మెయన్ ఫీచర్

ఒక రేవంత్.. ఇద్దరు స్పీకర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలు అనుకోని మలుపు తిరిగితే ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణ తెలుగుదేశం మాజీ సీమటపాకాయ్ కాస్తా కాంగ్రెస్ తాజా ఆటంబాంబుగా మారిన వైనం ప్రత్యక్షంగా తెలంగాణ, పరోక్షంగా ఏపి స్పీకర్లకు నైతిక సంకటంగా పరిణమించడం అనుకోని పరిణామమే మరి. కేసీఆర్ అనే కొండను ఢీకొనేందుకు మానసికంగా సిద్ధమైన రేవంత్ తెలిసి రాజీనామా చేసినా, తెలియక రాజీనామా చేసినా రెండు రాష్ట్రాల్లో పెండింగ్ రాజీనామా తేనెతుట్టెను కదిపారు. ఈ వ్యవహారంలో ఫలితం ఎలా ఉన్నా, రేవంత్ నిర్ణయం మాత్రం ఎప్పటికీ చర్చనీయాంశంగానే నిలిచిపోతుంది.
ఎవరినెప్పుడు పొగుడుతాడో తెలియని రాంగోపాల్‌వర్మ లాంటి వాడే రేవంత్‌పై మనసుపారేసుకున్నారు. అలాంటి రేవంత్ రాజీనామా నిర్ణయం ఇప్పుడు రెండు రాష్ట్రాల స్పీకర్లకు నిస్సందేహంగా సంకటమే. తాను మిగిలిన వారిలా పదవులు పట్టుకుని వేళ్లాడే రకం కాదని, నిఖార్సయిన నైతిక విలువలున్న వ్యక్తినని చాటేందుకే రాజీనామాతోపాటు, గన్‌మెన్లను వెనక్కిపంపినప్పటికీ, నిజానికి రేవంత్ వ్యూహం వేరు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకపోయినా ఆయనకు లాభమే. చిన్నవాడివైనా మహాజ్ఞానివని ఓ సినిమాలో తనకంటే వయసుతక్కువైన హీరో రాజేంద్రప్రసాద్‌ను కోట శ్రీనివాసరావు పొగుడుతారు. ఇక్కడ రేవంత్ ఎత్తుగడ చూస్తే అలాగే అనిపిస్తుంది.
ఒకవేళ స్పీకర్ తన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచినంతకాలం సాంకేతికంగా ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. ఆలోగా తన రాజీనామా ఆమోదం కోసం స్పీకర్‌పై ఒత్తిడి తెస్తారు. సర్కారు ఆ రాజీనామా ఆమోదించే మూడ్‌లో లేకపోతే రేవంతుకు ఇంకా మంచిది. ఆ ఎపిసోడ్ ఎంతకాలమనేది కేసీఆర్ దయ, రేవంత్ ప్రాప్తం! ఒకవేళ రాజీనామా ఆమోదిస్తే మంత్రిగా ఉన్న తలసాని గతంలోనే ఇచ్చిన రాజీనామానూ ఆమోదించక తప్పదు. టిడిఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనమైనందున, ఇక ఆ ముచ్చటే ఉండదని తలసాని వాదిస్తున్నా, ఆయనతోపాటు కారెక్కిన మాజీ తమ్ముళ్ల నైతిక వ్యవహారం సహజంగానే తెరపైకొచ్చి అదో చర్చ లాంటి రచ్చవుతుంది.
అప్పుడు నిర్ణయం తీసుకోవడం స్పీకరుకూ సంకటమే. ఇప్పుడు రేవంత్ మాదిరిగానే అప్పుడు తలసాని కూడా అన్నింటికీ తెగించే, వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు. ఆయన ఇలాకాలో సెటిలర్ల దన్ను ఉన్నందున గెలుపు కష్టమేమీ కాదు. ఒకవేళ కేసీఆర్ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే సామూహిక ఎన్నికలు తప్పువు. మరి కల్వకుంట్ల చంద్రుడు అంత సాహసవీరుడవుతారా అన్నదే చూడాలి.
ఈ మొత్తం వ్యవహారంలో రేవంతుకు పోయేదేమీలేదు. అందరితోపాటు ఎన్నికలకు వెళితే నలుగురితోపాటు నారాయణ అవుతారు. అప్పుడు కేసీఆర్‌కు కేవలం తన ఇలాకాపైనే దృష్టి సారించే సమయం ఉండదు. కాదూ కూడదని కేవలం తన రాజీనామానే ఆమోదిస్తే, ఎలాగూ నైతిక రచ్చకు బోలెడంత వెసులుబాటు. ఈ వ్యవహారంలో అసలు పితలాటకమల్లా స్పీకరుదే. పార్టీ గీత దాటిన వారిపై వేటు వేయాలంటూ టిడిఎల్పీ గతంలో ఇచ్చిన ఫిర్యాదులనూ నైతికంగా పరిష్కరించాల్సి ఉంటుంది.
