్నీ తర్వాత జనంలో చర్చ జరిగిన ఫలితంగా రాజీవ్‌పై ఉన్న భ్రమలు చెరగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దానికితోడు బోఫోర్స్, దస్ జన్‌పథ్‌పై సోనియా కుటుంబ సభ్యుల పెత్తనం ఆరోపణలు ప్రచారంలోకొచ్చాయి.
రాజీవ్ ప్రభ దివ్యంగా వెలిగినప్పుడూ.. ఇప్పటిమాదిరిగానే ప్రత్యామ్నాయ పార్టీలు లేవని, కాంగ్రెస్ పార్టీ కత్తికి ఎదురు లేదని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది. ఎన్టీఆర్ కత్తికి ఎదురులేని రోజుల్లో ప్రత్యామ్నాయం లేదనుకున్నప్పుడు, చెన్నారెడ్డి తెరపైకొచ్చి సైకిల్‌కు పంక్చర్ చేశారు. కాబట్టి రాజకీయాల్లో ప్రత్యామ్నాయం లేదనుకుని విర్రవీగితే కుదరదు. ఇది బిజెపి సహా అందరికీ వర్తించే సూత్రం!
అప్పటి కాంగ్రెస్-ఇప్పటి బిజెపి నాయకత్వాల మధ్య సారూప్యతను విశే్లషించుకుంటే పెద్దగా తేడా ఏమీ లేదన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. బిజెపికి దిక్కుగా ఉన్న మోదీ విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. మోదీ పగ్గాలు చేపట్టిన ప్రారంభంలో సోషల్ మీడియా ప్రచారంలో విపక్షాలే కాదు, మిత్రపక్షాలూ మరగుజ్జులయ్యాయి. మోదీ తప్ప మరెవరూ కనిపించని సోషల్ మీడియా కీర్తనలు పెద్దనోట్ల రద్దు తర్వాత తగ్గిపోయి, జీఎస్టీ అమలు అనంతరం అసలు కనిపించకుండా పోయాయి. అంతకుముందు వరకూ సోషల్ మీడియాలో మోదీపై ఎవరైనా విమర్శలు చేస్తే ఎదురుదాడి కనిపించేది. కానీ ఇప్పుడు దాని స్థానంలో వౌనం రాజ్యమేలుతోంది. ఇది ప్రజల మానసిక పరిస్థితికి ఓ మచ్చుతునక.
జనం లైన్ ఎప్పుడూ వేరుగా ఉంటుంది. తమ ఆలోచనలను ప్రతిబింబించేవారినే మెచ్చుతారు. పైగా ఈ దేశంలో నిరుపేదలు, మధ్య తరగతి వారే ఎక్కువ. తమ కలలు కల్లలవుతుంటే వౌనంగా ఉండేంత సహనశీలురు కాదు. సౌమ్యుడిగా పేరున్న వాజపేయి హయాంలో చేసిన భారత్ వెలిగిపోతోందన్న ప్రచారం సరిగ్గా అదే వర్గాల్లో ఆగ్రహం రగిలించింది. దేశంలో నల్లధనాన్ని తెప్పించి, అవినీతిని అరికట్టేందుకే పెద్దనోట్ల రద్దు చేశామని మోదీ అండ్ కో చెప్పిన మాటలను భారతావని భారంగానయినా భరించింది. కానీ, దాని వల్ల 95 శాతం మంది దగ్గరున్న ‘నల్ల’నాగుల డబ్బంతా ‘తెల్ల’నాగుల రూపంలో తిరిగి బ్యాంకులకే చేరిందని ఆర్‌బిఐ ప్రకటించడంతో జనం బుస్సుమనక తప్పలేదు.
అయినా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కమలమే విరబూసింది. అది పెద్దనోట్ల రద్దుకు లభించిన ప్రజామోదంగా కమల గళధారులు అన్వయించుకున్నారు. ఆ తర్వాత పాక్‌పై మోదీ సర్కారు చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌కు దేశమే సలాము చేసింది. అయితే ఇదంతా ఇక దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేసే తమ ప్రయత్నాలకు ఎదురవుతున్న మద్దతుగా భావించడమే భాజపా చేసిన తప్పు.
