మెయన్ ఫీచర్

అన్నింటికి ఆధార్ తప్పనిసరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ చూసినా ఆధార్ గురించి చర్చ జరుగుతోంది. వచ్చే నెల ఆఖరులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ విశిష్ట సంఖ్య గోప్యత, భద్రత, వివిధ పథకాలకు అనుసంథానం అంశాలపై చర్చించనుంది. ఆధార్ విశిష్ట సంఖ్య గోప్యతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, భద్రతకు ముప్పు లేదని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు, సరికదా ఎంతో కీలకమైన డాటాను ప్రైవేటు సంస్థలకు ఇ కెవైసి పేరిట అందుబాటులోకి రావడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. టెలికం సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థలు ఈ డేటాను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆధారాలు ఇప్పటికిపుడు లేకపోయినా, అనుమానాలు మాత్రం పోవడం లేదు. దానికి కారణం విశిష్ట సంఖ్యకు సంబంధించి మన వద్ద ఉన్న రక్షణ గోడలు (ఫైర్‌వాల్స్) సాంకేతిక పరంగా పకడ్బందీగా ఉన్నాయనే భరోసా లేకపోవడమే. చాలా తేలికగా బ్యాంకులు ఇతర సంస్థల నుండి పాస్‌వర్డులు, సమాచారాన్ని దొరకబుచ్చుకుంటున్న హాకర్లు ఆధార్ డేటాను సైతం ఎందుకు రహస్యంగా సేకరించలేరు అనే ప్రశ్న తలెత్తుతోంది. హాకర్లు చొరబడే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ మొత్తం వ్యవహారంపై అంతగా అవగాహన లేని భారతీయుల నుండి ప్రైవేటు సంస్థలు ఇ కెవైసి పేరిట డేటాను సేకరించడం మరింత ముప్పుతో కూడుకున్నదనేది నిస్సందేహం.
నేపథ్యం
అనేక అధ్యయనాల తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒక డాటా ఉండాలనే యోచనకు ఒక స్వరూపమే ఆధార్. ఎక్కడకు వెళ్లినా నేడు ఆధార్ విశిష్ట సంఖ్య ఉందా అని అడుగుతున్నారు. పుట్టిన బిడ్డకు సైతం ఆధార్ అవసరమైపోయింది. ఆధార్ విశిష్ట సంఖ్య తీసుకుంటున్నపుడు మనం ఇచ్చే వ్యక్తిగత సమాచారంతో కూడుకున్న జనాభా డాటా, బయోమెట్రిక్ డాటా వినిమయంపై అనుమానాలు మొదలయ్యాయి.
117 కోట్లు
విశిష్ట గుర్తింపు జాతీయ సంస్థ (యుఐడిఎఐ) 2016 ఏప్రిల్ 4వ తేదీ నాటికి 100 కోట్ల సభ్యులకు విశిష్ట సంఖ్యలను జారీ చేసింది. నేడు ఆ సంఖ్య 117 కోట్లకు చేరుకుంది. 2009 జనవరి 28 నుండి ఆధార్ అమలులోకి వచ్చింది. తొలి ఆధార్ సంఖ్యను 2010లో జారీ చేశారు. తర్వాత దశల వారీ ఆధార్‌కు సంబంధించి అనేక చర్చలు జరిగాయి. చివరికి 2016 మార్చి 26న భారత ప్రభుత్వం చారిత్రాత్మక ఆధార్ చట్టాన్ని తీసుకువచ్చింది. 18 ఏళ్ల వయోపరిమితి దాటిన వారి డేటాను 99 శాతం సేకరించినట్టు యుఐడిఎఐ చెబుతోంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డేటా సేకరణ 90 శాతం వరకూ పూర్తయింది. 5-18 ఏళ్ల ప్రాయం ఉన్న వారిలో 22.25 కోట్ల మందికి ఆధార్ విశిష్ట సంఖ్య జారీ అయింది. 5 ఏళ్లలోపు వారు 2.30 కోట్ల మంది ఆధార్ సంఖ్య పొందారు. ప్రతి రోజు కనీసం ఏడు లక్షల మంది ఆధార్ సంఖ్య కోసం నమోదవుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్‌గా ఆధార్ నమోదైంది.
