మెయన్ ఫీచర్

మోదీ బృందానికి గుజరాత్ గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధర్మం పాటించడం ద్వారా ముఖ్యమంత్రి పదవినుండి వైదొలగాలని అంటూ 2002లో నాటి ప్రధాని వాజపేయి సూచించినపుడు విషమ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరువాత మొదటిసారిగా ఆందోళనగా కనిపిస్తున్నారు. తాను ప్రధానిగా ఎదగడానికి ఉపయోగించుకున్న ‘గుజరాత్ మోడల్’ బీటలు వారితే తన రాజకీయ పలుకుబడికి బ్రేక్ పడినట్టే కాగలదని భయపడుతున్నారు. అందుకనే గుజరాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఆయనకు వణుకు పుట్టిస్తున్నాయి.
ప్రస్తుతం దాదాపుగా అన్ని అంచనాలు తిరిగి బిజెపి అధికారంలోకి రాగలదని చెబుతున్నా రెండు, మూడు నెలలుగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, మరోవంక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం ఆయనలో అసహనాన్ని కలిగిస్తున్నట్టు భావించాల్సి వస్తున్నది. వాస్తవానికి తాము చేసుకున్న అపరాధాల కారణంగానే ఓటమి ఎదురైతే కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే అవకాశం వస్తుందని బిజెపి నేతలకు తెలియని అంశం కాదు. తనంతట తానుగా అధికారంలోకి రాగల సత్తువ అక్కడ కాంగ్రెస్‌లో కనిపించడంలేదు.
ఎన్ని అవకాశాలు ఎదురవుతున్నా వాటిని ఉపయోగించుకోగల నాయకత్వం కనిపించడం లేదు. బిజెపి ప్రభుత్వంపై తిరగబడిన పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మద్దతు ఇవ్వడం కోసం తన కులస్థుల ప్రాబల్యం గల నియోజకవర్గాలలో తాను సూచించిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరుతూ వుండడంతో కాంగ్రెస్ నాయకులకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు మించిన కుమ్ములాటలు అంతర్గతంగా బిజెపిలో కూడా వున్నాయి. 22 ఏళ్లుగా గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం ఉంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఒక స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దానిని సరిచేసుకునే ప్రయత్నం చాలా ముందు నుండే చేయవలసింది. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు ప్రధాని కలవరపడుతున్నట్టు తెలుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడానికి కేంద్రం ఒత్తిడే కారణమన్న విమర్శలు చెలరేగాయి. ఎన్నికల కమిషన్ ఈమధ్యకాలంలో ఇటువంటి విమర్శలను ఎదుర్కొనలేదు.
ప్రధాని అర్థంతరంగా ఎన్నో పథకాలు ప్రకటించారు. ఈ నెలలోనే నాలుగుసార్లు గుజరాత్‌లో పర్యటనలు జరిపారు. ప్రధాని పదవి చేపట్టిన మొదటి రెండున్నర ఏళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే గుజరాత్‌లో పర్యటించిన మోదీ గత సంవత్సర కాలంలో 15 సార్లు పర్యటించడం ఆయనలో నెలకొన్న ఆందోళనను స్పష్టం చేస్తున్నది. తనని ప్రధానిగా చేస్తే గుజరాత్‌లో వలె అభివృద్ధి చేస్తానని చెప్పిన ప్రధాని ఇప్పుడు తన పాలనను, రాష్ట్రంలోని బిజెపి పాలనను చూసి ఓట్లు వేయమని ధైర్యం చెప్పుకోవలసింది.
కేంద్రంలో ప్రభుత్వం కూడా ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలమైందని అంటూ సొంతవారి నుండే విమర్శలు వస్తువుండడంతో అర్ధంతరంగా కొన్ని చర్యలు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒక రోజు ముందు మంత్రివర్గం సంక్షోభంలో వున్న బ్యాంకులను ఆదుకోవడానికి రు.2.11 లక్షల కోట్ల సహాయం ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపరచలేకపోయిందని విమర్శలు వస్తుండడంతో 14 లక్షల కోట్ల పనిదినాలు కల్పించడం కోసం రు 14 లక్షల కోట్ల వ్యయంతో వౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రకటించారు.
తామెంతగా తాయిలాలు కల్పిస్తున్నా ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోలేకపోతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ సందర్భంగా అంగీకరించడం గమనార్హం. నేరుగా ప్రభుత్వం పెట్టుబడులకు సిద్ధం కావడంలేదు. దానితో అనేక భారీ వౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలేదు. నోట్ల రద్దు వలన జనం దగ్గర వున్న నగదు అంతా బ్యాంకులకు చేరినదని గొప్పగా చెప్పకుండా బ్యాంకులు సైతం పెట్టుబడులకు రుణాలు ఇవ్వలేకపోతున్నట్టు అంగీకరించారు. అందుకు పేరుకుపోయిన మొండి బకాయిలు కారణంగా చె ప్పారు.