ఎవరికైనా కాలం కొంతవరకూ కలసివస్తుంటుంది. అంతమాత్రాన అది శాశ్వతం అనుకుంటే భ్రమ. మోదీ వరస విజయాలతో పొంగిన కమలం, ఢిల్లీ సహా రెండు రాష్ట్రాల్లో ఎదురైన పరాజయానికి కుంగిపోయింది. మళ్లీ మరికొన్ని విజయాలు, ఇంకొన్ని పరాజయాలు! తాజాగా పాక్ సరిహద్దులో నిత్యం దేశభక్తితో ఉప్పొంగే గురుదాస్‌పూర్ ఎంపి సీటు, బిజెపి నుంచి కాంగ్రెస్ వశమైంది. నాలుగుసార్లు విరబూసిన కమలం అక్కడ తాజాగా వాడిపోయింది. అదీ భారీ ఓట్ల తేడాతో! ఆ పార్టీనే అధికారంలో ఉన్న మహారాష్ట్ర లోని నాందేడ్-వాఘాలోనూ కాంగ్రెస్ ఊహించని విధంగా భాజపాను ఓడించింది. ప్రజలు బిజెపిపై పెట్టుకున్న భ్రమల నుంచి బయటకు వస్తున్నారన్నదే దీని సారాంశం.
బిజెపి మిగిలిన పార్టీలకు భిన్నమైనదన్న అభిప్రాయం, మోదీపై ఉన్న నమ్మకం, కాంగ్రెస్‌పై ఉన్న ఏహ్యభావమే కమలం వికసించడానికి కారణమన్నది నిర్వివాదం. రాజీవ్ మాదిరిగానే తొలి రెండేళ్లలో మోదీ కూడా మంచి అభిప్రాయమే మూటకట్టుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత వ్యవహారశైలి ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటిదాకా అవినీతి జరగలేదన్న ఒక్క నిజమే బిజెపిని శిఖరాలకు చేర్చింది. కానీ అనంతర కాలంలో మోదీ ఖరీదైన సూట్లు, అంబానీలు, అదానీలకు రెడ్‌కార్పెట్ వేస్తున్నారన్న భావన, దేశీయోత్పత్తి పడిపోయి, జిడిపి రేటు కూడా దారుణంగా పడిపోవడంతోపాటు ఉద్యోగాలు ఉత్తి కల్పనేనన్న విషయాన్ని ప్రజలు ఆలస్యంగా గ్రహించారు.
ఒక్క ఓటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా నైతిక విలువలు పాటించి అధికారం పోగొట్టుకున్న వాజపేయి సారథ్యం వహించిన పార్టీలో, అహ్మద్‌పటేల్‌ని ఓడించేందుకు అదే నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన వైనాన్ని దేశ ప్రజలు దర్శించారు. పార్టీ ఫిరాయింపులు, అనైతిక రాజకీయాలపై కత్తి దూసిన అదే కమలం కొన్ని రాష్ట్రాల్లో వాటికే మంగళం పాడి, దొడ్డిదోవన గద్దెనెక్కిన చిత్రాలూ చూశారు. లక్ష రూపాయలు పార్టీ నిధి తీసుకున్నందుకే దళితుడైన బంగారు లక్ష్మణ్‌ను వెలివేసిన నైతిక విలువల పార్టీకి అధ్యక్షులుగా చేసిన వెంకయ్యనాయుడు, గడ్కరీపై నిందలు వేసినా చర్యలు తీసుకోకుండా నింపాదిగా ఉన్న గతాన్ని .. అమిత్‌షా తనయుడిపై ఆరోపణలొచ్చినా వౌనంగా ఉన్న తీరుతో పోల్చిచూస్తున్నారు. జైషా మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామంటే పార్టీ ప్రతిష్ఠ పెరిగేది.
కొత్తగా తమపై రుద్దిన జీఎస్టీ తాలూకు మంటను అనుభవిస్తున్న మధ్యతరగతి ప్రజలు బిజెపిపై ఒక అంచనాకు వస్తున్నారు. ప్రపంచం మొత్తం విఫలమైన జీఎస్టీని బలవంతంగా రుద్ది, ఇప్పుడు దిద్దుబాటకు దిగినా జనం క్షమించే పరిస్థితిలో లేరు. యశ్వంత్‌సిన్హా జీఎస్టీపై చెప్పిన కఠిన సత్యాలు జనాభిప్రాయాలకు భిన్నంగా లేవన్నది గుర్తించాలి.
ఇక బిజెపికి, మోదీ ప్రతిష్ఠకు గుజరాత్ ఎన్నిక ఓ సవాలు. ఇప్పటిదాకా గంగా పరివాహక ప్రాంతాల్లో గెలిచిన కమలం దక్షిణపథాన విరుబూస్తుందా? ఉత్తరాదిలో కోల్పోయే దాదాపు వంద స్థానాలను దక్షిణాదిలో పూడ్చుకోవాలన్న ఆశలు నెరవేరతాయా? అసలు అలాంటి అవకాశాలున్నాయా అన్నది చర్చ. కర్నాటకలో ఒకసారి గద్దెనెక్కి తర్వాత ఓడిన బిజెపి, ఈసారి కచ్చితంగా మళ్లీ గద్దెనెక్కుతుందన్న అంచనా గత ఆరునెలల క్రితం వరకూ ఉండేది. కానీ అది రానురాను కాంగ్రెస్-బిజెపి పోటా పోటీ స్థితి నుంచి, మళ్లీ కాంగ్రెస్ పార్టీనే వస్తుందని కమలదళాలే అంగీకరించే పరిస్థితి వచ్చింది. కేరళలో ఇప్పట్లో ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికీ చేరుకునేది లేదు. అమ్మ పార్టీలో ఎన్ని తంపులుపెట్టినా తమిళనాట హిందీ పార్టీని ఆదరిస్తారన్నది అనుమానుమే.
