మెయన్ ఫీచర్

కొలీజియం స్థానంలో కొత్త యంత్రాంగం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య పోరు మొదలైందా? వాస్తవానికి ఈ రెండు వ్యవస్థల మధ్య తమ అధికారాల సరిహద్దు విభజనపై గత నాలుగు దశాబ్దాలుగా పోరు సాగుతునే ఉంది. శాశ్వత న్యాయమూర్తుల నియామకంలో ‘పనితీరు మదింపు’ రద్దుకు తాము వ్యతిరేకమని కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియంకు తెలపడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగం న్యాయవ్యవస్థకు సంపూర్ణ అధికారాలు ఇచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వమే న్యాయవ్యవస్థ ఈ దేశంలో పనిచేసింది. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కొల్‌కతాలో సుప్రీంకోర్టును ప్రారంభించగా, 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా సుప్రీంకోర్టును కొల్‌కతానుండి ఢిల్లీకి లార్డ్ కారన్ వాలీస్ మార్చేశాడు. భారత రాజ్యాంగం ఐదో భాగం నాలుగో అధ్యాయంలో 124 అధికరణ నుండి 147 అధికరణ వరకూ సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాల గురించి ప్రస్తావన ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు శాఖలుగా పనిచేస్తుంది. చట్ట సభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ. చట్టసభలు చేసే శాసనాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉంటుంది. దీనినే మనం ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు జరుపుతుందో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థది. అంటే కోర్టులది. ఈ మూడు వ్యవస్థలూ సమన్వయంతో పనిచేసినపుడు ఎలాంటి ఇబ్బందీ రాదు, కాని ఎవరికి వారు తామే సమున్నత యంత్రాంగంగా భావించినపుడు తప్పకుండా సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యే న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు, నియామకాల అంశం. అదనపు న్యాయమూర్తుల పనితీరు మదింపు వేయాలనే నిబంధనను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఎర్రజండా చూపించింది.
అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసే సందర్భంలో వారి పనితీరుపై వృత్తిపరమైన మదింపు పేరుతో గత రెండున్నర దశాబ్దాలుగా సమీక్ష జరుపుతున్నారు. ఇకపై ఆ పద్ధతి ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై న్యాయశాఖ అభ్యంతరం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని న్యాయశాఖ కోరింది. ఇంతవరకూ అదనపు న్యాయమూర్తుల పనితీరును తీర్పుల మదింపు కమిటీలు సమీక్షిస్తున్నాయి. ఈ పద్ధతిని రద్దు చేస్తున్నట్టు గత మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్ అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చెప్పారు. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు వృత్తిపర మదింపు వ్యతిరేకం అంటూ 1981లో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా 2010 నవంబర్‌లో జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అదనపు జడ్జీల పనితీరును మదింపు చేపట్టడం ప్రారంభించారు.
పార్లమెంటుకు హక్కు
నియామకాల వివాదం ఇప్పటికిపుడు వచ్చింది కాదు, గతంలో జరిగిన ఘటనలను ఒకసారి నెమరువేసుకోవాలి. ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉన్న ఏ చట్టమూ చెల్లదని, కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ ఈ హక్కులకు భిన్నంగా ఏ కొత్త చట్టాలు తీసుకురాకూడదని 13వ రాజ్యాంగ అధికరణం సూచిస్తోంది. ఈహక్కులను అమలుపరచడానికి సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లడానికి 32వ అధికరణంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ హక్కులను అమలు చేయమని సుప్రీంకోర్టు రిట్ ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. అయితే ఈ హక్కు ఇటు పార్లమెంటు, అటు న్యాయవ్యవస్థల మధ్య అనేకమార్లు సంఘర్షణకు దారి తీసింది. 4వ భాగంలోని ఆదేశక సూత్రాలు అమలుపరిచి జమిందారుల నుండి భూమి తీసుకుని పేదలకు పంచే చర్యల్లో ప్రాథమిక ఆస్తిహక్కు అడ్డం వచ్చింది. దాంతో హక్కును తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అందులో ముఖ్యమైంది 17వ సవరణ. ప్రాథమిక హక్కుల సవరణలు చెల్లవని గోలక్‌నాధ్ అనే అసామి సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని అంశాలు, 13వ అధికరణం పూర్తిగా చర్చించి అప్పటి న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు ఆధ్వర్యంలో 11మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ప్రాథమిక హక్కుల భాగాన్ని సవరించే వీలు లేదని, సవరించే అధికారం పార్లమెంటుకు కూడా రాజ్యాంగం ప్రకారం లేదని 1969లో చారిత్రాత్మక ఆదేశాలు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసే రీతిలో కేంద్రం 24, 25 రాజ్యాంగ సవరణలు తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం పార్లమెంటుకు ఏర్పడింది. ఈ సవరణలు చెల్లవని కేశవానంద భారతి అనే మఠాధిపతి సుప్రీంకోర్టులో ఒక రిట్ దాఖలు చేశారు. 13 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం మళ్లీ పూర్తిగా చర్చించి గోలక్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంటుకు ఉందని, అయితే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రం మార్చరాదని 1973లో తీర్పు చెప్పారు. ఈ తీర్పు న్యాయమూర్తుల నియామక అంశంలోనూ కీలక పాత్ర పోషించింది.