ఫిరాయించారంటూ ఫిర్యాదు చేసిన నైతిక విలువల వీరులే ఇప్పుడు తెరాస తీర్థం తీసుకున్నప్పటికీ, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం స్పీకర్ నైతిక ధర్మం. అయితే ఇక్కడే చిన్న లాజిక్కూ ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కెవరికీ లేదు. కోర్టుకెక్కి అదేదో రాష్ట్రంలో అలా చేసినందున, ఇక్కడా అదే వర్తిస్తుందని కోర్టు కూడా చెప్పదు. పెండింగ్ పిటిషన్లు త్వరగా తేల్చమని చెబుతుందే తప్ప, ఫలానా విధంగా చేయాలని కోర్టు కూడా చెప్పదు. రేవంత్ సొంత ఇలాకా కొడంగల్‌లో తాము గెలుస్తామని, వేగులు కచ్చితంగా బల్లగుద్ది చెబితే తప్ప కేసీఆర్ ఉప ఎన్నికకు వెళ్లరు. ఈలోగా రేవంత్ హడావిడి చేసి, నా రాజీనామా ఆమోదించాల్సిందేనని పట్టుపట్టి మీడియాలో ఉచిత ప్రచారం పొందవచ్చు. ఇక్కడ రేవంతుకూ ఓ నైతిక సంకటం లేకపోలేదు. తన రాజీనామా స్పీకర్ తేల్చనందున అప్పటివరకూ సభకు వస్తానంటే, రేవంత్ ఇప్పటివరకూ చెప్పిన నైతిక నీతులు అసలుకే ఎసరు తెచ్చి హీరో కాస్తా జీరో అవుతారు. రేవంత్ వ్యూహం ఫలిస్తే ఉప ఎన్నికలు, లేకపోతే రాజీనామా చేసిన నైతికవిలువలున్న నేతగా మిగిలిపోతారు.
* * *
ఆంధ్రా చంద్రుడు తనకు ఆరాధ్యుడని, ఆయన స్ఫూర్తిని గుండెల్లో ఫుల్లుగా నింపేసుకుని.. కాంగ్రెస్‌లో చేరిన వందశాతం శాతం ‘తెలుగు’ రక్త నేత రేవంత్ పోతూ పోతూ, ఏపి స్పీకరునూ నైతిక సంకటంలో నెట్టేశారు. తెలంగాణలో రేవంత్ రాజీనామాకు, ఏపి స్పీకరు ఇరకాటానికీ లింకేమిటని అనుకోవద్దు. నైతిక విలువల లింకులకు సరిహద్దులుండవు మరి! తెలంగాణలో ఒకవేళ రేవంత్ రాజీనామా ఆమోదిస్తే, ఇక్కడ కూడా గోడదూకిన వైసీపీ ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రుల రాజీనామా చర్చ రచ్చవక తప్పదు. తాము అప్పుడే రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇచ్చేశామని ఆదినారాయణరెడ్డి మీడియాకు చెప్పి, తనకు తెలియకుండానే స్పీకరును ఇరికించారు.
నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నాటి నుంచి, నాలుగునెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత వరకూ స్పీకర్ కోడెల చాలాసార్లు మీడియాలో ముచ్చటించారు. కానీ ఎక్కడా నలుగురు మంత్రుల రాజీనామా లేఖ గురించి ప్రస్తావించలేదు. విస్తరణ రోజు తర్వాత కూడా తనకు ఆ నలుగురి రాజీనామాలు అందలేదనే చెప్పడం, నాటి కార్యదర్శి సత్యనారాయణ కూడా తమకు లేఖలు అందలేదని చెప్పడాన్ని విస్మరించలేం. మరి ఇప్పుడు ఆదినారాయణుడే రాజీనామా లిచ్చేశామని చెప్పినందున, దానిపై స్పందించాల్సిన అనివార్య పరిస్థితి స్పీకరుది. అవి స్పీకరు ఫార్మెటులో ఉన్నాయా లేవా అన్నదీ ఇప్పటికీ బ్రహ్మరహస్యం.
రేవంత్ రాజీనామా వ్యవహారం నైతికంగా ఏపి స్పీకరుకూ ధర్మ సంకటమే. పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలలో నలుగురు క్యాబినెట్‌లో ఉన్నందున, వారిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదులనూ పరిష్కరించాలన్న డిమాండు మరింత ఊపందుకోవడం ఖాయం. రేవంత్ తన రాజీనామాను తెలంగాణ స్పీకర్ ఆమోదించాలని పట్టుపట్టినప్పుడల్లా, ఏపిలో ఆ నలుగురు మంత్రులు రేవంత్ మాదిరిగా రాజీనామా ఆమోదానికి ఎందుకు పట్టుపట్టడం లేదన్న విమర్శలు తెరపైకి వస్తే, అది పరోక్షంగా స్పీకరును ఇబ్బందిపెట్టడం ఖాయం.