32 వేల కోట్ల ఆదా
ఆధార్ విశిష్ట సంఖ్య జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 36వేల కోట్ల మేర వృధాను నివారించగలిగింది. పహల్ పథకం అమలులో 14,672 కోట్లు, పిడిఎస్‌లో 2346 కోట్ల మేర వృధాను ఆదా చేయగలిగారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో స్కాలర్‌షిప్‌ల ద్వారా 276 కోట్లు మిగిలింది. పెన్షన్ల ద్వారా జార్కాండ్, చండీఘడ్, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 67 కోట్లు ఆదా అయింది. దేశవ్యాప్తంగా ఇకెవైసితో 4.47 కోట్లు బ్యాంకు ఖాతాలు అనుసంథానం కాగా, 30 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంథానం అయ్యాయి. ఎల్‌పిజికి 12.28 కోట్లు ఖాతాలు, రేషన్‌కార్డులు 11.39 కోట్ల ఖాతాలు, ఎన్ రేగా పథకం అమలులో 5.90 కోట్ల ఖాతాలను ఆధార్‌తో అనుసంథానం చేశారు.
అసలు వివాదం
ఆధార్ చట్టం చాలా పటిష్టంగానే ప్రభుత్వ రూపొందించింది. అయితే ఈ చట్టంలో ఉన్న నియమనిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడంతోనే వివాదం చెలరేగుతోంది. ఆధార్ చట్టాన్ని 8 చాప్టర్లు, 59 సెక్షన్లతో రూపొందించారు. అందులో సెక్షన్ 57 ప్రకారం కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు, వ్యక్తుల గుర్తింపును నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ పరిశీలన చాప్టర్ -6కు లోబడి ఉండాలని నిర్దేశించారు. చాప్టర్ -6లో సమాచార భద్రతకు సంబంధించిన నిబంధనలున్నాయి. సెక్షన్ -28 నుండి 33 వరకూ వాటిని వివరించారు. అలాగే చాప్టర్ -3లో అధీకృతానికి సంబంధించి ఇచ్చిన సెక్షన్ -8కి లోబడి ఉండాలని కూడా పేర్కొన్నారు. ఈ రెండు చాలా కీలక అంశాలు, వీటి ప్రకారం ఏ వ్యక్తి ఆధార్ సమాచారం పొందాలన్నా ఆయన అనుమతి ఉండాలి, ఇంకో పక్క సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, దుర్వినియోగం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సెక్షన్ -30 ప్రకారం బయోమెట్రిక్ సమాచారం చాలా సున్నితమైన వైయుక్తిక సమాచారంగా నిర్ధారించారు. దీనినే ఇటీవల సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యత కింద తీసుకుని దానిని ప్రాథమిక హక్కుగా గుర్తించింది. సెక్షన్-8లో బయోమెట్రిక్ డేటా సేకరణకు సంబంధించి అనుమతి ఎలా తీసుకోవాలనే దానిపై స్పష్టత ఇచ్చింది. చివరికి ఈ డేటా సేకరించే సిబ్బందికి కూడా శాస్ర్తియమైన, న్యాయపరమైన అవగాహన, అర్హత కలిగి ఉండాలని సూచించింది. ఎవరినుండైనా బయోమెట్రిక్ సమాచారం పొందాలంటే ఆధార్ అథాంటికేషన్ యూజర్ ఏజన్సీ (ఎయుఎ) పేరుతో ముందుగా నమోదు కావాలి. మధ్యేమార్గంగా పనిచేసే సంస్థలను మనం అథాంటికేషన్ సర్వీసు ఏజన్సీలు (ఎఎస్‌ఎ)లుగా వ్యవహరిస్తాం. ఎయుఎలకు సమాచార పరిశీలన సమయంలో కేవలం అవును కాదు అనే సమాధానమే