ఇక కీలకమైన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అది కాగితంపులి మాత్రమే!! ఏపి-తెలంగాణలో ఆ పార్టీ వామపక్షాల మాదిరిగా ఏదో ఒక పార్టీ భుజం మీదెక్కి నాట్యం చేయాల్సిందే తప్ప, స్వయంభు కాదు. మొన్నామధ్య ఓ టీవీ చర్చలో.. ఏపిలో మీ పార్టీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాలేమిటో తడుముకోకుండా చెప్పాలని, ఓ విశే్లషకుడు పక్కనే ఉన్న బిజెపి నేతకు విసిరిన సవాలుకు ఆయన నుంచి జవాబు లేదు. మీ పార్టీలో చేరతామని ముందుకొచ్చిన వారిని చేర్చుకోలేని అసమర్ధ నాయకత్వం ఉంది. బొత్స కూడా తొలుత బిజెపి చుట్టూ తిరిగి, విసిగి వైసీపీలో చేరిన వారే. చెప్పుకుంటే ఈ జాబితా చాలా ఉంది. ఇప్పుడు కన్నా, సోము, పురందరేశ్వరి అండ్ కోది అరణ్యరోదనే.
తెలంగాణలో కమలదళాలు కేసీఆర్‌ను రహస్యంగా ప్రేమిస్తున్నాయి. సంస్థాగతంగా బలపడకుండా, టిడిపి లేదా టీఆర్‌ఎస్, అదీకాదంటే వైసీపీ భుజాల మీద ఎక్కి ఎంపి సీట్లు తీసుకోవచ్చన్న ఆలోచనలో వీరత్వం లేదు. తెలంగాణలో 10 లోకసభ, 70 అసెంబ్లీ; ఏపిలో 15 ఎంపి సీట్లలో పోటీ చేయాలన్నది కోరిక. బాగానే ఉంది. మరి అభ్యర్ధులు, జనాలు, ప్రచార నిధులు కూడా వారే ఇవ్వాలా? అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పేలుతున్న జోక్. సొంతంగా విజయం సాధించేందుకు నేతలకు స్వేచ్ఛనివ్వకుండా, ప్రాంతీయ పార్టీ నాయకత్వాల బలహీనతలు, కేసులు, విచారణలు, చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని, స్థానిక నేతలను మబ్బుల్లో ఉంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న వ్యూహమే ప్రమాదకరం.
వాజపేయి హయాంలో మిత్రపక్షాలకు బోలెడంత గౌరవం, ఆత్మగౌరవం ఉండేది. ఇప్పుడు లేనిది అదే. మోదీతోఏ ఒక్క మిత్రపక్షమూ సంతృప్తిగా లేదు. అందరికీ అభద్రతాభావమే. శివసేన తరచూ శివాలెత్తుతూనే ఉంది. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోయినా టిడిపి వౌనంగా ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం బిజెపిని కాంగ్రెస్ కంటే ఎక్కువగా ద్వేషిస్తున్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన దానికంటే బిజెపి చేసిన ద్రోహమే ఎక్కువన్న భావనతో ఉన్నారన్నది నిజం.
రిక్షావాడికీ ఆత్మగౌరవం ఉంటుంది. అతని ఇంటి వరకూ అతనే రాజు. బయట వాళ్లొచ్చి పెత్తనం చేసి, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించడు. అలాంటిది బలం లేకున్నా పరాయి రాష్ట్రాల్లో వేలు పెట్టి, సీఎంల ఆత్మగౌరవాన్ని భంగపరిస్తే ఎవరు సహిస్తారు? వీలుంటే పోరాడతారు. లేకపోతే అవకాశం కోసం చూస్తారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుని, ఇచ్చిపుచ్చుకునే రాజకీయ చాతుర్యం కాకుండా, బెదిరించి ఇంకొకరు పండించిన ఫలాలను గుంజుకోవాలన్న వ్యూహం వికటిస్తే అసలుకే ఎసరు ఖాయం.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144