మెయిన్ ఫీచర్

పుట్టనిండా భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న సామాజిక వ్యవస్థ.. ఆచార వ్యవహారాలతోపాటు పండుగలు జరుపుకునే తీరుతెన్నుల్లో అనేక మార్పులు కలుగుతున్నా ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠలతో జరుపుకునే పండుగ- ‘నాగుల చవితి’.
కార్తీక శుక్లపక్ష చవితిని నాగుల చవితి అని, శ్రావణ శుక్లపక్ష పంచమిని ‘నాగపంచమి’ అని సంభావిస్తూ సర్పపూజను తెలుగు రాష్ట్రాల్లో రెండు సార్లు చేస్తారు. అసలు ప్రతినెలా పంచమి తిథి సర్పాన్ని పూజించేందుకు ప్రశస్త్యమైన రోజు అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది.
వేద సంహితలు, బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాల్లో సర్పాలను గురించిన ప్రస్తావన వుంది. సర్పానికి సంబంధించిన పవిత్రమైన పూజలు, ఆరాధనలు అనాదిగా వస్తున్నవే. ప్రాచీనకాలం నుంచి ప్రపంచ యావత్తు కూడా సర్పాలను పూజించినట్టు చారిత్రిక ఆధారాలవల్ల తెలుస్తోంది. సర్పజాతిలో ఆదిశేషుడు, వాసుకి ప్రధానమైన వారుగా పరిగణిస్తారు. ఆదిశేషుడు కశ్య ప్రజాపతి, కద్రువల కుమారుడు. గొప్ప పండితుడిగా, అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగినవాడుగా పేరు పొందిన ఆదిశేషుడికే ‘అనంతుడు’ అనే పేరు కూడా వుంది. ఈ ఆదిశేషుడే భూమిని మోస్తాడని ఐతిహ్యం. శ్రీమహావిష్ణువు పాన్పుగా ఆదిశేషుడు, పరమశివుడి మెడలో ఆభరణాలుగా వాసుకి వంటి సర్పాలు గురించిన ఎన్నో గాథలు మన పురాణాల్లో కనిపిస్తాయ. సూర్యభగవానుడి రథానికి పగ్గాలు సర్పాలే కాగా, వినాయకుడు, భైరవులకు సర్పాలే యజ్ఞోపవీతాలుగా ఉన్నాయ. శనిదేవుడికి సర్పమే ఆయుధం. క్షీరసాగర మథనానికి ఉపయోగించిన మంధర పర్వత కవ్వానికి సర్పమే తాడుగా ఉపయో గపడింది. అమృతం ఆవిర్భవించేందుకు కూడా ఈ సర్పమే కారణమైంది. సర్పాన్ని సుబ్రహ్మణ్యస్వామిగా కూడా ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామికే స్కందుడు, కార్తికేయుడు, కుమారస్వామి, మురగన్ వంటి పేరున్నాయ.
నాగులచవితినాడు ఆచరించాల్సిన విధులను గురించి, పూజావిధానం గురించి స్వయంగా శివుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాందపురాణం చెబుతుంది.
‘‘ఓ పార్వతీ! నాగుల చవితినాడు ద్వారాలకు ఇరువైపులా గోమయంతో సర్ప చిత్రాలను రాసి పూజిస్తారు. చతుర్థి రోజు ఉపవాసం వుండి పంచమినాడు బంగారంతోగానీ, వెండితోగాని, కర్రతోగాని లేదంటే మట్టితోగానీ ఐదు పడగల సర్పాన్ని చేయిస్తారు. లేదంటే పసుపుతో గానీ, చందనంతోగానీ ఐదు పాముల బొమ్మలను చిత్రించి వీటిని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పూజిస్తారు. పంచమినాడు పాలు, పాయసాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రెండు రోజులూ పగలుగానీ, రాత్రినిగానీ భూమిని దున్నడంగానీ, తవ్వడంగానీ, భూమిలో బొరియలు వుంటే వాటిని పూడ్చివేయడంగానీ చేయరాదు అని శివుడు చెప్పినట్లు పురాణ కథనం.