లభిస్తుంది. అంతే తప్ప మిగిలిన సమాచారాన్ని యుఐడిఎఐ ఇవ్వదు. ఎయుఎ కాని ఇ కెవైసి యూజర్ ఏజన్సీలకు (కెయుఎ)మాత్రం సెంట్రల్ డిపాజిటరీలో నమోదైన మొత్తం సమాచారం కనిపిస్తుంది. దానిని భౌతికంగా పరిశీలించుకోవచ్చు. ఇందుకు సంబంధించి స్పష్టమైన నియమనిబంధనలున్నాయి. సెక్షన్ -57 ప్రకారం బయోమెట్రిక్ డేటా సేకరించాలనే సంస్థలు లేదా వ్యక్తులు సెక్షన్ 2(యు) కింద అనుమతి పొందాలి, వాటినే మనం అభ్యర్థ్ధిస్తున్న సంస్థలుగా (రిక్వెస్టింగ్ ఎంటిటీలు) పేర్కొంటున్నాం. ఇందుకు సెక్షన్ 2(సి) కింద అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలా అనుమతి పొందిన సంస్థలు వైయుక్తిక సమాచార సేకరణ సమయంలో ఆ విషయాన్ని వారికి చెప్పి చేయాల్సి ఉంటుంది, సెక్షన్-8 ప్రకారం సమాచారం ఇవ్వడం తప్పనిసరి. చట్టంలోని సెక్షన్ -5 ప్రకారం డేటాకు లిఖిత పూర్వక అనుమతి పొందడంతో పాటు సందర్భాన్ని లాగ్ బుక్‌లలో నమోదుచేయాలి. అదెలా నమోదుచేయాలో కూడా చాలా స్పష్టంగా వివరించారు. అంతే కాదు సెక్షన్ 14- ఎఫ్‌లో నమోదు చేసే వ్యక్తులు కూడా అర్హులై ఉండాలని పేర్కొంది. ఆ లాగ్ బుక్స్‌ను తిరిగి తనిఖీ చేసే హక్కు ఆధార్ హక్కుదారులకు ఉంటుందని సెక్షన్-18లో పేర్కొన్నారు. అలాగే ఆధార్ అంథాటికేషన్ రికార్డులను పరిశీలించే హక్కు వారికి సెక్షన్-32 కింద కల్పించారు. ఇంత స్పష్టంగా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏజెంట్లు, టెలికం ఆపరేటర్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఉచితంగా ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించినపుడు ప్రజలు ఆ టెలికం సంస్థ కార్యాలయాల ముందు క్యూలు కట్టారు. ఇకెవైసిని వినియోగించి యధేచ్ఛగా సమాచారాన్ని సేకరించింది. వాస్తవానికి ఎలాంటి ముందస్తు అవగాహన కల్పించకుండా డేటా సేకరణ సెక్షన్ 6(ఎ)కు విరుద్ధం. మరో మాటలో చెప్పాలంటే అక్కడ పనిచేసేవారికి కూడా న్యాయనిబంధనలు తెలిసి ఉండవు. వినియోగదారులు కూడా బయోమెట్రిక్, జనాభా వివరాలు ఇవ్వడం ద్వారా కలిగే ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండానే సమాచారాన్ని ఇచ్చేస్తున్నారు. చాలా సందర్భాల్లో లాగ్ బుక్స్ నిర్వహించలేదు. అంతా పారదర్శకంగా జవాబుదారీతనంతో జరుగుతుందనేందుకు సరైన ప్రక్రియ లేనే లేదు. డేటాకు కచ్చితమైన రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. మొత్తం ఈ ప్రక్రియ అంతా గుడ్డిగానే జరుగుతుందనడం నిర్వివాదాంశం. అగౌరవంగా, అరాచకత్వంతో జరుగుతోంది. ఇదంతా చూసిన తర్వాత పలువురు నిపుణులు ఈ డేటా సేకరణ , నిక్షిప్తంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనలో అర్థం ఉంది. దానిని విశే్లషించాల్సిన అవసరం కూడా ఉంది. వ్యక్తుల ప్రైవేటు వ్యక్తుల ఉల్లంఘనలు ఎన్నో జరుగుతున్నాయి.
