మెయన్ ఫీచర్

రాహుల్ పట్ట్భాషేకంతో కాంగ్రెస్‌లో తరం మార్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ చేపట్టడానికి రంగం సిద్ధం అవుతున్నది. కేవలం తల్లి సోనియా గాంధీ నుండి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడమే కాకుండా మొత్తం పార్టీలో నూతన తరం నాయకత్వం చేపట్టే విధంగా చేయడం కోసం రాహుల్ గాంధీ చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారు. పార్టీలో కీలక అధికార కేంద్రాలు కూడా మారే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
గత మూడు నాలుగేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం రాహుల్ విశేషంగానే కృషి చేస్తున్నారు. సోనియా గాంధీకి సన్నిహితంగా ఉన్న నాయకులను కాకుండా నూతన నాయకులు ‘రాహుల్ బృందం’గా పార్టీలో ఆధిపత్యం వహించే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
ఇందిరాగాంధీ శతజయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ సదస్సును ఏర్పాటుచేసి, రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ నాయకత్వం చేపట్టగానే ప్రస్తుతం సోనియా గాంధీ హయాంలో పార్టీపై పూర్తి ఆధిపత్యం వహిస్తున్న ముగ్గురు నాయకుల రాజకీయ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న ఇపుడు అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వ్యవహారాలు అన్నింటిని పర్యవేక్షిస్తున్నది అహ్మద్ పటేల్, మోతిలాల్ ఓర, జనార్దన్ దివేది. ఈ ముగ్గురిని ప్రస్తుతం నిర్వహిస్తున్న కీలక బాధ్యతలలో రాహుల్ హయాంలో కొనసాగించే అవకాశం లేదు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ తరువాత అత్యంత కీలకమైన మూడవ నేతగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియామకం చేయడానికి పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. గుజరాత్‌లో కాంగ్రెస్ అదృష్టం పండి పార్టీ అధికారంలోకి రాగలిగితే అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రిగా వెళ్ళే అవకాశం ఉంది. లేనిపక్షంలో సోనియాకు సలహాదారునిగా కొనసాగుతారా లేదా రాహుల్ కార్యవర్గంలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఉంటారా? గతంలో గుజరాత్ పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా కూడా పనిచేశారు.
అదేవిధంగా పార్టీ కోశాధికారిగా ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తల పండిన మోతిలాల్ ఓరకు సహితం స్థానభ్రంశం తప్పదు. అయితే వచ్చే సంవత్సరం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో, ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు మోతిలాల్‌కు ఆ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక తప్పకపోవచ్చు.
ఇక మీడియా ఇన్‌ఛార్జిగా ఉద్వాసన పలికినప్పటినుండి జనార్దన్ ద్వివేది పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన ఆస్కార్ ఫెర్నాండెస్‌కు సహితం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్వాసన తప్పకపోవచ్చు. వీరందరికీ పార్టీలో గౌరవ పదవులను కట్టబెడతారా ఏమో చూడవలసి వుంటుంది.
ఈ సీనియర్ నాయకుల స్థానంలో రాగలవారి గురించి అరడజను మందికిపైగా పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరను కొత్త కోశాధికారిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన తండ్రి మురళి దేవర పార్టీకి నిధులను సమకూర్చడంలో సిద్ధహస్తుడని పేరుండేది. ఈ మధ్య రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా పార్టీకి నిధుల సమీకరించడంకోసం మిలింద్ అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటినుండి కాబోయే కోశాధికారిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరొందిన జితేంద్ర సింగ్, రణదీప్ సూర్జేవాలాలలో ఒకరిని రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ మీడియా విభాగం బాధ్యతలు చూస్తున్న రణదీప్ రాజకీయ కార్యదర్శిగా మారితే ఆయన స్థానంలో తిరిగి అజయ్ మకెన్‌కు పార్టీ మీడియా వ్యవహారాలు అప్పచెప్పే అవకాశం ఉంది.