నాగుల చవితి రోజు స్ర్తి పురుషులిద్దరూ నాగేంద్రుడిని పూజిస్తారు. పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టను షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి పుట్టలో పాలుపోసి నైవేద్యం సమర్పిస్తారు. వెండితోగానీ, రాగితోగానీ సర్పరూపంలో విగ్రహాన్ని తయారుచేయించి దానిని పూజామందిరంలో ఉంచి పూజించి నైవేద్యం సమర్పిస్తారు. నువ్వులు, బెల్లము కలిపి చేసిన నువ్వుల పిండిని, బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసిన చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు. చవితిరోజు ఉపవాసం వుండి మరునాడు పుట్టకు పూజ చేసి నైవేద్యానికి సమర్పిస్తారు. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ పద్ధతిలో నాగరాజును పూజించడంవల్ల శివకేశవులిద్దరూ అనుగ్రహిస్తారని విశ్వాసం.
నాగుల చవితిని ఆచరించడంవల్ల అనేక సత్ఫలితాలు లభిస్తాయని పురాణాలు వెల్లడిస్తూ వున్నాయి. అందుకు సంబంధించిన ఒక కథ పురాణాల్లో వుంది.
పూర్వం మణిపురం అనే గ్రామంలో ఒక గౌడ బ్రాహ్మణుడు నివసిస్తూ వుండేవాడు. అతను ఒకసారి భూమిని దున్నుతూ ఉండగా భూమిలోని ఒక బొరియలో వున్న పాముల పిల్లలు అన్నీ నాగలి కర్రకు తగిలి చనిపోయాయి. తర్వాత కొద్దిసేపటికి వచ్చిన ఆ పిల్లల తల్లి అయిన నాగుపాము వచ్చి చచ్చిపోయి వున్న పిల్లలను చూసి కోపానికి లోనై తన పిల్లలను చంపిన వ్యక్తిని వెతికేందుకు బయలుదేరింది. తిరిగి తిరిగి గౌడ బ్రాహ్మణుడి ఇంటికి చేరి నాగలికి వున్న రక్తపు మరకలను చూసి ఆ బ్రాహ్మణుడే తన పిల్లలను చంపి ఉంటాడని గుర్తించి, నిద్రపోతూ వున్న ఆ బ్రాహ్మణుడి కుటుంబ సభ్యులను కాటువేసి చంపివేసింది. అయినా ఆ నాగుపాము కోపం చల్లారలేదు. ఆ బ్రాహ్మణుడి కూతురు పొరుగు ఊరిలో ఉండేది. ఆమెను కూడా చంపేందుకు పాము బయలుదేరి ఆమె ఇల్లు చేరింది. ఆ సమయంలో ఆమె నాగపూజచేస్తూ వుంది. దీనితో పూజ ముగిసేంతవరకూ ఆ పాము వేచి వుండి, అనంతరం నైవేద్యంగా సమర్పించిన పాలు, చలిమిడిని సేవించింది. దీనితో పాము కోపం తగ్గింది. పూజను ముగించిన ఆమెకు ఎదురుగా పడగ విప్పిన పాము దర్శనమివ్వగా.. తన భాగ్యానికి సంతోషించి ఆమె పాముకు నమస్కరించింది. ఆమె భక్తిని చూసి ఆమెను మెచ్చిన పాము తాను ఆమె తల్లిదండ్రులను, సోదరులను చంపిన విషయం తెలిపింది. దీనితో బ్రాహ్మణుని కూతురు దుఃఖించి తన తండ్రి తెలియక చేసిన తప్పును మన్నించి తిరిగి బ్రతికించమని సర్పాన్ని వేడుకుంది. అందుకు అంగీకరించిన సర్పం కొంత అమృతాన్ని గౌడ బ్రాహ్మణుడి కుమార్తెకు ఇవ్వగా ఆమె తన పుట్టింటికి వెళ్లి మృతదేహాలపై అమృతాన్ని చిలకరించగా వారు తిరిగి జీవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