న్యాయవివాదాలు
ఆధార్ ఔచిత్యంపైనే రాజ్యాంగ ధర్మాసనం ముందు 2015 ఆగస్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌పై విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ఆధార్ చట్టం అమలులోకి వచ్చింది. చట్టసభలో సాధారణ ఆమోద రీతిలో కాకుండా ‘మనీబిల్లు’ రూపంలో దానిని ఆమోదింపచేసింది. అంత బలవంతంగా అమలులోకి తీసుకువచ్చిన బిల్లు చెల్లుబాటు ప్రశ్నార్థకమైంది. ఆధార్ వినియోగం, దుర్వినియోగంపై కూడా భారతజాతీయులు అందరికీ అవగాహన కల్పించాల్సి ఉండగా ఆ దిశగా చేయాల్సినంత ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. రిజిస్ట్రేషన్‌కు, రిజిస్టర్డు పెళ్లిళ్లకు, స్కాలర్‌షిప్‌లకు, చదువులకు, ప్రవేశపరీక్షలకు, ఎంపిక పరీక్షలకు, బస్సు టిక్కెట్లు, విమాన టిక్కెట్లకు, ఇతర ప్రభుత్వ లబ్ధి పథకాలకు ఆధార్ అవసరం అవుతోంది. వ్యక్తిగత పరిశీలనకు ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే మొబైల్ నెంబర్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. అయితే ఆ ఫింగర్ ప్రింట్‌లను సైతం దాచరనే గ్యారంటీ ఏముంది? వాస్తవానికి పకడ్బందీగా ఇలాంటి భద్రతను కల్పించే చట్టం ఏదీ భారత్‌లో లేదు. వివరాల గోప్యత రక్షణ చట్టం ఇరోపియన్ యూనియన్‌లో అమలులో ఉంది, అలాంటి చట్టం మనకు ఏదీ లేకపోవడం కూడా లోపమే, ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు యుఐడిఎఐ కూడా సమాచారాన్ని ఎవరు పరిశీలించారో ఎందుకు పరిశీలించారో ఆటోమెటిక్‌గా ఆధార్ నెంబర్‌కు ఎందుకు తెలియజేయకూడదనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక సేవకు అనుమతి పొంది అదే డాటాను పలు సేవలకు వినియోగించుకోరనే గ్యారంటీ ఏమీ నేడు లేదు. గత ఏడాది సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టులో మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు ఆధార్ సంఖ్యను తప్పని సరి చేయడంపై పిటీషన్ దాఖలైంది. నశీముద్నీన్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు తరఫున న్యాయవాదులు శ్రాంత భూషణ్, నేహారథి తమ వాదనలు వినిపించారు. ఆధార్ సంఖ్య తప్పని సరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ -14కు విరుద్ధమని వారు వాదించారు. జస్టిస్ కె ఎస్ పుట్టుస్వామి వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆధార్ కార్డును తప్పనిసరి చేయడానికి లేదని తేల్చి చెప్పింది. 2015 ఆగస్టు 11న ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు ఈ అంశం వచ్చినపుడు కూడా ఆధార్ నిర్బంధం చేయడానికి వీలు లేదని పేర్కొంది. 2013 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఆధార్‌కు సంబంధించి ఉన్న అనుమానాలన్నీ ఉత్తుత్తివేనని అడ్వకేట్ జనరల్ కె కె వేణుగోపాల్ గత వారం సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో వినిపించారు. జస్టిస్ ఎ కె సిక్రి, జస్టిస్ అశోక్ భూషన్‌ల బెంచ్‌పై ఒక పిటీషన్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌పై మరో పిటీషన్ ఆధార్‌కు సంబంధించి విచారణ జరుగుతోంది. జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఆధార్‌పై మరింత వివరణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు రిఫర్ చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు గోప్యత, ప్రాథమిక హక్కు అంశాలను తేల్చాలని నిర్ణయించింది. అనేక చర్చలు జరిగిన తర్వాత ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ దానిని తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్‌కు పంపింది. గతంలో 9 మంది న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ ఆర్ నారిమన్ ఇచ్చిన ప్రత్యేక తీర్పు ద్వారానే వైయుక్తిక గోప్యత ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది. దాంతో పాటు అదే బెంచ్‌లోని జస్టిస్ డి వై చంద్రచూడ్ సూచించినట్టు అందరిలో తలెత్తుతున్న రక్షణ వ్యవస్థ కోసం కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో నియమించిన కమిటీ తన ముసాయిదాను ఇప్పటికే విడుదల చేసింది. తుది రూపం 2018 ఫిబ్రవరి నాటికి వెలుగుచూడనుంది. అంతలో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏం చెబుతుందో నని ఆసక్తి పెరిగింది.

-బి.వి.ప్రసాద్