రేవంత్ ఒక్క ఏపీ స్పీకరునే కాదు, అటు తన స్ఫూర్తిప్రదాత చంద్రబాబునూ సంకటస్థితిలో పడేశారు. తాను పార్టీ మారినందున, నైతిక విలువలు పాటించి రాజీనామా చేయడమే కాకుండా, గన్‌మెన్లను వెనక్కిపంపి, నెలరోజుల్లో క్వార్టరునూ ఖాళీ చేయాలని నిర్ణయించడం తెదేపా నాయకత్వానికీ నైతిక సంకటమే. రేవంత్ మాదిరిగా పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా మీరెందుకు రాజీనామా చేయించరన్న ఆలోచనకు అదొక ప్రేరణ.
* * *
రాంగోపాల్‌వర్మ ఊహించినట్లు రేవంత్ బాహుబలి అవుతాడో లేదో పక్కనపెడితే, ఆయన చేరిన కాంగ్రెస్‌లో కనిపించని కట్టప్పలు గజానికొకరు. పైకి ఎగబాకేవారిని కిందకు దింపే విద్యలో పిజిలు చేసిన లీడర్లు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయాలు, సంస్కృతిని కాచివడపోసిన సీనియర్ పాత్రికేయ విశే్లషకులు కృష్ణారావు చాలా ఏళ్ల క్రితమే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అనేది బెజవాడ జంక్షన్ లాంటిది. రైలులో ఎక్కేవాళ్లు, దిగేవాళ్లకు లెక్కే ఉండదు. మరి రేవంతూ అందులో ఒకరవుతారా? అందుకు భిన్నంగా ఉంటారా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఒక్కటి మాత్రం నిస్సందేహం. బాబు మాదిరిగా స్వేచ్ఛ ఇచ్చేంత విశాల హృదయం ఢిల్లీకి ఒకవేళ ఉన్నా, దాన్ని అనుభవించకుండా అడ్డుపడే వారి సంఖ్య లెక్కపెట్టడం కష్టం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీలా శాసించిన వైఎస్‌కే అంతర్గత శత్రువుల ఈతిబాధలు తప్పలేదు. ఆయన ‘ఆత్మ’ను రాజ్యసభకు పంపించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మరి వైఎస్‌తో పోలిస్తే రేవంత్ ఎంతన్నది ఆలోచించాల్సిందే. టిడిపిలో రేవంత్‌కు రమణలు, మోత్కుపల్లిలు నలుగైదుగురే అడ్డంకి. కానీ కాంగ్రెస్‌లో వారి సంఖ్య డజన్లు.
పైగా అర్జునుడి గురి పిట్టపైనే ఉన్నట్లు రేవంత్ లక్ష్యం సీఎం సీటుపైనే ఉంది. మరి ఇప్పటికే ‘పెద్దలు జానారెడ్డిగారు’ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కాలం కలసివస్తే వీహెచ్, అరుణ, సురేష్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితర వీర సీనియర్లు ఆ సీటుపై మనసుపారేసుకుని ఉన్నారు. జానారెడ్డయితే అందరూ కోరితే సీఎం పదవి చేపట్టడానికి సిద్ధమేనని మనసులోమాట మరోసారి బయటపెట్టారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి, రేవంతును బాహుబలితో పోల్చిన రాంగోపాల్‌వర్మ పొగడ్తపై తనదైన శైలిలో చేసిన వ్యాఖ్య కొట్టివేయలేం. పార్టీలో చేరితే బాహుబలి కాదు. పార్టీని గెలిపిస్తేనే బాహుబలి అన్న జానారెడ్డి వ్యాఖ్య పరిశీలిస్తే, రేవంత్ ఎంత కష్టపడాలో చెప్పకనే చెబుతోంది.
టిడిపిలో ‘వర్కింగు’ అయినందున, రేపో మాపో కాంగ్రెస్ ప్రకటించే ఇద్దరు ముగ్గురు ‘వర్కింగు’లలో ఆయనా ఒకరు కావచ్చు. అదీకాకపోతే ఏ ప్రచారకమిటీనో దక్కించుకోవచ్చు. అయితే కాంగ్రెస్ రాజకీయాలకు, టిడిపి రాజకీయాలకూ తేడా బోలెడు. జనపథ్‌కు ప్రధాన ద్వారం ఒక్కటే అయినా లోపల తలుపులు బోలెడు. ఎవరే తలుపు నుంచి వెళ్లి మెడలో దండతో వస్తారో ఎవరికీ తెలియదు. బాబు మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్లు ఇచ్చే పద్ధతి ఉండదు. టిడిపిలో కొనే్నళ్లపాటు విపరీతమైన స్వేచ్ఛ అనుభవించిన రేవంత్ స్పీడుకు ఇవి రుచించనివే. ఒక్కటైతే నిజం. ఆయన చేరిక తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోసిందన్నది నిర్వివాదం.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144