అందువల్లనే నాగుల చవితి, పంచమి రోజుల్లో చెట్టు పుట్ట కొట్టడం, భూమిని త్రవ్వడం, దున్నడం చేయరాదని అంటారు. అంతేకాదు పాములు భూమిలో వుండి భూసారాన్ని కాపాడుతాయని, సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన నీటిని ప్రసాదిస్తాయనే నమ్మకం కూడా వుంది. సంతానం లేనివారు శివాలయాల్లో రావి, వేప చెట్లు నాటి వాటి దగ్గర నాగప్రతిష్ఠ చేస్తారు. అందువల్ల సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. పిల్లలు పుట్టి చనిపోతూ వున్నవారు కూడా నాగప్రతిష్ఠ చేయడంవల్ల పిల్లలు బ్రతుకుతారనే నమ్మకం వుంది. సర్పాన్ని ఆరాధించడంవల్ల కళ్ళకు, చెవులకు, చర్మానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాకుండా సర్పారాధన చేసేవారికి వంశం అభివృద్ధి చెందుతుందని భవిష్యపురాణంలో పేర్కొనబడింది. దీర్ఘకాలిక వ్యాధులు వున్నవారు పుట్టకు ప్రతినిత్యం ప్రదక్షిణలు చేసి భక్తితో పాలు పోస్తే వ్యాధులు తొలిగిపోతాయని కూడా పెద్దలు చెపుతారు. పిల్లలకు చెవినొప్పి, చీము కారడం వంటి వ్యాధులు వస్తే పుట్ట మట్టి తెచ్చి చెవికి పూసే ఆచారం నేటికీ ఆచరిస్తారు. మానవ శరీరాన్ని తొమ్మిది రంధ్రాలువున్న పాముల పుట్టతో పోలుస్తారు. పుట్టలో చుట్ట చుట్టుకుని పాము వున్నట్లే నవరంధ్రాలు వున్న మానవ శరీరంలో కుండలనీ శక్తి వుంటుందనీ, పాము విషాన్ని చిమ్మినట్లు మానవ శరీరంలోని కుండలినీ శక్తి కూడా సత్త్వ రజస్తమోగుణాలను చిమ్ముతూ వుంటుందనీ, సాధనద్వారా కుండలినీ శక్తిని మేల్కొలిపి మనలోని మంచి గుణాలను పెంపొందించుకోవచ్చునని యోగశాస్త్రం చెబుతోంది.
మన పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్టల్రలో దాదాపు మనం జరుపుకునే ఆచార వ్యవహారలతోనే నాగులచవితిని జరుపుకుంటారు. తమిళనాడులో నాగులచవితి సందర్భంగా సర్పం, సుబ్రహ్మణ్యస్వామి, పుట్టలను పూజించడంతోపాటు దేవాలయాలు, ఇండ్లముందు పాలుపోసిన పాత్రలను వుంచుతారు. ఈ పాలను నాగదేవత స్వీకరించి తమను, తమ కుటుంబాన్నీ రక్షిస్తుందని వారి నమ్మకం. బీహార్ రాష్ట్రంలో సోదరుల క్షేమాన్ని కోరుతూ సోదరీమణులు సర్పాలను పూజించి నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. గోధుమ పిండి, బెల్లములను కలిపి నీటి ఆవిరిలో ఉడికించి ఆవిరి కుడుములను వండి నివేదన చేస్తారు. వీటికి ‘డిండీ’లు అని పేరు. బెంగాల్ రాష్ట్రంలో నాగుల చవితినాడు విషహరి పూజ చేస్తారు. విషహరికే ‘మానసాదేవి’ అని పేరు. ఈ దేవత ఆశీనురాలై నాలుగుచేతులలోనూ నాలుగు సర్పాలను కలిగి వుంటుంది. ఈ దేవతను పూజించి నైవేద్యం సమర్పిస్తారు. మట్టితో సర్పాన్ని తయారుచేసి ఊరిమధ్యలో వుంచి పూజిస్తాం. పంజాబ్‌లో మిరాసీ ప్రజలు నాగపూజతోనే జీవితాన్ని గడుపుతారు. గుజరాత్‌లో కృష్ణసర్పాన్ని పూజిస్తారు. నాగదేవతలను చంపరు. ఒకవేళ ఏదైనా సందర్భంలో అనుకోకుండా చంపినా శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్తారు. కేరళ రాష్ట్రంలోని ప్రజలు నాగదేవత పూజ చేయడంవల్ల లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుందని భావిస్తారు. ప్రాచీన మెసపటోమియా నాగరికతలో గ్రామాల చుట్టూ నాగ ప్రతిమలు వున్న రాళ్ళను పాతిపెట్టేవారు. ఈజిప్టులో ‘రన్నత్’ అనే సస్యదేవతకు ప్రతీకగా సర్పాన్ని ఆరాధించేవారు. పర్షియా దేశంలో ఇంద్రధనుస్సును సర్పరాజుగా భావించేవారు. గ్రీసులో సర్పాన్ని భూమి పుత్రుడుగా భావించి ఆరాధించేవారు. నేపాల్, సిరియా, ఇటలీ, జపాన్, ఆఫ్రికా దేశాల్లో కూడా అనేకచోట్ల బయల్పడిన సర్ప విగ్రహాలు ఆయా దేశాల్లోని సర్పారాధనను గురించి తెలుపుతూ వున్నాయి.

- ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు 9491946070