నోట్ల రద్దు కారణంగా రు.2.70 లక్షల కోట్ల నల్లధనం పట్టుకోగలిగామని ప్రధాని ఒక సందర్భంగా చెప్పుకున్నా రిజర్వు బ్యాంకు నివేదికలోగానీ, ప్రభుత్వ ఆర్థిక సర్వేలోగాని ఆ విషయం ప్రస్తావనకు రాలేదు. అవినీతి అరికట్టడం గురించి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం అవినీతిపరులకు రక్షణ కల్పించే విధంగా ఒక బిల్ తీసుకురావడం జాతీయస్థాయిలో తీవ్ర నిరసనలకు దారి తీసింది. దీనితో వసుంధర రాజె ప్రభుత్వం తోక ముడిచి ఆ బిల్‌ను సెలక్ట్ కమిటీకి పంపవలసి వచ్చింది.
ఈ సందర్భంగా ప్రధాని కాంగ్రెస్ పట్ల అసహనం ప్రకటిస్తున్నారు. ఈ అసహనంలో ఆయన వాడుతున్న పదజాలం బిజెపి నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నది. ఇంకా సరిగ్గా యంత్రాంగం ఏర్పడకుండానే సంసిద్ధత ఏర్పడకుండానే హడావుడిగా జిఎస్‌టిని ప్రవేశపెట్టి లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చూసింది. కానీ ఇప్పుడు దీనిని తమ ప్రభుత్వమే ప్రవేశపెట్టలేదని, అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకు వచ్చాయని చెప్పుకొచ్చారు. అంటే జిఎస్టీ అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాము జవాబుదారీ కాదనే పలాయన వాదాన్ని ఆశ్రయిస్తున్నట్టుంది.
అదేవిధంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని గుజరాత్‌వలె అభివృద్ధి చేస్తాం అంటు చెప్పుకొచ్చిన ప్రధాని ఇప్పడు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు గుజరాత్ అభివృద్ధి చెందకుండా నాటి కేంద్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతు వచ్చినట్టు వాపోయారు. అంటే తన పాలనలో గుజరాత్ అభివృద్ధి చెందలేదని ప్రధాని అంగీకరించారా? ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్న ‘గుజరాత్ మోడల్’ నినాదం మాత్రమేనా?
మరోవంక కాశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియకు ఇప్పటి వరకు విముఖంగా వుంటూ వచ్చిన ప్రధాని ఇప్పుడు అన్ని వర్గాలతో సంప్రదింపుల కోసం ఒక మాజీ పోలీసు అధికారిని నియమించారు. గత సంవత్సరం జనవరిలో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబ్ ముఫ్తీ ఢిల్లీ వచ్చి, ప్రధానిని కలిసి వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని ప్రాధేయపడ్డారు. లేనిపక్షంలో పరిస్థితులు మరింతగా విషమించగలవని ఆందోళన వ్యక్తం చేసారు. వాజపేయి ప్రారంభించిన రాజకీయ ప్రక్రియను కొనసాగిస్తాం అంటూ శ్రీనగర్‌లో 2015లో పిడిపి-బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఆ దిశలో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019లో రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఏ నినాదంతో వెళ్లాలి అనే విషయమై బిజెపి అగ్రనాయకత్వంలో ఒక విధమైన తర్జన భర్జనలు ఇప్పుడు జరుగుతున్నాయి 2014లో వలె ‘అభివృద్ధి‘ అజెండాతోనే వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తున్నారు. అయితే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు, ఇతర నాయకులు అనేకమంది ‘అభివృద్ధి‘ అజెండా జాతీయ మీడియాలో ప్రచారానికి ఉపయోగపడిన సాధారణ ప్రజలనుండి ఓట్లు పొందడానికి పనికిరాదన్న భావనతో ఉన్నారు. అందుకనే నూతన ‘హిందుత్వ సామ్రాట్’గా ఎదుగుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల ఇప్పుడు వారి దృష్టి పడుతున్నది. ఎన్నికలు జరిగే చోట ఆయనతో విస్తృతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపట్ల ప్రధాని అసంతృప్తితో వున్నట్టు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు 2014 ఎన్నికలలోవలె నరేంద్ర మోదీని, ఆయన చూపిన ‘గుజరాత్ మోడల్’ను చూపించి కాకుండా ఆదిత్యనాథ్‌ను చూపించి ఓట్లు అడగడానికి సిద్ధపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలను అదుపు చేయడం తన మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడు చెప్పిన ఆదిత్యనాథ్ ఆరు నెలలైనా ఈ విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించలేకపోయారు. ఆయన ఎంతో హడావుడి చేసిన ‘రోమియో వ్యతిరేక స్క్వాడ్’లు ప్రచారానికే పరిమితమయ్యాయి. దానితో అయోధ్యలోని సరయు నది తీరంలో దీపావళి సందర్భంగా దీపోత్సవం జరిపి రామరాజ్యం తీసుకువస్తానని అంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
ఆకాశంలో విమానం ద్వారా పుష్పాలు కురిపించి, మోడల్స్‌ను శ్రీరామ, సీత, లక్ష్మణులుగా వేషం వేయించి త్రేతాయుగంలో అయోధ్య ఎట్లా వుండెడిదో ఇప్పుడు కలియుగంలో చూపించే ప్రయత్నం చేసారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ‘రామాలయం’ నిర్మిస్తామని కాకుండా ‘రామరాజ్యం‘ తీసుకొస్తామంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు.