వివాదాస్పద మార్పులు
1993 నుండి కొనసాగుతున్న కొలీజియం విధానాన్ని రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ యాక్ట్ (ఎన్‌జెఎసి)ను 2015 ఏప్రిల్ 13న తీసుకువచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పింది. ఈ తీర్పులో ప్రభుత్వ అంగాల్లో న్యాయశాఖ పాత్ర, నిర్మాణం, తదితర అంశాలను వివరించింది. రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారం ప్రజలదే. 124-2 అధికరణం ప్రకారం రాష్టప్రతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. న్యాయమూర్తుల నియామకం వివిధ దేశాల్లో పలురకాలుగా ఉంది. రష్యాలో న్యాయమూర్తులను ఎన్నుకుంటారు. అదే స్విట్జర్లాండ్‌లో శాసనసభలతో ఎన్నికవుతారు. బ్రిటన్‌లో కార్యనిర్వాహక శాఖతో న్యాయమూర్తులు ఎన్నికవుతారు.
వివాదం మొదలు
గోలక్‌నాధ్, కేశవానంద భారతి కేసుల్లో పార్లమెంటు విశేష అధికారాలకు సుప్రీంకోర్టు ముకుతాడు వేయడంతో కేశవానంద భారతి కేసు తీర్పు అనంతరం సీనియర్ న్యాయమూర్తులైన ఎం షెలాత్, కెఎస్ హెగ్డే, ఎఎన్ గోవర్‌ను కాదని జూనియర్ అయిన జస్టిస్ ఎ ఎస్ రేను 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం నియమించింది. 1977లో సీనియర్ అయిన హెచ్ ఆర్ ఖన్నాను కాదని, రెండో స్థానంలో ఉన్న ఎంహెచ్ బేగ్‌ను కేంద్రం నియమించింది. అప్పటి నుండి ఇరు పక్షాల మధ్య వివాదం మొదలైందని చెప్పవచ్చు. వాస్తవానికి భారతదేశంలో న్యాయమూర్తుల నియామకం ఎలా ఉండాలో అనేక కమిషన్లు న్యాయకోవిదులు ఎన్నో సూచనలు చేశారు. అందులో కొలీజియం కూడా ఒకటి. సుప్రీంకోర్టు 1982లో ఎస్‌పి గుప్త వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తులను నియమించే సందర్భంలో ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1983లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం మాత్రం న్యాయమూర్తుల బదిలీ, నియామకాల్లో కేంద్రం ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తే చాలని, సమ్మతి పొందాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి పేర్కొన్నారు. 1993లో సుప్రీంకోర్టు ఆఫ్ రికార్డు అసోసియేషన్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆనాటి ప్రధాన న్యాయమూర్తి 7-2 తేడాతో న్యాయమూర్తులను నియమించే అంశంలో రాష్టప్రతి అభిప్రాయం తప్పనిసరిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చే అభిప్రాయాలను పాటించాల్సిందేనని తీర్పు ప్రకటించింది. జస్టిస్ జగదేశ్ శరణ్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థకు 1993లో నాంది పలికింది. 1998 అక్టోబర్ 28న ముగ్గురు న్యాయమూర్తులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టును ఆనాటి రాష్టప్రతి కె ఆర్ నారాయణ్ న్యాయసలహా కోరడంతో కొలీజియంలో న్యాయమూర్తుల సంఖ్యను నాలుగుకు పెంచారు. అప్పటి నుండి కొలీజియం నిర్ణయం ప్రకారం రాష్టప్రతి న్యాయ నియామకాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతకు ముందు అంతా కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయమూర్తుల నియామకాలను చూసేది.