అళ్వార్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జితేందర్ సింగ్ గెలుపొందగలిగితే రాహుల్ బృందంలో కీలకమైన వ్యక్తిగా మారగలరు. అపుడు రాహుల్ రాజకీయ కార్యదర్శిగా నియమించడం అనివార్యం కాగలదు. మీడియా వ్యవహారాలు చూడడంకోసం మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పేరు సహితం వినిపిస్తున్నది.
రాహుల్ గాంధీ ముందున్న మరో సవాల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించడం. సహజంగానే రాహుల్‌తోగల సాన్నిహిత్యం దృష్ట్యా సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ స్వయంగా జరిపించుకున్న సర్వేల ప్రకారమే వీరికన్నా పార్టీ సీనియర్లు అయిన అశోక్ గెహ్లాట్, కమలనాథ్‌లకే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
అయినా రాష్ట్రాలలో యువ నాయకులను ప్రోత్సహించడం కోసం రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కన్నా పదేళ్ళ యుపిఎ ప్రభుత్వంలోనే ఎక్కువమంది యువకులు ఉన్నారని ఈ మధ్య చెప్పిన రాహుల్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో (తన మంత్రివర్గంలో) యువకులకు మరింత ప్రాతినిధ్యం లభించగలదని పేర్కొనడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింపచేసుకున్నది.
ఇదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన యువతలో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిన పార్టీ నాయకత్వంలో నూతన తరానికి ప్రాధాన్యత ఇస్తున్న సంకేతం ఇచ్చారు. అదేవిధంగా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడం కోసం జనంలోకి దూసుకుపోగల యువ నాయకుల కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు పలు రాష్ట్రాలలో నెలకొన్న పార్టీలోని ముఠా తగాదాలను అదుపు చేయడం రాహుల్ గాంధీని వెంటాడుతున్న ప్రధానమైన సమస్య. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఈ సమస్య తీవ్రంగానే వుంది. హిమాచల్‌లో అనేకమంది పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి తలపడుతున్నారు. కాంగ్రెస్‌లో వివిధ కులాల నాయకులను దగ్గరకు చేర్చుకోవడం ద్వారా బీహార్ తరహాలో ఒక విధమైన ‘మహాకూటమి’ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్న రాహుల్‌కు సొంత పార్టీలో సీట్లు ఆశిస్తున్నవారిని అదుపు చేయడం పెద్ద సమస్య కాగలదు.
ఒక విధంగా గుజరాత్‌లో వినూత్న ప్రయోగం చేస్తున్నారు. పటిదార్, ఓబిసి, దళిత్ కులాలతో కూటమి ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ రాజకీయాలలో నూతన ఒరవడికి బీజం వేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర రాష్ట్రాలలో సహితం ఇటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. పటిదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచి కన్వీనర్ జిగ్నేష్ మెవని బిజెపిని ఓడించడమే తమ లక్ష్యంగా ప్రకటించారు. ఇక క్షత్రియ ఠాకూర్ సేన కన్వీనర్ అల్పేష్ ఠాకూర్ సహితం బిజెపిపై కత్తులు నూరుతున్నారు.
అయితే ఈ కులాల నాయకులను సంతృప్తిపరచడం కాంగ్రెస్‌కు అంత తేలికమైన విషయం కాదు. పటేళ్లు అత్యధికంగా ఉన్న సుమారు 50 నియోజకవర్గాలలో తాను సూచించిన వారినే కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబెట్టాలని హార్దిక్ పటేల్ పట్టుబడుతున్నారు. అదే జరిగితే మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల తిరుగుబాటు అనివార్యం కాగలదు. బిజెపికి అటువంటి సమస్య లేదు. కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన 14 మంది శాసనసభ్యులకు సీట్లు ఇవ్వడం మినహా మిగిలిన నియోజకవర్గాలలో అటువంటి ఒత్తిడులు ఉండవు.