సుపరిపాలన గురించి ఇప్పుడు బిజెపి నాయకులు ఎవ్వరూ మాట్లాడడంలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో మిగిలిన అన్ని పార్టీలతో పోటీపడుతూ, తమదే పై చేయి అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతి గురించి ఎక్కువగా మాట్లాడే మోదీ రాష్ట్రం గుజరాత్‌లో ప్రభుత్వం ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. మోదీ స్థానంలో ప్రస్తుత నేతలను ప్రజలు చూడలేకపోతున్నారు. మోదీ ప్రధాన మంత్రిగా వుంటున్న గుజరాత్‌ను మించి చూడలేకపోతున్నారనే విమర్శలు వున్నాయి. అందుకనే గుజరాత్‌లో తనతో పనిచేసిన అధికారులకే కేంద్రంలో కీలక పదవులు లభిస్తున్నాయి. వారి సూచనల మేరకే నడుచుకుంటున్నారు. ఇతర మంత్రుల ప్రమేయం లేకుండా చేసుకుంటున్నారు. దానితో జాతీయ స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారనే అభిప్రాయం నెలకొంటున్నది.
గుజరాత్‌లో ఇప్పటివరకు బిజెపికి గట్టి సమర్ధకులుగా వుంటున్న పటిదార్‌లలో నెలకొన్న అసంతృప్తి ఏ మేరకు పార్టీకి నష్టం కలిగిస్తుంది అన్న విషయంపైనే ఎన్నికల ఫలితాలు ఉంటాయి. మరోవంక దళితులలో గతంలో ఎన్నడు లేనివిధంగా బిజెపి పాలన పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. జిఎస్‌టి అమలు కారణంగా బిజెపికి మద్దతు ఇస్తూ వస్తున్న చిన్న, చిన్న వ్యాపారులతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నది. జిఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్‌లో జరిపినంత తీవ్రమైన ఆందోళనలను వ్యాపారులు దేశంలో మరే రాష్ట్రంలో జరపకపోవడం గమనార్హం. ఈ ప్రతికూల పరిస్థితులను గ్రహించడం వల్లనే జిఎస్టీలో పలు రాయితీలు ప్రకటిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధానిగా మూడున్నరేళ్ల తన పాలనలో జరిగిన లోపాలను ప్రధాని గుర్తించారా? వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ఇప్పుడు చేపడతారా? లేక కేవలం ఎన్నికల లబ్ది కోసం ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారా?
గుజరాత్‌లో ఒకవేళ బిజెపి ఓటమి చెందితే కేంద్రంలో మోదీ ప్రభుత్వ సుస్థిరతపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు ‘గుజరాత్ మోడల్’పై నిర్మించుకున్న నైతిక శిఖరం కూలిపోగలదు. అందుకనే గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందడం బిజెపికన్నా నరేంద్ర మోదీకి కీలకం కానున్నాయి. అయితే ఎన్నికల ముందు చేసే ప్రకటనలు ఓటర్లపై చెప్పుకోదగిన ప్రభావం వుండదని గ్రహించాలి. 1982లో కిలో రెండు రూపాయల బియ్యం పథకం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు ఉద్ధృతంగా ప్రచారం చేస్తూ ఉంటే, నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తన ప్రభుత్వం కిలో రు.1.90కే బియ్యం సరఫరా చేస్తుందని ప్రకటించడమే కాకుండా అమలు కూడా చేశారు. అయినా ప్రజలు విశ్వసించలేదు. అందువల్ల ఇప్పటి వరకు జరిగిన పాలన పైననే ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర 9849569050