కొలీజియం వ్యవస్థపై అడపాదడపా న్యాయమూర్తులు ప్రతికూలంగా స్పందిస్తూనే ఉన్నారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం వృత్తిపరమైన ప్రీతికి దారితీయదా అంటూ జస్టిస్ జెఎస్ వర్మ ప్రశ్నించారు. అలాగే న్యాయమూర్తుల నియామకంపై జస్టిస్ రూమాపాల్ సైతం ఇదో చిదంబర రహస్యం అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే జస్టిస్ ఎం ఎస్ వెంకటాచలయ్య అధ్యక్షతన 2002లో రాజ్యాంగ సమీక్షా సంఘం సూచన మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా, మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖా మంత్రి, ఒక విశిష్ట సభ్యునితో కమిషన్ ఏర్పాటు చేశారు. దీనిని జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌గా 2014 ఆగస్టు 13న లోక్‌సభ, మరుసటి రోజు రాజ్యసభ ఆమోదముద్ర వేశాయి. అదే ఏడాది డిసెంబర్ 31న అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడంతో కొలీజియం వ్యవస్థ రద్దయి 2015 ఏప్రిల్ 13 నుండి న్యాయ నియామకాల కమిషన్ అమలులోకి వచ్చింది. ఇందుకోసం 99 వ రాజ్యాంగ సవరణ ద్వారా 124, 127, 128, 217,222, 224 ఎ, 124 బి, 124 సి ప్రకరణలను కొత్తగా చేర్చారు.
పెరుగుతున్న ఖాళీలు
ఎన్‌జెఎసి రాజ్యాంగ విరుద్ధమని దానిని రద్దు చేయాలని 2015 జనవరి 6న సుప్రీంకోర్టు న్యాయవాది భీమ్‌సింగ్ సాహా పిల్ దాఖలు చేశారు. దీనిని సమర్ధిస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా మరో పిల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ జెఎస్ ఖేహార్ , ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ఎం బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌లతో కూడిన ధర్మాసనం విచారించి ఎన్‌జెఎసి రాజ్యాంగ విరుద్ధమని 2015 అక్టోబర్ 16న 1030 పేజీల తీర్పు వెలువరించింది. దాంతో మళ్లీ కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చినట్టయింది. అయినా తాము కొలీజియంతో సంతృప్తిగా లేమని ప్రత్యామ్నాయ విధానాన్ని సూచించాలని సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ 16న కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారం ఎటూ తేలకముందే న్యాయమూర్తులు రిటైరవుతున్నారు. ఆరు హైకోర్టుల్లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో నాలుగు న్యాయమూర్తి పదవులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 1017 పోస్టులకు 458 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో 4452 (2015 డిసెంబర్ 31 నాటికి) న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పరస్పర అస్త్రాలు
ఖాళీల భర్తీ ప్రక్రియలో సంప్రదాయ పద్ధతినే కార్యనిర్వాహక వ్యవస్థ పాటిస్తోందనే అపవాదు లేకపోలేదు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలో సుప్రీంకోర్టు చొరబడటం సరికాదనేది కేంద్రప్రభుత్వ వాదన. పరిపాలనలో అన్నింటా మార్గదర్శనం చేస్తున్న సుప్రీంకోర్టుకు వివిధ వ్యవస్థల మధ్య పరిమితులు తెలియవని ఎవరనుకుంటారు, ఇప్పటికైనా కొలీజియం స్థానంలో సమగ్ర యంత్రాంగం ఏర్పాటుకు ఇరు పక్షాలు సహకరించాలి. భారత న్యాయవ్యవస్థపై దేశ ప్రజలకు అచంచల విశ్వాసం, నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో సిగపట్లకు తెరపడాలి.

- బి.వి. ప్రసాద్