ఇక పలు దశాబ్దాలుగా కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ, వరుసగా ఓటమి చెందుతున్న వారిని పక్కన ఉంచి, యువతరానికి ఆయా సీట్లలో అవకాశం కల్పించే రాహుల్ విధానం సహితం పార్టీలో నూతన తరం ఆధిపత్యం వహించడానికి దారితీయనున్నది. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ముఠా తగాదాలు రేవంత్‌రెడ్డి చేరిక ద్వారా రాహుల్ ఒక హెచ్చరిక వంటి సందేశం ఇచ్చినట్లు అయింది.
వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీని ఇరకాటంలో పడవేయడంలో రాహుల్ గాంధీ చాలావరకు విజయం సాధిస్తున్నారు. ‘సూట్ బూట్ కా రాజ్’ అనడం దగ్గరనుంచి ‘గబ్బర్‌సింగ్ టాక్స్’ అనడం వరకు మోదీ ప్రభుత్వం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వమని, సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు మాత్ర మే ఉపయోగపడుతున్న ప్రభుత్వం అనే సందేశం ఇవ్వగలిగారు. దానితో ఆత్మరక్షణలో పడిన మోదీ ప్రభుత్వం తాము ‘పేదల పక్షం’ అని చెప్పుకోవడం కోసం అనేక చర్యలు చేపట్టవలసి వస్తున్నది.
చివరకు బిజెపికి చెందిన పలువురు నాయకులు సహితం దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ పాలన ఛిన్నాభిన్నం చేసినదనే అభిప్రాయానికి వచ్చే పరిస్థితి నేడు ఏర్పడింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ ప్రభుత్వం అసమర్థతను వేలెత్తి రాహుల్ చూపగలుగుతున్నారు. అయితే మోదీకి భిన్నమైన, ప్రత్యామ్నాయమైన విధానాలు, కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి దూరమైన వివిధ వర్గాలను దగ్గరకు చేర్చుకోవడంలో నిర్దుష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోలేకపోతున్నారు.
కేవలం వివిధ స్థాయిలలో నాయకులను మార్చి కొత్త తరానికి తీసుకురావడం ద్వారా మాత్రమే రాహుల్ ప్రజలకు దగ్గర కాలేరు. ప్రధాని నరేంద్ర మోదీ వలే రాజకీయ ప్రత్యర్థులను దేశంలో, విదేశాలలో దూషిస్తూ కాలం గడపడంవలన ప్రయోజనం ఉండబోదు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అధికారాలు కేంద్రీకృతం అయి ఉన్నాయని, సుష్మస్వరాజ్ వంటి సీనియర్ మంత్రులు సహితం స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారని రాహుల్ పేర్కొన్నారు. అది వాస్తవమే కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అందుకు భిన్నంగా నాయకత్వంలో వికేంద్రీకరణకు రాహుల్ హామీ ఇవ్వగలరా? ఢిల్లీ నుండి నాయకులను రాష్ట్రాలపై రుద్దకుండా, తమ నాయకుడిని ఎంచుకొనే స్వాతంత్య్రం రాష్ట్ర స్థాయి నాయకులకు ఇవ్వగలరా?
ఒక ప్రధానమైన జాతీయ పార్టీలో యువ నాయకత్వం ఏర్పడటం హర్షణీయ పరిణామమే. అయితే అది మన దేశ రాజకీయ వ్యవస్థను వేధిస్తున్న రుగ్మతలకు భిన్నమైన రాజకీయ సంస్కృతికి రాహుల్ శ్రీకారం చుట్టగలరా? అటువంటి నూతన అంశాలను రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ ప్రధాని పదవి చేపట్టిన సమయంలో ప్రజలకు కలిగించారు. రాహుల్ విషయంలో మాత్రం అటువంటి సంకేతాలు వెలువడడం లేదు.

-చలసాని నరేంద్ర 9849569050